చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత మంగళవారం నాడు భారీ ఎత్తున మెడికల్ సరుకులతో తమ దేశానికి చెందిన కార్గో ట్రైన్ ఒకటి పారిస్‌లోని ఓ స్టేషన్‌కు చేరుకుందన్న విషయాన్ని ది గ్లోబల్ టైమ్స్, జిన్హువా న్యూస్ ఏజెన్సీలాంటి చైనా మీడియా సంస్థలు ఘనంగా కవర్ చేశాయి. ఈ వారం మరికొన్ని రైళ్లు అదే తరహా యాంటీ కరోనా వైరస్ మెడిసిన్స్ సరుకులతో జర్మనీలోని డాయిష్‌బర్గ్, స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు కూడా చేరుస్తాయని ఆ వార్త సంస్థలు ప్రకటించాయి. తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ నుంచి వైన్, జర్మనీ నుంచి యంత్ర పరికరాలు, స్పెయిన్ నుంచి ఆలివ్ ఆయిల్‌ను ఈ రైళ్లు తీసుకొస్తాయని కూడా తెలిపాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్-19 మీద పోరాటంలో చైనా యూరోపియన్ దేశాలకు ఎంతో సహకరిస్తోందన్న విషయన్ని చైనాకు చెందిన ఇంగ్లీష్ మీడియా వార్తలను ప్రచురించింది. ఒక్క మే నెలలోనే చైనా సరుకు రవాణా రైళ్లు యూరప్‌కు వెయ్యి ట్రిప్పులు నడిపాయని, దాదాపు 12,000 కిలోమీటర్లు కవర్ చేశాయని ఆ మీడియా సంస్థలు వెల్లడించాయి.
ప్రపంచ మీడియా పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ, గత జనవరి నుంచి కరోనా మీద పోరాటంలో యూరప్‌కు పూర్తిస్థాయిలో సహకరించినట్లు కనిపిస్తోంది. అవసరంలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడన్న నానుడి ఉంది. ఇది అందుకు మినహాయింపు కాదని ఢిల్లీలో ఉంటున్న ఫ్రాన్స్ రాయబారి ఒకరు అన్నారు. "మాకు ఇష్టమున్నా లేకున్నా, చైనా ఆర్ధికవ్యవస్థ మా ఆర్ధిక వ్యవస్థలను నడిపిస్తోందని ఆమె అన్నారు. "మా భవిష్యత్తు కోసం మేం వారితో చేతులు కలపక తప్పలేదు'' అన్నారామె.
నిజమే. చైనా యూరోపియన్ యూనియన్‌కు ప్రియమైన మిత్రుడు కాకపోవచ్చు. కానీ చైనా ఎకానమీతో సంబంధం పెట్టుకోకుండా అది తప్పించుకోలేదు. ఈ రెండు ఆర్ధిక వ్యవస్థల మధ్య 2019 సంవత్సరంలో 560 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వ్యాపారం జరిగింది. వ్యాపార సంబంధాలు కొనసాగకపోతే అది యూరోపియన్ యూనియన్‌కు పెనుభారంగా మారుతుంది.
చైనా-ఈయూ రైల్ కారిడార్ 2011లో ప్రారంభమైంది. ఆరు దేశాలగుండా ప్రయాణిస్తూ ఈ రైళ్లు వ్యాపార సామాగ్రిని మోసుకొస్తుంటాయి. కరోనా మహమ్మారి తర్వాత కూడా ఈ రైలు వ్యవస్థ యూరప్ ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
సంబంధాలు కలపడంలో దూకుడుగా చైనా
సరిహద్దుల్లో భారత్‌తో వివాదాలు, అమెరికాతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నా, ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ రిలేషన్స్‌ను నిర్వహించడంలో మాత్రం చైనా ముందుంది. గతవారం దాదాపు 97శాతం వస్తువుల దిగుమతిపై జీరో టారిఫ్‌ను ప్రకటిస్తూ బంగ్లాదేశ్‌తో చైనా ఒప్పందం కుదుర్చుకుంది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం వల్ల భారత్ దేశం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్త్రాలను నిలిపివేసి, బంగ్లాదేశ్ నుంచి వాటిని తెచ్చుకుంటోంది చైనా. ఆ దేశానికి టెక్స్ టైల్స్ ఎగుమతిలో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య పోటీ ఉంది.
ఇటు ఆఫ్రికాలో 60బిలియన్ డాలర్ల విలువైన కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి చైనా ఒప్పందాలు చేసుకుంది. బీజింగ్‌లో 2018లో జరిగిన చైనా ఆఫ్రికా సహకార సమాఖ్య సమావేశంలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ దీన్ని స్వయంగా ప్రకటించారు. సౌత్ అమెరికా దేశాలతో కూడా చైనా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం విషయంలో చైనాతో ఘర్షణ పడుతున్నప్పటికీ ఆర్ధిక సంబంధాలను మాత్రం కొనసాగిస్తోంది వియాత్నాం. ఆ దేశంలో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇక అన్ని విషయాలలోనూ తనకు ఆప్తమిత్ర దేశమైన చైనా నుంచి పాకిస్థా న్ 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించింది. ప్రాచీనకాలంలోని సిల్క్ రోడ్‌కు సమానమైన వన్ బెల్డ్ వన్ రోడ్ అనే చైనా కలల ప్రాజెక్టుకు పాకిస్థాన్ సహకరిస్తోంది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా మారిన తర్వాత వ్యాపార సంబంధాల విషయంలో చైనా ఆత్మవిశ్వాసం పెరిగింది. "మేం చాలా దేశాల సంప్రదాయ విధానాలకు భిన్నంగా అత్యంత ఆత్మవిశ్వాసంతో ప్రపంచ ఆర్ధికరంగంలో కేంద్రబిందువుగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మా ఆర్ధికరంగాన్ని పరిపుష్టం చేసుకుంటూనే, ప్రపంచశాంతికి, అభివృద్ధికి, మానవాళి సంక్షేమానికి మావంతుగా కృషి చేస్తున్నాం'' అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు.
చైనా వ్యవహారాలపై బాగా పట్టున్న ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి కెవిన్ రడ్ "ఆర్ధిక చరిత్రను గమనించినట్లయితే రాజకీయ అధికారం అనేది ఆర్ధిక శక్తి నుంచే పుట్టుకొస్తుంది. కాలక్రమేణా విదేశాంగ విధానం, భద్రతాంశాలు కూడా వాటిని అనుసరిస్తాయి'' అని అన్నారు. ఆర్ధిక రంగంలో చైనా ఎదుగుదలను విశ్లేషించిన ఆయన "తన అభివృద్ధిని మేనేజ్ చేసుకోవడంలోనే ప్రపంచంతో చైనా సంబంధాలు ఆధారపడి ఉంటాయి'' అన్నారు.
ఆర్ధిక రంగంలో చైనా అనూహ్యమైన ఎదుగుదలపై చాలా దేశాలు అసూయపడటం నిజమే. అయితే ఇదే సమయంలో చైనా దుందుడుగా, పొగరుబోతులాగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కెనడా, స్వీడన్, ఆస్ట్రేలియాలాంటి దేశాలతో చైనా గొడవలు పడుతోంది. ముఖ్యంగా మేథో హక్కులు, సైబర్ వార్‌ఫేర్, మానవహక్కుల విషయంలో ఈ దేశాలతో చైనా వివాదాలు కొనితెచ్చుకుంది. అయితే ఈ పంచాయితీల గురించి చైనా పెద్దగా కంగారు పడటం లేదంటారు స్వీడన్‌లోని ఉప్సలా యూనివర్సిటీలో పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రీసెర్చ్ లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అశోక్ స్వైన్. " తనపై ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో వ్యతిరేకత ఉందన్న విషయం చైనాకు తెలుసు. అంతేకాదు తన ఆర్ధిక వ్యవస్థతో పాశ్చాత్య దేశాల ఆర్ధిక వ్యవస్థలు ముడిపడి ఉన్న కారణంగా ఆ దేశాలు తనను ఏమీ చేయలేవన్నది కూడా చైనాకు తెలుసు'' అని అన్నారాయన.
అయితే చైనా రాయబార సంబంధాలు ఇప్పుడు కాస్త వెనుకంజలో ఉన్నాయంటారు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీటో యూనివర్సిటీ చైనా సెంటర్ డైరక్టర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ రాణా మిత్తర్.
"దీనికి ప్రధాన కారణం కోవిడ్-19, ఆ మహమ్మారి విషయంలో ఆ దేశం వ్యహరించిన తీరు. దీన్ని కప్పిపుచ్చుకోడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి కోవిడ్-19 రక్షణకవచాలు, ఇతర సామాగ్రిని చైనా పంపిణీ చేస్తోంది'' అని ప్రొఫెసర్ మిత్తర్ అన్నారు. అయితే ఈ సమస్యల నుంచి చైనా సులభంగానే బయటపడుతుందని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ముందున్న సవాళ్లు
చైనీయుల దృష్టిలో ఆదేశ ఆర్ధిక వ్యవస్థకు పెద్ద విలన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 2018లో ఆయన చైనా వస్తువుల మీద భారీ దిగుమతి సుంకాలు విధించి, దాని ఎగుమతులను దెబ్బతీశారు. ఇప్పటికీ ఆ వైఖరిని, ఆ నిర్ణయాన్ని మార్చుకోలేదు ట్రంప్. ఆయన, ఆయన సహచర రిపబ్లికన్ పార్టీ సభ్యులు చైనాపై విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నారు. మేథోసంపదను హరిస్తోందని, సైబర్ యుద్ధానికి ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
భద్రతా కారణాలు చూపి తనకు దగ్గరగా ఉండే పాశ్చాత్య దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, మరికొన్ని యూరోపియన్ దేశాలకు చైనాకు చెందిన హువావే కంపెనీ 5జి టెక్నాలజీని రాకుండా ట్రంప్ నిలువరింపజేశారని ఆస్ట్రేలియన్ మీడియా పేర్కొంది. హువావే చైనాకు చెందిన ప్రైవేట్ కంపెనీ అయినప్పటికీ, దానిపై ప్రభుత్వ పెత్తనం ఉంటుందని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి.
చైనా గ్లోబల్ స్వప్నాలకు కరోనా వైరస్ కొంత వరకు బ్రేక్ వేసింది. వైరస్‌ను నిలువరించడంలో చైనా విఫలమైందని డోనాల్డ్ ట్రంప్‌తోపాటు, అనేక దేశాలు చైనాను విమర్శించాయి. ఆస్ట్రేలియా ఇంకో అడుగు ముందుకేసి దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. ఇది చైనాకు మరింత కోపం తెప్పించింది. ఈ కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఆస్ట్రేలియాలో సర్వేలు నిర్వహించే 'లోవి ఇనిస్టిట్యూట్' తాజాగా విడుదల చేసిన ఫలితాలలో ఆస్ట్రేలియన్లు చైనాపై అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారని తేలింది. కేవలం 23శాతంమంది ఆస్ట్రేలియన్లు మాత్రమే మహమ్మారిని అదుపు చేయడంలో చైనా సమర్ధవంతంగా వ్యవహరించిందని చెప్పారు. అంతకు ముందు సర్వేలో అది 43శాతంగా ఉంది. "నిన్నమొన్నటి వరకు చైనాను ఆస్ట్రేలియన్లు ఒక ఆర్ధికశక్తిగా చూశారు. కానీ ఇప్పుడు ఒక ప్రమాదంగా భావిస్తున్నారు'' అని లోవి సర్వే ఏజెన్సీకి నాయకత్వం వహిస్తున్న నాటాషా కస్సమ్ వ్యాఖ్యానించారు. అయితే నేరాన్నంతా తనపై మోపడాన్ని చైనా తీవ్రంగా ఖండిస్తోంది. "ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్‌లాంటి దేశాలకు చైనాపట్ల ఉన్న సానుకూల దృక్పథం క్రమంగా మారుతోంది. కరోనా మహమ్మారికి ప్రధాన కారణం చైనానే అని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. "తమ తమ దేశాలలో కోవిడ్-19ను కంట్రోల్ చేయలేక, తమ అసమర్ధతను కప్పి పుచ్చుకోడానికి ఆ నెపాన్ని చైనాపై నెడుతున్నాయి'' అని చైనా కమ్యూనిస్టు పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉండే ది గ్లోబల్ టైమ్స్ పత్రిక రాసింది.

ఫొటో సోర్స్, Reuters
బలహీన స్థితిలో అమెరికా
అమెరికా కేంద్రంగా పనిచేసే గ్లోబల్ సెక్యూరిటీ సంస్థ 'పొలిటాక్ట్' తాజాగా విడుదల చేసిన నివేదిక కరోనా నెపాన్ని ఒకరి మీదకు ఒకరు నెట్టుకునే క్రమంలో చైనాతో పలుదేశాలకు మధ్య విరోధం ఏర్పడింది అని రాసింది. " ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కోవిడ్-19పై వివిధ దేశాల నడుమ వచ్చిన వివాదాలే కారణం. మొదట్లో చైనా దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నదనే అభిప్రాయం వినిపించింది. ఆ తర్వాత మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాల కారణంగా దానిపై వస్తున్న విమర్శలలో తీవ్రత తగ్గింది
మరోవైపు మహమ్మారి కట్టడి విషయంలో అనవసరమైన వివాదాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా పరపతి దెబ్బతిన్నదని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఆ తర్వాత అమెరికా మిత్రదేశాలు తమ స్థితిగతులు, వ్యూహాలపై పునరాలోచనలోపడగా, అమెరికా బలహీన పడిన తర్వాత పరిణామాలపై మిగిలిన ప్రపంచదేశాలు దృష్టి సారించాయి.
మరింత జాగ్రత్తగా ఉండాలని చైనా భావిస్తున్నట్లు ప్రొఫెసర్ రాణా మిత్తర్ అభిప్రాయ పడ్డారు."ప్రపంచం మొత్తం తనను లక్ష్యంగా చేసుకుందని చైనా భావించడంలో తప్పులేదు. తాను సాధించిన అనేక విజయాలను ఈ ప్రపంచం మెచ్చుకోలేదన్నది చైనా భావన. 1980ల ప్రారంభం నుండి దారిద్య్రరేఖ దిగువన ఉన్న కోట్లమందిని తాను పైకి తీసుకు రాగలిగానని, ప్రపంచానికి గొప్ప టెక్నాలజీని అందించానని చైనా భావిస్తోంది. అందుకే చైనా ఎక్కువ గుర్తింపును కోరుకుంటోంది'' అని ప్రొఫెసర్ మిత్తర్ అన్నారు. అయితే మానవ హక్కుల గురించి ప్రపంచం మాట్లాడటాన్ని మాత్రం చైనా ఇష్టపడదు అని ఆయన అన్నారు.
పాశ్చాత్య దేశాలు చైనాపై వ్యవహరిస్తున్న తీరులో కూడా సందిగ్ధత ఉందని అంటారు ప్రొఫెసర్ అశోక్ స్వైన్. "చైనా పాల్పడుతున్న మానవహక్కుల ఉల్లంఘన, మైనారిటీలు, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులపై దాడుల వ్యవహరాన్ని వదిలేసి చైనా ఆర్ధికరంగం, పెట్టుబడులు, వ్యాపారాల మీదనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నాయి'' అని అశోక్ స్వైన్ అన్నారు.
అమెరికా మాత్రం ఇటీవల చైనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన వ్యవహారంపై దృష్టి పెట్టింది. వీగర్ తెగ ముస్లింలపై జరుగుతన్న దాడులు, అణచివేతలకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించే చట్టంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. చైనా మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న అధికారులను శిక్షించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.

ఫొటో సోర్స్, Empics
చైనా కంగారు పడుతోందా?
చైనా విషయంలో సానుకూలంగా ఉండే పాశ్చాత్య దేశాల నిపుణులు కూడా తన దేశంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనల నిరోధంపై చైనా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. తమ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసేలా పారదర్శకంగా ఉంటే మేలని వారు అంటున్నారు.
ఇరవయ్యో శతాబ్దం చివరి దశాబ్దం చివరినాటికి, చైనా ఒక ఆర్థిక శక్తిగా మారింది. అదే సమయంలో చైనాను ప్రపంచం కొంత వరకు దూరంగా పెట్టింది. ఈ సమయంలోనే ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రవేశాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ బహిరంగంగా సమర్థించారు. 164దేశాలకు సభ్యత్వం ఉన్నది ప్రపంచ వాణిజ్య సంస్థ. ఇది ప్రపంచ దేశాల వాణిజ్యాలకు దిశను, విధానాలను నిర్ణయిస్తుంది. చైనా 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం పొందింది. ఆ సమయంలో, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, చైనా ప్రపంచ దేశాలకు సన్నిహితంగా చేరడం ద్వారా రాజకీయ, ఆర్థిక సంస్కరణల దిశలో ముందుకు సాగుతుందని నమ్మారు.
ప్రజాస్వామ్య దేశాల సమూహంలో చైనా సభ్యత్వం పొందడం వల్ల 2015 నాటికి చైనా తలసరి ఆదాయం 7,000 డాలర్లు అవుతుందని బిల్ క్లింటన్ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే 2015కు రెండు సంవత్సరాల ముందే చైనా 7,000 డాలర్ల తలసరి ఆదాయ లక్ష్యాన్ని సాధించింది. కాని ప్రజాస్వామ్య ప్రక్రియ.. రాజకీయ సంస్కరణలు మాత్రం మొదలుకాలేదు. ఇంకా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా మరింత నియంతృత్వ దేశంగా మారిందన్న విశ్లేషణలు వినిపించాయి.
అయితే, 2012లో షి జిన్‌పింగ్ అధికారం చేపట్టడానికి ముందు వరకు చైనాలో కొన్ని రాజకీయ మార్పులు చూడొచ్చన్నఆశ ఉండేది. "హు జింటావో చైనా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు (2002-2012) చైనాలో బహుళ పార్టీ వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరిగాయి. మానవ హక్కుల విషయంలో కూడా చైనా చురుకుగా వ్యవహరించినట్లు కనిపించింది. కానీ షి జిన్‌పింగ్ అధ్యక్షుడైనప్పటి నుండి (2012 నుంచి) చైనాలో మానవ హక్కులను నినదించే గొంతులను తీవ్రంగా అణిచివేసారు. కమ్యూనిస్టు పార్టీ పాలనపై తన పట్టును కఠినతరం చేసింది"అని ప్రొఫెసర్ అశోక్ స్వైన్ అన్నారు.
అయితే చైనా పోరాట పటిమను తక్కువ అంచనా వేయకూడదని ప్రొఫెసర్ రాణా మిత్తర్ హెచ్చరించారు. "మనం స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలను వేరువేరుగా చూడాలి. ప్రస్తుతం చైనా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని చెప్పక తప్పదు. చైనా అమెరికాల మధ్య కోల్డ్ వార్ మొదలైందని చాలామంది భావిస్తున్నారు" అని మిత్తర్ అన్నారు. "ఈ పరిస్థితులలో చైనా రాజకీయ ప్రయత్నాలు ఏ లక్ష్యాలను సాధిస్తాయనే దానిపై మనం దృష్టి పెట్టకూడదు. 5జి టెక్నాలజీతో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో చైనా ఇప్పటికే మిగతా ప్రపంచం కంటే ముందంజలో ఉంది. చైనా ఈ సాంకేతికను ఉపయోగించుకుంటుంది. హువావే వంటి సంస్థలు అభివృద్ధి చెందుతాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా సరసమైన ధరలకు ఉత్పత్తి చేయ గలుగుతాయి. ఈ సాంకేతికత ద్వారా ఇతర దేశాలలో సులభంగా విస్తరించవచ్చు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా సహారా దేశాలు, సౌత్ ఈస్ట్ ఆసియా, దక్షిణ ఆసియాలలో అనేక మధ్యస్థ దేశాలు ఉన్నాయి. చౌకైన సాంకేతికతను తన రాజకీయ,ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి చైనా ప్రయత్నిస్తుంది" అని మిత్తర్ అన్నారు.
"చైనా ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇరుసుగా మారింది. కొత్త సాంకేతిక ఆవిష్కరణ రంగంలోనే కాదు, ఉత్పత్తి సామర్థ్యం కారణంగా ప్రపంచ సప్లయి చైన్‌లో కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి చైనాను బయటకు తీసుకురావడం కనీసం రాబోయే కొన్నేళ్లపాటు ఆచరణలో సాధ్యం కాదు. చాలా దేశాలు ఇది సరైంది కాదని కూడా భావిస్తున్నాయి" అని మిత్తర్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- అమెరికా: 2014 తర్వాత వేగవంతమైన వృద్ధి రేటు సాధించిన ఆర్థిక వ్యవస్థ
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- ‘ఉపాధి లేదు.. చేతిలో డబ్బు లేదు’.. మహిళలను టార్గెట్ చేస్తున్న అక్రమ రవాణా ముఠాలు
- ఆంధ్రప్రదేశ్: పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల విభజన లాభమా? నష్టమా?
- హైడ్రోజన్ విప్లవం ఇప్పటికైనా వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








