చైనా విద్యార్థులు తమను తామే కిడ్నాప్ చేసుకుంటున్నారు.. ఆస్ట్రేలియా పోలీసులు అసలు కథ బయటపెట్టారు

కిడ్నాప్ డ్రామాలో భాగంగా కాళ్లు చేతులు కట్టేసిన ఒక యువతి ఫొటో పోలీసులకు లభించింది

ఫొటో సోర్స్, NSW POLICE

ఫొటో క్యాప్షన్, కిడ్నాప్ డ్రామాలో భాగంగా కాళ్లు చేతులు కట్టేసిన ఒక యువతి ఫొటో పోలీసులకు లభించింది

ఆస్ట్రేలియాలో ఉంటున్న చైనీస్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఓ నకిలీ కిడ్నాపింగ్ కుంభకోణం జరుగుతోందని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

ఇందులో పెద్ద మొత్తంలో వసూళ్లు జరుగుతున్నట్లు వారు తెలిపారు.

పోలీసులు చెబుతున్నదాని ప్రకారం... నిందితులు చైనీస్ విద్యార్థులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.

కిడ్నాప్ కాకున్నా, అయినట్లుగా విద్యార్థులు సొంతంగా ఫొటోలు, వీడియోలు తీసుకునేలా బలవంతం చేస్తున్నారు.

ఆ ఫొటోలు, వీడియోలను వారి కుటుంబాలకు పంపించి, వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఇలా ఈ ఏడాది ఇప్పటివరకూ ఎనిమిది 'నకిలీ కిడ్నాప్‌లు' జరిగినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. వీటిలో ఓ కిడ్నాప్‌కు సంబంధించి నిందితులు రూ.10 కోట్లకుపైనే వసూలు చేశారు.

తమ వాళ్లు కిడ్నాప్ అయినట్లు ఫొటోలు, వీడియోలు రావడంతో... వారికి ఏం జరగకూడదన్న ఉద్దేశంతో వారి కుటుంబ సభ్యులు నిందితులకు డబ్బు పంపిస్తున్నారు.

2020లో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. నిందితులు ఓ 'పరిశ్రమ స్థాయిలో' ఏర్పడి, ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు వివరించారు.

ఏవైనా బెదిరింపు కాల్స్ వస్తే, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు పోలీసులు సూచిస్తున్నారు.

ఎలా జరుగుతోంది?

ఆస్ట్రేలియా బయట ఏదో ఒక దేశంలో నిందితులు ఓ కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అది ఎక్కడ ఉందో గుర్తించడం కష్టంగా ఉందని అన్నారు.

చైనా దౌత్య కార్యాలయం నుంచో, మరో ప్రభుత్వ శాఖ నుంచో తాము మాట్లాడుతున్నట్లు నిందితులు విద్యార్థులకు చెబుతారు.

చైనాలో ఏదో నేరంలో ఇరుక్కున్నావనో, మరో రోకమైన సమస్య ఉందనో విద్యార్థులను బెదిరిస్తారు.

సాధారణంగా వీళ్లు మాండరిన్ భాషలోనే మాట్లాడతారు.

అరెస్టు చేయకుండా లేదా దేశం నుంచి తిప్పిపంపకుండా ఉండేందుకు డబ్బు చెల్లించాలని విద్యార్థులను డిమాండ్ చేస్తారు.

కొన్ని కేసుల్లో ఇంట్లోవారితో, స్నేహితులతో మాట్లాడటం ఆపేయమని విద్యార్థులకు నిందితులు సూచిస్తున్నారు.

హోటల్‌లో గది తీసుకుని, కిడ్నాప్ అయినట్లుగా నటిస్తూ విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసేలా వారిని ఒప్పిస్తున్నారు.

ఒక కేసులో విద్యార్థిని కిడ్నాప్ అయినట్లు వీడియో రావడంతో, ఆమె తండ్రి నిందితులకు సుమారు రూ.10 కోట్లు పంపించారు.ఆ తర్వాత సిడ్నీ పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఓ గంట సేపు గాలించిన తర్వాత, ఆ విద్యార్థిని నగరంలోని ఓ హోటల్‌లో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు.

కిడ్నాప్ డ్రామాలో భాగంగా కాళ్లు చేతులు కట్టేసిన ఒక యువతి ఫొటో పోలీసులకు లభించింది

ఫొటో సోర్స్, NSW POLICE

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాదిలో ఇలాంటి కేసులు ఎనిమిది వచ్చాయని సిడ్నీ పోలీసులు చెప్పారు

కొన్ని కేసుల్లో నిందితులు రూ.10 లక్షల నుంచి రూ.1.6 కోట్ల వరకూ వసూళ్లకు పాల్పడ్డారు.

కొన్ని కుటుంబాలు తమ దగ్గర ఉన్న డబ్బంతా నిందితులకు చెల్లించాయని డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ డారెన్ బెనెట్ చెప్పారు.

ఇలాంటి కేసుల్లో చాలా వరకూ బాధిత విద్యార్థులు మరుసటి రోజు క్షేమంగా కనిపించారని పోలీసులు తెలిపారు.

కొందరు విద్యార్థులు సిగ్గుతో ఫిర్యాదు చేసేందుకు కూడా వెనుకాడుతున్నారని అన్నారు.

''తమను, తమవారిని ఓ పెద్ద ప్రమాదంలోకి నెట్టామని బాధిత విద్యార్థులు క్షోభకు గురవుతున్నారు'' అని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు చెప్పారు.

ఎందుకు మోసపోతున్నారు?

కుంభకోణం భారీ స్థాయిలో జరిగిందని, ఫోన్ బుక్‌లో చైనీస్ పేర్లతో ఉన్నవారికి ఆటోమెటెడ్ కాల్స్ వెళ్లేలా వ్యవస్థను నిందితులు ఉపయోగించినట్లు కనిపిస్తోందని పోలీసులు తెలిపారు.

''వాళ్లు చాలా మందిపై తమ వల విసురుతారు. కొందరు వారికి చిక్కుతారు. ఇలాంటి కుంభకోణం కేసులు దాదాపు ప్రతి వారం వస్తున్నాయి'' అని బెనెట్ అన్నారు.

అంతర్జాతీయ విద్యార్థుల్లో కొందరు ఒంటరిగా ఉంటుండటం, కొన్ని 'సాంస్కృతిక అంశాలు'... నిందితులు వారిని సులభంగా మోసం చేసేందుకు ఉపయోగపడుతున్నాయని పోలీసులు అన్నారు.

''మానసికంగా నిందితుల నియంత్రణలోకి బాధితులు వెళ్తున్నారు. కిడ్నాప్ అయినట్లు నటించడం వంటి తీవ్రమైన పనులు కూడా చేస్తున్నారు'' అని బెనెట్ చెప్పారు.

''ఇలాంటి నేరాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి విద్యార్థులు రెండు పనులు చేయాల్సి ఉంది. ఇలాంటి మెసాలు జరుగుతున్నాయన్న విషయాన్ని మొదట వాళ్లు గుర్తించాలి. ఇలాంటి మోసం తమకు జరుగుతున్నా, తెలిసినవారికి జరుగుతున్నా వెంటనే పోలీసుల దృష్టికి తేవాలి'' అని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సూచించారు.

న్యూజీలాండ్, అమెరికాల్లోనూ ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)