వారణాసిలో మోదీ మీద పోటీ చేస్తున్నకాంగ్రెస్ అభ్యర్థి సొంత పార్టీనే విమర్శించారా? :Fact Check

ఫొటో సోర్స్, Hindustan Times
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నరేంద్ర మోదీపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత అజయ్ రాయ్, తన సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
''వారణాసి నుంచి పోటీ చేస్తోన్న మోదీ ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఏమంటున్నారో వినండి'' అని వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు.
నరేంద్ర మోదీపై వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరదింపుతూ, కాంగ్రెస్ పార్టీ అజయ్ రాయ్‌ను వారణాసి అభ్యర్థిగా ప్రకటించాక, ఈ వీడియో తెరపైకి వచ్చింది.

ఫొటో సోర్స్, Facebook/Screen grab
రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో, ఓ వ్యక్తి.. కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగ్ గురించి ప్రస్తావిస్తూ, తల్లీకొడుకులు పార్టీని నాశనం చేస్తున్నారు అన్న విజువల్ ఉంటుంది.
'పార్టీలో ఆశ్రిత పక్షపాతం, ప్రాపకం పెరిగాయి' అని ఆ వీడియోలో విమర్శిస్తారు. గతంలో పదేళ్లు పాలించిన యూపీఏ ప్రభుత్వాన్ని 'రిమోట్ కంట్రోల్ గవర్నమెంట్' అని ఆ వీడియోలోని వ్యక్తి అన్నారు.
'' మనం తప్పుగా ఆలోచిస్తున్నాం. మన రాజకీయాలు తప్పు. మనం పార్టీకి బానిసలం అయ్యాం. ఇక మన పిల్లలకు అవకాశాలు ఎప్పుడు వస్తాయి? ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. మనమేమో.. ఆయన్ను పార్టీ జనరల్ సెక్రటరీని చేశాం. మీరు కోర్ మీటింగ్‌కు హాజరైనపుడు, దేశం గురించి ఆలోచించడంతోపాటు, మీ సంక్షేమం గురించి కూడా ఆలోచించండి. పొరపాట్ల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది'' అన్నారు.
వీడయో చివర్లో, 'ఇవి నా అభిప్రాయాలు' అంటారాయన.
కానీ ఈ వీడియోలో కనిపిస్తోంది అజయ్ రాయ్ కాదని మేం కనుగొన్నాం.

ఫొటో సోర్స్, Getty Images
వీడియో వెనుక అసలు కథ
వీడియోలో కనిపించే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వ్యాపారవేత్త అనిల్ బూల్‌ఛందాని అనే వ్యక్తికి చెందిన వీడియో ఇది.
2019 ఫిబ్రవరి 8న అనిల్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 'మై డ్రమటిక్ రియాక్షన్స్' అని క్యాప్షన్ రాశారు అనిల్.
తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లోని ఒక ఫొటోకు 'నా వీడియో నాకంటే ఎక్కువ ఫేమస్ అయ్యింది' అని క్యాప్షన్ రాశారు.
సాధ్వి ప్రగ్యా ఠాకూర్, అలోక్ సంజర్‌లతో తీయించుకున్న ఫొటోలు కూడా తన ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో కనిపిస్తాయి.
అనిల్ బూల్‌ఛందాని బీబీసీతో మాట్లాడుతూ, ''ఓ సినిమాకు ఆడిషన్స్ కోసం ఈ వీడియోలో అలా నటించాను. నేను బీజేపీ మద్దతుదారుడిని. ఆడిషన్స్ కోసం చాలా వీడియోల్లో నటించాను. కానీ ఇది మాత్రమే ఇలా ఎక్కవగా సర్క్యులేట్ అయ్యింది'' అన్నారు.
అయితే, తన సినిమా ప్రయత్నాల గురించి ఆయన చెబుతున్న విషయాలను మేం ధ్రువీకరించలేకపోయాం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








