గ్రామీణ భారతం బహిరంగ మల విసర్జన నుంచి విముక్తమైందనే ప్రకటనలో నిజమెంత? - BBC Reality Check

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్
- హోదా, బీబీసీ న్యూస్
భారత గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మలవిసర్జన అలవాటు నుంచి విముక్తమయ్యాయంటూ భారత ప్రభుత్వం చేసిన ప్రకటనతో.. ఒక అధికారిక నివేదిక విభేదిస్తోంది.
గ్రామీణ భారతదేశంలో సర్వే చేసిన ఇళ్లలో నాలుగో వంతు పైగా ఇళ్లకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి.
మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన భారీ కార్యక్రమం తర్వాత భారతదేశంలోని గ్రామాలు నూటికి నూరు శాతం బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తమయినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత నెలలో ప్రకటించిన నేపథ్యంలో.. ఈ నివేదిక వివాదాస్పదంగా మారింది.
భారత స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ 150వ జయంతి అయిన ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలనే ఆకాంక్ష ప్రధాని మోదీకి చిరకాలంగా ఉంది.
కొత్త నివేదిక ఏం చెప్తోంది?
ఎన్‌ఎస్‌ఓ నివేదికను 2018 జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించారు. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 1,00,000 పైగా ఇళ్లను సర్వే చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు అందుబాటులో ఉన్న ఇళ్లు 71.3 శాతం... అంటే మూడు వంతుల కన్నా తక్కువే ఉన్నాయని ఆ నివేదిక గుర్తించింది. అలాగే, మరుగుదొడ్డి అందుబాటులో ఉన్న ఆ గ్రామీణ ఇళ్లలో 3.5 శాతం ఇళ్లు వాటిని ఉపయోగించటం లేదని కూడా తెలిపింది.
మరుగుదొడ్డి లేని గ్రామీణ ఇళ్లు
కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇతర రాష్ట్రాలకన్నా ఇంకా దారుణంగా ఉందని కూడా ఈ నివేదిక స్పష్టంచేస్తోంది. ఉదాహరణకు.. ఒడిషాలోని గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం పైగా ఇళ్లకు మరుగుదొడ్డి సౌకర్యం లేదు.
అంతేకాదు, మరో ప్రభుత్వ నివేదిక అయిన 2018-19 జాతీయ వార్షిక గ్రామీణ పారిశుధ్య సర్వే నివేదికలో వెల్లడించిన గణాంకాలకు కూడా ఎన్ఎస్‌ఓ నివేదిక భిన్నంగా ఉంది. దేశంలోని గ్రామీణ ప్రాంత ఇళ్లలో 93.3 శాతం ఇళ్లకు మరుగుదొడ్లు ఉన్నాయని పారిశుధ్య సర్వే నివేదిక చెప్పింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో గాంధీ జయంతి సందర్భంగా మాట్లాడుతూ, తన ''స్వచ్ఛ భారత్'' మిషన్‌లో భాగంగా భారతదేశ గ్రామాలు తాము బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తమయ్యాయని నిర్ధారించినట్లు ప్రకటించారు.
ఆయన పట్టణ భారతదేశాన్ని కలపలేదు. పట్టణ ప్రాంతాల్లో ఇంకా సుమారు 50 ప్రాంతాలు తమను తాము బహిరంగ మలవిసర్జన విముక్త ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉందని తాజా అధికారిక సమాచారం చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ని మరుగుదొడ్లు కట్టారు?
ప్రభుత్వ నిధులు ఉపయోగించి దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మరుగుదొడ్లు కట్టారనేది నిజం.
బీజేపీ ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణం 2017-18 లో పతాక స్థాయికి చేరింది. ఆ ఏడాదిలో దాదాపు మూడు కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించారు.
గ్రామీణ ప్రాంతంలో మరుగుదొడ్ల సదుపాయం 2018 అక్టోబర్ నాటికి 95 శాతానికి చేరిందని స్వచ్ఛ భారత్ (క్లీన్ ఇండియా) వెబ్‌సైట్ పేర్కొంది.
ఇది 71 శాతానికి కొంచెం ఎక్కువగా ఉందంటూ ఎన్‌ఎస్ఓ 2018 జూలై - డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన సర్వే ద్వారా వేసిన అంచనా కన్నా ఇది చాలా ఎక్కువ.
అయితే.. 2012లో నిర్వహించిన తన గత సర్వే కన్నా పరిస్థితి చాలా మెరుగుపడిందని ఎన్‌ఎస్ఓ నివేదిక పేర్కొంది. అప్పుడు గ్రామీణ ప్రాంతంలో కేవలం 40.6 శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం అందుబాటులో ఉండేది.
అయితే.. ఇటీవలి సర్వేలో భాగంగా ప్రభుత్వ ప్రయోజనాలు అందటం గురించి అడిగిన ఒక ప్రశ్న తర్వాత వెంటనే నేరుగా.. మరుగుదొడ్డి అందుబాటు గురించిన ప్రశ్న అడగటం జరిగిందని ఆ నివేదిక చెప్తోంది.
''ప్రభుత్వ పథకాల ద్వారా అదనపు ప్రయోజనాలు పొందటానికి దోహదపడుతుందనే భావనతో.. ఈ ప్రశ్నలకు వ్యతిరేక సమాధానం ఇచ్చే స్వాభావిక పోకడ ఉండివుండొచ్చు'' అని ఆ నివేదిక వ్యాఖ్యానించింది.
గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం

ఆధారం: స్వచ్ఛ భారత్ మిషన్ డాటా
బహిరంగ మలవిసర్జన కొనసాగుతోంది
భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన స్థాయిలు.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రావటానికి ముందు నుంచే కొన్నేళ్లుగా తగ్గుతున్నాయి.
అయితే అధికారిక గణాంకాలు ఏం చెప్తున్నా కానీ.. బహిరంగ మలవిసర్జన ఇంకా కొనసాగుతోందని చెప్పటానికి చాలా ఆధారాలు ఉన్నాయి.
బహిరంగ మలవిసర్జన విముక్తమంటూ 2018 ఫిబ్రవరిలో ప్రకటించిన 11 రాష్ట్రాల్లో ఒకటైన హరియాణా నుంచి బీబీసీ హిందీ అక్టోబర్ నెలలో రాసిన ఒక కథనంలో.. ఒక గ్రామంలో 200 మందికి పైగా జనం బహిరంగ మలవిసర్జనకు వెళుతున్నారని గుర్తించారు.
ఈ ఏడాది ఆరంభంలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ - నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఒక అధ్యయనం.. గ్రామీణ ప్రాంతాల్లో 44 శాతం మంది ఇంకా బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని అంచనా వేసింది.
బహరంగ మలవిసర్జన తగ్గుదల

ఆధారం: ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ డాటా
అందులో మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న నాలుగో వంతు ఇళ్లు కూడా ఉన్నాయి. జనం తమకు మరుగుదొడ్డి అందుబాటులో ఉన్నా కూడా బహిరంగ మలవిసర్జన కొనసాగించటానికి పలు కారణాలున్నాయి:
- చాలా మరుగుదొడ్లకు ఒకే గొయ్యి గల లెట్రిన్ లేదా సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది.. ఐదారేళ్లకు అవి నిండిపోతాయి
- నాసిరకం నిర్మాణం, నిర్వహణ సరిగా లేకపోవటం వల్ల కొన్ని మరుగుదొడ్లు పనిచేయటం లేదు
- జనంలో.. ప్రత్యేకించి వృద్ధుల్లో దీర్ఘకాలంగా ఉన్న అలవాట్లను మార్చుకోవటానికి విముఖత
గ్రామీణ పారిశుధ్యం విషయంలో తను చేసిన ప్రకటనలను భారత ప్రభుత్వం ఇంతకుముందు సమర్థించుకుంది. బహిరంగ మలవిసర్జన కొనసాగుతోందని చెప్పిన కొన్ని స్వతంత్ర అధ్యయనాలు అనుసరించిన విధివిధానాలను ప్రశ్నించింది.

ఫొటో సోర్స్, Getty Images
మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటు అత్యధిక స్థాయిలో ఉందంటూ 2018-19 జాతీయ గ్రామీణ పారిశుధ్య సర్వే.. ప్రపంచ బ్యాంకు, యూనిసెఫ్ సహా నిపుణులు ఆమోదించిన విధివిధానాలను పాటించిందని కూడా ప్రభుత్వం ఉటంకించింది.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నివేదిక నుంచి నిర్ధారణలకు రావటం సరికాదని స్టాటిస్టిక్స్ (గణాంక) మంత్రిత్వశాఖ, తాగునీరు, పారిశుధ్యం విభాగం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
''పారిశుధ్య విస్తరణను గణనీయంగా తక్కువ చేసి చెప్పటానికి కారణం అయివుండవచ్చు'' అంటూ.. ఆ సర్వే స్వయంగా ప్రత్యేకంగా ప్రస్తావించిన పరిమితులను ఉటంకించాయి.

ఇవి కూడా చదవండి
- ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి విధుల్లోకి చేరవచ్చు, యూనియన్లను నమ్మి మోసపోకండి: కేసీఆర్
- అమ్మాయిల రక్షణకు పులిపై వచ్చిన 'సూపర్ హీరోయిన్'
- హెచ్ఐవీ బాధితుల కోసం ప్రపంచంలోనే తొలి స్పెర్మ్ బ్యాంకు
- అవినీతి పేరు పెట్టి అమరావతిని చంపేస్తారా?: చంద్రబాబు
- దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- రైల్వే పోటీ పరీక్షల్లో తెలుగే టాప్.. గతేడాది తెలుగు భాషలో పరీక్ష రాసిన 9.89 లక్షల మంది అభ్యర్థులు
- మీ పెంపుడు కుక్కతో జాగ్రత్త... ముద్దులు పెడితే ప్రాణాలు పోతున్నాయి
- "ఆర్టీసీ మహిళా కార్మికుల కన్నీళ్లు చూసి మా ఆవిడ ఏడ్చేసింది.. ఉబికివస్తున్న కన్నీటిని నేను ఆపుకున్నాను"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








