ఫొని తుపాను: ఒడిశా, ఉత్తరాంధ్ర కకావికలం... ఎనిమిది మంది మృతి

ఫొని

ఫొటో సోర్స్, BBC/SUBRATKUMARPATI

    • రచయిత, ఒడిశా నుంచి శంకర్, శ్రీకాకుళం నుంచి విజయ్
    • హోదా, బీబీసీ కోసం

ఫొని తుపాను బీభత్సం సృష్టించింది. ఒడిశాను అతలాకుతలం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం భారీగా నివారించగలిగినా ఆస్తి నష్టం మాత్రం తప్పలేదు.

కుండపోత వాన, 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు వేల సంఖ్యలో కూలిపోయాయి. సెల్‌ఫోన్ టవర్లు ధ్వంసమయ్యాయి.

అనేక చోట్ల గోడలు, ఇళ్లు కూలిపోయాయి. భువనేశ్వర్, ఖుర్దారోడ్, పూరీ రైల్వే స్టేషన్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రాజధాని భువనేశ్వర్‌లోని బిజూపట్నాయిక్ అంతర్జాతీయ విమానాశ్రయానికీ ఫొని తుపాను తాకిడి తప్పలేదు. అక్కడా నష్టం వాటిల్లింది. విమానాశ్రయం నుంచి అన్ని సర్వీసులనూ ఒక రోజు పాటు రద్దు చేశారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 8 మంది చనిపోయినట్లు పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. పూరీ పరిసరాల్లో 160 మంది గాయపడ్డారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

తుపాను కారణంగా ఉత్తరాంధ్ర, ఒడిశా మీదుగా వెళ్లే 147 రైళ్లు రద్దయ్యాయి.

కూలిన చెట్లు

ఫొటో సోర్స్, DPRO srikakulam

ఆంధ్రకు సమీపంలోనే తీరం దాటింది..

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సరిహద్దుకు సుమారు 50 కిలోమీటర్ల ఎగువన రంభ సమీపంలో చిల్కా సరస్సు మీదుగా తీరాన్ని దాటిన తుపాను ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపింది.

తీరం దాటిన సమయంలో 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రచండ గాలులు వీచాయి.

సెల్‌ఫోన్‌ టవర్లు, భారీ క్రేన్లు సైతం ఈ పెనుగాలులకు చిగురుటాకుల్లా వణుకుతూ నేలకూలాయి. బస్సులు, కార్లు గాలికి కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ కావడం తుపాను తీవ్రతను చాటింది.

అయితే, ఒడిశా ప్రభుత్వం జాతీయ రహదారులు సహా అనేక మార్గాల్లో రాకపోకలను సైతం శుక్రవారం కొంత సమయం నిషేధించింది. సుమారు 14 లక్షల మంది ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణ నష్టం తగ్గింది. కేంద్రపడ, నయాగఢ్ జిల్లాల్లో ఇద్దరు మరణించినట్లు అధికారులు బీబీసీకి తెలిపారు.

పైకప్పు ఎగిరిపోయిన రైల్వే స్టేషన్

ఫొటో సోర్స్, DPRO Srikakulam

ఫొటో క్యాప్షన్, ఒడిశాలోని భువనేశ్వర్, ఖుర్దా రోడ్, పూరీ రైల్వేస్టేషన్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణ సహాయ నిధి కింద ప్రధానమంత్రి మోదీ రూ.వెయ్యి కోట్ల రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించారు.

బంగ్లాదేశ్‌లో ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ధాటికి చెట్టు కూలి ఒకరు మరణించగా, వరదల కారణంగా 14 గ్రామాలు కొట్టుకుపోయాయని అక్కడి అధికారులు ఏఎఫ్‌ఫీ వార్త సంస్థకు తెలిపారు.

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ మీదుగా కదులుతున్న వాయుగుండం శనివారం నాటికి మరింత బలపడే అవకాశం ఉంది.

పురీలో తుపాను విధ్వంసం

ఫొటో సోర్స్, EPA

శ్రీకాకుళం జిల్లాలోనూ భారీ నష్టం

తుపాను ఒడిశాలో తీరం దాటినప్పటికీ అంతకుముందే ఉత్తరాంధ్రలో, ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ నష్టానికి కారణమైంది.

శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాలు, రెండు పట్టణాలపై ఈ తుపాను ప్రభావం అధికంగా కనిపించింది.

శుక్రవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం 406 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 187 హెక్టార్లలో వరి, 555 హెక్టార్లలో వేరుసెనగ, పత్తి, కొర్ర, మొక్కజొన్న, రాగి, పొద్దుతిరుగుడు, పొగాకు, తదితర పంటలకు నష్టం వాటిల్లింది. నష్టం విలువ పూర్తి స్థాయిలో అంచనా వేయాల్సి ఉంది.

162 ఇళ్లు దెబ్బతిన్నాయి. సుమారు రూ. 51.25 లక్షల మేర ఈ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

శ్రీకాకుళంలో ధ్వంసమైన అరటి పంట

ఫొటో సోర్స్, dpro srikakulam

ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళంలో ధ్వంసమైన అరటి పంట

ఇందులో 33 కె. వి. ఫీడర్లు 19, 11 కె. వి. ఫీడర్లు 101, 33/11 కె. వి. సబ్ స్టేషన్లు 45, 33 కె. వి. ఫోల్స్ 72, 11 కె. వి. ఫోల్స్ 554, ఎల్. టి. ఫోల్స్ 1503, డి. టి. ఆర్. లు 137 27 కిలోమీటర్ల వరకు ఎల్. టి. లైన్లు, 194 కిలోమీటర్ల వరకు 33 కె. వి. లైన్లు, 1435.16 కిలోమీటర్ల వరకు 11 కె. వి. లైన్లు దెబ్బతినడంతో విద్యుత్ శాఖకు రూ. 9.7 కోట్ల మేర నష్టమేర్పడింది.

తుపాను కారణంగా పశువులు, గొర్రెల పెంపకదార్లకు కొంత నష్టం వాటిల్లింది. 9 పశువులు, 12 గొర్రెలు మృతి చెందడంతో రూ. 3.49 లక్షల మేర నష్టపోయారు.

రెండు పురపాలక సంఘాల్లో కాలువలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా పైపులైన్లు దెబ్బతినడంతో రూ.21 కోట్ల మేర నష్టమేర్పడింది.

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించిన మొత్తంగా రూ. 38 కోట్లకు పైగా నష్టమేర్పడినట్లు ప్రాథమిక అంచనాలున్నాయని అధికారులు వెల్లడించారు.

తుపాను

ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం నివారణ

మే 2వ తేదీ అర్ధరాత్రి తరువాత 150 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి. అయితే, అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా 3,334 కుటుంబాలకు చెందిన సుమారు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం.. 14 మండలాల్లో ముందుజాగ్రత్తగా విద్యుత్ నిలిపివేయడం, రహదారుల వెంబడి ఉన్న చెట్ల కొమ్మలను నరికించడంతో చాలావరకు ప్రమాదాలు, నష్టం తప్పించగలిగారు.

225 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 160 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 232 మంది అగ్నిమాపక సిబ్బంది పునరావాస చర్యలు చేపట్టారు.

338.295 మెట్రిక్ టన్నుల బియ్యం, 11.169 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 123.500 మెట్రిక్ టన్నుల బంగాళ దుంపలు, 5338 లీటర్ల పామాయిల్, 70.550 మెట్రిక్ టన్నుల ఉల్లి పాయలు, 16 వేల లీటర్ల పాలు పునరావాస కేంద్రాల్లో అందుబాటులో ఉంచి బాధితులకు భోజన ఏర్పాట్లు చేశారు.

312 వైద్య శిబిరాలు నిర్వహించి తుపాను బాధిత ప్రజలకు అవసరమైన వైద్య సహాయం అందించారు.

తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవస్థలను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ 'బీబీసీ తెలుగు'కు తెలిపారు. కంచిలి, పలాస, కొత్తూరు, సంతబొమ్మాళి, పొలాకి, కోటబొమ్మాళి, నందిగాం, గార, రణస్థలం, శ్రీకాకుళం సహా 12 మండలాల్లో ఫొని ప్రభావం ఉందని తెలిపారు.

అత్యధికంగా కంచిలి లో 19 సెంటమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్ర తనయ నదులకు వరదలు వచ్చే ప్రమాదముండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

శుక్రవారం రాత్రి సరికి 60 శాతం గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు. ప్రాణనష్టమేమీ లేదని కలెక్టర్ నివాస్ బీబీసీ తెలుగుకు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)