అద్వాణీ, వాజ్‌పేయిల కోసం ఇందిరా గాంధీ తమ ఎంపీలను రాజీనామా చేయమన్నారా: Fact Check

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
బీజేపీ ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలవని సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అడ్వాణీ పోటీ చేయడానికి వీలుగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను రాజీనామా చేయాలని కోరినట్లు భారత యవజన కాంగ్రెస్ ఆన్‌లైన్ మ్యాగజైన్ 'యువ దేశ్' ఇటీవల ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ప్రజాస్వామ్యం బలహీనులకు కూడా బలవంతుల్లాగే అవకాశం ఇస్తుంది. అలాగే ఇందిరాగాంధీ కూడా అడ్వాణీ, అటల్ బిహారీ వాజ్‌పేయికి ఒక అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఓటు వేయండి" అనే దానికి శీర్షిక పెట్టారు.
ఈ విషయాన్ని ఇటీవల ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశారు.
"బీజేపీకి లోక్‌సభలో '0' సీట్లు ఉన్నప్పుడు, అటల్ జీ, అడ్వాణీలకు సీట్లు ఇచ్చేందుకు ఇందిరాగాంధీ తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలతో బలవంతంగా రాజీనామా చేయించారు" అని ఆ పోస్టులో చెప్పారు.
ప్రశ్నలకు సమాధానాలు అందించే కోరా వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన ప్రామాణికత గురించి జనం ప్రశ్నలు కూడా సంధించారు. ఈ పోర్టల్‌లో పెట్టిన సమాధానాలను 11 వేల మందికి పైగా చూశారు.
ఈ ప్రకటన విశ్వసనీయత గురించి తెలుసుకోవాలని బీబీసీ పాఠకులు కూడా దాన్ని మాకు పంపించారు.
ఈ వాదనలో నిజం లేదని మా పరిశీలనలో గుర్తించాం.

ఫొటో సోర్స్, Getty Images
వాదన వెనుక అసలు నిజం ఇదీ
1980 జనవరిలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని అధికారికంగా స్థాపించారు.
1984 అక్టోబర్‌లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొట్టమొదటిసారి పోటీ చేసింది.
1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 404 స్థానాలు గెలుచుకుంది. రాజీవ్ గాంధీ భారత ప్రధాని అయ్యారు.
అప్పుడు బీజేపీ రెండు స్థానాలే గెలుచుకుంది. లోక్‌సభలో ఆ పార్టీకి అతి తక్కువ స్థానాలు వచ్చింది అప్పుడే.
అప్పుడు గుజరాత్‌లోని మెహ్సాణా నుంచి డాక్టర్ ఏకే పటేల్, అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌లోని హన్మకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి బీజేపీ అభ్యర్థులుగా గెలిచారు.
1984 సాధారణ ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేసిన వాజ్‌పేయి ఓడిపోయారు. కానీ ఆ ఎన్నికలు జరగకముందే ఇందిరాగాంధీ మరణించారు.
ఇక అడ్వాణీ 1970 నుంచి 1994 వరకూ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు.
"ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టంగా తెలుస్తోంది. 1984 ఎన్నికలు (బీజేపీ తొలి ఎన్నికలు) జరగక ముందే ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆమెకు అసలు దీనితో ఎలాంటి సంబంధం లేదు" అని సీనియర్ జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయ్ బీబీసీతో అన్నారు.
ఈ వాదన తప్పని మరో సీనియర్ జర్నలిస్ట్ వినోద్ శర్మ బీబీసీకి చెప్పారు.
"ఇది తప్పు. వేరే పార్టీకి స్థానాలు ఇవ్వడం కోసం సిట్టింగ్ ఎంపీలను తొలగించడం అంత సులభం కాదు. అయినా మీరు ఎవరికైనా ఎంపీ స్థానాన్ని ఇచ్చినపుడు, వారు ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది" అన్నారు.
ఇందిరాగాంధీ జీవితంపై పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్ట్ కుంకుం చద్ధా కూడా ఈ వాదనలు తప్పని బీబీసీతో అన్నారు.
"వాజ్‌పేయి, అద్వాణీ ఆ సమయంలోనే చాలా పెద్ద నేతలు. ఇలాంటిదేదైనా జరిగుంటే, అలా జరిగిందని వారు అంగీకరించేవాళ్లు. నేను ఇంతకు ముందెప్పుడూ ఈ విషయం వినలేదు. ఇది కచ్చితంగా తప్పుడు వార్తే" అన్నారు.

ఫొటో సోర్స్, EPA
బీజేపీ ఆవిర్భావం
బీజేపీకి ముందున్న భారతీయ జనసంఘ్ పార్టీని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. అది తర్వాత జనతా పార్టీలో విలీనం అయ్యింది.
కాంగ్రెస్‌లో ఇందిరా గాంధీ వ్యతిరేకులతో ఏర్పడిన కూటమే ఈ జనతా పార్టీ. జనసంఘ్ ఇందులో ఒక భాగం.
1977లో ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ను ఓడించిన జనతా పార్టీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆ పార్టీ ద్వంద్వ సభ్యత్వం, ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సభ్యత్వాన్ని అడ్డుకోవడంతో జనతా పార్టీలోని చాలా మంది ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు.
దీంతో జన సంఘ్ మాజీ సభ్యులు భారతీయ జనతా పార్టీ అనే ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించాల్సి వచ్చింది. కానీ ఇందిరా గాంధీ హత్యకు ముందు బీజేపీ ఏ లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
అడ్వాణీ ట్రాక్ రికార్డ్
1962, 1967లో ఇందిరా గాంధీ పదవీకాలంలో అడ్వాణీ జన సంఘ్ పార్టీకి చెందిన 'ఆర్గనైజర్' అనే ఒక రాజకీయ పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్‌గా ఉన్నారు.
అడ్వాణీ 1970 నుంచి 1994 వరకూ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఎప్పుడూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
1970లో ఢిల్లీ నుంచి, 1976లో గుజరాత్ నుంచి, 1982, 1988లో మధ్యప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు.
రాజ్యసభ సభ్యులు ఒకే సమయంలో లోక్ సభలో కూడా సభ్యులుగా ఉండలేరు.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP
వాజ్‌పేయి ట్రాక్ రికార్డ్
అత్యవసర స్థితి తర్వాత 1977లో జనతా పార్టీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆయన క్యాబినెట్‌లో వాజ్‌పేయి విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు.
1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ జనతా పార్టీ చేతిలో ఓడిపోయారు. 1980లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చారు. 1980 ఎన్నికల్లో కూడా వాజ్‌పేయి న్యూ దిల్లీ స్థానం నుంచి మళ్లీ గెలిచారు.
ఇందిరాగాంధీ మరణం తర్వాత 1984లో జరిగిన ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేసిన వాజ్‌పేయి ఓడిపోయారు.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి
- మోదీ, అమిత్ షాల తెగింపుకు అడ్డుకట్ట వేసి, వెనక్కు తగ్గేలా చేసిన నాథూరామ్ గాడ్సే
- శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- అమిత్ షా కోల్‌కతా రోడ్ షోలో ఘర్షణలకు బీజేపీ కార్యకర్త 'ప్రణాళిక' వెనుక నిజం
- అంబేడ్కర్ విగ్రహాన్ని బీజేపీ ఎమ్మెల్యే కూల్చారా
- కమల్ హాసన్ వ్యాఖ్యలపై చర్చ: గాడ్సే.. హంతకుడా లేక తీవ్రవాదా?
- మోదీ నిజంగానే మిరాజ్ విమానాలను మేఘాలతో పాక్ రాడార్ నుంచి కాపాడారా...
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కినందుకు దళితుల సామాజిక బహిష్కరణ
- మెషీన్లు ఆటోమేటిగ్గా మిమ్మల్ని 'ఫైర్' చేస్తే ఎలా ఉంటుంది
- మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది?
- వారణాసిలో ముస్లింల ఇళ్లు కూల్చేస్తే.. హిందూ ఆలయాలు బయటపడ్డాయా
- 'నా దేశభక్తిని బలవంతంగా పరీక్షించకండి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








