ముస్లిం వీగర్లను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా

ఫొటో సోర్స్, AFP/getty images
చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో మూలవాసులైన వీగర్ ముస్లింలను వేధిస్తున్నారన్న ఆరోపణలతో ఆ దేశానికి చెందిన 28 సంస్థలను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది.
'ఎంటిటీ లిస్ట్'గా పేర్కొనే నిషేధిత జాబితాలో పెట్టడంతో ఆ 28 సంస్థలు ఇకపై వాషింగ్టన్ అనుమతులు లేకుండా అమెరికా నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయలేవు. బ్లాక్‌లిస్టులో పెట్టిన సంస్థల్లో కొన్ని ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా మరికొన్ని సర్వేలెన్స్ పరికరాల వ్యాపారం చేసే ప్రయివేట్ టెక్ సంస్థలు.
అమెరికా ఇలా చైనాకు చెందిన సంస్థలను వాణిజ్య పరంగా బ్లాక్‌లిస్టులో పెట్టడం ఇదే తొలిసారి కాదు. మేలో చైనాకు చెందిన టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం హ్వావేను కూడా ఈ ఎంటిటీ లిస్టులో పెట్టింది. ఆ సంస్థ ఉత్పత్తులను వాడితే భద్రతాపరమైన సమస్యలు వస్తాయన్న భయంతో ఈ నిర్ణయం తీసుకుంది.
జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, వేధింపుల్లో ఈ 28 సంస్థల పాత్ర కూడా ఉందని అమెరికా వాణిజ్య విభాగం ఆరోపించింది.
జిన్‌జియాంగ్‌లోని నిర్బంధ శిబిరాల్లో ఉంటున్నవారిని విపరీతంగా హింసిస్తున్నారని, ముఖ్యంగా ముస్లిం వీగర్లపై అకృత్యాలకు పాల్పడుతున్నారని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఈ నిర్బంధ శిబిరాలను చైనా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నిర్వహిస్తున్న ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లుగా చెబుతోంది.

అమెరికా ఎవరిని లక్ష్యం చేసుకుంది?
ఏకపక్షంగా సాగించిన సామూహిక నిర్బంధాలు.. వీగర్లు, కజక్‌లు, ఇతర ముస్లిం మైనారిటీలపై అత్యాధునిక సాంకేతికత సహాయంతో నిఘా పెట్టడం వంటి చైనా చర్యల్లో ఈ 28 సంస్థల పాత్ర కూడా ఉందని అమెరికా వాణిజ్య విభాగం సోమవారం ప్రకటించింది.
ఎంటిటీ లిస్టులో పెట్టిన వాటిలో జిన్‌జియాంగ్ ప్రావిన్స్ భద్రతా విభాగం, మరో 19 చిన్నచిన్న ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
మిగతా ఎనిమిది సంస్థల్లో హైక్ విజన్, దహువా టెక్నాలజీ, మెగ్వి టెక్నాలజీ వంటి టెక్ కంపెనీలున్నాయి. ఈ సంస్థలన్నీ ప్రత్యేకంగా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వాడుతున్నాయి.
సర్వేలెన్స్ పరికరాల తయారీలో ప్రపంచంలోని పెద్ద సంస్థల్లో హైక్‌విజన్ ఒకటి.
అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. వాణిజ్య ఉద్రిక్తతలన తగ్గించుకోవడానికి చైనా ఇప్పటికే వాషింగ్టన్‌కు ఒక బృందాన్ని కూడా పంపించింది.

ఫొటో సోర్స్, AFP
చైనాలోని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సంస్థలే లక్ష్యమా?
- కరిష్మా వస్వానీ, బీబీసీ అసియా బిజినెస్ కరస్పాండెంట్
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం స్వల్ప కాలికంగానైనా చైనా సాంకేతిక లక్ష్యాలన కొంతవరకు దెబ్బతీస్తుంది. ప్రస్తుతం అమెరికా లక్ష్యంగా చేసుకున్న సంస్థలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో దిగ్గజాలే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతికతపై పెద్ద ఎత్తున రీసెర్చి చేస్తూ, విరివిగా వాడుతూ కొత్తకొత్త పరికరాలు తయారుచేస్తున్నాయి చైనా సంస్థలు.
కానీ, ఆర్టిపిషియల్ అల్గారిథమ్స్‌ను నిర్వహించే ప్రాసెసర్ చిప్స్ విషయంలో మాత్రం ఇప్పటికీ అమెరికా సంస్థలైన ఇంటెల్, ఇన్విడియాలతే ఆధిపత్యం.
మరోవైపు సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న చైనా ప్రగాఢ వాంఛను అమెరికా తాజా చర్యలు మరింత పెంచే అవకాశం ఉంది.
ఉదాహరణకు.. హ్వావేను ఈ ఏడాది ఎంటిటీ లిస్టులో పెట్టిన తరువాత గూగుల్ వంటి సంస్తలు కూడా హ్వావేకు ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్(ఓఎస్) అందించాలంటే వాషింగ్టన్ నుంచి ఎక్స్‌పోర్ట్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో తనను ఎంటిటీ లిస్టులో పెట్టిన తరువాత హ్వావే సొంతంగా ఓఎస్ తయారుచేసుకుని తన ఫోన్లలో వాడుతానని చెబుతోంది.
అమెరికాకు చెందిన ఇతర టెక్నాలజీలకు కూడా ప్రత్యామ్నాయంగా చైనా సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు.
ఇది ఇలాగే కొనసాగి అమెరికా, చైనాల వాణిజ్య యుద్ధం సాంకేతిక సమరంగా మారితే వినియోగదారులు పూర్తిగా అన్నీ చైనా వస్తువులే కానీ లేదంటే అన్నీ అమెరికా వస్తువులే కొనాల్సిన పరిస్థితులు రావొచ్చు.

ఫొటో సోర్స్, Reuters
జిన్‌జియాంగ్‌లో పరిస్థితి ఎలా ఉంది
చైనా పశ్చిమ ప్రాంతంలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సులో గత కొన్నాళ్లుగా ఆ దేశం పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతోంది.
వీగర్లు, ఇతర ముస్లి మైనారిటీ వర్గాలకు చెందిన సుమారు 10 లక్షల మందిని చైనా నిర్బంధించిందని అమెరికా ఆరోపిస్తోంది.
వారందరినీ నిర్బంధ శిబిరాల్లో ఉంచి ముస్లిం మతాన్ని వీడాలని, మాండరిన్ భాష మాట్లాడాలని వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే, చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి విశ్వాసపాత్రులుగా ఉండాలనీ నూరిపోస్తోందన్న ఆరోపణలున్నాయి.
చైనా మాత్రం ఈ ఆరోపణలన్నిటినీ ఖండిస్తోంది. ఆ శిబిరాల్లో వృత్తి విద్యా శిక్షణలు అందిస్తున్నామని చెబుతోంది. ఈ శిక్షణల వల్ల వారు ఉద్యోగాలు పొందగలుగుతున్నారని, చైనా సమాజంలో మమేకం కాగలుగుతున్నారని చెబుతోంది.

ఫొటో సోర్స్, AFP
జిన్‌జియాంగ్‌లో చైనా చేపడుతున్న చర్యలను అమెరికా, పలు ఇతర దేశాలు తప్పుపడుతూ వస్తున్నాయి.
అమెరికా విదేశీవ్యవహారాల మంత్రి మైక్ పాంపియో గత వారం మాట్లాడుతూ.. 'చైనా తన ప్రజలను దేవుడిని ఆరాధించడం మానేసి ప్రభుత్వాన్ని పూజించమని బలవంతం చేస్తోంద'ని ఆరోపించారు.
వీగర్లు, ఇతర ముస్లిం మైనారిటీల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ జులైలో 20కి పైగా దేశాలు ఐరాస మానవ హక్కుల మండలిలో ఒక లేఖను విడుదల చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ ఎవరీ వీగర్లు?
చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో అనాదిగా ఉంటున్న వీగర్లు టర్కీ సంతతికి చెందిన ముస్లింలు. జిన్‌జియాంగ్ ప్రావిన్స్ జనాభాలో 45 శాతం వీగర్లే. మిగతావారిలో 40 శాతం మంది హన్ చైనీస్.
వీగర్లు అధికంగా ఉండే తూర్పు తుర్కెస్తాన్ ఇరవయ్యో శతాబ్దం తొలినాళ్లలో స్వాతంత్ర్యం పొందింది. అయితే, 1949లో చైనా దాన్ని ఆక్రమించుకుని తన నియంత్రణలోకి తీసుకుంది.
అప్పటి నుంచి ఆ ప్రాంతంలో హన్ చైనీస్ పెద్ద సంఖ్యలో వలస రావడం మొదలైంది. దీంతో వీగర్లు తమ సంస్కృతి నాశనమవుతుందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌కు టిబెట్ మాదిరిగానే స్వయంప్రతిపత్తి ఉంది.
ఇవి కూడా చదవండి:
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- ఇవి చైనా సృష్టించిన కృత్రిమ దీవులు
- చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం
- చైనాలో ఇస్లాం వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ మదరసా విద్యార్థులు
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- దక్షిణ చైనా సముద్రం: వివాదాస్పద ప్రాంతంలో చైనా బాంబర్లు
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- చైనాలో 10 మందికి బహిరంగంగా మరణ శిక్ష విధించిన చైనా
- చైనాలో ఇంటర్నెట్పై కఠిన ఆంక్షలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








