ఉత్తరాంధ్ర: ‘మేం ఆసుపత్రికి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు రాళ్లలో నడుచుకుంటూ కొండ దిగాలి’

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచమంతా అక్షరాస్యత, సాంకేతికతల అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే, ఉత్తరాంధ్ర గిరిజన పల్లెలు మాత్రం నేటికీ రోడ్లు, నీళ్లు, వైద్యం లాంటి కనీస సౌకర్యాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఎందుకు ఇక్కడి ప్రజలు అభివృద్ధిని నోచుకోవడంలేదు? బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని అందిస్తోన్న కథనం.
2018 సెప్టెంబర్‌లో విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని చింతలవలస అనే గిరిజన గ్రామానికి చెందిన ముత్తాయమ్మకు పురిటి నొప్పులతో బాధపడుతుండగా, ఆమెను డోలీలో కూర్చోపెట్టుకొని కొండ కింద 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు గ్రామస్థులు బయల్దేరారు.
ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో దారి మధ్యలోనే కాన్పు చేయాల్సి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సూరయ్య అనే యువకుడు వీడియో తీసి వారి కష్టాలను బయటి ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో కాన్పు తర్వాత బొడ్డు తాడును రాతితో కోయడం కూడా కనిపించింది.
ఆ పరిస్థితి ముత్తయమ్మ ఒక్కరిదే కాదు. మరో గ్రామానికి చెందిన ఒక మహిళను పురిటి నొప్పులు వస్తున్నప్పుడు కావడిలో తీసుకెళ్తుండగా, ఆమె గర్భం కోల్పోయారు.
తాను తీసిన వీడియోను చూసి అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుంటారని సూరయ్య ఆశించారు. కానీ, ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని ఆయన అంటున్నారు. "ఏమీ మారలేదు. రోడ్లు, నీళ్ల కోసం ఎన్నో అప్లికేషన్లు రాశాం. మేం ఏం పాపం చేశాం. మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
"మేం ఆసుపత్రికి వెళ్లాలంటే ముందుగా పది కిలోమీటర్లు రాళ్లల్లోంచి నడుచుకుంటూ కొండ దిగాలి. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లాలంటే అంబులెన్సు కోసం ఎదురుచూడాలి. మేం ఇవన్నీ చేసే సరికి చాలా సమయం పడుతోంది" అని రంగయ్య చెప్పారు.

శాశ్వత వసతి గృహం కావాలి
స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ... "గర్భిణీల కోసం కొండ కింద ఆసుపత్రి ఏర్పాటు చేయడం కాస్త ఉపశమనం ఇచ్చింది. ఐటీడీఏ నిధుల్లోంచి నెలకు రూ.50 వేల ఖర్చుతో ఇక్కడ రెండు వసతి గృహాలను నడపుతున్నారు. ఎనిమిదో నెల నుంచి ప్రసవం అయ్యే వరకూ గర్భిణీలు ఇక్కడ ఉండవచ్చు. ఈ వసతి గృహానికి శాశ్వత భవనం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఏడాదిగా పెండింగులోనే ఉంది. ఈ తాత్కాలిక ఏర్పాటుపై గిరిజనులు అంత సంతోషంగా లేరు" అని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న రోడ్లు లేని 3 వేల 194 గిరిజన గ్రామాల్లో చింతవలస ఒకటి. ఈ గ్రామం పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోకి వస్తుంది. రోడ్ల కోసం పెట్టుకున్న ఎన్నో అర్జీలకు సమాధానం కోసం వారింకా ఎదురు చూస్తూనే ఉన్నారు.
"మేం అడవిపై ఆధారపడి, అడవిలో బతుకుతున్నాం. మేం ఎవరిపైనా వారు పెట్టే దానికోసం ఆధారపడలేదు. మేం మాకు ఏదుందో దానికోసమే, ఆ ఒక్క పూట భోజనం కోసమే కష్టపడుతున్నాం" అంటున్నారు సూరయ్య.

ఇక్కడి ప్రజలు మైదాన ప్రాంతాలకు దూరంగా బతుకుతున్నారు.
"మా ఊళ్లో చాలా మంది ముసలి వాళ్లున్నారు. వాళ్లకు సంత నుంచి సరుకులు కావాలంటే ఊళ్లో ఎవరో ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాలి. ఎవరూ సాయం లేకపోతే వాళ్లు కొండ దిగి ఎక్కాలి. వాళ్లు ఒక వేళ అడవి నుంచి ఏమైనా సేకరించి సంతలో అమ్ముకుందామన్నా, రోడ్లు లేకపోవడంతో కుదరదు" అని వివరించారు సూరయ్య.

మైదాన ప్రాంతానికి దూరంగా ఉన్న ఈ గిరిజన గూడేనికి బీబీసీ న్యూస్ ప్రతినిధులు వచ్చారని తెలుసుకున్న ఐటీడీఏ బృందం హడావుడిగా అక్కడికి చేరుకుంది.
ఈ గ్రామాలను రోడ్లతో మైదాన ప్రాంతాన్ని కలపడమే ఇక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారమని అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఈ ఊరికి ఇప్పటికే రోడ్డు మంజూరైందని, ఎన్నికలు ముగిశాక పనులు మొదలవుతాయని చెప్పారు.
ఈసారి అయినా అధికారుల మాటలు నిజమవ్వాలని, దశాబ్దాలుగా వింటున్న కబుర్లుగా వారి మాటలు మిగిలిపోకూడదని గ్రామస్తులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









