హైడ్రోజన్ ఇంధనంతో వాహనాలన్నీ దూసుకుపోయే రోజు ఎప్పటికైనా వస్తుందా?

- రచయిత, రోజర్ హరాబిన్
- హోదా, బీబీసీ పర్యావరణ విశ్లేషకుడు
హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడే సాంకేతికతలో ప్రపంచానికి బ్రిటన్ దారిచూపగలదని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.
పర్యావరణానికి హాని చేయని పరిశ్రమలు, ఉద్యోగాలు దీనితో వస్తాయని ఆయన ఆశిస్తున్నారు.
హైడ్రోజన్ ఇంధనంతో విప్లవం రావొచ్చన్నది కొందరి అంచనా? అయితే, ఇది జరిగే పనేనా? వట్టి మాటలా?
హైడ్రోజన్‌తో నడిచే యంత్రాల్లో ఫ్యూయెల్ సెల్‌ను వినియోగిస్తారు. ఇది బ్యాటరీకి భిన్నమైంది.
ఫ్యూయెల్ సెల్‌లో హైడ్రోజెన్ గాలిలో ఉండే ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరుపుతుంది. ఈ రసాయనిక శక్తి విద్యుత్‌గా మారుతుంది. దానితోనే యంత్రాలు నడుస్తాయి. ఈ ప్రక్రియంలో నీరు విడుదల అవుతుంది. పర్యావరణానికి హాని కలిగించేవేవీ పుట్టవు.
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కార్లు, ట్రక్కులు, పడవలు, వ్యాన్లు, డబుల్ డెకర్ బస్సులు, చిన్నపాటి విమానాలు ఇదివరకు రూపొందాయి. తాజాగా జేసీబీ సంస్థ ఓ ఎక్స్‌కవేటర్‌ను ఫ్యూయెల్ సెల్‌తో తయారుచేసింది.

ఫొటో సోర్స్, HYUNDAI
విప్లవం గురించి వింటూనే ఉన్నాం..
హైడ్రోజన్ ఇంధనంతో విప్లవం వస్తుందన్న మాటను చాలా కాలంగా వింటూనే ఉన్నాం.
2000ల ఆరంభంలోనే ఆటోమొబైల్ రంగంలో ఇది పెను మార్పులకు కారణమవుతుందని చాలా మంది అనుకున్నారు.
కానీ, ఆ అంచనాలు నిజం కాలేదు.
ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి.
హైడ్రోజన్ ఇంధనం కోసం పూర్తిగా కొత్త మౌలిక వసతులు అవసరమయ్యాయి. అప్పటికి హైడ్రోజన్ కార్లకు పోటీదారు అయిన బ్యాటరీ కార్లకు అంతటి సమస్య లేదు. ఎక్కడైనా ఛార్జ్ చేసుకునే వీలుంది.
అప్పటికే అధిక సామర్థ్యం గల బ్యాటరీలు ఇతరత్రా అవసరాల కోసం వినియోగంలో ఉన్నాయి. హైడ్రోజన్ అలా కాదు.
అందుకే కార్ల విషయంలో బ్యాటరీలతో జరిగిన పోరులో హైడ్రోజన్ ఓడిపోయింది. కానీ, రవాణా, పరిశ్రమలు, హీటింగ్ వంటి ప్రక్రియల అవసరాలను బ్యాటరీలు తీర్చలేకపోతున్నాయి. అందుకే, ఇప్పుడు మళ్లీ హైడ్రోజన్ పోటీలోకి వచ్చింది.

జేసీబీ సంస్థ తయారుచేసిన భారీ ఎక్స్‌కవేటర్‌లాంటిదే మరో చిన్న ఎక్స్‌కవేటర్ ఉంది. అది బ్యాటరీతో నడుస్తుంది. డోర్‌లో పట్టే అంత చిన్నగా అది ఉంటుంది.
ఒకవేళ భారీ ఎక్స్‌కవేటర్ స్థాయిలో దాన్ని తయారుచేయాలంటే, దానికి ఐదు టన్నుల బరువుండే బ్యాటరీ పెట్టాల్సి ఉంటుందని జేసీబీ సంస్థ చెబుతోంది. పైగా ఛార్జ్ చేయడానికి గంటల కొద్దీ సమయం పడుతుంది.
హైడ్రోజన్ మాత్రం గాలి కన్నా బరువు తక్కువ. నిమిషాల్లో ట్యాంక్‌ను నింపొచ్చు.
లారీల లాంటి భారీ వాహనాలు కూడా హైడ్రోజన్‌తో నడపగలిగే జాబితాలోకే వస్తాయి. బ్యాటరీలతో వాటిని నడపడం కష్టం. కొన్ని సార్లు అవి మోసుకుపోయే బరువుకు సమానమైన బ్యాటరీలు అవసరం పడొచ్చు.
ఉత్తర ఐర్లాండ్‌లోని తమ ఫ్యాక్టరీకి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే 80 డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్లు వచ్చినట్లు జేసీబీ సంస్థ తెలిపింది.
మరి, వీటికి ఇంధనం ఎలా నింపుతారు?
సుదూర ప్రయాణం చేసే ట్రక్కుల కోసం మార్గం మధ్యలో హైడ్రోజన్ పంపులు ఏర్పాటు చేస్తారు.
భవిష్యతులో హైడ్రోజన్ కారులకు, హైబ్రిడ్ బ్యాటరీ వాహనాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. కార్లలో అంతకంతకూ పెద్దవుతున్న బ్యాటరీల సమస్య తీరిపోవచ్చు.
బస్సుల కోసం డిపోల్లోనే ఇంధనం నింపే ఏర్పాటు చేయొచ్చు.
ఇదివరకు హైడ్రోజన్ ట్యాంకులు పేలొచ్చన్న భయం ఉండేది. కెవ్లర్ సింథటిక్ ఫైబర్ పూత పూసిన ట్యాంకులు, ట్యాంకు మూసుకుపోతే హైడ్రోజెన్ విడుదల చేసేందుకు అందుబాటులోకి వచ్చిన ప్రక్రియలు దీనికి పరిష్కారాన్ని చూపాయి.

రైళ్లు, విమానాలూ...
విమానాశ్రయాలు కూడా హైడ్రోజన్‌ను నిల్వ చేసుకోవచ్చు.
బ్రిటన్‌లోని మొట్ట మొదటగా క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా నడిపిన ఎలక్ట్రిక్ విమానం హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్‌తోనే ఎగిరింది.
హైడ్రోజన్ రైలు, హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌తో జర్మనీ ఈ రేసులో ముందుంది. హైడ్రోజన్ మార్కెట్‌లో పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో ఆ దేశం దాదాపు రూ.59వేల కోట్ల పెట్టుబడి ఈ రంగంలో పెట్టింది.
యురోపియన్ యూనియన్ (ఈయూ) కమిషన్ కూడా ఈ మార్కెట్‌పై దృష్టి పెట్టింది.
యురాక్టివ్ అనే వెబ్‌సైట్‌లో హైడ్రోజన్ సాంకేతికత విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని త్వరలో విడుదల చేయాలని ఈయూ కమిషన్ ప్రణాళికలు వేసుకున్నట్లు కథనం వచ్చింది.
అంతర్జాతీయంగా చమురు లావాదేవీలకు డాలర్ కరెన్సీగా ఉన్నట్లే, హైడ్రోజన్ విషయంలో యూరో కరెన్సీగా ఉండాలని ఈయూ భావిస్తున్నట్లు లీకైన ఓ పత్రంలో ఉంది.
బ్యాటరీల విషయంలో పోటీలో చైనా ముందు బ్రిటన్ ఓడిందని, హైడ్రోజన్ విషయంలో అలా జరగకూడదని బ్రిటన్ భావిస్తోందని నిపుణులు అంటున్నారు.
2020ల ఆరంభంలోనే భారీ స్థాయి ప్రయోగాలు మొదలుపెట్టాలని పర్యావరణ మార్పులపై ఏర్పాటైన కమిటీ బ్రిటన్ ప్రభుత్వానికి సూచన చేసింది.
మరికొద్ది వారాల్లో బర్మింగ్హమ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన హైడ్రోజన్ రైలును సాధారణ ట్రాక్‌లపై నడిపి పరీక్షించనున్నారు. బ్రిటన్‌లో ఇదే తొలి హైడ్రోజన్ రైలు.

ఫొటో సోర్స్, Reuters
అవరోధాలు ఉన్నాయి
హైడ్రోజన్ ఇంధనానికి మార్గం అంతా సుగమమేం కాలేదు. ఇంకా, కొన్ని అవరోధాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి బ్రిటన్‌లో అమ్ముడవుతున్న హైడ్రోజన్‌లో దాదాపు అంతా సహజ వాయువు నుంచి వేరు చేసిన హైడ్రోజనే. అది ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. పైగా పర్యావరణానికి హాని చేసే కార్బన్ డై ఆక్సైడ్ ఇందులో విడుదలవుతుంది.
ఈ కార్బన్ డై ఆక్సైడ్‌ను ‘కార్బన్ క్యాప్చర్’ విధానంలో గ్రహించి, వాతావరణంలోకి చేరకుండా చేయొచ్చు. కానీ, దీని వల్ల వ్యయం పెరుగుతుంది.
పునరుత్పాదక విద్యుత్‌ను వాడుకొని నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరు చేసి వాడుకోవడం ఇంకొక మార్గం.
ఈ ప్రక్రియ హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకునే విధానానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. ఫ్యూయెల్ సెల్‌ను ఉపయోగించి నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరు చేస్తారు. ఇందుకోసం విద్యుత్ ఉపయోగిస్తారు. అంటే, విద్యుత్ శక్తి రసాయనిక శక్తిగా మారుతుంది.
విద్యుత్ శక్తిని రసాయనిక శక్తిని మార్చి, మళ్లీ అదే రసాయనిక శక్తిని విద్యుత్‌గా మార్చుకొని వాడటం అర్థం లేని ప్రక్రియ అని, ఫ్యూయెల్ సెల్స్‌ని ‘ఫూల్ సెల్స్’ అని టెస్లా సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ ఇదివరకు అన్నారు.
భవిష్యతులో డిమాండు ఎక్కువగా ఉండని సమయంలో అందుబాటులో ఉండే విద్యుత్ చాలా చవగ్గా దొరుకుతుందని, ఇతర విధాల్లో దాన్ని ఉపయోగించుకునే మార్గాల్లో ఇదొక్కటని హైడ్రోజన్ ఇంధనాన్ని సమర్థించేవారు అంటున్నారు.
ప్రస్తుత పరిణామాలైతే హైడ్రోజన్ ఇంధనానికి అనుకూలంగా ఉన్నాయి.
బ్రిటన్ 2050కల్లా కార్బన్ ఉద్గారాలను 80 శాతం తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వ్యవస్థలు హైడ్రోజన్ లాంటి ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి ఎంత సహకారం లభిస్తుందన్న విషయంపైనా హైడ్రోజన్ ఇంధన భవితవ్యం ఆధారపడి ఉంది.
20 ఏళ్ల క్రితం బ్యాటరీ కార్లతో పోటీలో ఓడిన హైడ్రోజన్ రేపటి కార్బన్ రహిత ఆర్థికవ్యవస్థలోనైనా చోటు దక్కించుకుంటుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- హైదరాబాద్, విజయవాడల మధ్య హైస్పీడ్ రైలు సాధ్యమేనా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








