అయోధ్యలో ప్రభుత్వం సెక్యులరిజం పరిధిని ఉల్లంఘించిందా?

అయోధ్య, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, ఉమంగ్ పొద్దర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత దేశం లౌకిక గణతంత్ర రాజ్యం. కానీ మతానికి, రాజ్యానికి మధ్య ఉన్న గీతలు తరచూ మసకబారుతున్నాయి.

జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనేకమంది రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజున సెలవు కూడా ప్రకటించాయి. దీంతో భారత గణతంత్ర రాజ్యం తనంతట తానుగా మత వేడుకలలో భాగమవుతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ మనం సెక్యూలరిజం అంటే ఏమిటి, రాజ్యాంగం ఏం చెప్పింది, కోర్టులు ఏమన్నాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అయోధ్య నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

భారత్‌లో లౌకికత్వం

రాజ్యాంగ ప్రవేశిక భారతదేశం లౌకిక దేశమని చెబుతోంది. 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని జోడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి ఒక్కరు తమకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. ఈ హక్కును వినియోగించుకోవడానికి సహేతుకమైన షరతులు ఉన్నాయి.

రాజ్యంగంలోని ఆర్టికల్ 29, 30 మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నాయి.

‘‘లౌకికత్వంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏ రెండు మతాల మధ్య వివక్ష చూపకూడదు. రెండోది మైనార్టీలకు రక్షణ కల్పించడం’’ అని సీనియర్ న్యాయవాది, రాజ్యంగ నిపుణుడు డాక్టర్ రాజీవ్ ధవన్ చెప్పారు.

రాజ్యంగం మైనార్టీలకు వారి మతం లేదా భాషా ప్రాతిపదికన సొంత విద్యా సంస్థలు నడుపుకునే అధికారాన్ని కల్పించింది. వీటికి నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వాలు వివక్ష చూపకూడదని కూడా రాజ్యాంగం చెబుతోంది.

‘‘మనం భారతదేశంలో లౌకికత్వం గురించి మాట్లాడుకుంటే ఇది అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి. మతాన్ని, రాజ్యాన్ని కచ్చితంగా విడదీయాలనే భావనను మనం ఆచరించడం లేదు. కానీ కొన్ని దేశాలలో దీనిని పాటిస్తున్నారు. ఉదాహరణకు ఫ్రాన్స్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటుంది. అన్ని మతపరమైన గుర్తులను బహిరంగంగా వినియోగించడాన్ని నిషేధించింది.

‘‘భారత దేశ సెక్యూలరిజం ఎలాంటిదో చెప్పాలంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది’’ అని రాజ్యాంగ నిపుణుడు డాక్టర్ జి. మోహన్ గోపాల్ చెప్పారు.

‘‘ఈ విషయంలో రాజ్యంగసభలో జరిగిన చర్చల్లోనూ స్పష్టత రాకపోవడంతో, సుప్రీం కోర్టు తీర్పుల్లోనూ ఈ సందిగ్థం కనిపిస్తుంటుంది’’ అని తెలిపారు.

‘అన్ని మతాలకు సమదూరం పాటించాలనే న్యాయస్థానాల ఆలోచన కూడా బ్రాహ్మణ గ్రంథాల నుంచి తీసుకున్నదే’ అని ఆయన అన్నారు.

1994లో సుప్రీం కోర్టు జస్టిస్ జె.ఎస్. వర్మ ఇచ్చిన తీర్పులో ‘సర్వ ధర్మ సంభవ’ అనే భావన గురించి చెప్పారు. అన్ని మతాలపట్ల సహనంగా ఉండటమే సెక్యూలరిజమని యజుర్వేదం, అథర్వవేదం, రుగ్వేదం పేర్కొన్నాయని చెప్పారు.

అయితే మత గ్రంథాల ద్వారా సెక్యూలరిజాన్ని నిర్వచించడాన్ని కొందరు వ్యాఖ్యతలు వింతగా భావిస్తున్నారు.

అయోధ్య, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

సెక్యూలరిజంపై సుప్రీం కోర్టు ఏమంది?

లౌకికత్వంపై సుప్రీం కోర్టు అనేక తీర్పులు ఇచ్చింది. కానీ ఈ తీర్పులేవీ కూడా సెక్యూలరిజానికి ఏకరూప నిర్వచనాన్ని ఇవ్వలేకపోయాయని విమర్శకులు అంటారు.

యూనివర్సిటీ ఆఫ్ జ్యుడిషియల్ సైన్సెస్‌లో న్యాయశాస్త్రం, సెక్యూలరిజాన్ని బోధించే విజయ్ కిషోర్ తివారీ మాట్లాడుతూ ‘‘భారతీయ సెక్యూలరిజం భావన, పశ్చిమదేశాల సెక్యూలరిజం కంటే భిన్నమైనది. మతానికి, రాజ్యానికి మధ్య ఉండాల్సిన విభజనపై రాజ్యంగపరంగా కూడా అది సందిగ్థంలో ఉంది’’ అని చెప్పారు.

‘‘సుప్రీం కోర్టు కూడా ఏ ఆచరణ సెక్యులరిజమవుతుందో స్పష్టంగా చెప్పలేకపోయింది. ఏది మంచిదో కూడా చెప్పలేదు. ఎందుకంటే అది దాని పరిధిలో లేదు. అయితే భారత్ విషయానికొస్తే రాజ్యాన్ని, మతాన్ని వేరు చేయడం పూర్తిగా సాధ్యం కాదు, అవసరం లేదు. ’’ అని తెలిపారు.

‘‘కొన్ని కేసులలో కోర్టులు తీవ్రమైన విధానాలు తీసుకుంటాయి. సెక్యూలరిజం అనేది రాజ్యాంగంలో భాగమని దానిని ఎవరూ మార్చలేరని చెపుతాయి. కానీ మరి కొన్ని కేసులలో మెజార్టీ ప్రయోజనాల కు సున్నితంగా ఉండి, మైనార్టీల హక్కులను పక్కనబెడతాయి. అదే సమయం కొన్ని కేసులలో మైనార్టీలకు ప్రత్యేక హక్కులు కట్టబెడతాయి’’ అని న్యూజెర్సీలోని రాంపో కళాశాలలో న్యాయశాస్త్రం, సామాజిక శాస్త్రాలను బోధించే సంఘమిత్ర పాది చెప్పారు.

రాజ్యాంగంలో సెక్యూలర్ అనే పదం చేర్చడానికి నాలుగేళ్ళ ముందే 1972లోనే సెక్యూలరిజం భారత రాజ్యంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీం కోర్టు చెప్పింది. అంటే దీనర్థం ఏ ప్రభుత్వానికి కూడా పౌరుల నుంచి సెక్యూలరిజాన్ని లాక్కునే హక్కు లేదని.

రాజ్యాంగాన్ని సవరించే ప్రభుత్వ హక్కును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

అయితే 1972లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సెక్యూలర్ స్టేట్ అనే మాట భారతదేశానికి వర్తిస్తుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘‘రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు మన దేశం సెక్యూలర్ కాకుండా నిరోధిస్తున్నాయి’’ అని చెప్పారు.

బాబ్రీ మసీదు ధ్వంసం చేసిన తరువాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేసిన నిర్ణయాన్ని 9మంది సభ్యులున్న సుప్రీం ధర్మాసనం సమర్థిస్తూ సెక్యూలరిజంపై గట్టి తీర్పును ఇచ్చింది.

అప్పట్లో ఈ రాష్ట్రాలలో ప్రభుత్వాలను రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించారు.

ఈ ప్రభుత్వాలన్నీ మతపరమైన సంస్థలకు మద్దతు పలికి మసీదు ధ్వంసానికి సహాయపడ్డాయని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది.

మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యంగ వ్యవస్థలన్నీ విఫలమయ్యాయని ఈ రాష్ట్రాల గవర్నర్లు చెప్పారు.

ఈ కేసులో మతానికి, రాజ్యానికి మధ్య ఉండాల్సిన కఠినమైన విభజన రేఖ ఉండి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

అయోధ్య నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

భారత న్యాయస్థానాలలో సెక్యూలరిజం

తరువాత కాలంలో ఈ కేసు బలహీనపడిపోయింది. 1995లో ఓ నాయకుడు ‘‘మహారాష్ట్రలో తొలి హిందూ రాజ్యం ఏర్పడబోతోంది’’ అని చెప్పడం మతప్రాతిపదికన ఓట్లు అడగడం కాదని కోర్టు పేర్కొంది.

ఎన్‌సీఈఆర్‌టీ తన సిలబస్‌లో సంస్కృతం, వేద గణితాన్ని జోడించడాన్ని సవాలు చేస్తూ 2002లో దాఖలైన కేసులో కోర్టు ఈ పాఠ్యప్రణాళికను ఆమోదించింది.

దీనిపై ఒక జడ్జీ ‘ తటస్ఠ విధానం ఈ దేశానికి ఎటువంటి మేలు చేయలేదు’’ అని రాశారు.

దీనిపై 2009లో సుప్రీం కోర్టు మాజీ జడ్పీ జస్టిస్ అఫ్తాబ్ అలమ్ ఓ ప్రసంగంలో పాఠ్యప్రణాళికలో ఒకే మతానికి చెందిన విషయాలను మాత్రమే చేర్చారనే విషయాన్ని కోర్టు తీర్పు విస్మరించిందని చెప్పారు.

దీని తరువాత కర్ణాటకలో ఉద్రిక్తంగా మారిన ఓ జిల్లాలోకి విశ్వ హిందూ పరిషత్ అప్పటి అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ప్రవేశాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది.

‘‘ఈ దేశం లౌకికత్వాన్ని నాశనం చేసేందుకు ఏ వ్యక్తినీ అనుమతించేది లేదు’’ అని పేర్కొంది.

ఇదే కేసులో ‘‘ఈ దేశంలోని ప్రతి పౌరుడు తన మతాన్ని ఆచరించేందుకు, ప్రచారం చేసుకునేందుకు అతని మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలి’’ పేర్కొంది.

కానీ ఇటీవల కాలంలో కోర్టులు సెక్యూలర్‌గా ఉండటంలేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.

‘‘కోర్టులు తమ తీర్పులు వెలువరించేందుకు అనేక మత గ్రంథాల సహాయం తీసుకున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి.’’ అని గోపాల్ చెప్పారు. అయోధ్యపై ఇచ్చిన తీర్పులో రాముడు బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో పుట్టారనే హిందువుల విశ్వాసాన్ని కోర్టు నొక్కిచెప్పింది.

కోర్టులు సెక్యూలరిజాన్ని ఆచరించడంలో విఫలమవుతున్నాయని డాక్టర్ ధావన్ అభిప్రాయపడ్డారు. ‘‘జ్ఞానవాపి కేసులో ప్రార్థనా స్థలాల పరిరరక్షణ చట్టాన్ని పూర్తిగా మరిచిపోయారు’’ అని చెప్పారు.

‘‘కోర్టులు కూడా పదే పదే ఉమ్మడి పౌరస్మృతి గురించి డిమాండ్ చేయడం,ఒక రాజకీయ పార్టీ ఎజెండా లాంటిదే’’ అని డాక్టర్ తివారీ అన్నారు.

అయోధ్య నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

రామాలయ ప్రాణప్రతిష్ఠ

అయోధ్యలో జనవరి 22న జరిగిన కార్యక్రమాలు భారత లౌకిక భావనకు విరుద్ధంగా ఉన్నాయని డాక్టర్ ధావన్ చెప్పారు.

‘‘మీరు ఏదో ఒక మతాన్ని సమర్థించడం, దానిని రాజకీయం చేయడం తప్పు. ఇది భారత లౌకికవాదానికి మంచిది కాదు. ఇతర మతాలను మినహాయించి ఒక మతాన్ని సమర్థించడం మంచిది కాదు. ఆ ప్రదేశంలో మసీదు నిర్మించి ఉంటే ప్రధాని వెళ్ళి ఉండేవారా?’’ అని ఆయన ప్రశ్నించారు.

‘‘ఎటువంటి వివక్ష లేకుండా మైనార్టీలకు ఇచ్చిన మతస్వేచ్ఛ ప్రస్తుతం ముప్పును ఎదుర్కొంటోంది. వారెవరూ భద్రంగా లేరు’’ అని డాక్టర్ తివారీ చెప్పారు.

అయోధ్యలో జరిగిన కార్యక్రమాన్ని రెండు కోణాలలో చూడాలని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిలాల్ అహ్మద్ చెప్పారు.

ఒకటి ఏమిటంటే ఇదో సాంస్కృతిక కార్యక్రమంగా భావిస్తే, ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చట్టపరంగా సరైనదే. అలాగే భారతీయ కోణంలో మసీదుకో, మందిరానికో, లేదంటే రాజకీయనాయకుడికో, లేదంటే ఆలయ పునరుద్ధరణకో విరాళం ఇవ్వడం కూడా ఆమోదనీయమే.

‘‘మరో కోణం ఏమిటంటే దీని వెనుక ఉన్న రాజ్యాంగపరమైన నైతికత సంగతేంటి ?ప్రభుత్వం మతపరమైన విషయాలకు దూరంగా ఉండాలని భావిస్తారు. ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి. అది మతపరమైన కార్యక్రమమా కాదా? అన్ని మతాలకు చెందినవారు ఇందులో పాల్గొన్నారా లేదంటే తమను పక్కనపెట్టేశారని కొందరు భావించారా’’?

ఈ కోణంలో చూసినప్పుడు అయోధ్య కార్యక్రమం సెక్యూలరిజం భావనకే కాదు, రాజ్యాంగ నైతికతకు కూడా వ్యతిరేకమైనదేనని హిలాల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)