ఆంత్రోపోసిన్‌: మనం కొత్త యుగంలోకి అడుగుపెట్టామా? శాస్త్రవేత్తల మధ్య గొడవేంటి?

రాతిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రిచర్డ్ ఫిషర్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

కాలాన్ని యుగాల నుంచి క్షణాల దాకా చెపుతుంటాం. ఈ కాల ప్రమాణాలను శాస్త్రజ్ఞులు అనేక గుర్తుల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ లెక్కన ప్రస్తుతం మనం హోలోసిన్ యుగంలో జీవిస్తున్నాం. 12 వేల సంవత్సరాల క్రితం సరిగ్గా మంచు యుగం ముగుస్తున్న సమయానికి హోలోసీన్ శకం ప్రారంభమైంది.

అయితే హోలోసిన్ శకం కూడా ముగిసిందా... ఇప్పుడు మనం ఆంత్రోపోసిన్ అనే కొత్త శకంలో ఉన్నామా? మరి ఈ కాలప్రమాణం ఎప్పడు మొదలైంది? ఎక్కడ మొదలైంది? దీని గురించి శాస్త్రజ్ఞులు ఏం చెబుతున్నారు?

ఆంత్రోపోసిన్. ఈ మాట ఇటీవల కాలంలో విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. కానీ శాస్త్రజ్ఞులకు మాత్రం ఇది సరిగ్గా ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైందనే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.

ఆంత్రోపోసిన్ అంటే భూగోళమంతటా మానవాళి ప్రకృతిని ఎప్పటి నుంచి ప్రభావితం చేయడం మొదలుపెట్టిందనే విషయాన్ని వివరిస్తుంది.

మరి మానవాళి ప్రకృతిని ప్రభావితం చేయడం ఎప్పుడు మొదలైంది? వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచా? లేదూ మన కారణంగా ఏర్పడిన కాలుష్యం పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశించిన మొట్టమొదటి క్షణంలోనా?లేదంటే పారిశ్రామిక విప్లవం మొదలైనప్పుడా...? ఇవేవీ కాదంటే ఇటీవలి 20 శతాబ్దంలోనా?

వ్యర్థాలు

ఫొటో సోర్స్, Getty Images

సరిగ్గా ఇవే ప్రశ్నలు ఆంత్రోపోసిన్‌ను అంగీకరించని శాస్త్రవేత్తల హృదయాలను కూడా తొలుస్తున్నాయి.

ఆంత్రోపోసిన్ కాలాన్ని అధికారికంగా గుర్తించే విషయమై నిర్వహించిన ఓటింగ్‌లో శాస్త్రవేత్తలు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు మార్చి 5న మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే కేవలం వార్తా పత్రికల శీర్షికలు మాత్రమే చదివితే ఆంత్రోపోసిస్ కథ కంచికి చేరిందని ఊహించడం తేలికే కానీ, ఇది ఊహకు మించిన విషయం. ఎందుకంటే శాస్త్రజ్ఞులు ఆంత్రోపోసిన్‌ను వ్యతిరేకించడం లేదు. అదెప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైందనే విషయంపైనే వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే మొట్టమొదట సముద్రాలు ఏర్పడిన కాలం (ప్రీ కాంబ్రియన్ కాలం) నుంచి, ప్రస్తుత హోలోసిన్ కాలం వరకు భూమిపై ఆయా కాలాలన్నింటినీ స్ట్రాటిగ్రాఫిక్ రికార్డు (ఎర్త్ టైమ్ లైన్) నమోదు చేస్తారు. ఇప్పడీ ఆంత్రోపోసిన్ కాలాన్ని గుర్తించి, ఈ రికార్డును నవీనీకరించాలా అని శాస్త్రజ్ఞులు చర్చిస్తున్నారు. దీనిని నమోదు చేయాలంటే అసలు ఆంత్రోపోసిన్‌ను కొన్ని లక్షల సంవత్సరాలు కొనసాగే యుగంగా గుర్తించాలా, లేదంటే కొంతకాలం మాత్రమే ప్రభావం చూపే ఓ ఈవెంట్‌లా గుర్తించాలా అనే చర్చా ఉంది.

Canada's Crawford Lake

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెనడాలోని క్రాఫర్డ్ లేక్

అసలింతకి మనం ఆంత్రోపోసిన్ లో ఉన్నట్టా లేనట్టా?

ఆంత్రోపోసీన్ అనే పదం 2000 సంవత్సరం నుంచి బాగా ప్రసిద్ధి చెందింది.

మానవాళి కచ్చితంగా ఈ భౌతిక ప్రపంచంపై తోతైన ప్రభావం చూపడం ఎప్పుడు మొదలుపెట్టిందనే విషయాన్ని ఆంత్రోపోసిన్ సూచిస్తుంది.

మానవ ప్రమేయం వల్ల భూమి తీరుతెన్నులు మారిపోయాయి. వాతావరణంలో మార్పులు వచ్చాయి. కొన్ని జాతులు అంతరించాయి... మరికొన్ని కొత్తవి పుట్టుకొచ్చాయి, రాతిపొరలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, సేంద్రియ పదార్థాలతో కూడిన ప్లాస్టిగ్లోమరేట్ అనే శిలలను కూడా సృష్టించాం.

కానీ జియోలజిస్టులు ఆంత్రోపోసిన్ అనే మాటకు మరింత కచ్చితమైన నిర్వచనాన్ని కోరుకుంటున్నారు. అంటే దీనర్థం వారు అధి ఎప్పుడు (సమయం) ఎక్కడ (స్థలం) నుంచి ప్రభావం చూపడం మొదలైందనే విషయం నూటికి నూరు శాతం తెలియాలని భావిస్తున్నారు. దీనిపై వారిప్పటిదాకా 20 ఏళ్ళనుంచి పరిశోధనలు చేస్తున్నారు కానీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.

ఓ నిర్ణీత కాలప్రమాణాన్ని గుర్తించడమనేది స్థలం, సమయం, ఆ సమయంలో అదెంతటి ప్రభావం చూపిందనే విషయం ఆధారంగా మొదలవుతుంది. ఈ కాల నిర్ణయమనేది అంతకుముంద ఎప్పుడు చూడని ఓ శిలాజం కనిపించినా కూడా దాని ఆధారంగా చేస్తారు. ఉదాహరణకు జురాసిక్ కాలం ఆల్ఫ్ పర్వత ప్రాంతాలలో మొదలైందని చెప్పడానికి శాస్త్రజ్ఞులకు అమ్మోనైట్ అనే జీవి కనిపించం వల్ల శాస్త్రవేత్తలు నిర్థరణకు రాగలిగారు. ఇలా శిలాజాలే కాకుండా, రసాయనాలు ఉపయోగించి, మంచుపర్వతాలలోని ఐస్ కోర్స్,భూనిక్షేపాల నుంచి కూడా తెలుసుకోగలగుతారు. ఇలా తెలుసుకున్న చోట ఓ గుర్తును ఏర్పాటుచేస్తారు. వీటిని గోల్డెన్ స్పైక్ అని పిలుస్తారు. శాస్త్రజ్ఞులకు కచ్చితంగా ఈ మార్పులు ఎప్పుడు, ఎక్కడ నుంచి మొదలయ్యాయని తెలుస్తాయో అక్కడ ఈ గోల్డెన్ స్పైక్ ను ఏర్పాటు చేస్తారు.

పదేళ్ళుగా ఆంత్రోపోసిన్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ) ఈ గోల్డెన్ స్పైక్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై పనిచేస్తోంది.

అనేక సంవత్సరాల పాటు వీరు పరిశీలనలు జరిపాక 2016లో 20వ శతాబ్దపు మధ్యభాగం నుంచి ఆంత్రోపోసిన్ యుగం ప్రారంభమైందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం వీరు సరస్సులు, గుహ పైబాగాన ఉండే సున్నపురాళ్ళు, పగడపుదిబ్బలు, ప్రపంచం నలుమూలాల ఉన్న ఐస్ కోర్స్‌ను పరీక్షించారు. దీంతోపాటు అణ్వాయుధాల పరీక్షలు, పేలుళ్ళ కారణంగా కార్బన్ 14 విపరీతంగా పెరగడం, మైక్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎక్కువ వేడిలో బొగ్గు మండించడం కారణంగా ఏర్పడిన కార్బన్ కణాలు తదితరాలను మార్కర్లుగా తీసుకున్నారు.

భవిష్యత్తు భూగర్భశాస్త్రవేత్తలు ఆంత్రోపోసిన్ కాలం ఎప్పుడు మొదలైందనే విషయం ఈ మార్కర్ల ద్వారా తెలుసుకోగలుగుతారు కార్బన్ 14 అనేది మనిషి శరీరంలో కూడా ఉంటుంది. 1950 తరువాత పుట్టిన వారిలో దంతాలలో, కణజాలం, ఎముకలలో కార్బన్ 14 ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఏ శాస్త్రవేత్తకో మన దంతం దొరికితే కార్బన్ డేటింగ్ ద్వారా మనం ఆంత్రోపోసిన్ కాలానికి చెందినవారమనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు.

ఆంథ్రోపోసిన్ మార్క్స్ పరిశీలన

ఫొటో సోర్స్, Getty Images

20వ శతాబ్దమే ఎందుకు?

1950 నాటి కాలం ఓ స్పష్టమైన భౌగోళిక తేడాను చూపుతోంది. ఇక్కడ నుంచే మానవాళి ప్రభావం ప్రకృతిపై ఎక్కువ అయిందని లీసెస్టర్ యూనిర్సిటీకి చెందిన జియోలజిస్ట్, ఏడబ్ల్యూజీ చైర్మన్ గా ఉన్న కోలిన్ వాటర్ చూపుతున్నారు. ఈ గ్రూపు తమ పరిశోధనలో కూడా ప్రకృతిపై మానవాళి ప్రభావం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ 1950ల నుంచి హఠాత్తుగా కార్బన్‌డై ఆక్సైడ్ శాతం పెరగడం, సముద్రాలు అమ్లీకరణ చెందడం ఎక్కువైందనే విషయాన్ని గుర్తించారు.

2023 మధ్య భాగంలో గోల్డెన్ స్పైక్ కు అనువైన ప్రాంతాన్ని ఏడబ్ల్యూజీ గుర్తించింది. ప్రపంచంలోని అనేక గుహలు, పగడపుదిబ్బలు తదితరాలను పరిశీలించాకా కెనడాలోని టోరంటో పశ్చిమప్రాంతంలోని క్రాఫోర్డ్ సరస్సును ఇందుకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. ఈ సర్సులో న్యూక్లియర్, ఇంధన శిలాజాలను సేకరించారు. శాస్త్రవేత్తలు సరస్సు అడుగు నుంచి ఐస్‌బార్స్ ను సేకరించి వాటిని ఓ సురక్షితమైన స్థానంలో భద్రపరిచారు. ఇది ఫ్యూచర్ జియోలజిస్టులకు ఆంత్రోపోసిన్ కాలం ఎప్పుడు మొదలైందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

అయితే ఏడబ్ల్యుజీ వీటన్నింటిని అధికారికంగా చెప్పలేదు. ఇది కేవలం తన మాతృసంస్థలు అయిన సబ్ కమిషన్ ఆన్ క్వాటర్నరీ స్ట్రాటిగ్రఫీ (ఎస్‌క్యూఎస్), ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రఫీకి మాత్రమే తన సిఫార్సులేమిటో నివేదిక రూపంలో ఇచ్చింది. అయితే దీనిని గుర్తించడంలో విభేదాల కారణంగా ఏడబ్ల్యూజీలో ఒక శాస్త్రవేత్త రాజీనామా చేశారు.

ఏడబ్ల్యూజీ ప్రతిపాదనలపై సహచరులు అనేకమంది వ్యతిరేకంగా ఓటు వేసినట్టు, న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. అయితే ఈ ఓటింగే తుది నిర్ణయం కాదని కొలిన్ వాటర్ చెప్పారు.

లైట్ల వెలుగులు

ఫొటో సోర్స్, Getty Images

20వ శతాబ్దపు మధ్యభాగాన్ని ఆంత్రోపోసిన్ కాల ప్రారంభంగా తీసుకోవడాన్ని కొందరు పరిశోధకులు వ్యతిరేకిస్తున్నారు. వీరి వాదన ప్రకారం మొట్టమొదట వ్యవసాయం ప్రారంభమైనప్పుడే మీధేన్ వాయువు గాలిలో కలిసి ఉంటుందని, ఇది కూడా ఒక మార్కరేనని, అలాగే గనుల తవ్వకం వల్ల ఏర్పడే లెడ్ కాలుష్యాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదని వారు వాదిస్తున్నారు. దీంతోపాటు శిలాజ ఇంధనాలను భారీగా మండించిన పారిశ్రామిక విప్లవాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదనేది వీరి వాదన.

వీటితోపాటు అసలు ఆంత్రోపోసిన్‌ను హోలోసిన్, పాలియోసిన్‌లా ‘యుగం’గా పరిగణించాలా లేక ఓ స్వల్ప కాలపరిమాణమైన ‘ఈవెంట్’గా గుర్తించాలా అనే విషయంలోనూ అభిప్రాయభేదాలు ఉన్నాయి.

అంటే ఆంత్రోపోసిన్ ఎప్పుడు మొదలైందనే ప్రశ్న ఒక్కటే కాదు, అదెప్పుడు ముగుస్తుందనేది కూడా. ప్రకృతిపై మానవాళి ప్రభావం 21వ శతాబ్దం తరువాత కనిపించకపోతే...అప్పుడీ ఆంత్రోపోసిన్ ను యుగంగా గుర్తించడంలో అర్థం ఉండదు. కాకపోతే ఈవెంట్ అనేది కచ్చితంగా దీర్ఘకాలం తన ప్రభావాన్ని చూపుతంది.

అయితే ఆంత్రోపోసిన్ భావనకు కొందరు సైంటిస్టులు వేసిన వ్యతిరేక ఓటుతో ముగింపు పలికినట్టేనా అంటే కాదు అని కచ్చితంగా చెప్పొచ్చు.

ఎందుకంటే దీని ఫలితాలు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. వీటిని ఎస్‌క్యూఎస్ సీనియర్ మెంబర్లు, దాని అధ్యక్షుడు ఓటింగ్ చెల్లుబాటుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మార్చి 6న ఎస్‌క్యూఎస్ చేసిన ప్రకటనలో ఈ ఓటింగ్ తుది నిర్ణయం కాదని పేర్కొంది.

మొత్తం మీద శాస్త్రవేత్తలందరూ ఆంత్రోపోసిన్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందనే విషయంలో చర్చోపచర్చలు చేస్తున్నారు.

కానీ నిజమేమిటంటే... భూమిపైన మానవాళి లోతైన ప్రభావం ఉందని చెప్పడంలో ఎవరికీ అభిప్రాయ భేదాలు లేవు. కానీ అదెంతకాలం ఉంటుందన్నదే అసలైన ప్రశ్న.

ఆంత్రోపోసిన్‌ను ఎవరు ఎన్నిరకాలుగా నిర్వచించినా సమాధానం దొరకాల్సింది ఈ ప్రశ్నకే.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)