చంద్రబాబు, జగన్, పవన్.. ప్రచారాలు సరి.. గెలిచేదెవరో ?

ప్రచారంలో బ్రాహ్మణి

ఫొటో సోర్స్, facebook/Naralokesh

ఫొటో క్యాప్షన్, ప్రచారంలో నారా బ్రాహ్మణి

తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వం ముగింపు దశకొచ్చేసింది. ఏపీలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు.. తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో, ఒకే తేదీన పోలింగ్ జరుగుతుండడంతో ప్రచారం కూడా రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ముగుస్తోంది.

చివరి నిమిషం వరకు పోటాపోటీ ప్రచారాలు.. విమర్శలు, ఆరోపణలు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు.. జరిగాయి.

ప్రచారానికి, పోలింగ్‌కు మధ్యలో వ్యూహ, ప్రతి వ్యూహాలే ఇక కీలకం కానున్నాయి.

ప్రధాని మోదీతో హంసా దేవినేని

ఫొటో సోర్స్, facebook/chowkidarhamsadevineni

ఫొటో క్యాప్షన్, ఏపీలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీతో అనంతపురం లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి హంసా దేవినేని

ఆంధ్రప్రదేశ్‌లో...

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు.

మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగుస్తుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు, మరికొన్ని చోట్ల 5 గంటలకు ముగిసింది.

సుమారు 3.93 కోట్లు మంది ఓటర్లు మొత్తం 2,437 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలైనప్పటికీ తిరస్కరణలు, ఉపసంహరణల తరువాత 175 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 2,118 మంది.. 25 లోక్‌సభ స్థానాల్లో 319 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.

ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి తమతమ సిటింగ్ స్థానాల నుంచి మరోసారి పోటీ చేస్తుండగా తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో ఓటరు కరుణ కోసం స్వయంగా ఎదురుచూస్తున్నారు.

వీరు కాకుండా తాజా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు, మాజీ మంత్రులు, కేంద్రంలో గతంలో మంత్రులుగా పనిచేసిన కిశోర్ చంద్రదేవ్(టీడీపీ), పురంధేశ్వరి(బీజేపీ) వంటివారు.. సీబీఐ జేడీగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన వీవీ లక్ష్మీనారాయణ(జనసేన) వంటివారు.. సినీ నటులు, రాజకీయ వారసులు, ఉన్నతోద్యోగాలు చేసి ఎలక్షన్లలో పోటీ చేస్తున్నవారూ ప్రజా తీర్పు కోసం సిద్ధమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో సగాని కంటే ఎక్కువ మంది మహిళా ఓటర్లు కావడంతో పార్టీలన్నీ వారిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేశాయి.

కొత్త రాష్ట్రం కావడం, ప్రత్యేక హోదా డిమాండ్ ప్రబలంగా ఉండడంతో పార్టీల విమర్శలు ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నీ ఎక్కువగా ఆ అంశం చుట్టూనే తిరిగాయి.

ఏపీ నేతలు

ఫొటో సోర్స్, facebook

బిగ్ ఫైట్

రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

మరోవైపు 2009 తరువాత మరోసారి ముక్కోణపు పోటీ ఏర్పడడంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.

ఏపీలోని ప్రధాన రాజకీయ పక్షాలు టీడీపీ, వైసీపీలు ఒంటరి పోరు సాగిస్తుండగా జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలూ ఎవరితోనూ పొత్తులేకుండానే బరిలో దిగాయి.

తొలిసారి ఎన్నికల క్షేత్రంలో అడుగుపెట్టిన జనసేన మాత్రం సీపీఐ, సీపీఎం బీఎస్పీలతో పొత్తు పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తోంది.

మాయావతి, పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, janasena

జాతీయ స్థాయి నేతల ప్రచారం

టీడీపీ ప్రచారాన్ని మొత్తం భుజానికెత్తుకున్న చంద్రబాబునాయుడు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వంటివారిని తన పార్టీ తరఫున ప్రచారానికి తీసుకొచ్చారు.

చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా తాను పోటీ చేస్తున్న మంగళగిరితో పాటు పార్టీ అభ్యర్థుల కోసం చాలా జిల్లాల్లో ప్రచారం చేశారు.

ఇక వైసీపీ అధినేత జగన్ ప్రధానంగా తానే అంతా అయి ప్రచారం చేయగా ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ సైతం చాలా ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు.

జగన్ కోసం ప్రచారంలో పాల్గొననప్పటికీ తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు మాత్రం తమ మద్దతు జగన్మోహన్ రెడ్డికేనంటూ పరోక్ష ప్రచారానికి ప్రయత్నించడం కనిపించింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల కోసం తానే స్వయంగా ప్రచారం చేపట్టారు. పార్టీలో పవన్ తరువాత రాష్ట్రవ్యాప్త చరిష్మా ఉన్న నేతలెవరూ లేకపోవడంతో ఆయనకు ఒంటరి పోరాటం తప్పలేదు. అయితే, బీఎస్పీతో పొత్తు వల్ల ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. బీఎస్పీ అధినేత్రి మాయావతి జనసేన తరఫున ఒకట్రెండు ప్రచార సభల్లో పాల్గొన్నారు.

మరోవైపు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం కూడా ప్రచారానికి వచ్చింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ చోట్ల సభలు నిర్వహించగా.. బీజేపీ సైతం ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలను తెచ్చి ప్రచారంలో ఊపు తెచ్చే ప్రయత్నం చేసింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చిత్తూరు జిల్లాలో నిర్వహించి సభల్లో పాల్గొన్నారు.

వైసీపీ మేనిఫెస్టో

ఫొటో సోర్స్, ysrcp

మేనిఫెస్టోలలో పోటాపోటీ

చంద్రబాబునాయుడు 'మీ భవిష్యత్తు నా బాధ్యత' అంటూ మేనిఫెస్టోను వెలువరించి తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెప్పుకొచ్చారు.

జగన్ తనను గెలిపిస్తే రాజన్న రాజ్యం తెస్తానని చెబుతూ.. ''నేను విన్నాను.. నేను ఉన్నాను'' పేరుతో మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకు హామీలిచ్చారు.

జనసేన సైతం మేనిఫెస్టోను విడుదల చేసి ఆకట్టుకునే పథకాలను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు తమ జాతీయ స్థాయి మేనిఫెస్టోలను ప్రచారం చేసుకుంటుండడంతో పాటు ఏపీని అభివృద్ధి చేయడం తమతోనే సాధ్యమంటూ ప్రజలను ఓట్లడిగాయి.

చంద్రబాబుతో పునేఠా

ఫొటో సోర్స్, facebook/tdp

ఫొటో క్యాప్షన్, బదిలీ అయిన సీఎస్ పునేఠా

ఈసీ కొరడా

ఈ ఎలక్షన్లలో ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఏపీ ఇంటిలిజెన్స్ విభాగ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావు, రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది.

అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠానూ బదిలీ చేసింది.

దీంతో ఈసీ కేంద్రం చెప్పినట్లు ఆడుతోందంటూ చంద్రబాబు విమర్శలు ఎక్కుపెట్టారు.

ప్రచార సభలో పాల్

ఫొటో సోర్స్, kAPaul

ఫొటో క్యాప్షన్, ప్రచార సభలో పాల్

ఆయన గురించి ప్రస్తావించకపోతే ఎలా?

ఏపీ ఎన్నికల్లో ఈసారి ప్రస్తావించాల్సిన మరో ముఖ్యమైన పేరు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పాల్ తన పార్టీ తరఫున పలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపారు.

కీలక నేతలతో సమానంగా ఆయన ప్రచారాలకూ జనం పోటెత్తడం ఒకెత్తయితే.. ఆకట్టుకునే మాటలు, ఆకర్షించే హావభావాలతో ఆయన ప్రతిరోజూ మీడియాలో హైలెట్ కావడం మరో ఎత్తు.

ప్రత్యర్థి పార్టీల నేతలను తమ్ముడూ అని పిలుస్తూ.. తనపై పోటీ చేస్తున్న అభ్యర్థులు కనిపిస్తే వారితో జోకులేస్తూ.. ఇతర పార్టీల ప్రచారం జరుగుతున్న సమయంలో తాను ఆ మార్గంలో వెళ్తే వారితో కలిసి అడుగులు వేయడం వంటి ఆసక్తికర సన్నివేశాలెన్నో పాల్ ప్రచారంలో కనిపించాయి.

వీటన్నితోపాటు తన విజయం, తన పార్టీ విజయంపై ఎక్కడలేని ఆత్మవిశ్వాసం కనబరుస్తూ.. 'నేనే సీఎం' అంటూ పాల్ పదేపదే చెబుతుండడంతోనూ ఆయన నిత్యం వార్తల్లో నిలిచారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, TRS

తెలంగాణలో..

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగింది. 443 మంది అభ్యర్థులు ఓటరు తీర్పు కోసం సిద్ధమవుతున్నారు.

పాలక పార్టీ టీఆర్ఎస్, ఎంఐఎం, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ ప్రధానంగా ఇక్కడ బరిలో నిలిచాయి.

టీఆర్ఎస్ ప్రచారాన్ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తన భుజస్కంధాలపై వేసుకోగా.. కాంగ్రెస్ బీజేపీల తరఫున రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ఆయా పార్టీల జాతీయ నేతలూ ప్రచారం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేంద్ర మంత్రులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

రాహుల్‌ గాంధీ రెండు విడతలుగా నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనగా.. ఆ పార్టీ నుంచే ఏఐసీసీ నాయకుడు గులాంనబీ ఆజాద్‌ ఒక రోజు ప్రచారం చేశారు.

బీజేపీ తరఫున ప్రధాని మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ బహిరంగసభల్లో పాల్గొనగా అమిత్‌షా వివిధ చోట్ల సభల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా బీజేపీ అభ్యర్థుల తరఫున తెలంగాణలో ప్రచారం చేశారు.

బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌లు హైదరాబాద్‌లో బహిరంగసభలో పాల్గొన్నారు.

నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న వామపక్షాల తరఫున సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకారాట్‌ బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)