సిత్రాలు సూడరో: చెవులు చిల్లులు పడుతున్నాయ్.. ఆపండి స్వామీ

bbc
    • రచయిత, జి.ఎస్.రామ్మోహన్
    • హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు

(గమనిక:పౌరులు అందుకుంటున్న ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ తాకిడిపై సెటైర్. ఇందులోని పాత్రలు,సంభాషణలుపూర్తిగా కల్పితం)

వేంకటేశ్వరరావు ఆఫీసులో కంప్యూటర్ తో కుస్తీ పడుతున్నారు. కంప్యూటర్లొచ్చి చాలా కాలమే అయినా ఆయన ఇప్పటికీ కుస్తీ నుంచి ముందుకు వెళ్లలేదు. అవెంత పనికిపాలినవో పాతరోజులెంత మంచివో ఉపన్యాసాలిస్తూనే ఉంటారు. ఇవ్వన్నీ గాలిలో ఉండి గాలిలో పోయేవని కాగితము శాశ్వతమే కాక సత్యమూ శివమూ సుందరమూ అని కూడా వేంకటేశ్వరరావు గారి నిశ్చితాభిప్రాయం. ఫైళ్లను అంటిపెట్టుకుని ఉండే దుమ్మూ ధూళికి అలవాటు పడ్డ ప్రాణం. తాను తీరిగ్గా కూర్చుని కాగితం మీద తలవంచి ఏదో రాస్తున్నట్టు ఉంటే ఎదురుగా ఉన్న మనిషి భయంగానూ అనుమానంగానూ నుంచుని చూస్తూ ఉండే దృశ్యం ఆయనకు అత్యంత ఇష్టమైన జ్ఞాపకం.

వర్తమానపు బాధ వల్ల గతంపై వచ్చిన ప్రేమతో కూడిన ఆసక్తితో ఆ పాత మధురాలను తల్చుకునే వేళ హఠాత్తుగా మొబైల్ మోగింది. అటునుంచి చంద్రబాబు. నిజ్జంగా ముఖ్యమంత్రి చంద్రబాబే. ఎదుటి వారి అధికారాన్ని బట్టి మన వినయం అనే లోకజ్ఞానం చిన్ననాడే ఔపోసన పట్టిన వాడై ఉన్నందువల్ల గౌరవంగా లేచి నుంచోబోయాడు. శరీరం పైకి లేస్తున్నపుడు ఫోన్లో లేచి నుంచున్నదీ లేనిదీ అర్థం కాదని హేతువు మనసులోలోపల అడ్డుపుల్ల వేయడం వల్ల సగంలో ఆగిపోయాడు.

చంద్రబాబు ఈ మధ్య వేదికలమీద వంగిపోయి దండాలుపెడుతున్నారే ఆ భంగిమ వరకూ లేచి కూర్చున్నాడు వేంకటేశ్వరరావు. తనకు చంద్రబాబు నేరుగా ఫోన్ చేశారనే విషయం అందరికీ తెలియపర్చడం ఎట్లా అని ఆలోచనలతో ఉబ్బితబ్బిబ్బవుతూ ఉండగానే సమస్కారం, నేను మీ చంద్రబాబును తో మొదలై ఎందుకు తనకు ఓటెయ్యాలో చెప్పడం పూర్తి చేసేశారు చంద్రబాబు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టెయడం అంత బాగోలేదని అనుకున్నప్పటికీ అంతటి బిజీ ముఖ్యమంత్రి తనకు నేరుగా ఫోన్ చేయడం అనే మహద్భాగ్యం ముందు అది చిన్న విషయమే అని సర్దుకున్నవాడై ఈ ఘనతను నలుగురితో పంచుకునేందుకు వేగంగా ఆపీసు క్యాంటీనుకు పరుగుతీశాడు వేంకటేశ్వరరావు. ఘనతైనా గాసిప్పైనా క్యాంటీనే సరైన ప్లేసని అక్కడి వారి సామూహిక నమ్మకం.

phone

ఫొటో సోర్స్, Getty Images

కాపోతే తానొకటి తలిస్తే క్యాంటీన్ మరోటి తలిచింది. కురసోవా ఇకిరు సినిమాలో పెద్దాయన మాదిరి శరీరాన్ని కూడదీసుకుని చేరేసరికే అక్కడంతా కోలాహలంగా ఉంది. అప్పటికే అక్కడ జగన్ దగ్గరనుంచి ఫోన్లు అందుకున్నవాళ్లు, పవన్ కల్యాణ్ దగ్గరనుంచి ఫోన్లు అందుకున్న వాళ్లు చేరిపోయి అనుభవాలు పంచుకుంటున్నారు.

ఒక పార్టీ అని కాదు, ఒక నాయకుడు అనికాదు. సర్వం ఐవి ఆర్ ఎస్ మయం. సాంకేతికత తెలిసిన వారు గొంతు సవరించుకుని మిగిలిన వారికి జ్ఞానబోధ చేస్తున్నారు. అవి ఏకకాలంలో ఎంతమందికి ఎలా వెళ్లగలవో చెపుతున్నారు. ఆ నెంబర్లు డేటాబేస్ నుంచి ఎలా తీసుకుంటారో ఎలా ప్రచారానికి వాడుకుంటారో విశ్లేషిస్తున్నారు. లోన్ల వాళ్లు పాలసీలవాళ్లు ఇప్పటికే ఇది ముమ్మరంగా ఎలా పాటిస్తున్నారో చెప్పకొస్తున్నారు.

సాంకేతికతతో పాటు రాజకీయ జ్ఞానం కూడా అందించడం తన బాధ్యత అని గుర్తెరిగిన మేధావులు ఇటీవల తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాల మధ్య జరిగిన డేటా గొడవను యాడించి మరీ అందరిముందు ప్రదర్శిస్తున్నారు. 50ల్లోనే 80ల తీరు తెచ్చిపెట్టుకున్న తనబోటి నలుగురైదుగురు తప్ప మిగిలిన వారంతా ఇలాంటిఫోన్ కాల్స్ రహస్యం కొద్దో గొప్పో ఎరిగిన వారని క్యాంటీన్ కొత్తగా అందించిన జ్ఞానం వేంకటేశ్వరరావు ఉత్సాహంపై పేడనీళ్లు చల్లింది.

bbc

ఫొటో సోర్స్, ISTOCK / BBC

రాత్రి గడిచింది. ఈ లోపు నాలుగైదు కాల్స్ వచ్చాయి. తమకు ఓటేస్తే ఎన్ని రకాలుగా సుఖపెడతామో అన్నీ చెప్పుకొస్తున్నారు. ఎంతైనా తొలి అనుభవం తొలి అనుభవమే. అవేమంత ఉత్సాహం కలిగించలేదు. రెండో రోజుకల్లా ఫోన్ల వేడిపెరిగింది. ఆంధ్రా నుంచే కాదు, చేవెళ్లనుంచి భువనగిరి నుంచి కూడా అదే వేగంతో ఫోన్లు వస్తున్నాయి. రాష్ర్టాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉంటాం అన్న స్ఫూర్తిని ఎలా తీసుకున్నారో ఏమో కానీ రెండు రాష్ర్టాల అభ్యర్థులనుంచి తాకిడి.

ఈ ఓటరు మన నియోజకవర్గం వాడా కాదా అనేదానితో సంబంధం లేదు. అతను అమెరికాలో ఉంటాడా అనకాపల్లిలో ఉంటాడా దిల్లీలో ఉంటాడా అనేదానితో సంబంధం లేదు. అసలు ఓటరా కాదా అనేదానితో కూడా సంబంధం లేదు. మన దగ్గర నెంబర్ ఉందా అయితే పంపించేయ్ ఆడియో మెసేజ్.తర్వాత వాళ్ల ఖర్మ. అంతే. తేనెటీగలు కమ్ముకున్నట్టు ఊపిరాడకుండా కాల్స్. రెండు రాష్ట్రాల అభ్యర్థులూ కూడబలుక్కుని చేస్తున్నట్టు క్రమం తప్పకుండా కుమ్మేస్తున్నారు. మోక్షం తప్ప అన్ని రకాల హామీలు ఇచ్చేస్తున్నారు.

వేంకటేశ్వరరావుకేమో ఫోన్ వస్తే బాత్ రూమ్లోంచి అయినా పరిగెత్తుకొచ్చి ఎత్తే అలవాటు. పోస్టాఫీసులో ట్రంకాల్ కోసం గంటల తోడి వేచిచూసిన ప్రాణం. ఫోన్ రావడమంటే ఎవరో పోవడమో కొత్తగా ప్రపంచంలోకి ఎవరైనా రావడమో అన్నంత ఇంపార్టెంట్ విషయంగా భావించిన రోజుల నాటి ప్రాణం. అందుకని సర్వకాల సర్వావస్థల యందునూ ఫోన్ అంటూ వస్తే పరిగెట్టుకుంటూ వెళ్లి శక్తినంతా చెవిలోకి తెచ్చుకుని మరీ మాట్లాడే అలవాటు. కానీ వేంకటేశ్వరరావు ఆఫీసులోనే కొన్ని తెలివైన ప్రాణాలున్నాయి. వాళ్లు కొత్త నెంబర్ అయితే ఎత్తడం మానేశారు.

భార్య ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయి వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే ఎత్తకపోవడం వంటి పరిణామాలు వాటి ప్రమాదకర పర్యవసానాలు జరిగాయి. ఏం జరిగినా చెవుల్లోంచి రక్తం కారడం కంటే అది బెటర్ కదా అని ఊరుకున్నారు. ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు అని సీనియర్లు ఊరడిస్తూ వచ్చారు. మధురమైన వారు మధురమైన సంప్రదాయం అని జోకులేసుకునే మధుమేహపు మల్లారావు లాంటి వారైతే ఫోన్ అంటూ వస్తే ముఖం అంతా జేవురించి విసిరికొట్టేంత దూరం వెళ్లిపోయారు.

తియ్యదనంతో పాటు హైబీపీ కలగలిపిన డబుల్ కా మీఠా లాంటి యాదగిరి ఆ పని కూడా చేసేశారు. కూతురు అమెరికా నుంచి పంపించిన ఫోన్ అనేకముక్కలుగా విరిగిపోయింది. ఫోన్ కాల్స్ మీదే కాదు, అసలు రాజకీయాలమీదే మనసు విరిగిపోయింది. జంధ్యాల సినిమాలో డైలాగుల మాదిరి రాజురాణి గుర్రంపై ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లడం లాంటివి గుర్తుచేసుకుని ఆకాశంలోకి చూడడమొక్కటే మిగిలింది. ఇంతకుముందు సానుకూలంగా ఉన్న నాయకులు కూడా విలన్ లాగా కనిపిస్తున్నారు. ప్రపంచం అనేదాన్ని ఆయన ఇపుడు కొత్తగా నిర్వచించుకుంటున్నారు. పోన్లలో ఆడియో మెసేజ్ పంపేవాళ్లు. పంపని వాళ్లు. ఈ రెండే ప్రపంచంలో జాతులు వర్గాలు కులాలు అన్నీను అని ఆయన ఇవేళ నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఉన్నారు.

ఫోన్

పరిపరి విధాలుగా చింతపడుతున్న వేళ మూడో రోజుకు ఒక అయ్యకు ఒక ఐడియా వచ్చింది. జర్నలిస్టుకైతే జ్ఞానము అని పిల్చుకునే సమాచారము అధికము గావున వారితో సంభాషించిన పరిష్కారము తోచునేమో అనిపించి ఎల్లవేలలా ఆ క్యాంటీన్ చుట్టుపక్కలే తచ్చాడుతూ ఉండే బీట్ రిపోర్టర్ని పిలిపించితిరి. సెక్రటేరియెట్ బీట్ చూసి ఉన్న సదరు రిపోర్టర్ నేరుగా మంత్రులకే ఫోన్ చేసి మాట్లాడగలిగిన మనిషి. అదికూడా పదిమంది మధ్యలో. అందుకని ఆయన ఎదుట పెక్కుమందికి భయంతో కూడిన గౌరవమూ మరియూ అదీను. ఇంతకీ మనోడేం చెప్పాడు. రోలు వచ్చి రోకలితో మొరపెట్టుకునుటయా అన్నట్టు చూసినవాడాయెను.

విదురుడు కౌరవ సభకేసి చూసినట్టుగా దయగా చూసి ప్లాస్టిక్ కుర్చీలో సైతం బాసింపట్టు వేసుకుని కూర్చొని ఒక దమ్ములాగి ఇవ్విధముగా పలికెను. అయ్యలారా, అమ్మలారా, ఇంత చిన్న ప్రేమకే చిగురుటాకులా వణికిపోతున్నారే, మీరు ప్రెస్ క్లబ్ అనే పేరు వినియుంటిరా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మా నాయకులు మాయందు చూపించిన ఫోన్ ప్రేమతో పోలిస్తే మీరు అనుభవిస్తున్నదెంత? ఐవిఆర్ఎస్ అనే ఈ టెక్నాలజీ కనిపెట్టిన తర్వాత ఈ భూమి మీదనూ ఇంకేదైనా గ్రహం మీదనూ మా ప్రెస్ క్లబ్ వారికంటే ఉపయోగించుకున్న వారెవ్వరునూ ఉండబోదురని గర్వంగా చెప్పగలము అని వాక్రుచ్చెను. ఇదేమీ పనికొచ్చే బేరం కాదని గ్రహించిన వారై ఈ చిత్రహింసల నుంచి కాపాడే వారెవరూ లేరా అని అందరూ మోరలెత్తి ఆకాశం వైపు చూడసాగిరి.

ఇదిగో, మనమిట్టా అనుకుంటాం కానీ ఎవరు మాత్రం పట్టించుకుంటారు చెప్పండి. వాళ్లకు వాళ్ల పని ముఖ్యం. నువ్వేమైతే వాళ్లకేం. కాకపోతే వాళ్లకు తెలీని రహస్యమొకటుంది. అంతకుముందు ఫలానా వాళ్లకి ఓటేద్దాం అనుకున్నోళ్లు కూడా విసుగు వచ్చి మనసు మార్చుకునే ప్రమాదం ఉంది. ఇపుడే ఇంత హింస పెట్టే వాళ్లు రేపు అధికారంలో ఇంకెంత హింస పెడతారో అనుకునే ప్రమాదం ఉంది. ఎవరైనా చెప్పండి బాబులూ వాళ్లకి! కోయీ హై !

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)