ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బొగ్గు గ‌నులు: త‌క్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?

బొగ్గు గనులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కీల‌క‌మైన సింగ‌రేణి బొగ్గు గ‌నులు పూర్తిగా తెలంగాణాకు దక్కాయి. దాంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప‌రిశ్ర‌మ‌ల‌కు పెద్ద స‌మ‌స్య‌ ఎదురైంది.

ప్ర‌స్తుతం ఒడిశా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమ‌తి చేసుకుంటున్న‌ప్ప‌టికీ కీల‌క స‌మ‌యాల్లో స‌మ‌స్య‌లు త‌ప్ప‌డం లేదు. థర్మ‌ల్ విద్యుత్ ఉత్పాద‌న‌కు ఆటంకాల‌తో రాష్ట్రంలో అనేక సార్లు విద్యుత్ కోత‌లు విధించాల్సి వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌మ‌కు బొగ్గు గ‌నులు కేటాయించాల‌ని కోరుతూ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రికి లేఖ రాశారు. అదే స‌మ‌యంలో ఏపీలో బొగ్గు త‌వ్వ‌కాల‌కు ఉన్న అవ‌కాశాలను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మంచి ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

బొగ్గు గనుల అన్వేషణ
ఫొటో క్యాప్షన్, కృష్ణా జిల్లా పరిధిలో పరీక్షల కోసం తవ్వకాలు జరుపుతున్నారు

ఏపీలోనూ సింగ‌రేణికి బొగ్గు గ‌నులు

రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు తెలంగాణా ప్రాంతానికి ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సింగ‌రేణి ప‌రిశోధ‌న‌లు చేసింది. అందులో భాగంగా మూడు బ్లాకుల బొగ్గు గ‌నులు సింగ‌రేణి ఆధ్వ‌ర్యంలో ఉన్నాయి.

వాటిని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు అప్ప‌గించాలంటూ 2015లో నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాశారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా సింగ‌రేణి వివ‌ర‌ణ కోరింది. భౌగోళికంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్న బొగ్గు గ‌నుల‌ను ఏపీకి అప్ప‌గించ‌డానికి ఉన్న స‌మ‌స్య‌లు తెలపాలంటూ సింగ‌రేణి కాల‌రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ని ఆదేశించింది.

అయితే, అప్ప‌ట్లో సింగ‌రేణి సంస్థ దానికి అభ్యంత‌రం తెలిపింది. తెలంగాణాను ఆనుకుని ఉన్న ఏపీ ప‌రిధిలోని భూభాగంలో త‌మ‌కు ఉన్న ఆ మూడు బ్లాకులను అప్ప‌గించ‌లేమ‌ని తెలిపింది. అక్కడ ప‌రిశోధ‌న‌ల కోసం రూ.100 కోట్లు వెచ్చించిన‌ట్టు వెల్లడించింది.

ఆ త‌ర్వాత ఈ వ్య‌వ‌హారం మ‌రుగున ప‌డిపోయింది. నేటికీ ఏపీలో సింగ‌రేణికి చెందిన 3 బ్లాకులు య‌ధావిధిగా కొన‌సాగుతున్నాయి. త‌వ్వ‌కాలు ప్రారంభంకాలేదు.

యంత్రం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బొగ్గు ఎక్క‌డి నుంచి వ‌స్తోంది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాలు న‌డుస్తున్నాయి. అందులో కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన ఎన్టీపీసీ సింహాద్రి (ప‌ర‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం), కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న దామోద‌రం సంజీవ‌య్య థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్ (కృష్ణ‌ప‌ట్నం) ఉన్నాయి. వాటితో పాటు ఏపీ ప్ర‌భుత్వం ప‌రిధిలో విజ‌య‌వాడ స‌మీపంలో ఉన్న నార్ల తాతారావు థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్, క‌డ‌ప‌లో ఉన్న‌ రాయ‌ల‌సీమ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ వంటివి ఉన్నాయి. ప‌లు ప్రైవేట్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంటులు కూడా ఉన్నాయి.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ పవర్ జన‌రేష‌న్ కార్పోరేష‌న్ (ఏపీ జెన్‌కో) ప‌రిధిలో మొత్తం 41.628 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాద‌న జ‌రుగుతుంటే, అందులో సింహ‌భాగం థ‌ర్మ‌ల్ విద్యుత్‌దే కావ‌డం విశేషం.

గ్యాస్ స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డంతో ఏపీలో ఉన్న ప‌లు గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాద‌న సంస్థ‌లు నిలిచిపోయాయి. దాంతో ప్ర‌స్తుతం 34.628 మిలియ‌న్ యూనిట్ల‌ థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్పాద‌నే కీల‌కంగా మారింది.

థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్పాద‌న కోసం ఏపీకి సొంతంగా గ‌నులు లేకపోవడంతో ఒడిశాలోని తెలిషాహి, న‌యాప‌రాతోపాటుగా... మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సులియారి బెల్వార్ గ‌నుల నుంచి బొగ్గు దిగుమ‌తి చేసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీ జెన్‌కో, ఏపీఎండీసీల‌కు కేటాయించిన మేర‌కు వ‌స్తున్న బొగ్గుని విద్యుత్ సంస్థ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.

థర్మల్ పవర్ ప్లాంటు

ఫొటో సోర్స్, CHRIS ALLEN

ఫొటో క్యాప్షన్, థర్మల్ విద్యుత్ కేంద్రం (ప్రతీకాత్మక చిత్రం)

బొగ్గు స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు- నిలిచిపోతున్న విద్యుత్ ఉత్పాద‌న‌

కీల‌క స‌మ‌యాల్లో బొగ్గు స‌ర‌ఫ‌రాకు ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి. ఇటీవ‌ల ఆయా బొగ్గు గ‌నుల్లో వ‌ర్షాల కార‌ణంగానూ, సిబ్బంది స‌మ్మెల మూలంగానూ ఉత్పాద‌న నిలిచిపోవ‌డంతో బొగ్గు స‌ర‌ఫ‌రా ఆగింది. దాని ప్ర‌భావం ఏపీలో థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్పాద‌న మీద ప‌డింది.

సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో ఈ స‌మ‌స్య ఏర్ప‌డింది. దాంతో సింహాద్రి ప‌వ‌ర్ ప్లాంట్‌తో పాటు వీటీపీఎస్‌లో కూడా విద్యుత్ ఉత్పాద‌న నిలిచిపోవ‌డంతో రాష్ట్ర‌మంతా క‌రెంటు కోత‌లు త‌ప్ప‌లేదు.

విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం మూలంగా ఒక్కో రోజు 8 గం.ల పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆ త‌ర్వాత రాయ‌ల‌సీమ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌లో కూడా బొగ్గు కొర‌త కార‌ణంగా ప‌లు యూనిట్లలో ఉత్ప‌త్తి నిలిపివేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఏటా ఇలాంటి స‌మ‌స్య‌లు వెంటాడుతుండ‌డంతో విద్యుత్ ఉత్పాద‌న‌, స‌ర‌ఫ‌రా వంటివి ఏపీ స‌ర్కారుకు పెద్ద స‌వాల్‌గా మారుతున్నాయి.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, YS JAGAN/FB

కేటాయింపులు పెంచాల‌ని కేంద్రానికి విన‌తి

బొగ్గు కొర‌త కార‌ణంగా విద్యుత్ ఉత్పాద‌న నిలిచిపోవ‌డం, క‌రెంటు కోత‌ల‌తో ఏపీ వాసులు అల్లాడిపోవాల్సి వ‌స్తున్న త‌రుణంలో అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా బొగ్గు గ‌నుల కేటాయింపు పెంచాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కేంద్రాన్ని కోరారు. న‌వంబ‌ర్ 5న ఆయ‌న ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు.

ఏపీ విభ‌జ‌న త‌ర్వాత బొగ్గు గ‌నుల కేటాయింపులో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఏపీ జెన్‌కో ఆధ్వ‌ర్యంలో 5,010 మెగావాట్ల థ‌ర్మల్ విద్యుత్పాద‌న‌కు అవ‌కాశం ఉంద‌ని, అయినా త‌గిన బొగ్గు స‌ర‌ఫ‌రా లేకపోవడం సమస్యగా ఉంద‌ని వివ‌రించారు. సింగ‌రేణి నుంచి ప్ర‌స్తుతం ఏపీకి ఎటువంటి బొగ్గు కేటాయింపులు జ‌ర‌గ‌డం లేద‌న్నారు.

24 గంట‌ల పాటు నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఇది స‌మ‌స్య‌గా మారింద‌ని, దానిని అధిగ‌మించేందుకు స‌మీపంలో ఉన్న ఒడిశాలోని బొగ్గు గ‌నుల‌ను కేటాయించాల‌ని సీఎం జ‌గ‌న్ కోరారు.

ఛత్తీస్‌ఘ‌డ్‌లో ఏపీఎండీసీకి కేటాయించిన బొగ్గు గ‌నుల్లో త‌వ్వ‌కాల‌కు అత్య‌ధిక వ్య‌యం అవుతోంద‌ని సీఎం వివ‌రించారు. మందాకిని- ఏ కోల్ బ్లాక్‌లో బొగ్గుని కేటాయించాల‌ని కోరారు.

అయితే, ఆ లేఖ‌పై కేంద్రం నుంచి ఇంకా సానుకూల స్పంద‌న రాలేదు. త్వ‌ర‌లోనే త‌మ‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించేలా కేంద్రం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఏపీ విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఏపీలో బొగ్గు నిల్వ‌ల ప‌రిస్థితి ఏమిటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా నాణ్య‌మైన బొగ్గు నిల్వ‌లు ఉన్న‌ట్టు 2015లోనే ప్ర‌భుత్వం గుర్తించింది. కేంద్ర జియోలాజిక‌ల్ స‌ర్వే సంస్థ నిర్ధరించ‌డంతో ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా జిల్లాల ప‌రిధిలో బొగ్గు నిల్వ‌ల కోసం ప‌రిశీల‌న ప్రారంభించారు. నాలుగేళ్లుగా ప్ర‌యోగాలు నిర్వ‌హిస్తున్నారు.

ఖ‌మ్మం జిల్లాను ఆనుకుని కేజీ బేసిన్ ప‌రిధిలోని చింత‌ల‌పూడి, నూజివీడు స‌మీమ ప్రాంతాల్లో బొగ్గు నిల్వ‌లున్న‌ట్టు గుర్తించారు. సుమారుగా రెండు వేల మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల బొగ్గు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ ప్రాంతాల‌ను నాలుగు బ్లాకులుగా విభ‌జించి మైనింగ్ ఎక్స్ ప్లోరేష‌న్ కార్పోరేష‌న్ లిమిటెడ్ (ఎంఈసీఎల్) ఆధ్వ‌ర్యంలో ప‌రిశీల‌న కొన‌సాగుతోంది.

తొలుత ఈ బొగ్గు గ‌నుల త‌వ్వ‌కాల‌ను 2017 నాటికే ప్రారంభిస్తామ‌ని నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. కానీ, ఆ త‌ర్వాత బొగ్గు ప‌రిశోధ‌న‌ల విష‌యంలో జ‌రుగుతున్న జాప్యం కార‌ణంగా త‌వ్వ‌కాల విష‌యంలో నేటికీ అడుగు ముంద‌డుగు ప‌డ‌లేదు.

బొగ్గు గనుల అన్వేషణ కోసం బోర్లు వేసిన ప్రదేశం

ఒక బ్లాక్‌లో ప‌రిశీల‌న పూర్తి

చింత‌ల‌పూడి, రేచ‌ర్ల‌, సోమ‌వ‌రం ఈస్ట్, సోమ‌వ‌రం వెస్ట్ బ్లాకులుగా ఎంఈసీఎల్ ఆధ్వ‌ర్యంలో బృందాలు పరిశీల‌న కొన‌సాగిస్తున్నాయి. జార్ఖండ్‌కు చెందిన సిబ్బంది ఆధ్వ‌ర్యంలో నాలుగున్న‌ర ఏళ్లుగా ఈ ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక బ్లాకులో ప‌రిశీల‌న పూర్త‌య్యింద‌ని, నాణ్య‌మైన బొగ్గు నిల్వ‌లు ఉన్న‌ట్టు నిర్ధరించామ‌ని ఎంఈసీఎల్ చింత‌ల‌పూడి ప్రాజెక్ట్ మేనేజ‌ర్ ప్ర‌మోద్ రావు బీబీసీకి తెలిపారు.

"కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ త‌రఫున ఈ ప్రాంతంలో ప‌రిశోధ‌న‌లు సాగించేందుకు మాకు అప్ప‌గించారు. ఏపీఎండీసీ త‌రఫున సీఎంపీడీఐఎల్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ ప్ర‌యోగాలు సాగుతున్నాయి. సోమ‌వారం వెస్ట్ బ్లాక్‌లో త‌వ్వ‌కాలు జరిపాం. దానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ప్ర‌స్తుతానికి పూర్తిగా వెల్ల‌డించ‌లేం. ప్ర‌భుత్వం దాని మీద నిర్ణ‌యం తీసుకుంటే త‌వ్వ‌కాల‌కు అవ‌కాశం ఉంటుంది. 1,581 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు నిల్వ‌ల‌ను గుర్తించాం. అందులో 1,149 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు నిల్వ‌ల‌పై ప‌రిశోధ‌న పూర్త‌య్యింది. తుది నివేదిక ఆధారంగా త‌వ్వ‌కాల‌కు కోల్ ఇండియా ఆధ్వ‌ర్యంలో నిర్ణ‌యం తీసుకుంటార‌ు" అని ప్ర‌మోద్ రావు వివరించారు.

బొగ్గు గనుల అన్వేషణ కోసం బోర్లు వేసిన ప్రదేశం
ఫొటో క్యాప్షన్, రేచర్ల బ్లాకులో పరిశోధన జరపడానికి తవ్వకాలు జరిపిన ప్రాంతం

త‌క్కువ లోతులోనే బొగ్గు

బొగ్గ నిల్వ‌లపై టెక్నీషియ‌న్ ఆనంద్ గోప్ ఆధ్వ‌ర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి.

"50 మంది సిబ్బంది, మరికొంత మంది స్థానికులతో అయిదేళ్లుగా ఈ ప్రాంతంలో ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాం. అనేక చోట్ల బోర్లు వేస్తున్నాం. ఎంత‌ లోతులో బొగ్గు నిల్వ‌లు ఉన్నాయి? ఎంత నాణ్య‌తతో ఉంది? అన్న వివరాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. శాంపిళ్లను సేకరించి మహారాష్ట్రలోని నాగ‌పూర్‌కు పంపుతున్నాం. అక్క‌డి నిపుణులు వాటిని ప‌రిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తారు. సోమ‌వారం ఈస్ట్ బ్లాకులో 500 మీట‌ర్ల లోతులో బొగ్గు గ‌నులు ఉన్నాయి. రేచ‌ర్ల బ్లాకులో మాత్రం 1,800 మీట‌ర్ల వ‌ర‌కూ త‌వ్వాల్సి వ‌స్తోంది. బొగ్గు నాణ్య‌త బాగుండ‌డంతో దానికి సంబంధించిన నిర్ణ‌యాలు ప్ర‌భుత్వ‌మే తీసుకోవాల్సి ఉంటుంది" అని ఆనంద్ బీబీసీతో చెప్పారు.

బొగ్గు త‌వ్వ‌కాల‌కు అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. ముఖ్యంగా శాంపిళ్లలో ల‌భించిన బొగ్గులో బూడిద శాతం ఎంత ఉంది, బొగ్గు ఎంత లోతులో ఉంది, త‌వ్వ‌కాల‌కు ఉన్న ఆటంకాలు ఏంటి, ఓపెన్ కాస్ట్ సాధ్యం కాని ప‌క్షంలో ఎంత స‌మ‌యం, వ్య‌యం అవ‌స‌రం అవుతుంది? అన్న అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని బొగ్గు నిల్వ‌ల విష‌యంలో త‌వ్వ‌కాల‌కు సిద్ధ‌ప‌డ‌తారు.

ఈ విష‌యంపై కేంద్ర బొగ్గు గ‌నుల శాఖకు అనుబంధంగా ఉన్న ప‌రిశోధ‌నా విభాగాల నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంద‌ని ప్రాజెక్ట్ మేనేజ‌ర్ ప్ర‌మోద్ రావు చెప్పారు. ఏపీలో బొగ్గు గ‌నుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భిస్తే స్థానిక అవ‌స‌రాల‌కు ఏర్ప‌డుతున్న కొర‌త‌ను అధిగ‌మించే వీలుంటుంద‌ని రాష్ట్ర నాయకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)