ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: కశ్మీరీ రగ్గులు, తివాచీల తయారీపై ఏఐ ఎలాంటి ప్రభావం చూపగలదు?

ఫొటో సోర్స్, MOHAMMAD RAFIQ SOFI
- రచయిత, ప్రీతి గుప్తా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆకట్టుకునే కశ్మీర్ సంప్రదాయ చేనేత తివాచీ, రగ్గుల డిజైన్ల వెనుక తలిమ్ అని పిలిచే పురాతన విధానం ఉంది.
శతాబ్దాల నాటి ఆ సంప్రదాయాన్ని కాపాడుతూనే, అభివృద్ధి చెందుతోన్న కృత్రిమ మేథ సాయంతో ఉత్పత్తుల తయారీలో కొత్త ఒరవడిని సృష్టించే దిశగా అడుగులు పడుతున్నాయి.
తలిమ్‌గా పిలుచుకునే కోడ్ సాయంతో చేనేతకారుల మధ్య సమన్వయం చేసుకుంటూ, విభిన్న రకాల డిజైన్ల తివాచీ, కార్పెట్ల తయారీ సాగుతోంది.
ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి నుంచి తలిమ్ కోడ్ డిజైన్‌ను తొలిసారి గమనించిన మొహమ్మద్ రఫీక్ సోఫీ, అప్పటి నుంచి నేటి వరకు, తలిమ్ కోడ్ ఆధారిత డిజైన్లతో రూపొందించే తివాచీ, రగ్గుల తయారీ వ్యాపారంలో కొనసాగుతున్నారు.
"పని గురించి తెలుసుకుని, పూర్తిస్థాయిలో నేయడం నేర్చుకునేందుకు నాకు ఐదేళ్లు పట్టింది" అన్నారు సోఫీ. ఇప్పుడాయన వయసు 57 ఏళ్లు.
తాను చూసిన ఐదు దశాబ్దాల కాలంలో పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని సోఫీ చెప్పారు.
తనకు ఊహ తెలిసిన సమయంలో ఒక తివాచీని నేయడానికి ఆరునెలల కన్నా ఎక్కువ సమయమే పట్టేదని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా జరుగుతుంది?
ఒక తివాచీ తయారీ వెనుక చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. మొదట డిజైనర్ తివాచీ నమూనా తయారు చేస్తారు. అది తలిమ్ నిపుణుడి దగ్గరకు చేరుతుంది. ఆయన ఆ డిజైన్‌ను తలిమ్‌పై ఎన్‌కోడ్ చేసి, చిన్న చిన్న భాగాలుగా విభజించి, చేనేతకారుడి దగ్గరకు పంపుతారు.
ఆ తలిమ్ కోడ్ డిజైన్ చేనేత కార్మికుడికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది.
ఏ రంగు వాడాలి, ఎక్కడ నేయాలి, ఎక్కడ ఖాళీ వదలాలి? అల్లిక ఎక్కడ ఉండాలి? అని స్పష్టంగా తెలిపేలా ఉంటుంది.
చిన్న చిన్న విభాగాలుగా అవి చేనేత కారులకు చేరాక వారు ఆయా భాగాలను నేస్తారు. అలా ఒక్క తివాచీ తయారీ వెనుక వందలమంది ఉంటారు.
పనులన్ని పూర్తయ్యాక అంతటినీ ఒకే దగ్గర చేర్చి, ఆ తివాచీ తయారీ పూర్తి చేస్తారు. అలా డిజైనర్లు, చేనేతకారులు సమన్వయం చేసుకుంటారు.
ఆ ప్రక్రియలో ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే, దాన్ని గుర్తించడానికి చాలా సమయం పట్టేది.
కానీ, ఇటీవలి కాలంలో సోఫీ వంటి వారు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఆ ప్రక్రియనంతా వేగవంతం చేయడానికి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సాయం తీసుకుంటున్నారు. అలా తివాచీ తయారీ సమయానికి ఆరు వారాలకు కుదించగలిగారు.
ప్రస్తుతం నేత, అల్లికలు చేతిపైనే జరుగుతుండగా, తలిమ్ కోడ్ రూపకల్పన, డిజైన్ సృష్టి కంప్యూటర్‌పై జరుగుతోంది. దానర్థమేంటంటే, సోఫీ మొత్తం తివాచీ డిజైన్‌ను ఒకేసారి చూడగలరు. గతంలో కంప్యూటర్ లేని సమయంలో డిజైన్‌ను చిన్న చిన్న భాగాల ఆధారంగా మాత్రమే తెలుసుకునేవారు.
ఇప్పుడు, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే, వెంటనే తెలుసుకోవడంతోపాటు, తక్కువ సమయంలోనే సరిదిద్దుకునే వీలుందని సోఫీ అంటున్నారు.

ఫొటో సోర్స్, RUG REPUBLIC
"ఈ ఆవిష్కరణ కళాకారుడి సృజనాత్మకతలో జోక్యం చేసుకోదు. మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డిజైన్లు త్వరగా సిద్ధం అవుతున్నాయి" అన్నారు జమ్మూ& కశ్మీర్ ప్రభుత్వ చేనేత, హస్తకళల విభాగ డైరెక్టర్ మెహ్మూద్ షా.
తాజా ఆవిష్కరణలు, అభివృద్ధి చెందిన సాంకేతికతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో తయారీ విధానంలో గణనీయమైన మార్పులు రానున్నాయి.
ఆబీ మాథ్యూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న ఇంటర్నేషనల్ వర్చువల్ అసిస్టెన్స్ డేటా విశ్లేషణలో ప్రత్యేకత కలిగిన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంస్థ.
ఈ సంస్థ తలిమ్ కోడ్‌తో రూపొందిన తివాచీల చిత్రాలను వినియోగించి, వాటి ఆధారంగా కృత్రిమ మేథ (ఏఐ) తలిమ్ కోడ్ నిర్మాణాన్ని అర్థం చేసుకునేలా దానిని సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం ఈ కృత్రిమ మేథ ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. అంతేకాక, కోడ్ రాయడానికి మానవ ప్రమేయం అవసరమవుతోంది.
మాథ్యూ మాట్లాడుతూ, చేనేతకారులకు తలిమ్ కోడ్‌లను డీకోడ్ చేసి ఇవ్వడం ద్వారా తయారీ ప్రక్రియను మరింత వేగవంత చేయడానికి వీలవుతుందని అన్నారు.
"చేనేతకారులు కొత్త నమూనాలను ప్రయత్నించొచ్చు. ఇప్పటి అభిరుచులకు అనుగుణంగా ఒకప్పటి క్లాసిక్ థీమ్‌లలో మార్పులు చేయొచ్చు. అంతేకాకుండా, ప్రత్యేకమైన డిజైన్లతో తివాచీల తయారీ కూడా జరగొచ్చు" అన్నారు.
అభివృద్ధి చెందుతోన్న భారత్‌లో తివాచీలకు డిమాండ్ పెరగొచ్చని, సంప్రదాయ తయారీ విధానాన్నే అనుసరించి ఉత్పత్తి సాగితే, ఆ డిమాండ్‌ను అందుకోవడం కష్టమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
"వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయి. ఫ్యాషన్‌గా ఉండేవి, ఎక్కువకాలం మన్నే, తక్కువ నిర్వహణకు అనువైన తివాచీల పట్ల వారు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడున్న తయారీ విధానం, పరిశ్రమలో కొనసాగుతున్న ఉత్పాదకత అందుకు అనుగుణంగా మారాలంటే కొన్ని మార్పులు తప్పవు" అన్నారు మాథ్యూ.

ఫొటో సోర్స్, RUG REPUBLIC
మార్పు వస్తోంది..
ఆదిత్య గుప్తా 32 సంవత్సరాల క్రితం రగ్ రిపబ్లిక్ ను స్థాపించారు, దీనిలో ప్రస్తుతం సుమారు 5,000 మంది ఉద్యోగులున్నారు. నెలకు 15,000 రగ్గులను తయారు చేస్తుందీ కంపెనీ.
భారతీయ రగ్గు, కార్పెట్ పరిశ్రమ తుర్కియే, చైనాలోని ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోందని, కొత్త తయారీ పద్ధతులకు మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
"ప్రతి పరిశ్రమలో ఇన్నోవేషన్ ముఖ్యం. అది లేకుంటే అంతరించిపోయినట్లే" అని ఆదిత్య చెప్పారు.
"కొత్త సాంకేతికతతో ముందుకు సాగడమే కాదు, పాత, కొత్త పద్దతులను కలుపుకొంటూ ముందుకు సాగుతున్న దశలో ఉన్నది భారతీయ కార్పెట్ పరిశ్రమ.
సంప్రదాయ పద్ధతులను అవలంభించే క్రమంలో మెషీన్ల ద్వారా కాపీ చేయలేని డిజైన్‌లను రూపొందించే దిశగా ఇప్పుడు ఆవిష్కరణ ఉంది" అంటున్నారు ఆదిత్య.
రగ్ రిపబ్లిక్‌లో కార్పెట్‌ల రూపకల్పన, కడగడం, ఎండబెట్టడం, తేమ స్థాయిలను పర్యవేక్షించడం కోసం కొత్త సాంకేతికత పరిచయమైంది.
అలాగే సంప్రదాయ ఉన్ని కోసం రీ సైకిల్ జీన్స్, కాటన్, లెదర్ వంటి మెటీరియల్‌లతో ప్రయోగాలు జరిగాయి.
అన్ని ఆవిష్కరణలు ఉన్నప్పటికీ, ఆదిత్య ఇప్పటికీ పాత పద్ధతులకే విలువ ఇస్తున్నారు.
"వస్తువు సంప్రదాయంగా, చేతితో తయారు కావాలి, ఎందుకంటే వినియోగదారులు కోరుకునే ప్రధాన ఆకర్షణ అది" అని అన్నారు.
నిజమైన చేతి కశ్మీరీ కార్పెట్‌లను గుర్తించే అధికారిక ట్యాగింగ్ సిస్టమ్ పద్దతి పరిశ్రమకు సహాయపడింది.
కొనుగోలుదారులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కార్పెట్ డిజైనర్ ఎవరు, అది ఎలా తయారైందో వివరాలు తెలుసుకోవచ్చు.
"హస్తకళల విభాగం ఈ చర్య తీసుకోకపోతే 'చేతితో నేసే కార్పెట్ల' వ్యాపారం కొన్నేళ్లలోనే అంతరించిపోయేది" అని కార్పెట్ డిజైనర్ షానవాజ్ అహ్మద్ చెప్పారు.
స్థానిక ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమ రంగానిది ముఖ్యమైన భాగం కాబట్టి అది పెద్ద దెబ్బగా మారేది.
ఈ రంగంలో జమ్మూ, కశ్మీర్‌లోనే దాదాపు 50 వేల మంది కార్మికులున్నారు. వీరు సంవత్సరానికి సుమారు రూ.230 కోట్ల విలువైన రగ్గులు, కార్పెట్‌లను తయారు చేస్తారు.
కార్పెట్ తయారీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గత ముప్పై ఏళ్లుగా తివాచీలు నేస్తున్న ఫిరోజ్ అహ్మద్ భట్ వంటి వృద్ధులకు ఆశాజనకంగా ఉన్నాయి.
"నా తొలినాళ్లలో సంపాదన బాగుండేది, చాలామంది ఈ పనిలో ఉండేవారు. రానురాను వేతనాలు తగ్గిపోయాయి. ఇప్పుడు కొత్త డిజైన్లు వచ్చాయి, పని వేగం మళ్లీ పుంజుకుంది. వృద్ధి చెందుతోంది" అన్నారు ఫిరోజ్.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం:ధోనీ హెలీకాప్టర్ షాట్లను పరిచయం చేసిన ఈ స్టేడియం పిచ్ బ్యాటర్ల పాలిట స్వర్గమా?
- అయోధ్య: సెక్యులరిజం గీత చెరిగి పోతోందా, లౌకికవాదంపై రాజ్యాంగం, కోర్టులు ఏం చెప్పాయి..
- కుమారీ ఫుడ్ కోర్టు: తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత చర్చ, రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునే వరకు ఎందుకు వెళ్లింది?
- రజినీకాంత్‌ను ‘సంఘీ’ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, తమిళనాడులో జరుగుతున్న రగడ ఏంటి?
- రూ.40 లక్షల ఇన్సూరెన్స్ కోసం శ్మశానం నుంచి శవాన్ని తెచ్చి ఎలా దొరికి పోయాడంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














