మోదీ నేపాల్ పర్యటన: రద్దయిన భారతీయ నోట్లను మార్చుకునేందుకు ఒక్క ఛాన్స్ ఇస్తారా?

నరేంద్ర మోదీ, ఐదొందల నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి, కాఠ్మండూ నుంచి

ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ మూడోసారి నేపాల్ వెళ్లారు. శుక్రవారం(మే 11వ తేదీ) ఉదయం నుంచి ఆయన రెండు రోజుల పర్యటన మొదలైంది.

నవంబర్ 2016లో నోట్ల రద్దుతో నేపాల్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. నేపాల్ వెళ్తున్న ప్రధాని ఆ దేశ నేతలతో ఇదే విషయంపై చర్చలు జరుపుతారని భావిస్తున్నారు.

నేపాల్‌లోని సెంట్రల్ బ్యాంక్‌లో ఇప్పటికీ సుమారు రూ.8 కోట్ల రూపాయల విలువైన రద్దైన పాత నోట్లు ఉన్నాయి.

భారత్‌లో నోట్ల రద్దు రోజు మీకు గుర్తుండే ఉంటుంది.

ఏటీఎంల ముందు జనం పొడవాటి క్యూలు కట్టారు.

ప్రభుత్వం దెబ్బతో చిరు వ్యాపారులు రద్దైన 500, వెయ్యి నోట్లను మార్చుకోడానికి బ్యాంకుల ముందు గుమిగూడారు.

కానీ నోట్ల రద్దుతో భారత్ పక్కనే ఉన్న నేపాల్‌లో కూడా జనం చాలా ఇబ్బందులు పడ్డారు.

నేపాల్ నోటు తిప్పలు
నేపాల్ నోటు తిప్పలు

ఫొటో సోర్స్, Getty Images

‘భారతీయ రూపాయిపై నమ్మకం తగ్గిపోయింది’

మన దేశంలో ప్రజలకు పాత 500, వెయ్యి రూపాయలు మార్చుకునే అవకాశం ఇచ్చారు.

కానీ నేపాల్‌లో భారతీయ కరెన్సీ ఉన్న వాళ్లు మాత్రం ఇప్పటికీ ఆ అవకాశం కోసం వేచిచూస్తున్నారు.

నోట్ల రద్దు ముందు నేపాల్లో 500, వెయ్యి నోట్లు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి.

నోట్ల రద్దు ముందు ప్రజలకు 25వేల వరకూ నేపాల్ తీసుకెళ్లే అవకాశం ఉండేది.

అది కాకుండా నేపాల్‌ మొత్తం వ్యాపారంలో 70శాతం భారత్ వల్లే జరుగుతుంది. అందుకే అక్కడి ప్రజలు తమ దగ్గర భారత కరెన్సీని ఉంచుకునేవారు.

నోట్ల రద్దు ప్రకటనతో 500, వెయ్యి రూపాయల భారత కరెన్సీ నోట్లు తమ దగ్గరే ఉంచుకున్న నేపాల్ ప్రజలు షాకయ్యారు.

నోట్ల రద్దు తర్వాత తమ దేశ ప్రజలకు భారతీయ కరెన్సీపై నమ్మకం తగ్గిందని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అయిన నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అధికారి ఒకరు చెప్పారు.

నేపాల్ నోటు తిప్పలు

భారత్ భరోసా.. నేపాల్ ఎదురుచూపులు

నేపాల్ రాష్ట్ర బ్యాంక్‌లో ఇప్పటికీ సుమారు 8 కోట్లు విలువచేసే 500, వెయ్యి పాత నోట్లు ఉన్నాయి.

రద్దైన పెద్ద నోట్లు సామాన్యుల దగ్గర ఎన్ని నోట్లున్నాయి అనేదానిపై మాత్రం ఎలాంటి గణాంకాలూ లేవు.

ఏప్రిల్‌లో భారత పర్యటనకు ముందు ఈ సమస్యను పరిష్కరించాలని భారత అధికారులకు చెబుతానని నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ అన్నారు. కానీ భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మాత్రం ఈ అంశంపై ఏ సమావేశంలోనూ చర్చించలేదన్నారు.

దీనిపై నేపాల్ ప్రధాన మంత్రి ఓలీ చర్చించారు.

దీనిపై వివరణ ఇచ్చిన నేపాల్ ప్రధాని సన్నిహిత అధికారి "భారత అధికారులతో ఈ అంశంపై అధికారిక చర్చలు జరిగాయి, చర్యలు తీసుకుంటామని వారు నేపాల్ కు భరోసా ఇచ్చారు. కానీ వాటి గురించి ఇంకా ఎలాంటి వివరాలూ అందలేదు" అని చెప్పారు.

నేపాల్ నోటు తిప్పలు

ఫొటో సోర్స్, Getty Images

నోట్లు నీళ్లలో పడేయలేం కదా..

బీబీసీతో మాట్లాడిన భారత రాయబారి మంజీవ్ సింగ్ పూరీ రెండు దేశాల మధ్య అధికారిక చర్చలు కొనసాగుతున్నాయన్నారు.

ఆ సమయంలో మనలాగే నేపాల్ ప్రజలకు కూడా మార్చుకునే అవకాశం ఉంది. వాళ్లు సరిహద్దు దాటి దేశంలోకి వచ్చి రద్దైన పాత నోట్లు మార్చుకుని వెళ్లుండచ్చు. మనకు, నేపాల్ మధ్య అధికారిక చర్చలు నడుస్తున్నాయి. దీని గురించి ప్రభుత్వానికి తెలుసు. అని ఆయన తెలిపారు.

నోట్ల రద్దు ప్రకటించినపుడు మిథిలా ఉపాధ్యాయ్ ఢిల్లీలో ఉన్నారు. ఆమె భర్త దీప్ కుమార్ ఉపాధ్యాయ్, భారత్‌లో నేపాల్ రాయబారిగా ఉన్నారు.

కాఠ్మండూ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌతమ బుద్ధుడి జన్మస్థలం లుంబినికి దగ్గరగా ఉన్న తమ రెండతస్తుల ఇంట్లో ఒక చిన్న గదిలో కూచున్న మిథిల "నోట్ల రద్దు ప్రకటించినప్పుడు ఒక్కసారిగా కలకలం మొదలైంది, ఢిల్లీలో మేం చాలా కంగారుపడ్డాం" అని చెప్పారు.

ఆమె దగ్గర ఇప్పటికీ 10-15 వేలు విలువ చేసే పాత 500, వెయ్యి నోట్ల భారతీయ నోట్లు ఉన్నాయి. ఏదో ఒక రోజు భారత ప్రభుత్వం వాటిని మార్చుకునే సౌకర్యం కల్పిస్తుందని ఆమె ఆశగా ఎదురుచూస్తున్నారు.

"అప్పటికీ మార్చడానికి కుదరకపోతే, భారత్‌లో ఒకప్పుడు ఇలాంటి నోట్లు ఉండేవని మేం వాటిని మా వాళ్లకు చూపించుకుంటాం. ఇంకేం చేయగలం? నోట్లు నీళ్లలో పడేయలేం కదా, మార్కెట్లో ఎటూ ఇవి పనికిరావు. మా పాట్లు మేం పడతాం. మోదీజీ తల్లి కూడా నోట్లు మార్చుకోడానికి వెళ్లారు కదా" అని చెబుతూ ఆమె గట్టిగా నవ్వేశారు.

నేపాల్ నోటు తిప్పలు

ఫొటో సోర్స్, Getty Images

నోట్లు మార్చడం ఎంత కష్టమో?

మిథిలా ఉపాధ్యాయ్ ఇంట్లో గోడలపై వారు ఢిల్లీలో గడిపిన రోజుల్లో తీయించుకున్న ఫొటోలు వేలాడుతూ కనిపించాయి.

తమకు చుట్టూ చాలా మంది ఉంటారని, వారంతా పాత నోట్లు మార్చుకోగలమే ఆశలో జీవిస్తున్నారని చెప్పారు. భారత్‌తో సంబంధం ఉన్న నేపాల్‌లోని తమ ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే వేగంగా ఏదైనా కారు వచ్చినపుడు గాల్లోకి లేచిన మట్టి వల్ల కొన్ని క్షణాలు సూర్యుడు కనిపించడం లేదని చెప్పారు.

మిథిల దగ్గరే కూచున్న ముగ్గురు మహిళల్లో ఒకరు తీర్థయాత్రల్లో 10వేల పాత నోట్లు ఖర్చు పెట్టేశానని చెప్పారు. మరో మహిళ 7 వేల రూపాయల నోట్లు బలవంతంగా లక్నోలోని ఒక డాక్టరుకు ఇచ్చేసి వచ్చానని చెప్పింది.

మూడో మహిళ కూడా "తర్వాత ఏ సమస్యా ఉండకూడదని" ఇప్పుడు భారత నోట్లేవీ తీసుకోవడం లేదని చెప్పారు.

జనం పాత నోట్లు వదిలించుకోడానికి వాటిని గంటల్లో అమ్మేశారు. భారత్ లోని బంధువుల సాయం తీసుకున్నారు, ఇంకా చాలా ప్రయత్నాలు చేశారు.

భారత సరిహద్దుల్లో ఉన్నవారికి ఇది సులభం అయ్యుండచ్చేమోకానీ.. దూరంగా పర్వత ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రం అది చాలా కష్టమైంది. వారందరికీ ప్రభుత్వాన్ని నమ్ముకోవడం తప్ప వేరే దారి లేదు.

నేపాల్ నోటు తిప్పలు

ఫొటో సోర్స్, Getty Images

భారతీయ కరెన్సీతో ఇంటికి వచ్చేవాళ్లు..

ఢిల్లీలో మాజీ రాయబారి దీప్ కుమార్ ఉపాధ్యాయ్‌కు సాయం కోసం ఫోన్లు వస్తున్నప్పుడు, ఆయన నోట్లు మార్చుకోడానికి సమయం ప్రకటిస్తారని వారికి భరోసా ఇచ్చేవారు. కానీ ఈరోజు వరకూ అలా జరగలేదు.

చాలా మంది నాతో "చూడండి మేం ఇంట్లో వాళ్లకు తెలీకుండా డబ్బులు దాచిపెట్టాం అని చెప్పేవారు. ఒక వ్యక్తి తను 60-65 వేలు పొదుపు చేశానని, ఇప్పుడు ఈ డబ్బును ఏం చేయాలని నన్ను అడిగాడు" అన్నారు.

కాఠ్మండూలో దర్బార్ స్క్వేర్ దగ్గర ఒక వ్యక్తి "తమ దగ్గర ఉన్న 500, వెయ్యి నోట్లు పనికి రావని తెలిసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, మీరు అక్కడ కొండలపై ఉన్న మాజీ సైనికుల కుటుంబాలను అడగండి. ఎందుకంటే వాళ్ల కుటుంబాలు పెన్షన్‌పైనే ఆధారపడ్డాయి. భారత్ ఇలా అలా ఎందుకు చేసిందో?" అన్నాడు.

నోట్ల రద్దుతో కష్ట సమయంలో ఉపయోగపడతాయని భర్త ఇచ్చిన డబ్బులు దాచి పెట్టిన మహిళలు ఇప్పుడు సంశయంలో ఉన్నారు. భారత్‌లో కాయకష్టం చేసి భారతీయ కరెన్సీని ఇంటికి తెచ్చే కొండ ప్రాంతాల కుటుంబాల ఆశగా ఎదురుచూస్తున్నారు.

నేపాల్ నోటు తిప్పలు

ఫొటో సోర్స్, Getty Images

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షరతులు

నోట్ల రద్దుతో ప్రధాన బ్యాంకులకు, చిన్న వ్యాపారులకు పెద్ద షాక్ తగిలింది. కానీ రెండు ప్రభుత్వాలూ తమకు ఎలాంటి చెడూ చేయవని నమ్మకం ఉండేది.

నోట్ల రద్దుకు ముందు ఇక్కడి ప్రజలు 25 వేలు విలువచేసే 500, వెయ్యి నోట్లను నేపాల్ తీసుకురాగలిగేవారు. వాటిని నేపాల్ రూపాయిల్లో మార్చుకోగలిగేవారు.

కానీ నోట్ల రద్దు ప్రకటనతో నేపాల్ రాష్ట్ర బ్యాంక్‌కు చెందిన చాలా మంది అధికారులు సంశయంలో పడిపోయారు. వాళ్లు వెంటనే 500, వెయ్యి నోట్లను నేపాల్ కరెన్సీలోకి మార్చడంపై ఆంక్షలు విధించారు. భారత్‌లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చలు ప్రారంభించారు.

500, వెయ్యి రూపాయల భారతీయ కరెన్సీ తీసుకోవడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేపాల్ రాష్ట్ర బ్యాంక్ మధ్య రెండుసార్లు అధికారిక చర్చలు జరిగాయి.

నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భీష్మ్ రాజ్ టుంగానా "రిజర్వ్ బ్యాంక్ మాకు ఒక వ్యక్తి నుంచి 4500 రూపాయల పాత నోట్లు మార్చుకోవచ్చని చెప్పింది. కానీ మేం వాటిని తీసుకోలేకపోయాం" అన్నారు. ఎందుకంటే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో అని వారు భయపడ్డారు.

నేపాల్ నోటు తిప్పలు

నోట్లు మార్చుకునే మాటకొస్తే..

నేపాల్ ప్రజలు 25 వేల రూపాయల వరకూ తమ దేశం తెచ్చుకువచ్చే అవకాశం ఉందనే విషయం మనకు తెలుసు. అలాంటప్పుడు ఒక వ్యక్తి కేవలం 4500 రూపాయలు మాత్రమే మార్చుకోవచ్చని చెప్పడం బ్యాంకు అధికారులకు అంత సులభం కాదు.

"అందుకే వాళ్లు (రిజర్వ్ బ్యాంక్ ) చెప్పిన ఆ మాటపై మేం నిర్ణయం తీసుకోలేకపోయాం. ఆ విషయంపై ఇప్పటికీ ఊగిసలాటలోనే ఉన్నాం" అన్నారు.

"భారతీయ కరెన్సీపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది. భారతీయులతో మాకు మంచి సంబంధాలున్నాయి. కానీ ఈ సమస్యను ఎందుకు పరిష్కరించరు. నాకు భూటాన్ మంత్రి ఒకరు చెప్పారు. భూటాన్‌కు భారత్ ఆరు వేల కోట్ల విలువచేసే 500, వెయ్యి రూపాయల పాత కరెన్సీ నోట్లను మార్చి ఇచ్చింది. కానీ మాపైన ఇంత వివక్ష ఎందుకు చూపిస్తోంది" అని టుంగానా అన్నారు.

నేపాల్ ఇప్పుడు తమ దేశంలో వంద రూపాయల కంటే ఎక్కువ విలువున్న భారత కరెన్సీ నోటును దగ్గర ఉంచుకోవడం, దానిని మార్చుకోవడానికి ప్రయత్నించడంపై నిషేధం విధించింది.

"మేం ఎక్కువగా డ్రాఫ్ట్, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఉపయోగించాలని చెబుతున్నాం. ఎప్పుడో ఒకప్పుడు భారత ప్రభుత్వం వారికి తమ నోట్లు మార్చుకునే అవకాశం ఇస్తుందని ఇక్కడి ప్రజలు ఇప్పటికీ ఆశగానే ఉన్నారు" అని టుంగానా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)