‘శశికళకు బెంగళూరు జైల్లో అదనపు సౌకర్యాల కల్పన’ : రూప మౌడ్గిల్

"శశికళకు జైల్లో ప్రత్యేక మర్యాదలు జరుగుతున్నాయి అని నేను నివేదిక ఇచ్చాను. అది నిజమని ఇప్పుడు రుజువైంది. దీనివెనకున్న వారికి శిక్ష పడాలి" అని ఐపీఎస్ అధికారి రూప మౌడ్గిల్ అన్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళకు జైలులో ఏ-క్లాస్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని, ఇలా ఇవ్వాలని ఎలాంటి ఆదేశాలు లేవని 2017లో జైళ్ల శాఖ డీఐజీగా ఉండగా రూప ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు.
జైల్లో శశికళ స్వేచ్ఛగా, ఎలాంటి ఆంక్షలు లేకుండా తిరగడం ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. దీని తర్వాత రూపను జైళ్ల శాఖ నుంచి హోమ్ గార్డ్స్‌కు బదిలీ చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతోపాటు, శశికళ, ఆమె బంధువు ఇళవరసి నిందితులుగా నిర్థారణ అయింది.
రూప ఆరోపణలపై విచారణకు కర్నాటక ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇది 2017లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
రూప మౌడ్గిల్ చేసిన ఆరోపణల్లో చాలావరకూ నిజాలేనని కమిటీ తన నివేదికలో పేర్కొంది. బెంగళూరు సెంట్రల్ జైలులో శశికళకు అనధికారిక సదుపాయాలు కల్పించారని స్పష్టం చేసింది.
"నేను ఆ నివేదిక కావాలని చాలాసార్లు అడిగాను. దీనికోసం ఆర్టీఐ ద్వారా దరఖాస్తు కూడా చేశా. అయినా అది నాకు అందలేదు. సమాచార కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేస్తే అప్పుడు పూర్తి నివేదిక నాకు అందింది" అని రూప తెలిపారు.
2017లోనే నివేదిక ప్రభుత్వానికి చేరినా, దానిలోని అంశాలు ఇప్పటివరకూ వెల్లడించలేదు. ఆ నివేదికలోని అంశాలు నిజమేనని 2018లో ప్రభుత్వం అంగీకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ ఆ నివేదికలో ఏముంది?
ఇరుకుగా ఉన్న ఆ జైలులో ఐదుకు పైనే గదులను శశికళ, ఇళవరసి కోసం కేటాయించారని నివేదికలో ఉందని అడ్వొకేట్ టి.నర్సింహమూర్తి అన్నారు. ఆర్టీఐ ద్వారా ఆ విచారణ నివేదికను ఆయన తీసుకున్నారు.
శశికళ క్లాస్ ఏ ఖైదీ కాకపోయినా ఆమెకు రెండు గదులను కేటాయించారని, సొంతంగా వంట చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించారని, తనకు నచ్చిన దుస్తులు ధరించే వెసులుబాటు కల్పించారని, ఎక్కువమంది సందర్శకులు ఆమెతో మాట్లాడే అవకాశం ఇచ్చారని నివేదికలో ఉన్నట్లు నర్సింహమూర్తి బీబీసీతో చెప్పారు.
నివేదికను కమిటీ ప్రభుత్వానికి 2017లోనే సమర్పించినా సంవత్సరంపాటు ఎందుకు దాన్ని దాచిపెట్టారనేది అర్థం కావడంలేదని ఆయనన్నారు.
శశికళ తనకు తానుగా వంటచేసుకుంటున్నారా లేక ఆమె గదిలో వేరే మహిళా ఖైదీ ఆమెకు వండిపెడుతున్నారా అని కమిటీ అధికారులను ప్రశ్నించింది. కానీ దీనికి వారి నుంచి సరైన సమాధానం రాలేదు. ఆమె గదిలో కనిపించిన కుక్కర్ వంటకోసం ఉద్దేశించినది కాదని, దానిలో ఆమె ఆహారాన్ని దాచిపెట్టుకునేవారని అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా శశికళ, ఇళవరసిలకు జైల్లో అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ అప్పటి జైళ్ల శాఖ డీఐజీ రూప జైళ్లశాఖ డీజీపీ హెచ్ఎన్ సత్యనారాయణరావుకు లేఖ రాశారు. దీంతో దీనిపై విచారణకు కమిటీ ఏర్పాటైంది.
ఖైదీలను కలిసేందుకు 45 నిమిషాలకు మించి ఎవరినీ అనుమతించకూడదని నిబంధనలున్నా, 5 గంటలకు పైగా కూడా కొందరిని శశికళతో సమావేశం కావడానికి అనుమతినిచ్చారని కమిటీ విచారణలో తేలింది. దీనికోసం ఓ ప్రత్యేక రిజిస్టర్‌ను కూడా ఏర్పాటుచేశారని తేలింది.
ఈ నిబంధనల ఉల్లంఘనపై ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలంటూ తాను కోర్టు ద్వారా ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వబోతున్నానని నర్సింహమూర్తి తెలిపారు.

క్లాస్ ఏ ఖైదీలు అంటే ఎవరు?
ఖైదీల్లో క్లాస్ ఏ, క్లాస్ బీ అని రెండు రకాలుంటారు అని అడ్వొకేట్ కన్నదాసన్ బీబీసీకి వివరించారు.
సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, బాగా చదువుకున్నవారికి క్లాస్ ఏ స్థాయి కల్పించవచ్చు. ఎవరికి ఈ స్టేటస్ కల్పించాలి అనేదానిపై కోర్టులు లేదా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ కేటగిరీ ఖైదీలు మంచం, పరుపు, ఫ్యాను వంటి సౌకర్యాల పొందడంతోపాటు వారి ఆహారాన్ని వారే వండుకోవచ్చు.
ఇక క్లాస్ బీ ఖైదీలకు ఎలాంటి అదనపు సౌకర్యాలు ఉండవు. అంటే వీరంతా సాధారణ ఖైదీలు.
అయితే జయలలితకు కూడా క్లాస్ ఏ ఖైదీ స్థాయి ఇవ్వలేదు, కానీ ఆమె జైల్లో అన్ని రకాల సౌకర్యాలు అనుభవించారని కన్నదాసన్ తెలిపారు.
గతంలో క్లాస్ ఏ స్థాయిని కేవలం స్వాతంత్ర సమరయోధులకు మాత్రమే కల్పించేవారు. కానీ ఇప్పుడు మాదకద్రవ్యాల రవాణాలో పట్టుబడినవారు, హంతకులు కూడా ఈ సౌకర్యాలు పొందుతున్నారని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి.
- 'జయ ఆస్పత్రిలో ఉన్నపుడు శశికళ తీసిన వీడియో'
- ఆర్కే నగర్: బీజేపీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు!
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- కరుణానిధిని ఎందుకు ఖననం చేశారు?
- కరుణానిధి జీవితంలో ప్రధాన ఘట్టాలు.. కీలక మలుపులు
- కరుణానిధి: ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన సీరియల్ ఈయన రాసిందే
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








