కాంగో ఎన్నికలు: ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వద్దు.. పేపర్ బ్యాలెట్ విధానమే అనుసరించాలి’ - అమెరికా

ఫొటో సోర్స్, GETTY/JOHN WESSELS
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. 17 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత, అధ్యక్షుడు జోసెఫ్ కబీలా పదవి నుంచి తప్పుకోనున్నారు. ఏడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కానీ ఎన్నికల్లో ఉపయోగించనున్న ఓటింగ్ యంత్రాలు మాత్రం ప్రజల్లో, ప్రతిపక్షాల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
ప్రపంచంలోనే కోబాల్ట్ నిక్షేపాలు అధికంగా ఉన్న కాంగోలో 4కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాంగో దేశంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఎన్నికల్లో బ్యాటరీలతో నడిచే ట్యాబ్ తరహా పరికరాలను తొలిసారిగా వాడుతున్నారు.
కానీ.. ఈ యంత్రాల పనితీరును పూర్తిస్థాయిలో పరిశీలించలేదని 'వెస్ట్ మినిస్టర్ ఫౌండేషన్ ఫర్ డెమోక్రసీ' అధ్యయనం పేర్కొంది. వీటి కారణంగా ఎన్నికల్లో అక్రమాలు జరగొచ్చని అభిప్రాయపడింది.
దక్షిణ కొరియాకు చెందిన సంస్థ 'మిరూ సిస్టమ్స్' వీటిని రూపొందించింది. భారత్ సహా అనేక దేశాల్లో ఈవీఎంలు, ఇతర తరహా ఓటింగ్ యంత్రాలు వాడుతున్నప్పటికీ ఇలా ట్యాబ్లెట్ పీసీల తరహా పరికరాలతో ఓటింగ్ నిర్వహించడం మాత్రం ఎక్కడా లేదు.

ఫొటో సోర్స్, CENI
ఈ ఓటింగ్ యంత్రం ఎలా పని చేస్తుంది?
ట్యాబ్లెట్‌ను పోలిన దీని ద్వారా ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటు వేయగానే, ఓ బ్యాలెట్ పేపర్ ప్రింట్ వస్తుంది. ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా ఈ బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు.
ఈ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ లెక్కను, ఎన్నికల్లో వాడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్ల లెక్కతో సరిచూసుకుంటారు.
ఈ విధానం ద్వారా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా? అన్న ప్రశ్నలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. కాంగోలో నామమాత్రంగా ఉన్న సదుపాయాలు.. ఆదివారం జరగనున్న ఎన్నికలకు సవాలుగా మారాయి.
అందుకు ఉదాహరణగా కొన్ని వారాల క్రితం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరచిన ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రాజధాని కిన్షాసాలో ఎన్నికలు నిర్వహించడానికి కేటాయించిన ఓటింగ్ యంత్రాల్లో మూడోవంతు మెషిన్లు, బ్యాలెట్ పేపర్లు కాలి బూడిదయ్యాయి.

ఫొటో సోర్స్, GETTY/ALEXIS HUGUET
ఈ ఎన్నికల్లో వాడబోతున్న ఓటింగ్ మెషీన్లపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షానికి చెందిన అధ్యక్ష అభ్యర్థి షెసెకెడి.. ఈ యంత్రాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మరో ప్రతిపక్ష పార్టీ.. ఎన్నికలను బహిష్కరిస్తామంటూ హెచ్చరించింది.
ఈ ఓటింగ్ మెషీన్లలో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని 'ద సెంట్రీ'కు చెందిన నిపుణులు సారా గార్డినర్ అన్నారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ.. భద్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ, కాంగో ఎన్నికల్లో ఈ యంత్రాల వాడకంపై హెచ్చరించారు. విశ్వసనీయమైన, పారదర్శకమైన పేపర్ బ్యాలెట్ విధానాన్ని అనుసరించాలని సూచించారు.
కానీ ఈ ఓటింగ్ యంత్రాలపై వస్తున్న విమర్శలను, దక్షిణ కొరియాకు చెందిన తయారీ సంస్థ మిరూ సిస్టమ్స్ కొట్టిపారేసింది. భయపడాల్సిందేమీలేదని, కాంగోలో జరిగే ఎన్నికల్లో ఈ యంత్రాల పనితీరు అత్యంత పారదర్శకంగా ఉంటుందిని వాషింగ్టన్ పోస్ట్‌కు పంపిన ఈ మెయిల్‌లో వివరణ ఇచ్చారు.
కాంగో రాజకీయం ఎలా ఉంది?
ప్రస్తుత కాంగో అధ్యక్షుడు జోసెఫ్ కబీలాపై విజయం సాధించడానికి ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషించే ఖనిజ నిక్షేపాలను కలిగిన కాంగోలో అధికార మార్పిడి ఎన్నడూ సరళంగా జరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
హింసతో కూడిన అధికార మార్పిడి
కాంగో దేశంలో బెల్జియం పాలన ఉండేది. బెల్జియం వలసవాద పాలనకు వ్యతిరేకంగా కాంగోలో అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా 1960లో బెల్జియం నుంచి కాంగో దేశం స్వాతంత్ర్యం పొందింది.
కానీ స్వతంత్రం వచ్చినప్పటినుంచి కాంగోలో అధికారం వేగంగా చేతులు మారింది. అది కూడా హింసతో కూడిన అధికార మార్పిడి..!
స్వాతంత్ర్యం రావడానికి ఒక నెల ముందుగా జరిగిన ఎన్నికల్లో కాంగో మొదటి అధ్యక్షుడిగా జోసెఫ్ కసావుబు ఎన్నికయ్యారు. కాంగో మొదటి ప్రధానిగా ప్యాట్రిక్ లుముంబా ఎన్నికయ్యారు.
ప్యాట్రిక్ ప్రధాని పగ్గాలు చేపట్టిన కొంతకాలానికే దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగో రాజకీయాల్లో జోక్యం చేసుకున్న బెల్జియం, ప్యాట్రిక్‌ను తిరుగుబాటుదారులకు అప్పగించింది.
దీంతో ప్యాట్రిక్ తన ప్రధాని పదవిని కోల్పోయారు. తిరుగుబాటుదారులు ప్యాట్రిక్‌ను హత్య చేసి, ఆయన శవంపై యాసిడ్ పోసి కాల్చేశారు. కాంగో సైన్యాధ్యక్షుడు, తిరుగుబాటు నేత మొబుతు సెసె సీకో 1965లో కాంగో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇందిరా గాంధీ హత్యను పోలిన హత్య!
32ఏళ్ల సుదీర్ఘ పాలన అనంతరం, పొరుగు దేశాల సహాయంతో తిరుగుబాటుదారులు మొబుతు సెసె సీకోను పదవీచ్యుతుడిని చేశారు. అనంతరం అధికార పగ్గాలు చేపట్టిన లారెంట్ కబీలాను 2001లో తన అంగరక్షకుడే హత్య చేశాడు.
కబీలా కొడుకు 29ఏళ్ల జోసెఫ్ కబీలా కాంగో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన నేతగా జోసెఫ్ ప్రఖ్యాతి చెందారు.
కాంగోలో 2016లో ఎన్నికలు జరగాల్సివుండగా, కొన్ని కారణాలతో జరగలేదు. దీంతో జోసెఫ్ కబీలానే ఇప్పటివరకూ కాంగో అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఆదివారం జరగనున్న ఎన్నికల్లోనైనా హింసతో కాకుండా, అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతుందని కాంగో ప్రజలు భావిస్తున్నారు. కానీ ఓటింగ్ మిషీన్లపై ఆందోళన మాత్రం ప్రజల్లో ఇంకా ఉంది.
ఇవి కూడా చదవండి
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- మేఘాలయ బొగ్గుగనిలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు విశాఖ నుంచి గజ ఈతగాళ్లు
- రాజకీయాల్లోకి ఏంజెలీనా జోలీ?
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








