అయోధ్య రామ మందిర ఉద్యమం అనగానే ఎవరెవరు గుర్తొస్తారు...

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 5న పునాది రాయి వేయబోతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
అయోధ్యతోపాటు ఉత్తరప్రదేశ్ అధికార గణమంతా ఈ కార్యక్రమానికి సన్నద్ధమవుతోంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఇవాళ అయోధ్యకు చేరుకుని ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉన్నా అది రద్దయినట్లు ఏఎన్‌ఐ వెల్లడించింది.

గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక నిర్ణయంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పడింది. ఆగస్టు 5న మందిరానికి పునాది రాయి పడబోతోంది.
ఇంకా చెప్పాలంటే రామాలయ ఉద్యమం ముగిసే రోజు కూడా ఇదే. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు రావడంతో మీడియా కెమెరాలన్నీ ఆయన పైనే దృష్టి కేంద్రీకరిస్తాయి. అయితే రామ మందిర నిర్మాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చాలామంది ఆ రోజు అక్కడ కనిపించబోవడం లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
2019 నవంబర్ 9న అయోధ్యపై తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు, బాబ్రీ మసీదు ఉన్న ఆ భూమిలో కొంత భాగాన్ని ఉన్న హిందూపక్షాలకు ఇవ్వాలని చెప్పింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణియన్ స్వామి దివంగత విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్‌కు భారత్‌రత్న ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు. రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింఘాల్ 2015 నవంబర్‌లో మరణించారు.

ఫొటో సోర్స్, BBC/ Afp
అశోక్ సింఘాల్ విశ్వహిందూ పరిషత్‌కు 20 సంవత్సరాలపాటు యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. అయోధ్య వివాదాన్ని స్థానిక భూవివాదంకన్నా భిన్నంగా చూశారు సింఘాల్. దానిని జాతీయ ఉద్యమంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. "ఈ విజయోత్సవ సమయంలో మనం అశోక్ సింఘాల్‌ను గుర్తు చేసుకోవాలి. ఆయనకు భారతరత్న ఇవ్వాలి'' అని సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు.
1990లలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షులు ఎల్.కె.అద్వానీ రామమందిర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తాను అద్వానీని కలవడానికి వెళతానని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ప్రకటించారు. "ఆయన దీని కోసం రథయాత్ర చేశారు. నేను ఆయన్ను కలుసుకుంటాను, ఆశీర్వాదం తీసుకుంటాను" అని ప్రకటించారు ఠాక్రే.
అద్వానీకి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఉద్ధవ్ ఒక్కరే కాదు. తీర్పు వచ్చిన వెంటనే బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి అద్వానీ, సింఘాల్‌లను అభినందిస్తూ ట్వీట్ చేశారు. అద్వానీ ఇంటికి వెళ్లిన ఆమె "ఈ రోజు ఆయనకు నమస్కరించడం చాలా అవసరం'' అన్నారు.
"అద్వానీజీకి నా అభినందనలు. ఆయన నాయకత్వంలో ఈ మహత్కార్యంలో మనమంతా పాలు పంచుకున్నాం'' అని ఆమె ట్వీట్ చేశారు.
రామమందిర ఉద్యమంలో ఉమాభారతి కూడా పాల్గొన్నారు. 2003లో ఆమె మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీపై తిరుగుబాటు చేసిన ఆమె, మళ్లీ అదే పార్టీలో కొనసాగారు. నరేంద్ర మోదీ తొలి విడత పాలనలో ఆమె కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే ఇక్కడ ఒక ప్రశ్న. రామమందిర నిర్మాణం విషయంలో క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి?
నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పుకు ముందు అయోధ్య కేసు అనేక దశలను దాటుకుంటూ వచ్చింది. చివరకు మందిర నిర్మాణం ప్రారంభం కాబోతోంది. ఆలయం కోసం జరిగిన ఉద్యమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీలతో అనుబంధం ఉన్న అనేకమంది నేతలు ముఖ్యపాత్ర పోషించారు.
ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, కల్యాణ్ సింగ్, వినయ్ కటియార్, సాధ్వీ రితంభర, ప్రవీణ్ తోగాడియా, విష్ణుహరి దాల్మియా ఇలా అనేకమంది పేర్లు వినిపిస్తాయి.
ఈ ఉద్యమంలో వారి పాత్రను పరిశీలిద్దాం.
అశోక్ సింఘాల్
రామమందిర నిర్మాణానికి ప్రజల మద్దతు కూడగట్టడంలో అశోక్ సింఘాల్ ముఖ్యపాత్ర పోషించారు. చాలామంది దృష్టిలో ఆయన రామ మందిర ఉద్యమ నిర్మాత. 2011 వరకు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడిగా కొనసాగారాయన. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన పదవికి రాజీనామా చేసిన ఆయన 2015 నవంబర్ 17న మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
లాల్ కృష్ణ అద్వానీ
సోమనాథ్ టెంపుల్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర ప్రారంభించారు. అయితే అప్పటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన్నుసమస్తిపూర్ జిల్లాలో అరెస్టు చేశారు. "ఈ రోజు కరసేవకు చివరి రోజు'' అని ఆయన మసీదును కూల్చేసిన 1992 డిసెంబర్ 6న వ్యాఖ్యానించినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. మసీదు కూల్చివేతకు కుట్రపన్నారన్న ఆరోపణలపై ఆయనపై క్రిమినల్ కేసు ఇంకా కొనసాగుతోంది.
మురళీ మనోహర్ జోషీ
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అద్వానీ తర్వాత రెండో అతి పెద్ద నేత మురళీ మనోహర్ జోషీ. 1992 డిసెంబర్ 6న మసీదు కూల్చివేత జరిగిన సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. గోపురం కూలినప్పుడు ఉమాభారతి ఆయన్ను కౌగిలించుకున్నారు. వారణాసి అలహాబాద్, కాన్పూర్‌లకు ఎంపీగా పని చేశారు జోషీ. ప్రస్తుతం బీజేపీ సలహా సంఘంలో ఉన్నారు.
కళ్యాణ్ సింగ్
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. ఆయన ప్రభుత్వంలోని అధికారులు, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే మసీదు కూల్చివేతను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపించాయి. తర్వాత కొంత కాలానికి కల్యాణ్ సింగ్ బీజేపీని వీడి సొంత పార్టీ పెట్టుకున్నారు. కొన్నాళ్ల తర్వాత తిరిగి బీజేపీలో చేరారు. మసీదు కూల్చివేతకు కుట్రపన్నారన్న ఆరోపణలపై కేసులు ఎదుర్కొంటున్న 13మందిలో కల్యాణ్ సింగ్ కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, KK MUHAMMED
వినయ్ కటియార్
రామమందిరం ఉద్యమం కోసం 1984లో బజరంగ్ దళ్ ఏర్పడింది. దీనికి మొదటి అధ్యక్షుడిగా వినయ్ కటియార్‌ను నియమించింది ఆరెస్సెస్. బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆలయ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. 1992 డిసెంబర్ 6 తర్వాత కటియార్ రాజకీయంగా కూడా ఎదిగారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయోధ్య ఉన్న నియోజకవర్గమైన ఫైజాబాద్ లోక్‌సభ సీటు నుంచి ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
సాధ్వీ రితంభర
హిందుత్వ ఫైర్ బ్రాండ్ నేతగా సాధ్వీ రితంభరకు పేరుంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆమెపై కూడా కేసులు నమోదయ్యాయి. అయోధ్య ఉద్యమం సందర్భంగా ఆమె చేసిన ఉద్రేక పూరిత ప్రసంగాలు దేశమంతటా ఆడియో క్యాసెట్‌ల రూపంలో వినిపించాయి. అందుకే ఆమెను ప్రత్యర్ధులు 'బాబర్ కి అలాద్' అనేవారు.
ఉమా భారతి
మందిర ఉద్యమంలో ఉమాభారతి ప్రముఖ మహిళా నేతగా ఆవిర్భవించారు. బాబ్రీ కూల్చివేతలో ఆమె పాత్ర కూడా ఉందని లిబర్హాన్ కమిషన్ గుర్తించింది. అక్కడున్న జనాన్ని ఆమె ప్రేరేపించారని ఆరోపణలు రాగా, దాన్ని ఆమె ఖండించారు. కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ ప్రభుత్వాల్లో ఆమె మంత్రిగా పనిచేశారు. అయితే 2019 పార్లమెంటు ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. రెండోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఆమె మళ్లీ ఎలాంటి పదవినీ స్వీకరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రవీణ్ తోగాడియా
విశ్వహిందూ పరిషత్‌కు చెందిన మరో ప్రముఖ నాయకుడు ప్రవీణ్ తోగాడియా. రామమందిర ఉద్యమంలో ఆయన చాలా చురుకుగా పాల్గొన్నారు. అశోక్ సింఘాల్ తర్వాత ఆ పదవిని ఆయనకు అప్పగించారు. అయితే ఇటీవల ఆయన వీహెచ్‌పీ నుంచి విడిపోయి అంతర్జాతీయ హిందూ కౌన్సిల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.
విష్ణు హరి దాల్మియా
విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేతలలో విష్ణు హరి దాల్మియా కూడా ఒకరు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆయన కూడా నిందితులు. 2019 జనవరి 16న ఆయన ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
రామ మందిర ఉద్యమంలో పాల్గొన్న నేతల జాబితా చాలా పెద్దదే. ఇందులో ఎవరి పాత్ర ఎంత అన్నది పక్కనబెడితే ఈ ఉద్యమం బీజేపిని అట్టడుగు నుంచి పైకి తీసుకొచ్చిందన్నది మాత్రం నిజం. దీనివల్లనే బీజేపీ తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని, ఆ తర్వాత సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ దానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








