ఛత్తీస్‌గఢ్: అక్కడ ఎన్నికలు నిర్వహించడం యుద్ధంతో సమానం

స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలు నిర్వహించడం అంటే యుద్ధం చేసినట్లే! అది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. బస్తర్ పొరుగున ఉన్న దంతేవాడ జిల్లాలో బుధవారం నాడు బీజేపీ ఎమ్మెల్యే భీమా మందవి కాన్వాయ్‌పై నక్సల్స్ దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యేతో పాటు మరో నలుగురు చనిపోయారని దంతేవాడ జిల్లా మేజిస్ట్రేట్ తోపేశ్వర్ వర్మ బీబీసీకి తెలిపారు.

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు బలంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 లోక్ సభ స్థానాలున్నాయి. వాటిలో ఒక్క బస్తర్‌‌లో మాత్రమే ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 50 వేల మంది పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు.

మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య దశాబ్దాలుగా సాగుతున్న సంఘర్షణ కారణంగా ఇక్కడి మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి రవాణ సౌకర్యాలు లేవు.

బస్తర్‌లోని పరిస్థితుల గురించి బీబీసీ ప్రతినిధి సాల్మన్ రవి అందిస్తోన్న ప్రత్యేక కథనం.

ఇది మావోయిస్టుల 'జనతన ప్రభుత్వం' నడిచే ప్రాంతం. అంటే ఇక్కడ ప్రభుత్వంతో పాటు మావోయిస్టుల ప్రత్యామ్నాయ ప్రభుత్వం కూడా ఉంటుంది.

మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో పోలింగ్ బూత్‌లను 10-15 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. అయితే అంత దూరం వెళ్లి ఓటు వేయడం తమకు చాలా కష్టమని ప్రజలు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, అక్కడ ఎన్నికలు యుద్ధంతో సమానం

బస్తర్‌లోని ఫుల్పర్ద్ గ్రామానికి వెళ్లిన సాల్మన్ రవితో అక్కడి ప్రజలు మాట్లాడారు.

''మేం 10-15 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాలి. ఇది సరైంది కాదు. ఎవరి గ్రామంలో వారు ఓటు వేసేలా తగిన ఏర్పాట్లు చేయాలి'' అని సోనారామ్ బర్తి అన్నారు.

అయితే, హింసాత్మక పరిస్థితుల కారణంగా పోలింగ్ సిబ్బందిని లోతట్టు ప్రాంతాలకు పంపించడం కష్టం. ఈ విషయమై ఆ ప్రాంత డి.ఎస్.పి. పీతాంబర్ పటేల్ బీబీసీతో మాట్లాడారు.

ఆదివాసీలు

''భద్రత కారణాల దృష్ట్యా పోలింగ్ పార్టీలను మారుమూల గ్రామాలకు పంపడం కష్టం. అందుకే పోలింగ్ కేంద్రాలను దూరప్రాంతాలకు తరలించాం. ప్రజలు అక్కడికి వచ్చి ఓటు వేసేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రాని పోలింగ్ బూత్ ఒక్కటి కూడా లేదు. 60 కిలోమీటర్ల దూరంలో పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేసినా, ఓటర్లు వచ్చారు'' అని పీతాంబర్ పటేల్ అన్నారు.

గతంలో ఒక్క ఓటు కూడా నమోదవ్వని పోలింగ్ కేంద్రాలకు సైతం ఇప్పుడు ప్రజలు వస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది కానీ, క్రితం సారి పోలింగ్ 18% తగ్గిందని ఎన్నికల కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి.

గత ఎన్నికల్లో చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇప్పుడు కూడా చాలామంది ఓటు వేయరు. దీనికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి.

''2005కు ముందు జరిగిన ఎన్నికల్లో మా ప్రాంతంలో అందరూ ఓటు వేసేవారు. మావోయిస్టుల ప్రభావం పెరగడంతో మేం ఓటు వేయడంలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేం ఓటు వేయలేదు. ఈసారి కూడా వేయం. వాళ్ల మాటను ధిక్కరించి నేను ఓటు వేస్తే, నా భద్రతకు ఎవరు హామీ ఇస్తారు?'' అని మంగళ్ కుంజం అనే వ్యక్తి అన్నారు.

ఆదివాసీలు

మారుమూల గ్రామాల్లో నివసించే ఆదివాసీ ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా బతుకుతున్నారని బస్తర్‌కు చెందిన 'సర్వ ఆదివాసీ సమాజ్' చెబుతోంది. ఇప్పటికీ వాళ్లకు ఎన్నికల ప్రక్రియ అంటే ఏమిటో సరిగా తెలియదని చెబుతున్నారు.

''ఓట్లు వేయడానికైనా లేదా ఏదైనా రాజకీయ పార్టీ ర్యాలీలో పాల్గొనేందుకైనా… గ్రామ పెద్ద లేదా సర్పంచ్ మాట ప్రకారం, ప్రజలు వాళ్లను గుడ్డిగా అనుసరిస్తారు. అక్కడికి ఎందుకు వెళ్తున్నారో వారికి తెలియదు కూడా. ఎలాంటి సమాచారం ఉండదు. ఓటు వెయ్యాలన్నా ఏ బటన్ నొక్కాలనే విషయం కూడా వాళ్లకు తెలియదు'' అని సర్వఆదివాసీ సమాజ్ ప్రధాన కార్యదర్శి ధీరజ్ రాణా అన్నారు.

బస్తర్‌లో భద్రతాబలగాలు

ఎన్నికల కమిషన్, స్థానిక అధికారులు కలిసి వోటర్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఈ ప్రచారమంతా పట్టణ ప్రాంతాలకే పరిమితం. ఎన్నికలు జరిగే సమయంలో లోతట్టు గ్రామాల ప్రాంతాల ప్రజలు భయంతో రోజులు గడుపుతారు.

''మావోయిస్టుల ప్రచారం కారణంగా, పట్టణాలకు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాల్లో ప్రజలు భయంతో కాలం గడుపుతారు. ఈరోజు వారు ప్రాణాలతో ఉన్నారు. కానీ రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదు'' అని మలోష్నర్ గ్రామానికి చెందిన బలరామ్ భాస్కర్ అన్నారు.

ఎన్నికల హడావుడి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోని రాజకీయ వర్గాలకే పరిమితం. బస్తర్‌లోని మారుమూల ప్రాంతాల్లో జీవించే ఆదివాసులకు ఎన్నికల పట్ల ఎలాంటి ఆసక్తి కనిపించదు. వాళ్లకు వాళ్ల అడవి, సంస్కృతీ సంప్రదాయాలే ముఖ్యం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)