న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్ నిశ్చితార్థం.. సాహచర్యం చేస్తున్న ప్రియుడితో పెళ్లి ఖరారు

ఫొటో సోర్స్, Getty Images
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డెన్‌కు ఆమె దీర్ఘ కాల సహచరుడు, టెలివిజన్ ప్రెజెంటర్ క్లార్క్ గేఫోర్డ్‌తో నిశ్చితార్థం జరిగిందని అధికార ప్రతినిధి ఒకరు నిర్ధరించారు.
ప్రధాని జసిందా ఆర్డెన్ శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్నపుడు ఆమె ఎడమచేతి మధ్య వేలికి వజ్రపు ఉంగరం కనిపించిన తర్వాత ఆమె, ఆమె సహచరుడి పెళ్లి నిశ్చయమైందన్న వార్తలు వచ్చాయి.
ఆమె చేతికి వజ్రపు ఉంగరం గమనించిన ఒక జర్నలిస్ట్ ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించగా.. ఈ జంటకు ఈస్టర్ పండుగ సందర్భంగా నిశ్చితార్థం జరిగిందని ప్రధాని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
ప్రధాని జసిందా, ఆమె సహచరుడు క్లార్క్‌ల మొదటి బిడ్డ గత ఏడాదిలో జన్మించింది. ఆ పాపకు నీవ్ తె అరోహా అని నామకరణం చేశారు.
ఉన్నత పదవిలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన రెండో ప్రపంచ నాయకురాలు జసిందా. పాకిస్తాన్‌కు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసిన బేనజీర్ భుట్టో అధికారంలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన తొలి ప్రపంచ నాయకురాలిగా చరిత్ర సృష్టించారు.

ఫొటో సోర్స్, Getty Images
క్లార్క్ గేఫోర్డ్‌ను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేస్తారా అని బీబీసీ ప్రతినిధి విక్టోరియా డెర్బీషైర్ ఈ ఏడాది జనవరిలో ప్రధాని జసిందాను ప్రశ్నించారు.
''లేదు. నేను అడగను. ఈ ప్రశ్న గురించి అతడు స్వయంగా బాధ, వేదన అనుభవించాలన్నది నా కోరిక'' అని జసిందా బదులిచ్చారు.
గేఫోర్డ్ ఇంటి వద్ద ఉండి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునే తండ్రి పాత్ర చేపడారని ఆమె చెప్పారు.
''నేను చాలా చాలా అదృష్టవంతురాలిని'' అని ఆమె రేడియో న్యూజిలాండ్‌తో పేర్కొన్నారు.
''నాతో పాటు నడిచే ఒక భాగస్వామి నాకు ఉన్నారు. ఆయన ఒక తండ్రి కనుక.. ఈ ఉమ్మడి బాధ్యతలో అధిక భాగం చేపడుతున్నారు'' అని జసిందా వివరించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








