2024 YR4: భూమిని ఢీకొనే మార్గంలో వచ్చి, పక్కకు తప్పుకున్న గ్రహశకలం, ఇప్పుడది చంద్రుణ్ని తాకనుందా?

గ్రహశకలం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జార్జినా రన్నార్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2024 వైఆర్4 అనే పేరున్న భారీ ఆస్టరాయిడ్ (గ్రహశకలం) ఈ వారం అందరినీ భయపెట్టింది. ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశాలున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు, ఆ తర్వాత ప్రమాదం లేదంటూ ప్రకటించారు.

2032లో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం 0.28 శాతంగానే ఉన్నట్లు తాజాగా వెల్లడించారు. ఈ ఆస్టరాయిడ్ భూమిని తాకే అవకాశం 3.1 శాతమని ఈ మొదట్లో వాళ్లు అంచనాకు వచ్చారు. తర్వాత అది 0.28 శాతానికి తగ్గింది.

ఇప్పుడు అదే గ్రహశకలం చంద్రుడిని తాకే అవకాశం 1 శాతం మేర ఉన్నట్లు నాసా అంచనా వేస్తోంది.

2024 వైఆర్4 అనే గ్రహశకలాన్ని 2 నెలల కిందట చిలీలోని ఒక ఎడారిలో టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని పరిశీలిస్తుండగా గుర్తించారు.

దాదాపు పది అంతరిక్ష వస్తువులు భూమివైపు వస్తున్నాయని కూడా వారు గుర్తించారు.

ఖగోళపరంగా ఇవి చాలా చిన్న గ్రహశకలాలు. వీటిలో చాలావరకు భూమికి దగ్గరగా వచ్చి వెళ్లడమో, భూమిని ఢీకొట్టడమో జరిగి ఉండొచ్చు. కొన్ని భూవాతావరణంలో ప్రవేశించాక కాలిపోయి కూడా ఉండొచ్చు. అవన్నీ మనుషుల దృష్టికి రాకుండానే జరిగిపోయుంటాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇలా భూమికి దగ్గరగానో, దూరంగానో అంతరిక్షంలో ప్రయాణించే గ్రహశకలాలను ఫ్లై-బైస్ అంటారు.

వీటిలో చాలావరకు ప్రమాదకరమైనవి కావు. అయితే, ఇవి విశ్వంలో మనిషి ఛేదించని అనేక రహస్యాలను వెలుగులోకి తెచ్చాయి. వీటి ద్వారా ఎంతో విజ్ఞానం, సమాచారం కూడా లభిస్తుంది.

ఈ శకలాలను కొన్నిసార్లు చిన్న గ్రహాలు అని కూడా పిలుస్తుంటారు. 460 కోట్ల ఏళ్ల కిందట మన సౌర వ్యవస్థ ఏర్పడే సమయంలో వెలువడిన శిథిలాలుగా వీటిని పేర్కొంటుంటారు.

ఈ రాతి ముక్కలు గ్రహాల గురుత్వాకర్షణకు గురై భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటాయి.

ఒక పెద్ద గ్రహశకలం భూమికి ఎంత దగ్గరగా వస్తుందో, ఎంత తీవ్రంగా తాకుతుందో కచ్చితంగా తెలుసుకోవడం మనుషులకు ఇంత వరకు సాధ్యం కాలేదు.

భూమికి దగ్గరగా వచ్చే అంతరిక్ష వస్తువులను సీరియస్‌గా పరిశీలించడం 20వ శతాబ్దం చివరిలోనే ప్రారంభమైందని న్యూమెక్సికో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మార్క్ బోస్‌లాఫ్ అన్నారు. అంతకుముందు వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని బోస్‌లాఫ్ చెప్పారు.

40 మీటర్ల వెడల్పు లేదా అంతకంటే పెద్ద అంతరిక్ష వస్తువులు ఏడాదిలో చాలాసార్లు భూమికి, చంద్రునికి మధ్య నుంచి వెళ్తున్నట్లు పరిశోధకులకు తెలుస్తూనే ఉంటుంది.

అంతే సైజులో ఉండే ఒక గ్రహశకలం 1908లో సైబీరియా మీదుగా వెళుతూ పేలిపోయింది. దీంతో 500 చ.కి.మీ భూభాగంలో భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు గాయపడ్డారు.

వైఆర్4 గ్రహశకలం

ఫొటో సోర్స్, Drs. Bill and Eileen Ryan, Magdalena Ridge Observatory 2.4m Telescope, New Mexico Tech

అంతకుముందు 2004లో అపోఫిస్ అనే గ్రహశకలం కూడా వైఆర్4 మాదిరి భూమికి దగ్గరగా రాబోతోందని గుర్తించారు. ఇది 375 మీటర్లు వెడల్పులోగానీ, క్రూయిజ్ షిప్ ఆకారంలోగానీ ఉంటుందని భావించారు.

అప్పటి వరకు గుర్తించిన అత్యంత ప్రమాదకరమైన గ్రహశకలంగా దీన్ని పరిగణించినట్లు ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్‌ఆర్ఎస్) ప్రొఫెసర్ పాట్రిక్ మిషెల్ వెల్లడించారు.

2013 వరకు దానిని అబ్జర్వ్ చేశాకే అది భూమిని తాకబోవడంలేదని గుర్తించగలిగారు శాస్త్రవేత్తలు. మనుషులు నివసించే ప్రాంతాల్లో ఇంత పెద్ద గ్రహశకలం పడితే దాని తీవ్రత దారుణంగా ఉండేది.

ఇప్పటి వరకు వైఆర్4 ఎంత పెద్దదో తెలియదు. కానీ, కొన్ని అంచనాల ప్రకారం, పై చివరి అంచు 90 మీటర్ల వెడల్పు ఉంటే, అది భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది.

''ఇలాంటి గ్రహశకలాలు భూమిపై అతిపెద్ద బిలాన్ని సృష్టించగలవు. అది తాకిన సమీప ప్రాంతాల్లోని నిర్మాణాలు ధ్వంసమవుతాయి. కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంటుంది.'' అని లారెన్స్ లైవర్‌మోర్ నేషనల్ లేబోరేటరీ ప్రొఫెసర్ కేథరిన్ కునామోటో అన్నారు. చనిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు.

అపోఫిస్ గ్రహశకలం గురించి తెలిసిన తర్వాత ప్లానెటరీ డిఫెన్స్‌ (గ్రహాల నుంచి భూమిని రక్షించుకోవడం)లో శాస్త్రవేత్తలు చాలా పురోగతి సాధించారు.

ఇంటర్నేనల్ స్పేస్ మిషన్ ప్లానింగ్ అడ్వయిజరీ గ్రూప్‌లో ప్రొఫెసర్ మిషెల్ కూడా భాగమయ్యారు.

గ్రహశకలాల ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలో వీరు ప్రభుత్వాలకు సూచనలు చేస్తూ ఉంటారు. అది నేరుగా తాకినప్పుడు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి రీహార్సల్ చేస్తుంటారు. ఇలాంటిదే ఇప్పుడొకటి జరుగుతోంది.

వైఆర్4

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, భూమికి దగ్గరగా తిరుగుతున్న వైఆర్4

ఒకవేళ ఏదైనా ఒక పట్టణాన్ని లేదా నగరాన్ని గ్రహశకలం తాకినప్పుడు, ఒక అతిపెద్ద హరికేన్ వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారో అలా స్పందించాల్సి ఉంటుందని మార్క్ బోస్‌లాఫ్ అన్నారు. మౌలిక సదుపాయాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలను ఆ ప్రాంతం నుంచి తరలించాల్సి ఉంటుందనీ అన్నారు.

వైఆర్4 విషయంలో ఏం చేయాలో నిర్ణయించేందుకు స్పేస్ మిషన్ ప్లానింగ్ అడ్వయిజరీ గ్రూప్ ఏప్రిల్‌లో మరోసారి సమావేశం కాబోతుంది.

ప్రమాదకరమైన గ్రహశకలాల బారి నుంచి తప్పించే టెక్నాలజీని నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ‌లు అభివృద్ధి చేశాయి.

డిమోర్ఫోస్ అనే గ్రహశకలం మార్గాన్ని మార్చేందుకు నాసా డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్)లో స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. అయితే, వైఆర్4 విషయంలో ఇది పనిచేస్తుందా? అన్నదానిపై శాస్త్రవేత్తల్లో స్పష్టత లేదు. దీన్ని విజయవంతంగా దారి మళ్లించేందుకు కూడా తక్కువ సమయమే ఉంది.

అంటార్కిటికాలో సుమారు 50 వేల గ్రహశకలాలను గుర్తించారు. దానిలో అత్యంత ఫేమస్ అయింది ఏఎల్‌హెచ్84001. ఇది అంగారక గ్రహంపై ఆవిర్భవించిందని భావిస్తున్నారు. దీనిలో గ్రహాల చరిత్రను తెలుసుకోగలిగే అత్యంత కీలక ఆధారాలతోపాటు ఖనిజాలు ఉన్నాయి. ఇది చాలా వేడిగానూ, కోట్ల ఏళ్ల కిందటే దాని ఉపరితలంపై నీరు ఉండి ఉంటుందని చెప్పారు.

33 పాలిహైమ్నియా అని పిలిచే గ్రహశకలాన్ని 2023లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమిపై దొరికే అన్ని మూలకాలకన్నా మందమైన మూలకాలతో నిండి ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. భూ గ్రహానికి ఇది పూర్తిగా కొత్తది. 33 పాలిహైమ్నియా కనీసం 17 కోట్ల కి.మీల దూరంలోనిది. సైన్స్‌ను మరింత అర్థం చేసుకునేందుకు ఈ గ్రహశకలాలు అద్భుతమైన అవకాశం.

బిలం

ఫొటో సోర్స్, Getty Images

వైఆర్4 చంద్రుణ్ని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో కొంతమంది శాస్త్రవేత్తలు చాలా ఉత్సాహంగా దీనికోసం ఎదురుచూస్తున్నారు.

‘‘నిజ జీవిత ఘటనల నుంచి వచ్చే డేటా వల్ల మనకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది.'' అని ఇంపీరియల్ కాలేజీ లండన్ ప్రొఫెసర్ గరేత్ కొలిన్స్ అన్నారు.

గ్రహశకలం ఢీకొన్న తర్వాత ఎంత పదార్థం బయటికి వస్తుందా? ఎంత వేగంగా ఇది దూసుకొస్తుంది? ఎంతదూరం ఇది ప్రయాణిస్తుంది? వంటివి తెలుసుకోవచ్చు.

భూమిపై గ్రహశకలాల ప్రభావాల గురించి తెలుసుకునేందుకు అప్పటి వరకు శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన అంశాలను పరీక్షించుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మెరుగైన అంచనాలు వేయడానికి కూడా పనికొస్తుంది.

సౌర వ్యవస్థలో నిండి ఉన్న రాతి ముక్కలు ఏదో ఒక సమయంలో భూగ్రహాన్ని తాకుతాయనే విషయాన్ని వైఆర్4 మరోసారి గుర్తు చేస్తోంది.

ఒక పెద్ద గ్రహశకలం మానవ మనుగడకు ఎప్పుడు ప్రమాదకరంగా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే దశాబ్దాలలోవి కాకపోయినా, కనీసం రాబోయే శతాబ్దాలలో వచ్చే ప్రమాదాల గురించి అంచనాకు రావచ్చు.

అలాగే, అంతరిక్షాన్ని పర్యవేక్షించే సామర్థ్యాన్ని కూడా మనుషులు మెరుగుపరుచుకోవాలి. ఈ ఏడాది తర్వాత అతి పెద్ద డిజిటల్ కెమెరా అందుబాటులోకి రాబోతోంది. అది చిలీలో వెరా రాబిన్ అబ్జర్వేటరీ నుంచి పనిచేయబోతోంది. రాత్రిపూట ఆకాశంలో జరిగే అనేక అద్భుతాలను ఇది చిత్రీకరించనుంది. ఎంత ఎక్కువగా మనం పరిశీలిస్తే అంత ఎక్కువగా భూమికి సమీపంలో తిరిగే గ్రహశకలాలను గుర్తించవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)