ఎర్త్ రైజ్: 1968 నాటి ఈ ఫోటో ప్రపంచాన్నే మార్చేసింది..

ఎర్త్ రైజ్

ఫొటో సోర్స్, Nasa

    • రచయిత, ఇసాబెల్ గెరెస్టెన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఎర్త్ రైజ్...ఈ ఫోటోను తీసి 50 ఏళ్లకుపైనే అవుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకూ తీసిన ప్రముఖ పర్యావరణ చిత్రాలలో దీనిని ఒకటిగా పరిగణిస్తున్నారు.

క్రిస్మస్ రోజున 1968లో అపోలో 8లో పంపిన సిబ్బంది చంద్రుడి చూట్టూ తిరుగుతున్నప్పుడు ఈ అద్భుతమైన ఫోటోను తీశారు. చంద్రుడి ఉపరితలంపై నుంచి వెలుగులీనుతూ దీనిలో భూమి కనిపిస్తోంది.

నాసా వ్యోమగాములు మొదట ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

‘‘ఓ మై గాడ్, ఆ దృశ్యాన్ని చూడండి. అక్కడ భూమి పైకివస్తోంది. చూడండి ఎంత అందంగా ఉందో’’ అని తోటి వ్యోమగామి జిమ్ లోవెల్‌తో గట్టిగా అరుస్తూ బిల్ ఆండర్స్ చెప్పారు. ‘‘నీ దగ్గర కలర్ ఫిల్మ్ ఉందా బిల్? వెంటనే కలర్ రోల్ నాకు ఇవ్వండి’’ అని ఆయన అన్నారు.

ప్రపంచంలోని ప్రముఖ చిత్రాల్లో ఒకటైన దీన్ని ఆండర్స్ తీసినప్పుడు.. ‘‘అద్భుతంగా కనిపిస్తోంది’’ అని లోవెల్ అన్నారు.

ఈ ఫోటోకు ‘ఎర్త్ రైజ్’గా పేరు పెట్టారు. అంతరిక్షం నుంచి భూమికి తీసిన తొలి కలర్ ఫోటో ఇదీ. వెంటనే ప్రపంచం మొత్తం ఇది చక్కర్లు కొట్టింది. 1970లలో ప్రజల్లో పర్యావరణ చైతన్యం, అవగాహనలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసుకున్న ‘ఎర్త్ డే’ రూపకల్పనతోపాటు ప్రపంచ పర్యావరణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో ఈ ఫోటో ప్రధాన పాత్ర పోషించింది.

భూమి

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఫోటోను తీసి 50 ఏళ్లకుపైనే అవుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకూ తీసిన ప్రముఖ పర్యావరణ ఫోటోలలో ఇదీ ఒకటిగా పరిగణిస్తున్నారు.

‘‘ఇది పర్ఫెక్ట్ ఇమేజ్’’ అని బ్రిటన్‌లోని రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ మైఖెల్ పిచర్డ్ అన్నారు. ‘‘అది కలర్ ఫోటో. హైరిజల్యూషన్ ఇమేజ్. ఇలాంటి వాటిని మరిన్ని కూడా దీని నుంచి ఇట్టే తయారుచేయొచ్చు. భూమి గురించి కొత్త దృక్పథాన్ని మనకు ఇది అందించింది’’ అని ఆయన అన్నారు.

‘‘ఇది అంతరిక్షం నుంచి భూమిని స్పష్టంగా చూపించింది. మునుపెన్నడూ మనం చూడనిది ఇదీ’’ అని ఆయన అన్నారు. ‘‘అంతరిక్షంలో భూమి చాలా ప్రమాదాలను ఎదుర్కొంటోందని ఇది చూపించింది’’ అని ఆయన తెలిపారు.

1960ల చివర్లో అమెరికా, యూరప్‌ దేశాల్లో పర్యావరణ దృక్కోణాలు (ఎన్విరాన్‌మెంటల్ పర్‌స్పెక్టివ్స్), యాక్టివిజం విపరీతంగా పెరుగుతూ వచ్చింది. పర్యావరణ గ్రూపులైన ‘ఫ్రెండ్స్ ఆఫ్ ద ఎర్త్’, ‘గ్రీన్‌పీస్’లు 1969, 1971లలో ఏర్పాటయ్యాయి. 1970లోనే అమెరికా ప్రభుత్వం ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (పర్యావరణ పరిరక్షణ సంస్థ)ను ఏర్పాటుచేసింది.

ఎర్త్ రైజ్‌ను అపోలో 8 వ్యోమగాములు తీసిన 18 నెలలకు, అమెరికాలో పర్యావరణ విధ్వంసంపై ఎలుగెత్తేందుకు కోట్ల మంది ప్రజలు ‘ఎర్త్ డే’ రోజున వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు.

భూమి

ఫొటో సోర్స్, Getty Images

ప్రజల్లో పర్యావరణ చైతన్యం కలిగించడంలో ‘ఎర్త్ రైజ్’ ఫొటో ప్రధాన పాత్ర పోషించిందని ‘ఎర్త్ డే నెట్‌వర్క్’ ప్రెసిడెంట్ క్యాథలీన్ రోజర్స్ చెప్పారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ ఉద్యమంపై అవగాహన కల్పించడంతోపాటు వంద కోట్ల మంది పాల్గొనే ఎర్త్ డే ఏర్పాటుకూ ఇది కారణమైంది’’ అని రోజెర్స్ చెప్పారు. 1970నాటి ఎర్త్ డే పోస్టర్లలో ఎర్త్ రైజ్ ఫొటో ప్రముఖంగా కనిపించేదని ఆమె అన్నారు.

‘‘ఎర్త్‌ డేకు ముందు, మనం ఎంత ప్రత్యేకమైనవారమో అంతరిక్షయాత్రలు తెలియజేశాయని ప్రజలు మాట్లాడుకునేవారు. అయితే, ఆ ఫోటో పబ్లిష్ అయిన తర్వాత, భూమిని ఎన్ని ముప్పులు వెంటాడుతున్నాయోనని అమెరికా కాంగ్రెస్, ప్రపంచ నాయకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విశ్వంలో భూమి ప్రత్యేకతను ఎర్త్‌రైజ్ ప్రధానంగా చూపించింది. భూమి ఎంత మురికిగా ఉందో కూడా తెలియజేసింది’’ అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, సెనెగల్‌లోని పింక్ లేక్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు...

పర్యావరణ సంస్థల నుంచి పేజీల కొద్దీ రిపోర్టుల కంటే ఇలాంటి ఒక్క ఫోటో చాలా చెప్పగలదని పిచర్డ్ అన్నారు.

‘‘భూమి లాంటి గ్రహాలు నిరంతరం కొత్తగా పుట్టేవి కాదు. వీటిని మనం రక్షించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ‘‘ఇక్కడే ఎర్త్ రైజ్ ప్రాముఖ్యత దాగుంది. ఒక్క ఇమేజ్‌లో ఇది ఎంతో చెప్పింది. కొన్ని డాక్యుమెంట్లు, పత్రాలకు మించిన వివరాలను ఇది తెలియజేసింది’’ అని ఆయన చెప్పారు.

దీని చరిత్ర, శక్తిమంతమైన సందేశం వల్ల నేటికీ ప్రజల్లో పర్యావరణ చైతన్యం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతోంది.

‘‘మనం నివసించే భూమిని చిన్న నీలిరంగు గోళంగా ఇది చూపిస్తోంది. ముప్పుల నుంచి మన ప్రత్యేకత వరకూ అన్నీ దీనిలో కనిపిస్తాయి’’ అని పిచర్డ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఈ ఐస్‌బర్గ్‌ను చూసి ప్రపంచం ఎందుకు భయపడుతోంది?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)