హెచ్‌డీ189733బీ: ఈ గ్రహం నుంచి కుళ్లిన గుడ్ల వాసన వస్తుంది

కుళ్ళిన గుడ్ల వాసన వచ్చే సుదూర గ్రహం

ఫొటో సోర్స్, Roberto Molar Candanosa/Johns Hopkins Univeristy

    • రచయిత, మేడీ మోలోయ్
    • హోదా, బీబీసీ న్యూస్ క్లైమేట్ అండ్ సైన్స్

ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఉన్న ఒక సుదూర గ్రహం నుంచి కుళ్లిన గుడ్ల వాసన వస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.

జేమ్స్ వెబ్ స్పేస్‌ టెలిస్కోప్ డేటాను వాడుతూ.. హెచ్‌డీ 189733 బీ అనే గ్రహానికి చెందిన వాతావరణ పరిస్థితులను ఖగోళ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

ఈ గ్రహంపై ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

హెచ్‌డీ 189733 బీ వాతావరణంలో హైడ్రోజన్ సల్ఫైడ్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. గురు గ్రహంపైనా హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది.

అపానవాయువులలోనూ ఇలాంటి వాయువులుంటాయని పరిశోధకులు చెప్పారు.

సుదూర గ్రహంపై కొంత మంచు కురుస్తుందని తెలిపారు.

మన సౌర వ్యవస్థకు ఆవల సుదూరంగా ఉండే గ్రహంపై హైడ్రోజన్ సల్ఫైడ్ ఉన్నట్లు కనుగొనడం ఇదే తొలిసారి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

‘‘ఒకవేళ, మీ ముక్కు 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలోనూ పనిచేస్తే అప్పుడు మీకు ఈ గ్రహం వాతావరణంలో కుళ్లిన గుడ్ల వాసన వస్తుంది’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జాన్స్ హాప్కిన్స్ ఆస్ట్రోఫిజిస్ట్ డాక్టర్ గ్వాంగ్వే ఫు అన్నారు.

ఈ అధ్యయనం నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది.

జీవం ఉండొచ్చనడానికి హైడ్రోజన్ సల్ఫైడ్ సంకేతం అయినప్పటికీ ఇది కూడా గురు గ్రహం మాదిరిగా ఎక్కువగా వాయువులతో నిండినది కావడం, అధిక ఉష్ణోగ్రతలు ఉండడంతో ఆ కోణంలో పరిశోధించడం లేదు.

అయితే, హైడ్రోజన్ సల్ఫైడ్‌ను కనుగొనడం గ్రహాలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకునేందుకు సాయపడుతుందని పరిశోధకులు చెప్పారు.

సుదూర గ్రహాల్లో రసాయనాలను పరిశీలించేందుకు జేమ్స్ వెబ్ సరికొత్త మార్గం. ఈ గ్రహాల గురించి మరింత తెలుసుకునేందుకు ఖగోళ శాస్త్రవేత్తలకు జేమ్స్ వెబ్ సాయం చేస్తుంది.

‘‘ఇదొక గేమ్ చేంజర్. ఖగోళ రంగంలో ఇది నిజంగా విప్లవాత్మకమైన మార్పును తీసుకువస్తుంది. కొన్నిసార్లు మా అంచనాలను కూడా ఇది మించిపోతుంది ’’ అని డాక్టర్ ఫు అన్నారు.

స్పేస్ టెలిస్కోప్ నుంచి సేకరించిన సమాచారాన్ని మరిన్ని గ్రహాల గురించి అధ్యయనం చేసేందుకు ఖగోళ పరిశోధకులు ఉపయోగించనున్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)