ఫేస్‌బుక్: వారు ‘అత్యంత ప్రమాదకర వ్యక్తులు’.. అందుకే నిషేధిస్తున్నాం

ఫొటో సోర్స్, AFP/GETTY
- రచయిత, డేవ్ లీ
- హోదా, నార్త్ అమెరికా టెక్నాలజీ రిపోర్టర్
సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ తాను ''ప్రమాదకర వ్యక్తులు''గా పరిగణిస్తున్న కొందరు ప్రముఖులపై నిషేధం విధిస్తోంది.
మితవాద కుట్ర సిద్ధాంత వెబ్‌సైట్ ఇన్ఫోవార్స్ నిర్వాహకుడు అలెక్స్ జోన్స్, ఆ వెబ్‌సైట్ బ్రిటన్ ఎడిటర్ పాల్ జోసెఫ్ వాట్సన్, బ్రీట్‌బార్ట్ మాజీ న్యూస్ ఎడిటర్ మిలో యియానోపోలోస్‌లు విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని ఫేస్‌బుక్ ఆరోపించింది.
యూదు వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తీకరించిన నేషన్ ఆఫ్ ఇస్లామ్ నాయకుడు లూయీ ఫరాఖాన్‌ను కూడా ఫేస్‌బుక్ తొలగించనుంది.
బ్రిటన్ ఫస్ట్ వంటి బ్రిటన్‌లోని నిషిద్ధ ఇస్లామిక్ వ్యతిరేక గ్రూపులను ఈ సోషల్ నెట్‌వర్క్ ఇప్పటికే బ్యాన్ చేసింది.
తాజా నిషేధం ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
''హింస, విద్వేషాలను ప్రోత్సహించే లేదా పాలుపంచుకునే వ్యక్తులు, సంస్థలను వాటి సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా మేం ఎల్లప్పుడూ నిషేధిస్తూనే ఉన్నాం'' అని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది.
''నియమనిబంధనలను ఉల్లంఘించే వారిని సమీక్షించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ అకౌంట్లను తొలగించాలన్న నిర్ణయానికి మేం నేడు వచ్చాం'' అని వివరించింది.
శ్వేతజాతి ఆధిపత్యవాది పాల్ నెహ్లెన్, ఇస్లామ్ వ్యతిరేక కార్యకర్త లారా లూమర్‌లు కూడా ఈ నిషేధం ఎదుర్కొంటున్నవారిలో ఉన్నారు.
ట్విటర్ తనను నిషేధించటాన్ని వ్యతిరేకిస్తూ లారా లూమర్ గత నవంబర్‌లో న్యూయార్క్‌లోని ట్విటర్ భవనం వద్ద తన చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు.
అయితే.. వీరి అకౌంట్లను నిషేధిస్తున్నట్లు ఫేస్‌బుక్ ముందస్తుగా హెచ్చరించటం మీద విమర్శలు వచ్చాయి. అలా ముందుగా హెచ్చరించటం వల్ల వీరు తమ ఫాలోయర్లను ఇతర వేదికలకు మళ్లించటానికి అవకాశం ఇచ్చినట్లు అయిందన్నది విమర్శకుల వాదన.

ఫొటో సోర్స్, Getty Images
అలెక్స్ జోన్స్ తన మీద ఫేస్‌బుక్ విధించబోతున్న నిషేధం గురించి గురువారం నాడు ఫేస్‌బుక్ వేదికగానే కొంత సేపు ప్రసారం నిర్వహించారు.
''నన్ను నిషేధించబోతున్నారు. ఈ అకౌంట్ అదృశ్యమయ్యే ముందుగా నా మెయిలింగ్ లిస్ట్‌కి సైన్ అప్ చేయండి'' అంటూ యియానోపోలోస్ తన ఫాలోయర్లను ఉద్దేశించి రాశారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రెండిటిలోనూ ఈ వ్యక్తులకు సంబంధించిన అన్ని రకాల ప్రాతినిధ్యాలకూ నిషేధం వర్తిస్తుందని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
వీరికి ప్రాతినిధ్యం వహిస్తూ ఏర్పాటు చేసిన పేజీలు, గ్రూపులు, అకౌంట్లు అన్నిటినీ తొలగిస్తామని, నిషేధిత వ్యక్తి పాల్గొంటున్నట్లుగా తమకు తెలిసిన కార్యక్రమాల ప్రొమోషన్‌ను అనుమతించబోమని వివరించారు.
ఈ యూజర్లను నిషేధించటంలో హేతుబద్ధతను ఫేస్‌బుక్ ఒక ఈమెయిల్‌లో వివరించింది:
- అలెక్స్ జోన్స్ తన కార్యక్రమంలో.. జాత్యహంకార, ముస్లిం వ్యతిరేక, మహిళా వ్యతిరేక వాదనలకు పేరుపడ్డ ప్రౌడ్ బోయ్స్ అనే గ్రూప్ నాయకుడు గావిన్ మెక్‌ఇన్స్‌కు ఆతిథ్యం ఇచ్చారని ఫేస్‌బుక్ పేర్కొంది. గావిన్ మెక్‌ఇన్స్‌ను ఫేస్‌బుక్ ''విద్వేషకారి''గా ఫేస్‌బుక్ నిర్ధారించింది.
- ఫేస్‌బుక్ నిషేధించిన గావిన్ మెక్‌ఇన్స్‌ను, ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ వ్యవస్థాపకుడు టామీ రాబిన్సన్‌లను మిలో యియానోపోలోస్ ఈ ఏడాది బాహాటంగా కీర్తించారని ఆ సంస్థ పేర్కొంది.
- అలాగే లారా లూమర్ సైతం మెక్ఇన్స్‌తో కలిసి పాల్గొన్నారని, మరో నిషేధిత వ్యక్తి ఫెయిత్ గోల్డీని ఆమె కీర్తించారని ఫేస్‌బుక్ చెప్పింది.
- నేషన్ ఆఫ్ ఇస్లామ్ లీడర్ లూయీ ఫరాఖాన్ ఈ ఏడాది ఆరంభంలో పలు యూదు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు నిషేధించినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








