SLBC ప్రాజెక్ట్ : టన్నెల్ బోరింగ్ మెషీన్ ఎలా పని చేస్తుంది..

టన్నెల్ బోరింగ్ మెషీన్

ఫొటో సోర్స్, robbinstbm.com

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో సొరంగాన్ని తవ్వుతున్న యంత్రం గురించి ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఆ యంత్రం ఈ ప్రమాదంలో దెబ్బతినడం చర్చకు ప్రధాన కారణం.

ఈ ప్రాజెక్టులో వాడుతున్న యంత్రాన్ని టీబీఎం అంటే, టన్నెల్ బోరింగ్ మెషీన్ అంటారు. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీలో వినియోగిస్తోన్న ఈ మెషీన్ రకాన్ని డబుల్ షీల్డ్ టీబీఎం అంటారు.

''మిగిలిన అన్ని పద్ధతుల కంటే టన్నెల్ బోరింగ్ మెషీన్ ద్వారా శబ్దాలు తక్కువ వస్తాయి. పైన ఉన్న నల్లమల అడవిలో మరెక్కడా తవ్వకుండా, పైకి శబ్దాలు రాకుండా ఉండటానికి ఈ యంత్రాన్ని ఎంచుకున్నారు. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ చేయకుండా మట్టిని తొలగించడానికి ఈ యంత్రమే మంచిది. ముఖ్యంగా పరిసరాలు దెబ్బతినకుండా, పనిచేయడం ఈ యంత్రాల ప్రత్యేకత.'' అని తెలంగాణ సాగునీటి శాఖకు చెందిన ఇంజినీర్ ఒకరు బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టన్నెల్ బోరింగ్ మెషీన్

ఫొటో సోర్స్, robbinstbm.com

''ఒక రకంగా ఇది భూమిలోపల చెక్కుకుంటూ, కలుగు చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది. కొన్ని దశాబ్దాల నుంచీ ఈ తరహా యంత్రాలు వాడుకలో ఉన్నాయి. ఇందులో మెషీన్ ముందు వైపు తిరిగే చక్రం ఒకటి ఉంటుంది. దాన్నే కటర్ హెడ్ అంటారు. తరువాత మేరింగ్ ఉంటుంది. అలాగే వచ్చిన వ్యర్థాలను పట్టే వ్యవస్థా ఉంటుంది.

మట్టి, రాయి ఎంత గట్టిగా ఉంది? నీరు ఊరే శాతం.. ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఈ యంత్రాల్లో రకాలు మారతాయి. కాంక్రీట్ లైనింగ్, మెయిన్ బీమ్, గ్రిప్పర్, సింగిల్ షీల్డ్, డబుల్ షీల్డ్, ఎర్త్ ప్రెషర్ బాలెన్స్, ఓపెన్ ఫేస్ సాఫ్ట్ గ్రౌండ్ ఇలా చాలా రకాల యంత్రాలు ఉంటాయి.'' అని ఇంజినీర్ వివరించారు.

మధ్యలో ఎలాంటి యాక్సెస్ లేని ప్రపంచంలోనే పెద్ద టన్నెళ్ళలో ఒకటి ఎస్‌ఎల్బీసీ. దిల్లీకి చెందిన జేపీ గ్రూప్ (జయప్రకాశ్ అసోసియేట్స్) అనే కంపెనీ మొదటి నుంచీ ఈ ప్రాజెక్టు కాంట్రాక్టరు.

సొరంగం తవ్వే పనిని జేపీ గ్రూపు అమెరికాకు చెందిన రాబిన్స్ సంస్థకు అప్పగించింది. 2006 మే 26వ తేదీన ది రాబిన్స్ కంపెనీకి పని అప్పగించింది జేపీ గ్రూపు. మొత్తం రెండు టీబీఎంలు, కన్వేయర్ బెల్టు, బ్యాకప్ సిస్టం, స్పేర్ పరికరాలు ఇతరత్రా బాధ్యత అంతా ఈ సంస్థకే అప్పగించింది.

టన్నెల్ బోరింగ్ మెషీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పట్నా మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఉపయోగిస్తున్న టీబీఎం

టీబీఎంల ఖరీదు పదుల నుంచి వందల కోట్లలో..

2008 మార్చిలో ఔట్‌లెట్ వైపు, 2009 అక్టోబరులో ప్రస్తుత ప్రమాదం జరిగిన ఇన్‌లెట్ వైపు మెషీన్ పని మొదలుపెట్టింది. విడిభాగాలను తీసుకెళ్ళి సైట్లోనే బిగించే పద్ధతిని ‘ఆన్‌సైట్ ఫస్ట్ టైమ్ అసెంబ్లీ’ విధానంలో చేశారు.

అప్పుడు వచ్చిన శ్రీశైలం వరదల్లో ఈ యంత్రం మునిగిపోయినట్టు కంపెనీ చెప్పింది. 2010 నుంచి చురుగ్గా ఈ యంత్రం పని చేయడం ప్రారంభించింది. ‘‘అత్యంత కఠిన పరిస్థితుల్లో సొరంగం తవ్వాల్సిన ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ’’ అని రాబిన్స్ సంస్థ చెప్పుకొచ్చింది.

2020 నవంబర్ నాటికి రెండు యంత్రాలూ కలిపి 70 శాతం పని పూర్తి చేసినట్టు ఆ సంస్థ ప్రకటించుకుంది.

సాధారణంగా ఈ టీబీఎంల ఖరీదు పదుల నుంచి వందల కోట్ల రూపాయలు ఉంటుంది. దీని తయారీకి కూడా నెలల నుంచి ఏళ్ళ సమయం పడుతుంది.

రాబిన్స్ సంస్థ తయారు చేసే నిర్మాణ యంత్రాలలో రూ. 43 కోట్ల నుంచి రూ. 850 కోట్ల వరకూ ఖరీదైన మెషీన్లు ఉన్నాయి. పన్నులు, రవాణా ఖర్చులు వీటికి అదనం. ఈ ధర ప్రతి యంత్రానికీ మారిపోతుంది.

''కఠినమైన నేల ఉండి, పని మాత్రం వేగంగా వెళ్లాలి అనుకున్నప్పుడు ఈ తరహా యంత్రాలు అవసరమవుతాయి. 1972లో ప్రపంచంలో మొదటి డబుల్ షీల్డ్ టీబీఎం తయారు చేసింది. అప్పటి నుంచీ మా యంత్రాలు ఎన్నో ప్రపంచ రికార్డులను అధిగమించాయి. టీబీఎంకి ముందు వైపు తిరిగే కటర్ హెడ్ ఉంటుంది. దాని తరువాత టెలిస్కోపిక్, గ్రిప్పర్, టేల్ అని మూడు షీల్డులు ఉంటాయి.'' అని రాబిన్స్ సంస్థ చెప్పింది.

టన్నెల్ బోరింగ్ మెసీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెంగళూరు మెట్రో పనుల్లో ఉపయోగించిన టన్నెల్ బోరింగ్ మెషీన్

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ కూడా ఇదే యంత్రంతో తవ్వకం

ప్రపంచంలో భూమి కింద నిర్మాణ పనులు చేపట్టే యంత్రాల తయారీలో పేరు ఉన్న సంస్థల్లో అమెరికాకు చెందిన రాబిన్స్ ఒకటి. కనీసం వెయ్యి సొరంగాల నిర్మాణంలో పాత్ర ఉన్నట్టు ఆ సంస్థ ప్రకటించుకుంది.

సొరంగాలు తవ్వే టన్నెల్ బోరింగ్ మెషీన్లు, మట్టి తరలించే కన్వేయర్ బెల్టులు, మైనింగ్ యంత్రాలు, కట్టర్లు వంటివి ఈ సంస్థ తయారు చేస్తుంది.

టన్నెల్ బోరింగ్ మెషీన్
ఫొటో క్యాప్షన్, వెలిగొండ ప్రాజెక్టు దగ్గరున్న టన్నెల్ బోరింగ్ మెషీన్

ఆంధ్రలో నిర్మాణంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్ కూడా ఇదే యంత్రంతో తవ్వుతున్నారు.

ఈ తరహా టన్నెల్ బోరింగ్ మిషన్ల విషయంలో రాబిన్స్ ఎంత సమర్థవంతంగా చేస్తుందో చెప్పేందుకు తాజా ఎస్‌ఎల్బీసీ పనినే ఉదాహరణగా చెప్పుకుంది ఆ కంపెనీ.

ఈ టన్నెల్ నెలకు సుమారు 400 మీటర్లు పొడవు తవ్వితే అందుకు 14 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందనీ, చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. దాన్ని బట్టి ఈ యంత్రాల ఖర్చు ఎంతో అర్థం చేసుకోవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)