ఐదేళ్ల తర్వాత వీడియోలో కనిపించిన ఇస్లామిక్ స్టేట్ అధినేత.. శ్రీలంక దాడులు తమ పనేనని ప్రకటన

ఫొటో సోర్స్, iS video
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ సంస్థ అధినేత అబూ బకర్ అల్-బగ్దాదీ దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారి ఓ వీడియోలో కనిపించారు.
బగ్దాదీ ప్రసంగంగా పేర్కొంటూ ఐఎస్ ఈ వీడియోను విడుదల చేసింది. ఇంతకుముందు బగ్దాదీ 2014లో 'ఖలీఫా రాజ్యం' ఏర్పాటు చేస్తానంటూ మోసుల్‌లో మాట్లాడిన వీడియో ఒక్కటే ఆయన చివరి వీడియోగా చెప్పేవారు.
ఐఎస్ సొంత మీడియా నెట్‌వర్క్ అల్-ఫర్ఖాన్‌లో 18 నిమిషాల నిడివి ఉన్న తాజా వీడియోను పోస్ట్ చేసింది.
దీన్ని ఎప్పుడు రికార్డ్ చేశారన్నదానిపై స్పష్టత రాలేదు. ఐఎస్ మాత్రం ఏప్రిల్‌లో చిత్రీకరించామని చెబుతోంది.
వీడియో విశ్వసనీయతను నిర్ధారించే పనిలో తమ నిపుణులు ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. 'ఇంకా మిగిలి ఉన్న ఐఎస్ నాయకులకు పని పట్టేందుకు' అమెరికా నేతృత్వంలోని కూటమి కట్టుబడి ఉందని ప్రకటించింది.

ఫొటో సోర్స్, AFP
బగ్దాదీ ఏం చెప్పారు?
బుర్కినా ఫసో, మాలిలోని మిలిటెంట్లు తమకు విధేయత ప్రకటించారని బగ్దాదీ ఈ వీడియోలో చెబుతూ కనిపించారు.
సూడాన్, అల్జీరియాల్లో నిరసనల గురించి మాట్లాడారు. 'నిరంకుశ పాలకుల' సమస్యకు 'జీహాద్' పరిష్కారమని అన్నారు.
సుదీర్ఘ కాలం సూడన్‌ను పాలించిన ఒమర్ అల్-బషీర్, అల్జీరియాను పాలించిన అబ్దెలాజీజ్ ఇటీవలే పదవీచ్యుతలయ్యారు.
శ్రీలంక పేలుళ్లపై ఏమన్నారు
వీడియో చివర్లో బగ్దాదీ కనిపించకుండా కేవలం ఆయన మాటల ఆడియో రికార్డింగ్ మాత్రమే వినిపించింది.
శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజున జరిగిన దాడుల గురించి ఆయన ఇందులో మాట్లాడారు.
ప్రధాన వీడియో చిత్రీకరించిన తర్వాత కొన్ని రోజులకు ఈ ఆడియో రికార్డ్ చేసి ఉండొచ్చు.
సిరియాలోని బాఘజ్ పట్టణంలో తాము చవిచూసిన పతనానికి శ్రీలంకలో దాడులు ప్రతీకారమని బగ్దాదీ ఇందులో అన్నారు.
అయితే ఆ దాడులకు ఐఎస్ బాధ్యత ప్రకటించుకున్నప్పుడు బాఘజ్ పట్టణం గురించి ప్రస్తావనే చేయలేదని బీబీసీ మానిటర్ అనలిస్ట్ మినా అల్-లామీ గుర్తుచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓటముల ప్రస్తావన
గత ఆగస్టులోనూ బగ్దాదీ ఆడియో క్లిప్ ఒకటి బయటకువచ్చింది.
అందులో ఐఎస్ ఓటములపై నుంచి జనాల దృష్టి మరల్చేందుకు బగ్దాదీ ప్రయత్నించారని బీబీసీ మధ్య ప్రాచ్య ప్రతినిధి మార్టిన్ పాటియన్స్ అన్నారు.
తాజా వీడియోలో మాత్రం ఐఎస్ ఓటముల గురించి బగ్దాదీ నేరుగా ప్రస్తావించారు.
''బాఘజ్ పోరాటం ముగిసింది. కానీ, మరిన్ని రానున్నాయి'' అని అన్నారు.
ఐఎస్ 'సంఘర్షణ పోరాటం' జరుపుతోందని వ్యాఖ్యానించారు.
2014 తర్వాత బగ్దాదీ ఎక్కడా బయటకు కనిపించట్లేదు. ఆయన మృతి చెందినట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- 'ఫుడ్ అనేది ఒక పోర్న్ అయితే... నేను పోర్న్ స్టార్‌ని'
- న్యూస్పేపర్లలో ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం, పార్సిల్ చేయడంపై నిషేధం.. జులై 1 నుంచి అమలు
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- హైదరాబాద్‌కు బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది?
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- ఆరోగ్యంపై హార్మోన్ల ప్రభావం గురించి మహిళలు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








