బీచ్‌లో 19 ఏళ్ల యువతి మృతదేహం, చుట్టూ 10 డింగోలు.. ఏమిటీ అడవి జంతువులు?

డింగో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గ్రేస్ ఎలీజా గుడ్విన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియాలోని కేగారి ద్వీపంలో 19 ఏళ్ల కెనడా యువతి మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని గుర్తించేటప్పటికి చుట్టూ డింగో అనే అడవి జంతువులు ఉన్నాయని స్థానిక అధికారులు తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆమె మృతదేహాన్ని కొందరు చూశారని క్వీన్స్‌లాండ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

మృతురాలి పేరు అధికారులు వెల్లడించలేదు.

కేగారి ద్వీపం ఆస్ట్రేలియా తూర్పు తీరంలో ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కేగారి ద్వీపంలో సోమవారం ఉదయం ఇద్దరు బీచ్ వెంబడి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదో వస్తువు చుట్టూ సుమారు 10 డింగోలు గుమిగూడి ఉండడం చూశారు.

డింగోల మధ్యలో ఉన్నది మృతదేహం అని ఆ తరువాత వారికి అర్థమైంది అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాల్ అల్గీ స్థానిక మీడియాకు చెప్పారు.

ఆ యువతి డింగోల దాడిలో చనిపోయారా, లేదంటే నీటిలో మునిగిపోవడం వల్ల చనిపోయారా అనేది దర్యాప్తు చేస్తున్నట్లు పాల్ చెప్పారు.

అయితే, మృతదేహంపై డింగోలు టచ్ చేసినట్లుగా గుర్తులు ఉన్నాయని పాల్ చెప్పారు.

Dingo

ఫొటో సోర్స్, Getty Images

'డింగో'లు అంటే..

కేగారి ద్వీపంలో డింగోలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆస్ట్రేలియాలో ఉండే అడవి కుక్కలు.

వీటికి అక్కడి స్థానిక జాతుల సంస్కృతిలో ముఖ్యమైన స్థానం ఉంది. అయితే, వాటిని ఎప్పటికీ అడవి జంతువులుగానే చూడాలని అధికారులు చెబుతున్నారు.

క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం "డింగో సేఫ్" అనే ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది.

"డింగోస్ శిక్షణ పొందిన జంతువులు కావు. అవి మనం ఊహించిన దానికన్నా వేగంగా, అనూహ్యంగా స్పందిస్తాయి" అని 'డింగో సేఫ్' అధికారిక వెబ్‌సైట్‌లో హెచ్చరిస్తున్నారు.

కేగారి ద్వీపం, డింగో, కుక్క

ఫొటో సోర్స్, Getty Images

డింగోల ఆవాసం.. కేగారి దీవి

ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కేగారి దీవి సుమారు 120 అసలుసిసలైన డింగోస్‌కు నిలయం.

ఏటా సుమారు అయిదు లక్షల మంది టూరిస్టులు ఈ దీవిని సందర్శిస్తారు. అయితే, ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలోని డింగోస్‌తో పోలిస్తే, ఈ దీవిలోని డింగోస్ మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

అందుకే అధికారులు పర్యాటకులకు డింగోస్ విషయంలో సూచనలు ఇస్తుంటారు. 'డింగోస్‌కు ఆహారం పెట్టకూడదు. డింగోస్ తిరిగే ప్రాంతాలలో పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు. గుంపులుగా నడవాలి. వాటికి సమీపంగా వెళ్లి ఫొటోలు తీయరాదు' వంటి సూచనలు ఇస్తున్నారు అధికారులు.

డింగోస్, అడవి జంతువులు

ఫొటో సోర్స్, Getty Images

'సాధారణ కుక్కలతో ఉన్నట్లు డింగోస్‌తో ఉండొద్దు'

"డింగోస్ చాలా జిజ్ఞాస కలిగిన జంతువులు. అవి తమ ప్రాంతంలో ఏదైనా కొత్తగా గమనిస్తే అప్రమత్తంగా, అనుమానంతో స్పందిస్తాయి. డింగోస్ కంటే వాటితో మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారనేదే అసలు సమస్య' అని 'డింగోస్ నిపుణులు' డాక్టర్ డేవిడ్ జెంకిన్స్ (చార్ల్స్ స్టర్ట్ యూనివర్సిటీ) చెప్పారు.

"చాలామంది వాటిని పెంపుడు కుక్కలలా భావించి దగ్గరగా వెళ్లిపోతారు. కానీ అవి పూర్తిగా అడవి జంతువులు" అన్నారాయన.

డింగోలు

ఫొటో సోర్స్, Getty Images

ఎంత ప్రమాదకరం?

గణాంకాల ప్రకారం డింగోస్ మనుషులపై దాడి చేసిన ఘటనలు చాలా అరుదు.

కానీ అవి దాడి చేసిన సందర్భాలలో ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంది.

అయితే, ఆస్ట్రేలియా పర్యావరణ వ్యవస్థలో డింగోస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. నక్కలు, అడవి పిల్లుల వంటి జంతువుల సంఖ్యను నియంత్రించడంలో అవి సహాయపడతాయి.

డింగోస్ ప్రమాదకరమా అనే ప్రశ్న కంటే, మనుషులు వాటిని ఎలా చూడాలి, ఎలా ప్రవర్తించాలి అన్నదే కీలకం అని నిపుణులు చెబుతున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)