బిచ్చగాడి గుడిసెలో లక్షల నగదు, ఫిక్సెడ్ డిపాజిట్ల పత్రాలు... చూసి షాకైన పోలీసులు

ముంబై భిక్షగాడి దగ్గర లక్షల సంపద

కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం సినిమాలో బ్రిడ్జి మీద ఓ బిచ్చగాడు చనిపోతాడు. అతడ్ని పైకి లేపగానే గోనె పట్టాల కింద ఉన్న నోట్లన్నీ గాలికి లేస్తాయి. ఆ డబ్బు కోసం జనం ఎగబడిన సన్నివేశాన్ని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చూపించిన తీరు మనసుల్ని కదిలిస్తుంది.

దాదాపు అలాంటి సంఘటనే ముంబయిలో నిజంగా జరిగింది. ఈ నగరంలోని గోవాండి ప్రాంతంలో ఉన్న బిరాదీ చంద్ అలియాస్ సాధూబాబా ఒక బిచ్చగాడు. ఇటీవల రైలు పట్టాల మీద తీవ్రంగా గాయపడి చనిపోయాడు.

సాధూబాబా చనిపోయాక అతని గుడిసెలో తనిఖీ చేసిన పోలీసులు, ఆయన దాదాపు 11 లక్షల రూపాయలు పోగేసినట్లు గుర్తించారు.

పట్టాలు దాటుతుండగా అతడు తీవ్రంగా గాయపడ్డారని, తర్వాత చనిపోయాడని ముంబై పోలీసులు చెప్పారు.

"అక్టోబర్ 4న రాత్రి 7.40 గంటలకు పట్టాలు దాటుతున్నప్పుడు సాధూబాబా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను రాజవాడి ఆస్పత్రికి తీసుకెళ్లాం, అప్పటికే చనిపోయాడని అక్కడి వైద్యులు చెప్పారు" అని సీనియర్ ఇన్‌స్పెక్టర్ నందకిశోర్ సస్తే చెప్పారు.

సాధూబాబా గుడిసెలో పోలీసులు 8.77 లక్షల రూపాయల విలువైన ఫిక్సెడ్ డిపాజిట్‌ పత్రాలు, అకౌంటులో 96 వేల రూపాయలు ఉన్నట్లు చూపే బ్యాంకు పాస్‌బుక్ గుర్తించారు.

ముంబై భిక్షగాడి దగ్గర లక్షల సంపద

చిన్న గిన్నెతో భిక్షాటన

అక్కడ వేలాది 50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు కూడా బయటపడ్డాయి. వాటి విలువ దాదాపు లక్షా 47 వేలు ఉంటుంది.

బిరాడిచంద్ అలియాస్ సాధూబాబా ఇంత డబ్బు బిక్షాటనతోనే కూడబెట్టినట్లు తెలుస్తోంది.

"నాకు ఆయన చిన్నప్పటి నుంచీ తెలుసు. రైల్వే స్టేషన్లో అడుక్కునేవారు. ఆయన దగ్గర అంత డబ్బు ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఆయన మామూలు భిక్షగాడిలాగే బతికారు, తన దగ్గర ఇంత డబ్బు ఉందని ఎప్పుడూ చెప్పుకోలేదు" అని ఆటో డ్రైవర్ మిరాజ్ ఖురేషీ చెప్పాడు.

సాధూబాబా గుడిసెలో అంత డబ్బు దొరకడంతో ఆ ప్రాంతమంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు.

"రోజంతా బిచ్చగాళ్ళు ఎంత అడుక్కుంటారనేది ఎవరూ పట్టించుకోరు. సాధూబాబా తనకు వచ్చిన డబ్బును చిన్న సంచిలో పెట్టుకునేవారు. ఆయన ఇంత కూడబెట్టారని మేం అనుకోలేదు. ఆయన దగ్గర ఎప్పుడూ నాణేలతో ఉన్న ఒక చిన్న గిన్నె ఉండేది" అని పొరుగింట్లో ఉండే నజ్మా బానో చెప్పారు.

ముంబై భిక్షగాడి దగ్గర లక్షల సంపద

కుటుంబం గురించి కూడా చెప్పలేదు

సాధూ బాబా తన గుడిసెలో ఉన్న రేకు డబ్బాలు, ప్లాస్టిక్ ట్యాంకుల్లో డబ్బులు దాచిపెట్టారని స్థానికులు చెప్పారు.

నాకు తెలిసినప్పటి నుంచీ, ఆయన ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. మంచి బట్టలు, చెప్పులు కూడా వేసుకోరు. భిక్షాటన చేస్తూనే ఇంత డబ్బు పోగుచేశారంటే నమ్మలేకపోతున్నాం. గుడికి, వేరే ఎక్కడికైనా వెళ్తున్నానని మాకు చెప్పేవారు. కానీ, తనకు కుటుంబం ఉందనే విషయం ఎప్పుడూ చెప్పలేదు. నేను ఆయనతో మాట్లాడేదాన్ని. సాధూబాబా దగ్గర ఇంత డబ్బుందని అనుకోలేదు" అని సయిదా బేగం చెప్పారు.

సాధూబాబా గుడిసె ఉండే ప్రాంతం చాలా చీకటిగా ఉంటుంది. ఆయన దగ్గర అంత డబ్బుందని ఎవరికైనా తెలిసుంటే, అదెప్పుడో మాయమయ్యేదని స్థానికులు భావిస్తున్నారు.

కానీ, సాదాసీదాగా బతుకుతూ ఆ డబ్బును బిరాదీ చంద్ దానిని చాలా రహస్యంగా దాచిపెట్టారు. ఆయన తను తినడానికి తెచ్చుకునే చపాతీలను ఎలుకలకు, కాకులకు కూడా పెట్టేవారు. దాంతో ఆయన దగ్గర అంత డబ్బు ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

సాధూబాబా మృతిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయనది రాజస్థాన్ అని, ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారని గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)