అయోధ్య: రామమందిర భూమి పూజకు సన్నాహాలు.. మరి, మసీదుకు కేటాయించిన స్థలంలో ఏం జరుగుతోంది

ధన్నీపూర్‌లో ప్రతిపాదిత భూమి ఒక దర్గాకు సమీపంలో ఉంది.

ఫొటో సోర్స్, BALBEER

ఫొటో క్యాప్షన్, ధన్నీపూర్‌లో ప్రతిపాదిత భూమి ఒక దర్గాకు సమీపంలో ఉంది.
    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ హిందీ కోసం

అయోధ్యలో ఆగస్టు 5న రామమందిరం నిర్మాణం కోసం భూమిపూజ ఏర్పాట్లు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా సుమారు 200మంది అతిథులు వస్తారని భావిస్తున్నారు.

కరోనా కారణంగా ఉన్న పరిమితుల్లోనే వైభవంగా జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్‌ ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

అదే సమయంలో అయోధ్యకు 25కిలోమీటర్ల దూరంలో రౌనాహి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధన్నీపూర్‌ గ్రామంలో పరిస్థితి మిగిలిన గ్రామాలలాగే సాదాసీదాగా ఉంది.

అక్కడ కరోనా పాజిటివ్‌ వ్యక్తులు ఉన్నట్లు గుర్తించడంతో గ్రామంలోని కొన్నిప్రాంతాలకు రాకపోకలను నిషేధించారు. మిగిలిన ప్రాంతాలలో కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వక్ఫ్‌బోర్డు మసీదు నిర్మించుకోడానికి ఈ ధన్నీపూర్‌లోనే ఐదెకరాల భూమిని కేటాయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.

ఈ భూమి వ్యవసాయ శాఖకు చెందిన 25 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో అంతర్భాగంగా ఉంటుంది. ఇందులో వరి పండిస్తారు.

ధన్నీ పూర్

ఎవరికీ పట్టని ప్రాంతం.

మసీదు నిర్మించడానికి సుప్రీంకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ధన్నీపూర్‌లో భూమిని కేటాయించింది. కాని ఈ భూమి గురించిగానీ, మసీదు నిర్మాణం గురించిగానీ ఇక్కడ ఎవరికీ ఉత్సాహం, ఆసక్తిలేవు.

భూమి కేటాయించి దాదాపు 6 నెలలు గడిచాయి. ఇప్పటి వరకు వక్ఫ్‌బోర్డు సభ్యులు, రెవెన్యూ అధికారులు మాత్రమే భూమిని చూడటానికి వచ్చారు.

"మేం భూమిని స్వాధీనంలోకి తెచ్చుకునేలోగా లాక్‌డౌన్‌ మొదలైంది. దీని కొలతలు కూడా ఇంత వరకు తీసుకోలేదు. ఇప్పుడు బక్రీద్‌ కూడా వచ్చింది. ఆగస్టు 5న భూమిపూజ ఉంది. ఇక ఏం జరిగినా ఆ తర్వాతే జరుగుతుంది'' అని సున్నీ వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్ జుఫర్ అహ్మద్ ఫారూఖీ అన్నారు.

సున్నీ వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్ జుఫర్ అహ్మద్ ఫారూఖీ

మసీదు గురించి ప్రజలలో పెద్దగా ఆసక్తి లేదని జుఫర్‌ ఫరూఖీ కూడా అంగీకరించారు.

25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో భూమిని ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటని అయోధ్యలోని ముస్లింలంతా ప్రశ్నిస్తున్నారని ఫారూఖీ అన్నారు.

ఇక్కడ మసీదుకు బదులుగా ఆసుపత్రిగానీ, స్కూలు, లేదా గ్రంథాలయంవంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముస్లింవర్గానికి చెందిన కొందరు అభిప్రాయపడుతున్నారు.

తమ గ్రామం ముస్లిం మెజారిటీ అయినప్పటికీ, మసీదు నిర్మాణంపట్ల వారిలో ఎలాంటి ఉత్సాహంలేదని ధన్నీపూర్‌ సర్పంచ్‌ రాకేశ్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు.

అయితే ఇక్కడ మసీదు రావడం వల్ల మా ఊరు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు గ్రామస్తులు చాలామంది సంతోషించారని ఆయన అన్నారు.

వరి సాగు

కేటాయించిన భూమిలో వరిసాగు

"ఈ భూమిని ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పుడు చాలామంది చూడటానికి వచ్చారు. కాని ఆ తరువాత అంతా మర్చిపోయారు. ఎవరూ మసీదు గురించి అడగలేదు. భూమి అలాగే ఉంది. వరి సాగు చేస్తున్నారు. కొలతలు వేసి వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తారు. అక్కడ మసీదు ఎలా నిర్మిస్తారు, ఎప్పుడు నిర్మిస్తారు అన్నదానిపై మా గ్రామంలో ఎవరికీ ఆసక్తి లేదు'' అని సర్పంచ్‌ రాకేశ్‌కుమార్ యాదవ్‌ అన్నారు.

గత ఏడాది నవంబర్‌లో అయోధ్యపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు తరువాత ముస్లింలు మసీదు నిర్మించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ధన్నీపూర్ గ్రామంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ భూమి అసలు మసీదు నుండి 25కిలోమీటర్ల దూరంలోని సోహ్వాల్ తహసిల్‌ పరిధిలోకి వస్తుంది. ఇది రౌనాహి పోలీస్‌స్టేషన్‌కు కొన్నికిలోమీటర్ల దూరంలో ఉంది.

అయోధ్యలో బాబ్రీమసీదు భూమి హక్కుల కోసం పోరాడిన హాజీ మహబూబ్‌ "అంత దూరంలో భూమిని ఇవ్వడంలో అర్థం లేదు. అయోధ్య ముస్లింలు అక్కడికి వెళ్లి ప్రార్థనలు చేయలేరు. ఈ భూమి వద్దని మేం ఇంతకు ముందే చెప్పాం. ఇస్తే అయోధ్యలోనే భూమిని ఇవ్వాలి'' అని అన్నారు.

ఈ కేసులో పార్టీగా ఉన్న ఇక్బాల్‌ అన్సారీ కూడా ధన్నీపూర్‌లో భూమిని కేటాయించడాన్ని తప్పుబట్టారు.

"బాబ్రీ మసీదు అయోధ్యలో ఉంది. దానికి అక్కడే భూమి ఇవ్వాలి. ఇప్పటికే ఒక మసీదు ఉన్న ప్రాంతాన్ని డెవలప్‌ చేయవచ్చు. ప్రభుత్వం అయోధ్యలో భూమి ఇవ్వకపోతే ప్రజలు ఇళ్లలోనే ప్రార్థన చేసుకుంటారు. 25-30 కిలోమీటర్ల దూరం ఎందుకు వస్తారు? ధన్నీపూర్‌లో మసీదు గురించి ఎవరికీ ఆసక్తి లేదు'' అని అన్సారీ అన్నారు.

దర్గా

బోర్డు నిర్ణయమా? ముస్లింల నిర్ణయమా?

ప్రభుత్వం భూమి కేటాయించిన ధన్నీపూర్‌ గ్రామం ఎక్కువమంది ముస్లిం జనాభాకు చేరువగా ఉందని , ప్రతి సంవత్సరం భారీ ఉత్సవం జరిగే దర్గాకు సమీపంలో ఉందని చెబుతున్నారు.

ధన్నీపూర్‌ కూడా ముస్లింలు అధికంగా ఉండే గ్రామం. ఇక్కడ చాలా మసీదులు ఉన్నాయి. చరిత్రాత్మక నిర్ణయం తర్వాత కట్టబోయే మసీదు ఇతర మసీదులకన్నా భిన్నంగా ఉండాలి. కానీ స్థానిక ప్రజలు దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా, దీన్ని ఒప్పుకోవద్దని వక్ఫ్‌బోర్డుపై ఒత్తిడి చేశారు. కాని సున్నీవక్ఫ్ బోర్డు ప్రభుత్వం ఇచ్చిన భూమిని తీసుకోడానికి అంగీకరించింది. అక్కడ మసీదు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది.

" వక్ఫ్‌బోర్డు ముస్లింలందరికీ ప్రాతినిధ్యం వహించడం లేదు.ఇది ప్రభుత్వ సంస్థ. ఆ భూమిని తీసుకోవద్దని బోర్డును అభ్యర్థిస్తున్నాం. కాని బోర్డు భూమిని తీసుకుంటే, అది ముస్లింల నిర్ణయం అనుకోవద్దు. కేవలం బోర్డు నిర్ణయం మాత్రమే" అని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు సభ్యుడు యాసిన్‌ ఉస్మానీ అన్నారు.

ఇప్పుడు అయోధ్యలో భూమిపూజకు సన్నాహాలు పూర్తవుతున్నాయి. ఆగస్టు 5న దేశ విదేశాలలో నివసిస్తున్న భక్తులందరూ దీపం వెలిగించాలని శ్రీరామ్‌ జన్మభూమి ట్రస్ట్‌ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయోధ్యలో కూడా ప్రతిఒక్కరూ ఆ రోజు తమ ఇళ్లలో దీపం వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. భూమిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

1992 డిసెంబర్ 6న దాదాపు నాలుగున్నర వందల సంవత్సరాల ప్రాచీనమైన బాబ్రీమసీదు నిర్మాణాన్ని కరసేవకులు కూల్చేశారు.

ఆ సమయంలో యూపీలో కళ్యాణ్‌సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ సంఘటన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రద్దయింది.

ఈ సంఘటనను అనాగరిక చర్యగా పేర్కొని, మసీదును పునర్నిర్మిస్తామని అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు హామీ ఇచ్చారు. కానీ నాటి నుండి 2019 నవంబర్ 7 వరకు ఈ విషయం కోర్టుల్లో చిక్కుకుపోయింది.

గత ఏడాది నవంబర్ 9న చీఫ్‌జస్టిస్ రంజన్‌ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వివాదంలో ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది.

దీని ప్రకారం అయోధ్యలో వివాదానికి కేంద్రంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని రామమందిర నిర్మాణానికి ఇవ్వగా, మసీదు నిర్మించడానికి ముస్లిం పక్షానికి ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)