'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ: బీబీసీ ఆపరేషన్

బీబీసీ అండర్‌కవర్ మహిళా రిపోర్టర్‌ను లైంగికంగా వేధిస్తూ రహస్య కెమెరాకు చిక్కిన అధ్యాపకుడిని నైజీరియాలోని లాగోస్ విశ్వవిద్యాలయం సస్పెండ్ చేసింది.
నిందితుడి పేరు డాక్టర్ బోనిఫేస్ ఇగ్బెనెఘు. ఆయన ఓ చర్చిలో పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆయన చర్యలను చర్చి తీవ్రంగా ఖండించింది.
ఏడాది పాటు బీబీసీ ఆఫ్రికా ఐ బృందం జరిపిన ఆపరేషన్‌లో భాగంగా ఇలా రహస్య కెమెరాకు చిక్కిన పలువురు అధ్యాపకుల్లో బోనిఫేస్ ఒకరు.
బీబీసీ అండర్‌కవర్ ఆపరేషన్‌తో పశ్చిమ ఆఫ్రికాలోని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాల సిబ్బందిలో కొందరు విద్యార్థులపై పాల్పడుతున్న లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ప్రొఫెసర్లు తమను లైంగికంగా వేధించారని పలువురు విద్యార్థినులు చెప్పారు. వారిలో కొందరు తమ వివరాలను గోప్యంగా ఉంచారు.
బీబీసీ కథనంపై డాక్టర్ బోనిఫేస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఎందుకు సస్పెండ్ చేశారు?
17 ఏళ్ల విద్యార్థిగా నటిస్తూ వెళ్లిన బీబీసీ మహిళా రిపోర్టర్‌కు ఆ అధ్యాపకుడు అనుచితమైన ప్రశ్నలు వేస్తూ, సెక్స్ కోసం ప్రతిపాదనలు చేయడం కెమెరాలో రికార్డయ్యింది.
ఆ తర్వాత తలుపులు మూసేసిన తన కార్యాలయంలో ఆమెను శారీరకంగా వేధిస్తూ, ముద్దివ్వాలంటూ బలవంతం చేశారు. ఆ తర్వాత తనపట్ల 'విధేయత'తో ప్రవర్తించకుంటే మీ అమ్మకు చెబుతానంటూ ఆయన బెదిరించారు. అదంతా రహస్య కెమెరాలో నమోదైంది.
ఆ అధ్యాపకుడి మీద చాలామంది విద్యార్థులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన వేధింపుల వల్ల తాను పలుమార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేయాల్సి వచ్చిందని ఆయన పూర్వ విద్యార్థి ఒకరు బీబీసీతో చెప్పారు (ఆమె వివరాలను గోప్యంగా ఉంచుతున్నాం).
ఈ అధ్యాపకుడి వ్యవహారాన్ని బీబీసీ బహిర్గతం చేయడంతో యూనివర్సిటీ ఆఫ్ లాగోస్ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. డాక్టర్ ఇగ్బెనెఘును తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని, క్యాంపస్‌లో అడుగుపెట్టకుండా అతని మీద నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది.
"ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ వేధింపుల ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, ఇలాంటివి మరోసారి జరగకుండా చూసేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం" అని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన 'కోల్డ్ రూమ్'లో ఇక నుంచి సిబ్బంది ఎలాంటి కార్యకలాపాలు జరపకుండా దానిని మూసివేస్తున్నామని వెల్లడించింది.
ఫోర్‌స్క్వేర్ చర్చిలో డాక్టర్ ఇగ్బెనెఘు పాస్టర్‌గా పనిచేస్తున్నారు. అతడు విధుల నుంచి వైదొలగాలని ఆ చర్చ్ నిర్వాహకులు ఆదేశించారు.

ఆ వీడియోలో ఇంకా ఏముంది?
మొత్తం గంట నిడివి ఉన్న ఆ వీడియో డాక్యుమెంటరీలో ఘనా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాన్స్‌ఫోర్డ్ గ్యాంపో, డాక్టర్ పాల్ క్వామే బుటాకోర్‌తో సంభాషణలు కూడా ఉన్నాయి.
అయితే, బీబీసీ రహస్య ఆపరేషన్‌లో "మార్కుల కోసం సెక్స్" అడగలేదని ఆ ఇద్దరు ప్రొఫెసర్లు అన్నారు.
ప్రొఫెసర్ గ్యాంపో మరో అడుగు ముందుకేసి, బీబీసీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు కూడా స్థానిక మీడియాతో చెప్పారు.
బీబీసీ నివేదికలో పేర్కొన్న వ్యక్తులపై విచారణ జరుపుతామని, లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని ఘనా విశ్వవిద్యాలయం తెలిపింది.

స్పందన ఏమిటి?
ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించి బీబీసీ విడుదల చేసిన వీడియోకు నైజీరియా, ఘనా దేశాలలో సోషల్ మీడియాలో పెద్దఎత్తున స్పందన వచ్చింది.
ఆ అధ్యాపకుల చర్యలను అనేక మంది ట్విట్టర్ వినియోగదారులు ఖండించారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరు తమ సొంత అనుభవాలను కూడా వెల్లడించారు.
ఈ డాక్యుమెంటరీని ప్రపంచం ముందుంచిన జర్నలిస్ట్ కికి మోర్డి, విశ్వవిద్యాలయంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి తన స్వీయ అనుభవాన్ని కూడా వెల్లడించారు. వైద్య వృత్తిలోకి వెళ్లాలనుకున్న తన ఆశయాలను అర్ధంతరంగా వదులుకోవడానికి కారణం ఆ వేధింపులేనని ఆమె చెప్పారు.
బీబీసీ నివేదిక వల్ల ప్రేరణ పొందిన పలువురు మహిళలు, తాము ఎదుర్కొన్న వేధింపుల అనుభవాలను బీబీసీతో పంచుకుంటున్నారు.
"నేను అనేక బెదిరింపులను ఎదుర్కొన్నాను" అని నైజీరియాకు చెందిన ఒక గ్రాడ్యుయేట్ మంగళవారం బీబీసీ న్యూస్‌టుడేతో చెప్పారు. "నేను విశ్వవిద్యాలయంలో చేరక ముందే ఆ ప్రొఫెసర్ గురించి విన్నాను. ఆయన చేతిలో వేధింపులకు గురైన వారిలో నా స్నేహితులు కూడా ఉన్నారు" అని ఆమె వివరించారు.
విద్యార్థులు అనేక వేధింపులను భరించాల్సి వస్తోందని ఆమె అన్నారు.
ఘనా విశ్వవిద్యాలయంలో ఇలాంటి వేధింపులు సర్వసాధారణమని మరో మహిళ క్యాథెరిన్ చెప్పారు. మంచి ర్యాంకు (గ్రేడ్స్) రావాలంటే సెక్స్ చేయాలంటూ తనను అడిగినప్పుడు, తాను 'చిన్న అమ్మాయిలా' బోరున ఏడ్చానని ఆమె బీబీసీ ఔట్‌సైడ్ సోర్స్ కార్యక్రమంలో వెల్లడించారు.
"దురదృష్టం కొద్ది ఇక్కడ సరైన వ్యవస్థలు లేదు. తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే, ఆధారాలు చూపించమని అడుగుతారు. మన దగ్గర ఆధారాలు ఉండవు కాబట్టి, మౌనంగా ఉండిపోవాల్సి వస్తోంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఆర్టీసీ సంక్షోభానికి కారణాలు, పరిష్కారాలేంటి? యూనియన్లు, ప్రభుత్వం ఏమంటున్నాయి?
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- ఆమె ‘డర్టీ పిక్చర్స్’ ఎందుకు తీస్తున్నారంటే..
- ఇది గాడిద.. కాదు, కాదు, అది కంచెర గాడిద
- అమీనా: ఈ ఆఫ్రికా రాణి ప్రతి యుద్ధం తరువాత ఓ భర్తను పొందుతారు తర్వాత..
- ఆ రాజ్యానికీ రాజుకూ ఈ అందమైన, బలమైన మహిళా సైనికులే రక్ష
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- 'నేను లైంగిక దాడి బాధితురాలిని, నా పేరు ప్రపంచమంతా తెలియాలి'
- జలపాతంలో గున్న ఏనుగును కాపాడే ప్రయత్నంలో చనిపోయిన ఏనుగులు ఆరు కాదు 11
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








