అయితే ఇరవైల్లో లేకుంటే యాభైల్లో

వయసు పైబడినవారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ''వయసు పైబడినతర్వాతే చాలా మంది ఆవిష్కర్తలు గొప్ప విజయాలు సాధించగలిగారు''

ఇరవైల్లో ఉన్నప్పుడు మీరు చాలా క్రియేటివ్‌గా ఉన్నారా? వినూత్నమైన ఆలోచనలు చేసేవారా?

అయితే, జీవితంలోనే క్రియేటివిటీ అత్యున్నత స్థాయికి చేరిన దశలో అప్పుడు మీరు ఉండటమే అందుకు కారణం కావొచ్చు.

వయసు ఇరవైల మధ్యలో ఉన్నప్పుడు మనుషులు క్రియేటివిటీపరంగా అత్యుత్తమ దశను మొదటి సారి చవిచూస్తారని ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అప్పుడు మెదడు వినూత్నమైన ఆలోచనల భాండాగారంగా మారుతుందని వారు వెల్లడించారు.

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు సాధించినవారిపై ఈ అధ్యయనం చేశారు.

ఇరవైల్లో ఎక్కువగా విప్లవాత్మక ఆవిష్కరణలు చేసినవారు ఇలా వినూత్న ఆలోచనలు చేసినవారని పరిశోధకులు గుర్తించారు.

అయితే ఇరవైలను దాటాక కూడా క్రియేటివిటీలో అత్యుత్తమ దశను చవిచూడనివారు దిగులుపడాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు.

కొంతమందికి యాభైల్లో ఈ దశ వస్తుందని చెబుతున్నారు.

నానా జోన్స్ డార్కో
ఫొటో క్యాప్షన్, నానా జోన్స్ డార్కో

'ఇరవైల్లోనే ఒత్తిడి'

బ్రిటన్‌కు చెందిన 24 ఏళ్ల నానా జోన్స్ డార్కో సంచార క్షౌరశాలలు నడుపుతున్నారు.

తనకు ఎప్పుడూ కుప్పలుతెప్పలుగా వ్యాపార ఆలోచనలు వచ్చేవని, అయితే ప్రస్తుతం మరింత వినూత్నంగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుందని ఆయన అన్నారు.

ఇదే అత్యుత్తమ స్థాయి అంటే మాత్రం తాను విశ్వసించినని చెప్పారు.

''కొంచెం వయసు వచ్చాక మనల్ని అందరూ సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెడతారు. అవరోధాలు తగ్గుతాయి. మెదడు కూడా ఎక్కువ ఆలోచనలు చేయడం మొదలుపెడుతుంది. ఏదైనా సాధించాలన్న ఒత్తిడి ఇరవైల్లోనే అధికంగా ఉంటుంది. 'సాధారణ' కెరీర్‌ను కాకుండా కొత్తది ఎంచుకున్నప్పుడు అది ఇంకా ఎక్కువవుతుంది. తల్లిదండ్రులు, స్నేహితులు, చుట్టూ ఉండే పరిస్థితులు 25 ఏళ్లలోపు ఆర్థికంగా మీరు స్థిరపడాలన్న ఒత్తిడిని పెంచుతాయి'' అని జోన్స్ వ్యాఖ్యానించారు.

తన తల్లి ప్రస్తుతం యాభైల్లో ఉన్నారని, ఆమె సొంతంగా ఓ వ్యాపారం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.

క్రియేటివిటీ

ఫొటో సోర్స్, Getty Images

''వయసు ఎప్పుడూ అడ్డు కాదు''

జీవితంలో అనుకున్నదేదీ సాధించలేదని బాధపడేవారు యాభైల్లో సాధించేందుకు ప్రయత్నించవచ్చని అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ వీన్‌బెర్గ్ అంటున్నారు.

''ఇరవైల్లో సాధించలేకపోయినవారి విషయంలో అంతా ముగిసిపోయినట్లు కాదు. వయసు పైబడినతర్వాతే చాలా మంది ఆవిష్కర్తలు గొప్ప విజయాలు సాధించగలిగారనీ రుజువైంది'' అని ఆయన చెప్పారు.

''జీవితంలో ఇంకా సాధించాలనుకునే యువత ఆ దిశగా కృషిని కొనసాగించాలి. వయసుపైబడ్డాక వినూత్నంగా పనిచేస్తున్నామని భావిస్తున్నవారు అలాగే ముందుకు సాగాలి. ఎవరెలాంటి విజయాలు సాధిస్తారో ఎవరూ ఊహించలేరు'' అని వీన్‌బెర్గ్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)