న్యూరాలింక్: మెదడులో చిప్ అమర్చే ఎలాన్ మస్క్ ఐడియా ఈ ప్రపంచాన్ని ఎలా మార్చేయగలదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జిమ్ రీడ్, జో మెక్‌ఫాడెన్
- హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్స్
అంగారక గ్రహంపై ఆవాసం నుంచి అతిపెద్ద నగరాల కింద రవాణా మార్గాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికల వరకు ఎలాన్ మస్క్ ఆలోచనలు వినూత్నంగా కనిపిస్తాయి.
ఈ వారం ఎలాన్ మస్క్ తన న్యూరాలింక్ కంపెనీ మొదటి వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌ని మనిషిలో విజయవంతంగా అమర్చామని ప్రకటించి, మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఈ సాంకేతికత దీర్ఘకాలంలో మానవ జాతిని రక్షించగలదని ఆయన చెబుతున్నారు. ఇది నిజమేనా?
వాస్తవానికి మెదడు కణజాలంలోకి ఎలక్ట్రోడ్లు చేరడం కొత్తేమీ కాదు. 1960, 70లలోనే పిల్లులలో దూకుడు ప్రవర్తనను ప్రేరేపించడానికి లేదంటే దాన్ని తగ్గించడానికి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ వాడారు.
2000లలోని మొదటి దశకం ప్రారంభంలో కోతులు తమంత తాముగా కంప్యూటర్ స్క్రీన్‌పై మౌస్ కర్సర్‌ను కదల్చేలా శిక్షణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ ఇది వింతైన విషయమేమీ కాదు. కానీ, ఇంప్లాంటబుల్ టెక్నాలజీ అభివృద్ధికి సమయం పడుతుంది. కంపెనీల దగ్గర అనేక ఆలోచనలున్నాయి. వాటన్నింటినీ ఒక్కచోటికి చేర్చాల్సి ఉంది.’’ అని కింగ్స్ కాలేజ్ లండన్‌లో యాక్టివ్ ఇంప్లాంటబుల్ మెడికల్ డివైజ్‌ల ప్రొఫెసర్ అన్నే వాన్‌హోస్టెన్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.
ఈ సాంకేతికతను మెరుగుపరచడానికి, వాణిజ్యీకరించడానికి ప్రయత్నిస్తున్న కంపెనీలు లేదా విశ్వవిద్యాలయ విభాగాలలో న్యూరాలింక్ ఒకటి.
పక్షవాతం, సంక్లిష్ట నాడీ సంబంధిత చికిత్సల కోసం మొదట ఈ సాంకేతికలను వాడాలని ప్రయత్నిస్తున్నాయి.
మానవ మెదడు దాదాపు 8,600 కోట్ల న్యూరాన్లకు నిలయంగా ఉంది. మెదడులోని ఈ నరాల కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి.
మనం కదలాలనుకున్నా, అనుభూతి చెందాలనుకున్నా లేదా ఆలోచించాలనుకున్నా ఒక చిన్న విద్యుత్ ప్రేరణ ఉత్పన్నమవుతుంది.
ఇది ఒక న్యూరాన్ నుంచి మరో న్యూరాన్‌కు వేగంగా చేరుతుంది.
అయితే, శాస్త్రవేత్తలు ఆ సంకేతాలలో కొన్నింటిని గుర్తించగల పరికరాలను అభివృద్ధి చేశారు. వీటిలో తలపై నాన్-ఇన్వాసివ్ క్యాప్ లేదా మెదడులోకి వైర్లను అమర్చడం లాంటివున్నాయి.
ఈ సాంకేతికతను మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) అని పిలుస్తారు. దీని పరిశోధనకు వేల కోట్ల నిధులూ సమకూరుతున్నాయి.

ఫొటో సోర్స్, NEURALINK
సైన్స్ ఫిక్షన్ కథలా..
కాగా, నాణెం పరిమాణంలోని న్యూరాలింక్ పరికరాన్ని మనిషి పుర్రెలోకి చొప్పించారు. మైక్రోస్కోపిక్ వైర్లతో ఇది న్యూరాన్ కార్యాచరణను చదవగలదు. వైర్‌లెస్ సిగ్నల్‌ను తిరిగి పంపగలదు.
న్యూరాలింక్ మొదట పందులపై ట్రయల్స్ నిర్వహించింది. మరొక ప్రయోగం ద్వారా కోతులు కూడా పాంగ్ వీడియో గేమ్ ప్రాథమిక వెర్షన్‌ను ఆడగలవని గుర్తించింది.
మానవ పరీక్షల కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 2023 మేలో న్యూరాలింక్ ఆమోదం పొందింది.
మొదటి పేషెంట్‌పై ఇంప్లాంట్ ప్రయోగం జరిపారని తెలుసు కానీ, దాని గురించి మనకు చాలా తక్కువ సమాచారం ఉంది.
ప్రయోగం తర్వాత మెదడు కార్యకలాపాలు గుర్తించామని, పేషెంట్ కోలుకుంటున్నారని మాత్రమే మస్క్ తెలిపారు.
ఇది చాలా సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించొచ్చు. కొన్ని అంశాల్లో న్యూరాలింక్ ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, EPFL
పక్షవాతం వచ్చిన వ్యక్తిని నడిపించిందా?
న్యూరాలింక్ ప్రధాన ప్రత్యర్థులలో ఒకటి సింక్రాన్ అనే స్టార్టప్. ఇది బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ నియంత్రణలోని పెట్టుబడి సంస్థల నిధులతో నడుస్తోంది.
ఈ సంస్థ ఇప్పటికే 10 మంది పేషెంట్లకు స్టెంట్ లాంటి పరికరాన్ని అమర్చింది.
ఆస్ట్రేలియాకు చెందిన 62 ఏళ్ల ఫిలిప్ ఓ'కీఫ్‌కు 'మోటారు న్యూరాన్ వ్యాధి' ఉంది.
2021 డిసెంబర్‌లో ఫిలిప్ తన ఆలోచనలతో కర్సర్‌ను నియంత్రిస్తూ మొదటి ట్వీట్‌ను కంపోజ్ చేశారు.
అంతేకాదు స్విట్జర్లాండ్‌లోని లౌసాన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు సైక్లింగ్ ప్రమాదం వల్ల పక్షవాతానికి గురైన వ్యక్తికి కొన్ని పరికరాలను అమర్చి మళ్లీ నడవడం సాధ్యమని చూపించారు.
ఆయన మెదడులోని పరికరం నుంచి వెన్నెముక బేస్ వద్ద అమర్చిన రెండో పరికరానికి సిగ్నల్‌ను ప్రసారం చేయవచ్చని వారు చూపించామని 2024లో ప్రచురితమైన ఒక పరిశోధనా పత్రం తెలిపింది.
ఆ ప్రక్రియ బాధితుడి అవయవాలను కదిలేలా చేస్తుందని తెలిపారు.
వెన్నెముక గాయాలతో జీవిస్తున్న వారికి ఈ కొత్త రకమైన సాంకేతికతపై సాధారణంగానే ఆసక్తి ఉంటుంది.
"ప్రతీసారి ఇవే చెబుతున్నారు. కానీ, ముందుకు సాగుతున్నట్లు కనిపించడం లేదు'' అని 2017లో మోటార్‌బైక్ ప్రమాదంలో పక్షవాతానికి గురైన గ్లిన్ హేస్ అంటున్నారు.
గ్లిన్ హేస్ 'స్పైనల్ ఇంజ్యురీస్ అసోసియేషన్' పబ్లిక్ వ్యవహారాలను చూస్తున్నారు.
"నేను మళ్లీ ఏదైనా తిరిగి పొందాలంటే అది నడక మాత్రమే కాదు. నరాల నొప్పిని తగ్గించడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పేగు, మూత్రాశయం, లైంగికతను మెరుగు పరచడం వంటివి కూడా" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, STEVE JURVETSON
ఎలాన్ మస్క్ ప్రాధాన్యత ఏంటి?
మెదడు, వెన్నెముక గాయాలను సరిచేయడమనేది న్యూరాలింక్‌కు ప్రారంభం మాత్రమే.
మానవులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో అనుసంధానించడం దాని అసలు లక్ష్యం. ఇది మానవ జాతికి అత్యంత ముఖ్యమైన అంశమని ఎలాన్ మస్క్ భావిస్తున్నారు.
మెదడు నుంచి వచ్చే సంకేతాలను చాలా ఎక్కువ ఖచ్చితత్వంతో అర్థం చేసుకోగల లేదా అనువదించగల వ్యవస్థను అభివృద్ధి చేయడం నిజమైన సవాల్.
ఒకవేళ అదే జరిగితే మానవులు కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో కమ్యూనికేట్ చేయగలరు. అయితే, అది ఈ రోజు అర్థం చేసుకోవడం కష్టం.
కేవలం ఆలోచనతోనే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం, ఏదైనా ఆర్డర్ చేయడం, ఒక భాష నుంచి మరో భాషకు మీ మెదడే ట్రాన్స్‌లేట్ చేయడం వంటివి ఊహించుకోండి.
ఫోన్ లేదా కంప్యూటర్‌ను పరికరం ద్వారా కమ్యూనికేట్ చేస్తూ స్పీడ్ టైపిస్ట్ కంటే వేగంగా ఆలోచనలను పంచుకోవడం గురించి మస్క్ ఇప్పటికే ప్రస్తావించారు.
జ్ఞాపకాలను సేవ్ చేయడం, రీప్లే చేయడం సాధ్యమవుతుందని కూడా ఆయన గతంలో చెప్పారు. అయినప్పటికీ "ఇది బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్ మాదిరి ఉంది" అని అంగీకరించారు మస్క్.
కాకపోతే ఈ ప్రాజెక్టుపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పిజ్జా ఆర్డర్ చేయడానికి సర్జరీ చేయించుకుంటారా?
"ఒక అప్లికేషన్ చూడటానికే నేను కష్టపడుతున్నా, అక్కడ సర్జరీ ప్రమాదం ఉంది" అని ప్రొఫెసర్ వాన్‌హోస్టెన్‌బర్గ్ చెప్పారు.
"మీ ఫోన్‌లో ఒక పిజ్జా ఆర్డర్ చేయడానికి మెదడుకు శస్త్రచికిత్స చేసేంత రిస్క్ చేస్తారా? అని మీరే ప్రశ్నించుకోవాలి" అని అంటున్నారు.
అయితే, ఈ ప్రయోగాల ద్వారా మెదడు సరిగా పనిచేయని వారికి, నిద్ర రుగ్మతలు వంటి సమస్యలను పరిష్కారానికి మెదడును ఉత్తేజపరిచే అవకాశం ఉందని వాన్‌హోస్టెన్‌బర్గ్ భావిస్తున్నారు,
అయినప్పటికీ పరిశోధన ప్రారంభ దశలోనే ఉందంటున్నారు.
న్యూరాలింక్ వినియోగదారుడికి ప్రధాన ఉత్పత్తిగా మారడానికి చాలా అడ్డంకులు ఉన్నాయని కార్డిఫ్ యూనివర్శిటీ సైకాలజీ స్కూల్‌లో రీసెర్చ్ ఫెలో డాక్టర్ డీన్ బర్నెట్ అంటున్నారు.
"ప్రతి ఒక్కరి మెదడు భిన్నంగా ఉంటుంది. అందరికీ ఒకే చిప్ ఉండకూడదు. ఇది చాలా ఖచ్చితమైన ప్రక్రియగా ఉండాలి" అని ఆయన చెప్పారు.
"టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఐదేళ్లకు కొత్త చిప్ అవసరం పడితే? మీ తలపై పాత నోకియా ఫోన్ ఉన్నట్లుగా ఉంటుంది. అప్పట్లో అది సరదాగా ఉండేది, కానీ, దాని వల్ల నిజంగా ఉపయోగం లేదు?" అని డీన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
చాలా దూరం వెళ్లవచ్చు: మస్క్
ఈ రంగంలోని దాదాపు ప్రతి నిపుణుడు అంగీకరించే విషయం ఏమిటంటే ఈ రకమైన అత్యాధునిక సాంకేతికత దశాబ్దాల దూరంలో ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదాల నుంచి మానవాళిని రక్షించడమే తన అంతిమ లక్ష్యమని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. ఆయన గతంలో ఏఐని అస్తిత్వానికే ముప్పుగా అభివర్ణించారు.
మానవ, కంప్యూటర్ మెదడులను మెరుగ్గా కలిపితే మనం వెనక్కిపోయే అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
"అధిక బ్యాండ్‌విడ్త్, మెదడు-మెషిన్ కలయికతో మనం నిజంగానే చాలాదూరం వెళ్లవచ్చు" అని మస్క్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: కశ్మీరీ రగ్గులు, తివాచీల తయారీపై ఏఐ ఎలాంటి ప్రభావం చూపగలదు?
- లాల్‌కృష్ణ అడ్వాణీ: పార్టీని రెండు సీట్ల నుంచి ప్రధాని పీఠం వరకు తీసుకొచ్చిన నేత
- అయోధ్య: సెక్యులరిజం గీత చెరిగి పోతోందా, లౌకికవాదంపై రాజ్యాంగం, కోర్టులు ఏం చెప్పాయి..
- కుమారీ ఫుడ్ కోర్టు: తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత చర్చ, రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునే వరకు ఎందుకు వెళ్లింది?
- రజినీకాంత్‌ను ‘సంఘీ’ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, తమిళనాడులో జరుగుతున్న రగడ ఏంటి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














