ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...

ఎన్టీఆర్

ఫొటో సోర్స్, Tdp/fb

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎన్టీఆర్ చిత్రపటంతో ఎన్నికల ప్రచారం చేస్తే అనర్హత వేటు వేస్తారా?.. పార్టీ నాయకుడి ఫొటోతో ప్రచారం చేసుకోవడంలో తప్పేముంది?ఎవరైనా అలానే అనుకుంటారు.

కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అది ఎన్టీఆర్ చిత్రపటమైనా సరే చర్యలు తప్పవని 1989 ఎన్నికల సందర్భంలో పలువురు నేతలకు ఎదురైన అనుభవాలు చెబుతున్నాయి.

1989 ఎన్నికలప్పుడు ఏం జరిగింది.. ఎన్టీఆర్ ఫొటో తెచ్చిన చిక్కులేంటి.. ఆ ఫొటోలోని మతలబు ఏంటో ఇద్దరు సీనియర్ నేతలకు ఎదురైన అనుభవాల ద్వారా తెలుసుకుందాం.

శంఖం ఊదుతున్న ఎన్టీఆర్ కృష్ణుడి చిత్రపటం

ఫొటో సోర్స్, TDP/FB

ఫొటో క్యాప్షన్, శంఖం ఊదుతున్న ఎన్టీఆర్ కృష్ణుడి చిత్రపటం

ఎంవీ కృష్ణారావుపై ఆరేళ్ల అనర్హత వేటు

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలిచిన ఎంవీ కృష్ణారావుకు 1989లో ఊహించని షాక్ తగిలింది.

ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత 1983లో టీడీపీ నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఎంవీ కృష్ణారావు 1985, 1989 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచారు. అయితే, 1989లో ఆయన ఎన్నికల్లో గెలిచినప్పటికీ కొద్దికాలానికే శాసనసభ్యత్వం రద్దయి ఆరేళ్ల పాటు అనర్హత వేటు కూడా పడింది.

1989లో ఆయన చేతిలో ఓడిపోయిన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బి.త్రినాథరెడ్డి వేసిన కేసే అందుకు కారణం.

ఎన్నికల ప్రచార సమయంలో ఎంవీ కృష్ణారావు ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో శంఖం ఊదుతున్న చిత్రపటాన్ని వినియోగించారని.. అలాంటి చిత్రపటాలు ఓటర్లకు ఆయన పంచిపెట్టారని.. ఇది మతపరంగా ఓటర్లను ప్రలోభపెట్టడమేనని.. 'ప్రజాప్రాతినిధ్య చట్టం-1951'లోని సెక్షన్ 12(3)కి విరుద్ధమని త్రినాథరెడ్డి, ఆయన తరఫు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.

అందుకు సంబంధించిన సాక్షాలు, ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడంతో 1992లో హైకోర్టు ఎంవీ కృష్ణారావుపై ఆరేళ్ల అనర్హత విధిస్తూ తీర్పునిచ్చింది.

ఎంవీ కృష్ణారావు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పునే సమర్థించడంతో ఆయన 1994 ఎన్నికల్లో పోటీ చేసే అర్హతా కోల్పోయారు.

మళ్లీ 1999లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసి విజయం సాధించారు.

ఎంవీ కృష్ణారావు

ఫొటో సోర్స్, BHARATH

ఫొటో క్యాప్షన్, అనర్హత వేటుకు గురైన ఎంవీ కృష్ణారావు

అయితే.. అనర్హత వేటు కారణంగా 1994లో ఎంవీ కృష్ణారావు ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన త్రినాథరెడ్డి మాత్రం విజయం సాధించలేకపోయారు.

టీడీపీ నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేసిన దక్కత అచ్యుతరామిరెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు.

ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు 1962, 1972, 2004లో మాత్రమే గెలవగలిగింది.

అలాగే, ఈ నియోజకవర్గంలో వరుసగా గెలిచిన ఎమ్మెల్యే కూడా ఎంవీ కృష్ణారావు ఒక్కరే. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఇంకే నేతకూ అలాంటి అవకాశం రాలేదు. అయితే, ఇదే ఎంవీ కృష్ణారావు 2004లో టీడీపీ టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2018లో అనారోగ్యంతో మృతిచెందారు. ఉన్నత విద్యావంతుడైన ఎంవీ కృష్ణారావు స్వస్థలం కృష్ణాజిల్లా అయినప్పటికీ ఇచ్ఛాపురంలో స్థిరపడి అక్కడి నుంచే నాలుగు సార్లు గెలిచారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ఏం చెబుతుంది?

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 లోని సెక్షన్ 123 (3) ప్రకారం మతం, జాతి, ప్రాంతం, భాష ఆధారంగా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, వారి తరఫున ప్రచారం చేసే ఏజెంట్లు, మద్దతుదారులు భారత్‌లోని భిన్న వర్గాల మనోభావాలను కించపరిచేలా లేదా శత్రుత్వ భావాలను పెంచేలా ప్రచారం చేయడం, ప్రయత్నించడం చేయకూడదు.

మోహనరావు

ఫొటో సోర్స్, Bharat

ఫొటో క్యాప్షన్, అనర్హత వేటుపడ్డ కలమట మోహన రావు

పాతపట్నంలో 'కలమట'పై అనర్హత.. లక్ష్మీపార్వతికి లక్కీ ఛాన్స్

1989లో ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కలమట మోహనరావు కూడా శ్రీకృష్ణుడి వేషధారణలో శంఖం ఊదుతున్న ఎన్టీఆర్ చిత్రపటాన్ని ప్రచారంలో వాడినందుకు అనర్హతకు గురయ్యారు. 1989లో కేవలం 274 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన నారాయణరావుపై కలమట మోహనరావు గెలిచారు. అయితే... నిబంధనలకు విరుద్ధంగా కలమట మతపరంగా ఓటర్లను ప్రభావితం చేసేలా ఎన్టీఆర్ కృష్ణుని రూపంలోని ఫొటోలు పంచిపెట్టారంటూ ధర్మాన నారాయణరావు హైకోర్టును ఆశ్రయించారు.

కేసు విచారణలో ఉండగానే 1994 ఎన్నికలు రావడంతో కలమట మోహనరావు మరోసారి టీడీపీ నుంచి గెలవడం జరిగాయి. అయితే.. 1989 ఎన్నికల కేసుకు సంబంధించి హైకోర్టు 1996లో తీర్పు వెలువరించింది. కలమట మోహనరావు శాసనసభ్యత్వాన్ని రద్దు చేసింది. ఆయన్ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగానూ ప్రకటించింది.

దీంతో 1996లో ఉప ఎన్నికలు వచ్చాయి. కలమట మోహనరావు పోటీకి అనర్హుడు కావడంతో ఆయన భార్య వేణమ్మ టీడీపీ నుంచి పోటీ చేశారు. ఎన్టీఆర్ టీడీపీ నుంచి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఇక్కడి నుంచి పోటీ చేశారు. లక్ష్మీపార్వతి మంచి ఆధిక్యంతో వేణమ్మపై గెలిచారు. మళ్లీ 1999, 2004 ఎన్నికల్లో కలమట మోహనరావే గెలిచారు.

1978లో స్వతంత్ర అభ్యర్థిగా జనతాపార్టీ నేత లుకలాపు లక్ష్మణ్ దాస్‌పై గెలవడంతో తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టిన కలమట మోహనరావు మొత్తం 5 సార్లు పాతపట్నం నుంచి గెలిచారు.

2014లో ఆయన తనయుడు కలమట వెంకటరమణ ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించి అనంతరం టీడీపీలో చేరారు. ప్రస్తుత 2019 ఎన్నికల్లో కలమట వెంకటరమణ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు.

1989 ఎన్నికకు సంబంధించి కలమట మోహనరావుపై కేసు వేసిన ధర్మాన నారాయణరావు అంతకుముందు 1985లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

తణుకులో నిలవని కేసు..

పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో 1989లో విజయం సాధించిన ముళ్లపూడి వెంకట కృష్ణారావుపైనా ఇదేవిధంగా కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ చిత్రపటాలు పంచారంటూ నియమావళి ఉల్లంఘన కేసు దాఖలైనప్పటికీ రుజువు చేయలేకపోవడంతో ఆయన శాసనసభ్యత్వానికి ఢోకా లేకుండాపోయింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)