ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: గెలుపు కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తున్న పార్టీలు

ఫొటో సోర్స్, fb/kcr
- రచయిత, అంజయ్య తవిటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ కొంతకాలంగా నేతలు పెద్దఎత్తున యాగాలు జరిపిస్తున్నారు. ఒకవైపు నిర్విరామంగా ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తూనే, మరోవైపు యజ్ఞ, యాగాదులు కూడా చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ యాగం నిర్వహించారు. ఆ తర్వాత, జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారని, ఆయనలాగే తాము కూడా యజ్ఞ, యాగాలు నిర్వహిస్తే తమనూ విజయం వరిస్తుందన్న ఆశాభావం కొందరు ఆంధ్రా నేతల్లో పెరిగినట్లు అర్థమవుతోంది.
అందుకే, ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనల నేతలు ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలవాలని కాంక్షిస్తూ వివిధ రకాల యాగాలు చేపట్టారు.
ఆంధ్రాలో ఇటీవల ఎవరెవరు యాగాలు చేశారో చూద్దాం.

ఫొటో సోర్స్, arimenda.varaparsedreddy
జగన్ కోసం 21 నెలలుగా
2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని కాంక్షిస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అరిమెండ వరప్రసాద్ రెడ్డి 2017 జూలై 21 నుంచి నిర్విరామంగా శ్రీ మహా రుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా, ప్రస్తుతం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 54 మంది పండితులతో శ్రీ మహారుద్ర సహిత చండీ రాజశ్యామల ప్రత్యంగిర యాగం జరిపిస్తున్నారు.
ఎన్నికల పోలింగ్ జరిగే ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకూ ఆ క్రతువు కొనసాగుతుంది.
వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని 2018 అక్టోబర్‌లో శత చండీయాగం నిర్వహించారు.

ఫొటో సోర్స్, fb/ThotaOfficial
జనసేన
ఈ ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని కాంక్షిస్తూ విశాఖ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు ఫిబ్రవరి చివరి వారంలో రాజ శ్యామల యాగం నిర్వహించారు. పాయకరావు పేట జనసేన నేత బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు 16 మంది అర్చకుల సమక్షంలో ఈ యాగం జరిగింది.
పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో ఈ యాగం చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. గుంటూరు పశ్చిమ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ కూడా అతిరుద్ర యాగం చేశారు.

ఫొటో సోర్స్, Twitter/Gpullaiahyadav5
టీడీపీ
చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ కృష్ణా నది తీరంలో ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రాజశ్యామల, చండీ యాగాలు నిర్వహించారు. ఈ యాగం పూర్ణాహుతికి చంద్రబాబు దంపతులు కూడా హాజరయ్యారు.
విజయవాడలో వంగవీటి రాధా 40 మంది పండితులతో 4 రోజుల పాటు శ్రీయాగం నిర్వహించారు. మండలి విప్ బుద్ధా వెంకన్న చండీయాగం చేశారు. అంతకుముందు మార్చిలో కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలోనూ ఆ పార్టీ నేతలు చండీ యాగం జరిపించారు.
విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసర రావు కూడా తన రాజశ్యామల యాగం నిర్వహించారు.

ఫొటో సోర్స్, fb/trspartyonline
గెలిచేది ఒక్కరే.. ఇలాంటివాటిని ప్రోత్సహించరాదు: బాబు గోగినేని
"పూర్వ కాలంలో రాజు గారు యుద్ధానికి వెళ్ళే ముందు పురోహితులతో రాజ శ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు నిర్వహించేవారు. ఇది రెండు వైపులా జరిగేది, కానీ, గెలిచేది ఒక్కరే కదా! అంటే, ఈ యాగాలు ఎవరికి పనిచేస్తాయి అంటే గెలిచే వారికి మాత్రమే" అని హేతువాది బాబు గోగినేని అన్నారు.‘రాజరికం పోయింది, కానీ అప్పటి వెనుకబడిన తనం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నది. ఎన్నికలకు కూడా యాగాలను ఆశ్రయిస్తున్నారంటే, నామినేషన్లకు ముహూర్తాలపైన ఆధార పడుతున్నారంటే, ప్రచారానికి రాహు కాలం చూసుకుని బయటకు వెళ్తున్నారంటే, ఇలాంటివి చేసే రాజకీయ నాయకులు, అటువంటి వాటిని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో అర్ధం అవుతున్నద’ని ఆయన అభిప్రాయపడ్డారు.
"పార్టీ సభ్యులు ఇటువంటివి చేయడమే ఇబ్బందిగా ఉంటే, ఆ పార్టీల నేతలే స్వయంగా వీటిలో పాల్గొనడం ఇంకా శోచనీయం. ఎందుకంటే, ఇది ఆధునిక ప్రపంచానికి, ఆధునిక విజ్ఞానానికి విరుద్ధం. భారత రాజ్యాంగం తన 51 A (h) అధికరణలో 'వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందిచడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి' అని ఆదేశించడం లేదా? ఇది రాజకీయ నాయకులకు వర్తించదా?" అని బాబు గోగినేని ప్రశ్నించారు.
యజ్ఞాలు, యాగాలతో విజయం సాధించగలమని అనుకునే నాయకులు ఇప్పటికీ ఉండటం శోచనీయమన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏడీఆర్ సర్వే: కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత?
- బాయ్ ఫ్రెండ్ కోసం భార్య గొంతునులిమి చంపిన భర్త
- మీడియా ద్వారా కుట్రలు కూడా చేయొచ్చా?
- శవాన్ని ఎరువుగా మారిస్తే ఇలా ఉంటుంది
- తెలంగాణ: 'కోతుల బాధితుల సంఘం'... పొలం కాపలాకు లక్ష జీతం
- 'నా అనారోగ్యం వల్ల నా భార్యకూ నరకం కనిపిస్తోంది' -ఉద్దానం బాధితుడి ఆవేదన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








