తెలంగాణ ఆర్టీసీ సమ్మె: "మహిళా కార్మికుల కన్నీళ్లు చూసి మా ఆవిడ ఏడ్చేసింది.. ఉబికివస్తున్న కన్నీటిని నేను ఆపుకున్నాను"

"మా ఉద్యోగాలు మేం చేసుకుందామనొస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. పిల్లల ఫీజులు కట్టేందుకు కూడా ఇబ్బంది అవుతోంది. మా ఉద్యోగాలు పోయాయంటూ ఎవరూ మాకు అప్పు కూడా ఇవ్వడం లేదు."
"కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఎప్పుడూ అనుకోలేదు. మేమేమైనా తప్పు చేస్తే క్షమించండి. కానీ మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోండి."
"డ్యూటీలో చేరదామని వస్తే మమ్మల్ని దొంగల్లా, టెర్రరిస్టుల్లా అరెస్ట్ చేయడం ఏంటి? ఇదేనా బంగారు తెలంగాణ?"
"మమ్మల్ని డ్యూటీలో చేర్చుకోవడం లేదు. మేమేం తప్పు ఏం చేశాం? కేసీఆర్ మా గోడు పట్టించుకోవాలి."
ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించకపోవడంతో కొందరు ఆర్టీసీ మహిళా కార్మికుల కన్నీటి ఆవేదన ఇది.
తమను విధుల్లో చేర్చుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు మంగళవారం కూడా డిపోల వద్దకు వెళ్లారు. కానీ ఉన్నతాధికారులు దానికి ఒప్పుకోలేదు. నిరసన ప్రదర్శనలు చేస్తున్న కార్మికులను పలుచోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"మహిళా కార్మికులు హన్మకొండ బస్టాండ్‌లో కన్నీరు పెట్టుకున్నారు. నిజామాబాద్‌లో డీఎం కాళ్లు మొక్కారు. విధుల్లో చేర్చుకోకపోతే రోడ్డున పడతామని కన్నీటి పర్యంతం అయ్యారంటూ ఈటీవీ తెలంగాణ ఒక కథనం ప్రసారం చేసింది.
ఆర్టీసీ మహిళా కార్మికులు కన్నీరు పెట్టుకునే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కార్మికుల జీవితాలు రోడ్డున పడకుండా ఇప్పటికైనా వారిని విధుల్లోకి తీసుకోవాలనే కామెంట్లు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించాయి. అదే సమయంలో కార్మిక నాయకులది కూడా తప్పు ఉందంటూ మరికొందరు కామెంట్లు చేశారు. కేసీఆర్ చెప్పినప్పుడే సమ్మె విరమిస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Facebook/Vadde Jayachandra
"కార్మికుల కన్నీళ్లు చూసి మా ఆవిడ ఏడ్చేసింది"
"తమను ఉద్యోగంలోకి తీసుకోండి అంటూ చేతులు జోడించి ఏడుస్తున్న ఆర్టీసీ ఉద్యోగిని చూసి ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుని పక్కకు చూస్తే నాతో పాటు వార్తలు చూస్తున్న మా ఆవిడ ఏడ్చేస్తోంది" అని వడ్డే జయచంద్ర అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
"ప్రాణాలు పణంగాపెట్టి సొంత రాష్ట్రం సాధించుకొన్న ఆత్మాభిమానం మీడియా ముందు కన్నీళ్ల పర్యంతమవటం అత్యంత దయనీయమైన విషయం" అని ఆయన అన్నారు.
"ఒక మనిషి రోడ్డున పడి ఏడవాలి అంటే ఎంత ఆత్మాభిమానం చంపుకోవాలో, ఎంత అంతర్మథనం చెందాలో, ఎంత కడుపు కాలాలో అంతా అయ్యింది. ఒక్కసారి 'అతని స్థానంలో నేనుంటే..' అని ఆలోచించండి" అంటూ వడ్డే జయచంద్ర విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, FB/ Fazal Khan
"కార్మికులన కరుణించండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించకండి" అంటూ ప్రభాకర్ జైనీ అనే మరో వ్యక్తి స్పందించారు.
ఆర్టీసీలో చాలా మంది కార్మికులు పేదలేనని, వారిని క్షమించి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని మహ్మద్ ఫజల్ ఖాన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో విజ్ఞప్తి చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విధుల్లో చేరేందుకు డిపోలకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేయడంపై శేషగిరి బీవీ అనే ట్విటర్ యూజర్ అభ్యంతరం చెప్పారు.
"తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందా"? అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Facebook/పూసం సచిన్
మాట్లాడే ప్రతిఒక్కరికీ భవిష్యత్‌లో ఇలాగే జరుగుతుందని పూనం సచిన్ అనే వ్యక్తి కామెంట్ చేశారు. రేపటి హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని ఆయన అన్నారు. రమణ అనే వ్యక్తి వేసిన కార్టూన్‌ను ఆయన తన ఫేస్‌బుక్ వాల్‌పై షేర్ చేశారు.

ఫొటో సోర్స్, FB - Kiran Ravi
"ముందే ఉద్యోగాల్లో చేరితే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా"
మరోవైపు "కేసీఆర్ చెప్పినప్పుడే సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా" అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
"నాలుగేళ్లలో ఆర్టీసీ కార్మికులకు 66శాతం జీతాలు పెంచారు. కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా విధుల్లో చేరకపోతే ఎలా?" అని కిరన్ రవి అనే వ్యక్తి ప్రశ్నించారు.
"సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ చెప్పినప్పుడు సమ్మె విరమించి ఉద్యోగంలో చేరితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా" అని సుభాష్ చంద్ర మస్నా అభిప్రాయపడ్డారు.
"అప్పుడు ప్రభుత్వ విజ్ఞప్తుల్ని పట్టించుకోకుండా ఇప్పుడు బాధపడితే ఏంటి లాభం" అని ట్వింకిల్ సేనా కామెంట్ చేశారు.

ఫొటో సోర్స్, TELANGNA I&PR/TSRTC
"కార్మిక నాయకులదే ఈ తప్పంతా"
మరికొందరు ఆర్టీసీ కార్మిక నాయకులను తప్పుబట్టారు.
"కార్మిక నాయకుడికి లాజిక్ ఉండాలి. ఎప్పుడు సమ్మెకు వెళ్లాలి అనే విచక్షణ ఉండాలి. యాజమాన్య ఆలోచనను పసిగట్టాలి. ఇవేవీ లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లు ప్రవర్తిస్తే జరిగేది ఇదే" అంటూ గొండి కవీందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
"ప్రైవేటీకరణ చేస్తారేమో అని సమ్మెకు వెళ్లడం ఎందుకు? ఒకవేళ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే అప్పుడు కోర్టుకు వెళ్లి, సమ్మె చేసి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఈ సమ్మె ప్రతి సంఘాలకు ఒక గుణపాఠం కావాలి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, FB/Gondi Kaveender Reddy
"ఎగేసి వెనక్కి వెళ్లిన నాయకులకు ఏ ఇబ్బందీ లేదు. సమస్యలన్నీ ఇలాంటి సాధారణ కార్మికులకే. వ్యూహం లేకుండా, పూటకో తీరు నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను యాజమాన్యానికి దూరం చేసి చేతులెత్తేసిన నాయకులదే ఈ వైఫల్యం" అని రాజేందర్ రెడ్డి గడిపల్లి అభిప్రాయపడ్డారు.
"అయితే, తప్పు ఎవరిది? సమ్మె చేసే హక్కు ఉందా? లేదా? అన్నవి పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం, పౌర సమాజం స్పందించాల్సిన సమయం ఇది" అని వడ్డే జయచంద్ర అన్నారు.
కార్మికుల కన్నీటి ఆవేదనను మానవత్వంతో అర్థం చేసుకుని వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చాలామంది నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- రఫేల్‌కు ‘ఆయుధ పూజ’.. ‘దేశాన్ని రక్షించడానికి రఫేల్, రఫేల్‌ను రక్షించడానికి నిమ్మకాయలు’
- చైనా, తైవాన్‌ల మధ్య ‘వికీపీడియా’ యుద్ధం
- ఆర్టీసీ విలీనం: జగన్ ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరిగేది ఎవరికి?
- ఆంధ్రప్రదేశ్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యమేనా... చట్టం ఏం చెబుతోంది
- కణాలు ఆక్సిజన్ స్థాయులను ఎలా గుర్తిస్తాయో పరిశోధించిన శాస్త్రవేత్తలకు వైద్యంలో నోబెల్
- ఇలాంటి బస్సులో ఎప్పుడైనా ప్రయాణించారా
- ముస్లిం వీగర్లలను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా
- గున్న ఏనుగును కాపాడబోయి చనిపోయిన ఏనుగులు అయిదు కాదు 10
- హరప్పా నాగరికతనాటి ‘దంపతుల’ సమాధి చెబుతున్న చరిత్ర
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?
- బీబీసీ ఆపరేషన్: 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ విశ్వవిద్యాలయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








