అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద

అయోధ్య రామాలయం
    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ

‘‘వికలాంగులను దివ్యాంగులుగా పిలవమని మోదీజీ చెప్పారు. ఇప్పుడు దివ్యాంగ ఆలయంగా ఉన్న చోట సర్వాంగాలు ఉన్న దేవుడిని ఎలా ప్రతిష్ఠిస్తారు?’’

‘‘ ప్రధాని మోదీ లౌకికవాదంపై మూడుసార్లు ప్రమాణం చేశారు. ఇలాంటి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆయనకు ఎలాంటి హక్కూ లేదు’’

‘‘ఒక వేళ వారు వివాహితులై ఉంటే, వారు భార్యతో కలిసి కూర్చోవాల్సి ఉంటుంది. మతపరమైన కార్యక్రమంలో భార్యను దూరంగా ఉంచి భర్త ఒక్కరే పాల్గొనడానికి వీల్లేదు’’

‘‘శిఖరము, ధ్వజము లేకుండా ప్రాణప్రతిష్ఠ చేస్తే, అక్కడ రామ విగ్రహం కనిపించవచ్చేమో కానీ, అందులో దైవిక శక్తి ఉండదు. అసురశక్తులు అక్కడ తిష్ఠవేస్తాయి’’

ఇవీ జ్యోతిర్‌మఠం శంకరాచార్యలు అవిముక్తేశ్వరానంద సరస్వతి మహారాజ్ జనవరి 16న బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలలలో కొన్ని భాగాలు.

ఈ ఇంటర్వ్యూలో శంకారాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై ప్రశ్నలు లేవనెత్తడమే కాదు, సామాజిక మాధ్యమాలలో తరచూ అడుగుతున్న అనేక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు.

‘ప్రాణప్రతిష్ఠ’ పై మీ ఆగ్రహానికి కారణమేంటి?

పరమాత్ముని దేహమే దేవాలయం. ఆలయ శిఖరం దేవుని కనులుగానూ, శిఖరంపై కలశం తలగానూ, దానిపై ఉండే ధ్వజపతాకం శిరోజాలుగానూ భావిస్తారు. వీటి కిందే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ, ఇప్పటివరకూ ఆలయం మొండెం వరకే పూర్తయింది. కనుక ఆ మొండెంలో ప్రాణప్రతిష్ఠ చేస్తే అప్పుడదో నాసిరకమైన భాగమవుతుంది.

వికలాంగులను దివ్యాంగులుగా పిలవమని మోదీజీ చెప్పారు.

ఇప్పుడు రామాలయం దివ్యాంగ మందిరమే. ఇలాంటి దివ్యాంగమందిరంలో సకలాంగ మూర్తిని ఎలా ప్రతిష్ఠిస్తారు?

విగ్రహమంటే సంపూర్ణ మానవుడు. ఆయనలో ఎలాంటి లోపమూ లేదు. ఆలయం పూర్తయ్యాకే ప్రాణప్రతిష్ఠ అనే మాట వాడాలి. ఇప్పుడక్కడ ఎలాంటి జీవం ఉండటానికి వీల్లేదు. కానీ అలాంటిది జరిగిందంటే, దానర్థం ఆ పనిచేస్తున్న వ్యక్తి ఒత్తిడికి తలొగ్గి చేస్తున్నారని అర్థం.

అయోధ్య రామాలయం

ఈ కార్యక్రమాన్ని ప్రాణప్రతిష్ఠ కాకపోతే, ఏమని పిలవాలి?

ఇంకా తలభాగం పూర్తికాలేదు. ఇప్పుడు అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడంలో అర్థం లేదు. దేహం మొత్తం రూపొందాకే ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. దానికింకా సమయం ఉంది.

కాబట్టి ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని ప్రాణప్రతిష్ఠ అని చెప్పడం ధర్మం కాదు. మీరు రామభజనలు కీర్తనలు,. ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించుకోండి.

కానీ, ప్రాణప్రతిష్ఠ అనే మాట మాత్రం కేవలం ఆలయం పూర్తయ్యాకే వర్తిస్తుంది.

అయోధ్య రామాలయం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అయోధ్యలో 2020 ఆగస్టు5న జరిగిన రామమందిర భూమిపూజలో ప్రధాని మోదీ

ప్రధాని ప్రాణప్రతిష్ఠ చేయవచ్చా?

ప్రధానమంత్రి ఇప్పటికి మూడుసార్లు లౌకికవాదినని ప్రతిజ్ఞ చేశారు. ఆయన బీజేపీ సభ్యుడు. బీజేపీ తానొక లౌకిక పార్టీనంటూ ఎన్నికల కమిషన్‌కు ప్రమాణపత్రం అందించింది.

రెండోసారి ఆయన ఎంపీగా రాజ్యంగంపై ప్రమాణం చేశారు. మూడోసారి ప్రధానమంత్రిగా లౌకికవాదినని ప్రమాణం చేశారు. అందుకే ఆయనకు మతపరమైన ధార్మిక కార్యక్రమాలలో నేరుగా ఎటువంటి అదికారం ఉండదు.

ప్రజలందరి ప్రతినిధిగా, ఈ కార్యక్రమంలో పాల్గొనడం గురించి మాట్లాడితే, దేశంలోని అన్నిమతాల వారి కార్యక్రమాల్లో కూడా పాల్గొని అక్కడివారికి కూడా ప్రాతినిధ్యం వహించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.

చేస్తే అన్ని మతాలలోనూ ఇలాగే చేయండి. లేదా ఎక్కడా చేయకండి.

ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చా?

మనకు కొన్ని మతపరమైన నమ్మకాలు ఉన్నాయి. ఏ వివాహితుడు కూడా భార్యను దూరంగా ఉంచి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.

మీకు పెళ్ళయింది. భార్య ఉంది. మీకు పెళ్ళి కాకపోయి ఉంటే అది వేరే సంగతి. మీకు ఆమెతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, మీరు ఆమెతో మాట్లాడుతున్నారా లేదా, లేదూ సహజీవనం చేస్తున్నారా అని కాదు.. ఇదో ప్రత్యేక సందర్భం.

మతపరమైన కార్యక్రమంలో భార్యకు హక్కు ఉంటుంది. ఆమె భర్త శరీరంలో సగభాగం. వివాహంలో ‘సప్తపది’ లో మతపరమైన కార్యకలాపాల్లో నా పక్కన చోటిస్తానని ప్రమాణం చేస్తారు.

ఇలాంటి ప్రమాణం ఇప్పటికే ఆయన చేసేశారు. కాబట్టి ఈ మతపరమైన కార్యక్రమానికి భార్యను దూరంగా ఉంచలేరు.

మీరు బ్రాహ్మణుడు కారనే ఆరోపణలపై ఏం చెబుతారు?

బ్రాహ్మణుడు మాత్రమే సన్యాసి కాగలడు. దండాన్ని పట్టుకునే అధికారం అతనికే ఉంది. ఇది మన వేదాలు స్థిరపరిచిన విషయం.

బ్రాహ్మణుడు మాత్రమే దండి సన్యాసి కాగలడు. దండి సన్యాసి మాత్రమే శంకరాచార్యుడు అవుతారు.

నేను బ్రాహ్మణుడు కానని చెప్పేవారు ఏదైనా కోర్టులో కేసువేసుకోవచ్చు. వారు ఇది కోర్టులో నిరూపించాలి.

అలా నిరూపించగలిగితే మేమీ స్థానం నుంచి దిగిపోతాం.

అయోధ్య రామాలయం

మీరు కాంగ్రెస్ మనిషనే ఆరోపణ ఉంది కదా?

సరే, వారు అంతకన్నా ఇంకా ఏం చెప్పగలుగుతారు? ఆలయమంటే భగవంతుని శరీరమని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి.

ఓ అసంపూర్ణ ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరగకూడదు. దీనికి వారి వద్ద సమాధానం లేదు.

అందుకే, నేను కాంగ్రెస్ మనిషినని, బ్రాహ్మాణుడిని కానని, కోపం ఎక్కువ అని, మోదీకి వ్యతిరేకినని చెబుతున్నారు. ఇవా నా ప్రశ్నకు సమాధానాలు?

ప్రాణప్రతిష్ఠ ను వ్యతిరేకిస్తున్నారు కదా, మీకు భయం వేయడం లేదా?

మనమెవరం? మనకు ఎంతో బలమైన సంప్రదాయాలు, గ్రంథాలు ఉన్నాయి. మన గ్రంథాల బలమైన పునాదులపై మనం మాట్లాడుతున్నాం. ఈ రాజకీయ హిందువులు సంఖ్యాపరంగా లెక్కపెట్టే స్థాయిలో లేరు.

అమిత్ షా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మిస్ట్ కాల్ ఇష్యూ ప్రారంభించి 10 కోట్లమంది ప్రజలు చేరారని చెప్పారు. అంటే పదికోట్ల మంది బీజేపీ ప్రజలు ఉన్నారనుకుంటే, వారికి 21 కోట్ల ఓట్లు వచ్చాయి.

చాలామంది ప్రజలు వారి వెనుక ఉండొచ్చు. కానీ దేశంలో 100 కోట్లమంది హిందువులు ఉన్నారు. వీరిలో 50 కోట్లమంది సనాతన ధర్మాన్ని పాటిస్తారు.

వీరు గురువులు చెప్పిందే వింటారు. ఇండియాలోని చాలామంది హిందువులు వారితో లేరు. వారెప్పటికైనా మా వెనుకే ఉంటారు.

అయోధ్య రామాలయం

ఫొటో సోర్స్, ANI

‘ప్రాణప్రతిష్ఠ’ కు మీకు ఆహ్వానం అందిందా?

లేదు. నాకెటువంటి ఆహ్వాన పత్రిక అందలేదు. సంప్రదాయ విధివిధానాలను వీరు తుంగలో తొక్కారు.

హిందు మత గురువుకానీ దలైలామాను ఆహ్వానించారు. కానీ వీరు రామమందిరానికి శంకరాచార్యను పిలవరు. ఇదేం పద్ధతి?

మీకు ప్రధాని మోదీపై వ్యక్తిగత కోపం ఉందా?

మీరు మా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. విశ్వనాథ్ కారిడార్ కోసం 150 ఆలయాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ 2019లో మేం మోదీకి వ్యతిరేకంగా ఓ అభ్యర్థిని రంగంలోకి దించాం.

ఇలా ధ్వంసమైన ఆలయాలలో రెండువేల ఏళ్ళనాటివి ఉన్నాయి, వెయ్యి సంవత్సరాలవి ఉన్నాయి. ఆలయాలు ధ్వంసం చేసినందుకే మనం ఔరంగజేబును ద్వేషిస్తున్నాం. ఇప్పడదే పని మన సోదరులు చేస్తుంటే వారిని ఎలా క్షమించగలం?

ఏ టీవీ ఈ విషయాన్ని చూపించదు. ఏ పేపరూ దీని గురించి రాయదు. అందుకే మేం ఆయనకు వ్యతిరేకంగా ఓ సాధువును నిలబెట్టాం. దీంతో సహజంగానే అందరూ ఆయనను ఇంటర్వ్యూ చేశారు.

మోదీజీని ధార్మిక వ్యక్తిగా చూస్తుంటారు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా సాధువును నిలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు.

అభ్యర్థిని నిలబెడితే ఆయన ద్వారా ఎన్నో ఆలయాలు ధ్వంసమయ్యయాని చెప్పవచ్చు. మన ధర్మానికి ఎంతో నష్టం జరిగిందని చెప్పొచ్చు.

కానీ, మేం నిలబెట్టిన అభ్యర్థి నామినేషన్ ఎటువంటి లోపాలు లేకపోయినా తిరస్కరించారు.

అయోధ్య రామాలయం

ఫొటో సోర్స్, PIB

హిందూ మతం నిర్వచనం మారిపోతోందా?

ఇప్పుడు వేదాలను, గ్రంథాలను, గురువులను, ధర్మాచార్యులను అనుసరించడం కాకుండా, అన్నీ మా నాయకుడే, ఆయన ఏం చెపితే అదే చేస్తాం అనే ధోరణి ప్రబలింది.

ఈ ధోరణిని చొప్పించడం వల్ల హిందువులు గాడి తప్పుతున్నారు.

దీని ప్రతికూలత ఎలా ఉంటుందంటే.. రాజును మాత్రమే మనంనమ్ముకుంటే , రాజు ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఆయనకు ఏవరో ఒక శత్రువు ఉంటారు.

కానీ, ఒకానొక సమయంలో నిర్లక్ష్యం కారణంగా రాజు ఓడిపోతే అలాంటప్పుడు హిందువులు ఎక్కడికి పోవాలి?

అలాంటి సమయంలో హిందువులు ఓడిపోక తప్పదు కదా. మన పూర్వీకులు ఇలాంటి పద్ధతినే అనుసరించి, రాజును మనలో భాగంగానే చూశారు కానీ, పూర్తిగా ఆయనలో లీనమైపోయేలా చేయలేదు.

కానీ ఇప్పుడు నాయకులు చెప్పింది విన్నప్పుడే నువ్వు హిందువు అనే పద్ధతి మొదలైంది. ఇది సరైనది కాదు. ఎవరికైతే వేదాలపై నమ్మకం ఉండి, వాటిని అనుసరిస్తారో వారే హిందువు అవుతారు.

అయోధ్య రామాలయం

ఫొటో సోర్స్, ANI

తీర్థ క్షేత్ర ట్రస్ట్‌తో విభేదాలు ఉన్నాయా?

అటువంటిదేమీ లేదు. నిజానికి ఆ హక్కు మాది. అక్కడ శంకరాచార్యలు ట్రస్టు ఉంది. కానీ, ఎటువంటి కారణాలు చూపకుండానే ఆ ట్రస్టును తొలగించారు.

ఈ ట్రస్టులో దేశంలోని అనేకమంది ధార్మికాచార్యులు ఉన్నారు. అందులో నలుగురు శంకరాచార్యులు, ఐదుగురు వైష్ణవాచార్యులు, 13 అఖారాల ప్రతినిధులు ఉన్నారు.

అలాంటి ట్రస్టును రద్దుచేసి, ప్రధానమంత్రి తన పనివాళ్ళ కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు.

ఆలయం రామానంద్ శాఖకు చెందినదని చంపత్ రాయ్ చెప్పారు.

ఈ ఆలయం రామానంద్ శాఖకు చెందినదే అయితే అక్కడ మీరెందుకు కూర్చున్నారు? రామానంద్ శాఖకే ఇవ్వండి.

జగద్గురు స్వామి రామానంద్ రమణేశ్వారాచార్య రామానంద్ శాఖలో అతిపెద్ద గురువు.

తమకు కూడా ఎటువంటి ఆహ్వానం అందలేదని రమణేశ్వరాచార్య ప్రతినిధులు కూడా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)