కడావర్ డాగ్స్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి పంపించిన ఈ కుక్కల ప్రత్యేకత ఏమిటి? అసలు సెర్చ్ డాగ్స్ ఎన్ని రకాలు

ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించడం కోసం ప్రత్యేకమైన కుక్కలను తెలంగాణ అధికారులు ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం కేరళ నుండి కడావర్ డాగ్స్‌ను రప్పించారు.
గురువారం సాయంత్రమే వాటిని టన్నెల్‌లోకి తీసుకెళ్లి, వాటిని ఏ ప్రాంతంలో తిప్పాలి, ఎలా తీసుకెళ్లాలి వంటి విషయాలు పరిశీలించారు.
శుక్రవారం ఉదయాన్నే ఆ కడావర్ డాగ్స్ బృందం టన్నెల్‌లోకి బయల్దేరింది. ఆ బృందంతో పాటూ తవ్వే సామగ్రి సహా 110 మంది రెస్క్యూ సిబ్బంది, వివిధ ఏజెన్సీల ఉన్నతాధికారులు కూడా లోపలికి వెళ్ళారు.
బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్‌కు చెందిన ఈ కుక్కలకు భూమిలో 15 అడుగుల లోపల ఉన్న మనుషుల శరీరాలను కూడా గుర్తించే శక్తి ఉందని తెలంగాణ ప్రభుత్వ అధికారులు తెలిపారు.


ఫొటో సోర్స్, UGC
హ్యూమన్ రిమైన్స్ డిటెక్షన్ డాగ్స్ అని కూడా పిలుస్తారు..
డీకంపోజ్ అయిన మానవ శరీరాల వాసనలను గుర్తించేలా వీటికి శిక్షణ ఇస్తారు. వీటినే హ్యూమన్ రిమైన్స్ డిటెక్షన్ డాగ్స్ (హెచ్‌ఆర్‌డీడీ) అని కూడా అంటారు.
సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు మృతదేహాలను వాసన ద్వారా పసిగట్టే కుక్కలు, నేర విచారణలో వినియోగించే కుక్కలూ వేరు.
కుళ్ళిన, చాలా కాలం క్రితమే పూడ్చిపెట్టిన, ఎముకలు మాత్రమే మిగిలిన మానవ శరీరాలను గుర్తించేలా వీటికి శిక్షణ ఇస్తారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో వీటి వినియోగం ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్‌లో కేరళ రాష్ట్ర పోలీసులు వీటిని వినియోగించుకోవడంలో ముందున్నారు.
ప్రస్తుతం కేరళ పోలీసుల వద్ద మొత్తం 82 డాగ్స్ ఉన్నట్లు కేరళ పోలీసు విభాగం అధికారిక సైట్‌లో పేర్కొంది. 1959లో తిరువనంతపురంలో మూడు కుక్కలతో కేరళ పోలీసుల డాగ్ స్క్వాడ్ ప్రారంభమైంది.
మృతదేహాలను గుర్తించడంలో కేరళలో మాయ, మర్ఫీ అనే రెండు పోలీస్ కడవార్ కుక్కలకు మంచి పేరుంది.
వయనాడ్ ప్రమాదం సహా అనేక సందర్భాల్లో ఇవి ఎన్నో మృతదేహాలను గుర్తించాయి.

ఫొటో సోర్స్, UGC
సెర్చ్ డాగ్స్ ఎన్ని రకాలు?
సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్స్‌లో వివిధ రకాల కుక్కలను వాడుతూ ఉంటారు. ఈ కుక్కలు చేసే పనులను బట్టి వీటిని నాలుగు రకాలుగా వర్గీకరించినట్లు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర క్రిమినల్‌జస్టిస్ విభాగ వెబ్‌సైట్ పేర్కొంది. ఎయిర్‌సెంట్, ట్రైలింగ్, కడావర్ (భూమి, నీరు), డిజాస్టర్ అని నాలుగు రకాలుగా పేర్కొంది.
ఎయిర్‌సెంట్ డాగ్స్.. ఈ కుక్కలు గాలిలో ఉన్న వాసనను బట్టి వెతుకుతూ ఉంటాయి. అవి భూమిపై ఉండే వాసనను పట్టించుకోవు. గాలిలో ఉండే మనుషుల వాసనను పసిగట్టి, వారిని లొకేట్ చేస్తాయి.
విశాలమైన, పెద్ద ఖాళీ స్థలలో ఎయిర్‌సెంటింగ్ డాగ్స్ వాడకం చాలా సమర్థంగా పనిచేస్తుంది. ఎయిర్‌సెంటింగ్ డాగ్స్ వాసనల రకాలను కూడా గుర్తించగలవు. అంటే, తప్పిపోయిన వ్యక్తి వాసనను దానికి ముందే చూపించి, వదిలేస్తే, ఇతరులలో ఎక్కడ ఉన్నా ఆ వ్యక్తిని అది పట్టుకోగలదు.
ట్రైలింగ్ లేదా ట్రాకింగ్ డాగ్స్… ట్రైలింగ్ డాగ్స్ ఒక ప్రత్యేకమైన మనుషుల వాసనను మాత్రమే పట్టుకునేలా శిక్షణ పొందుతాయి. చివరిసారి వారెక్కడ కనిపించారో అక్కడి నుంచి ఆ కుక్కలు వెతుకులాట ప్రారంభిస్తాయి. అయితే, గాలి, ఉష్ణోగ్రతల కారణంగా వాసనను ప్రభావితం చేసే అంశాలు ఉన్నప్పుడు, ఆ వ్యక్తి వెళ్లిన మార్గాన్ని గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు.
ఆ వ్యక్తి వెళ్లిన ప్రాంతంలో మైదానంపై పడిన వాసన గుండా అవి పరిగెట్టుకుంటూ వెళ్తాయి. కొన్ని రోజుల క్రితం ఆ వ్యక్తి ఆ ప్రాంతం గుండా వెళ్లినా, గుర్తించేలా ట్రైలింగ్ డాగ్స్‌కు శిక్షణ ఇస్తారు.

ఫొటో సోర్స్, UGC
కడావర్ డాగ్స్... కడావర్ డాగ్స్‌కు చనిపోయిన మానవుల అవశేషాలను గుర్తించేలా శిక్షణ ఇస్తారు. పాతిపెట్టినా లేదా కుళ్లిపోయిన లేదా శరీరాల అవశేషాలను కూడా గుర్తించి, మృతదేహాలను ఈ డాగ్స్ పసిగెడతాయి.
ఆ కుక్కల సామర్థ్యం వాటికిచ్చే శిక్షణ బట్టి ఉంటుంది. భూమిపై, నీటిలో ఉన్న మృతదేహాల వాసనలను, మనుషుల అవశేషాలను ఇవి పసిగట్టగలవు.
డిజాస్టర్ డాగ్స్... ప్రకృతి వైపరీత్యాల సమయంలో పని అనేది ఎయిర్‌సెంట్ వర్క్‌కు భిన్నంగా ఉంటుంది. భవంతులు కూలడం, భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో చిక్కుకున్న, ప్రాణాలు కోల్పోయిన మనుషులను గుర్తించేలా ఈ కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
డిజాస్టర్ డాగ్స్‌కు శిక్సణ ఇచ్చి, సర్టిఫికేషన్ ఇచ్చేందుకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్ఈఎంఏ) ఒక నేషనల్ ప్రొగ్రామ్ కూడా నడుపుతోంది.
అవలాంచ్ డాగ్స్
హిమపాతాల కింద, లేదా మంచు కొండల్లో చిక్కుకున్న వారిని గుర్తించడం చాలా కష్టం. ఆ సమయంలో, మంచు నుంచి వచ్చే మానవుల వాసనను పసిగట్టి, వారిని కనుగొనేలా ఈ కుక్కలకు శిక్షణ ఇస్తారు.
వాటర్ డాగ్స్
నీటిలో నుంచి వచ్చే వాసనను పసిగట్టేలా ఈ డాగ్స్‌కు శిక్షణ ఇస్తారు. ఏదైనా వాసనను అవి గుర్తిస్తే, వెంటనే హ్యాండ్లర్‌ను అలర్ట్ చేస్తారు. కడావర్ డాగ్స్‌కు వాటర్ డాగ్స్ మాదిరిగా కూడా శిక్షణ ఇస్తారు. దీంతో, ఎవరైనా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినప్పుడు, కడావర్ డాగ్స్‌ను కూడా వాడుతుంటారు.

ఫొటో సోర్స్, UGC
‘వాట్ ద డాగ్ నోస్’ ..
కుక్కలకు తమ ముక్కులలో 200 నుంచి 300 మిలియన్ వరకు వాసనలు పసిగట్టే గ్రాహకాలు ఉంటాయని, మనుషులతో పోలిస్తే ఇవి 60 లక్షలు ఎక్కువని అమెరికా కెన్నెల్ క్లబ్ పేర్కొంది. మనతో పోలిస్తే వాటి మెదడులో వాసన పసిగట్టే ప్రాంతాలు సుమారు 40 రెట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.
'వాట్ ది డాగ్ నోస్' అనే పుస్తకంలో క్యాట్ వారెన్ అనే జర్నలిస్ట్ కడావర్ డాగ్స్ చేసే ప్రత్యేక పనులను ప్రస్తావించారు. ఈ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














