భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

మొదటి రఫేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత వైమానిక దళ తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్

వైమానిక దళ దినోత్సవమైన అక్టోబర్ 8న, భారత్ తన మొదటి రఫేల్ యుద్ధ విమానాన్ని అందుకుంది.

మొదటి రఫేల్ విమానం డెలివరీని అధికారికంగా స్వీకరించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఆయన ప్యారిస్ వెళ్లే ముందు స్వయంగా ట్విటర్‌లో ఆ విషయం గురించి చెప్పారు.

ఫ్రెంచి రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, డసో సంస్థ సిఇఓ ఎరిక్ ట్రాపియేల నుంచి అధికారికంగా రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించిన రాజ్‌నాథ్ సింగ్ దానికి విజయదశమి రోజున ఆయుధ పూజలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఒప్పందం ఎప్పుడు జరిగింది

2010లో యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి రఫేల్ జెట్ ఫైటర్ కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించింది. 2012 నుంచి 2015 వరకూ రెండు దేశాల మధ్య చర్చలు నడిచాయి. 2014లో యూపీఏ స్థానంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

భారత్ 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో 36 రఫేల్ విమానాల కొనుగోలు కోసం సుమారు 59 వేల కోట్ల రూపాయల ఒప్పందంపై సంతకాలు చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ 2016 సెప్టెంబర్‌లో రక్షణ సహకారం కోసం 36 రఫేల్ విమానాలను కొనుగోలు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. రెండు పక్షాల మధ్య కొన్ని ఆర్థిక అంశాల మినహా ఒప్పందం జరిగింది.

రఫేల్‌తో రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత తొలి రఫేల్ విమానానికి పూలు, కొబ్బరికాయతో పూజ చేసిన రక్షణ మంత్రి

వివాదం ఏంటి?

2016 సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్ విమర్శించింది. "యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక రఫేల్ ఫైటర్ జెట్‌ ధర 600 కోట్ల రూపాయలుగా నిర్ణయించారని, కానీ మోదీ ప్రభుత్వం అదే ఒప్పందానికి తుది రూపం ఇచ్చినపుడు, ఒక్కో రఫేల్ విమానానికి 1600 కోట్లు ఖర్చు చేస్తున్నారని" ఆరోపించింది.

రఫేల్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసిన మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హాలతోపాటు సీనియర్ వకీల్ ప్రశాంత్ భూషణ్ కూడా ఈ ఒప్పందంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ 2018 డిసెంబర్‌లో ఈ డీల్‌కు సంబంధించిన అన్ని పిటిషన్లనూ కోర్టు కొట్టివేసింది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలన్న డిమాండును తోసిపుచ్చింది.

అయితే, ప్రశాంత్ భూషణ్ తర్వాత రివ్యూ పిటిషన్ వేశారు. అందులో "కోర్టు తీర్పులో చాలా యదార్థ తప్పిదాలు ఉన్నాయని, ప్రభుత్వం అందించిన సీల్డు కవరులోని సమాచారం ఆధారంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని, దానిపై ఎవరి సంతకం కూడా లేదని" చెప్పారు.

ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ (ఎడమ), డసో కంపెనీ సిఇఓ ఎరిక్ ట్రాపియేతో భారత రక్షణ మంత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ (ఎడమ), డసో కంపెనీ సిఇఓ ఎరిక్ ట్రాపియేతో భారత రక్షణ మంత్రి

ధర పోల్చడం మా పని కాదు

రఫేల్ ధర, వాటి సంఖ్య, ఇతర అవకవతకలపై మాట్లాడిన చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ "నిర్ధారిత రఫేల్ ధరను పోల్చడం కోర్టు పని కాదు. మేం కేసును అధ్యయనం చేశాం. రక్షణ అధికారులతో చర్చించాం. నిర్ణయం తీసుకున్న ప్రక్రియతో మేం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం" అన్నారు.

"126 రఫేల్ విమానాలకు బదులు 36 విమానాల కోసమే ఎందుకు ఒప్పందం చేసుకున్నారు అనే దానిపై మేం దర్యాప్తు చేయలేం. మేం ప్రభుత్వంతో మీరు 126 రఫేల్ విమానాలు కొనుగోలు చేయండి.. అని చెప్పలేం కదా..." అన్నారు.

కానీ, రక్షణ నిపుణులు మరూఫ్ రజా రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు వస్తున్నాయి. ఇది చాలా మెరుగైన ఫైనాన్షియల్ డీల్ అన్నారు.

"భారత్‌ సైన్యంలోకి ఏదైనా కొత్త ఆయుధం రావాలంటే, దానిపై చాలా పరీక్షలు, తనిఖీలు చేసిన తర్వాతే తీసుకుంటారు. సుదీర్ఘ పరిశీలన తర్వేత సైన్యం వాటిని కొనుగోలు చేయవచ్చని సలహా ఇస్తుంది. రఫేల్‌తో పోటీపడే వేరే యుద్ధ విమానం చైనా, పాకిస్తాన్‌లోనే కాదు, మొత్తం భారత ఉపఖండంలోనే లేదు. దీని గురించి చాలా ప్రచారం జరగడానికి కారణం అదే. దానితోపాటు వాటి కొనుగోళ్లపై కూడా చాలా వివాదం నెలకొంది. కానీ వాటిలో ఏదీ ఇప్పటివరకూ నిరూపితం కాలేదు" అని రజా చెప్పారు..

ఈ యుద్ధ విమానం సత్తా ఎంత

ఫొటో సోర్స్, DASSAULT

32 విమానాలు సరిపోవా?

భారత్ 16-16 విమానాల చొప్పున రెండు స్క్వాడ్రన్‌లు కొనుగోలు చేస్తోంది. దానివల్ల సైన్యం రక్షణ అవసరాలు తీరుతాయి అని మరూఫ్ రజా అన్నారు.

రక్షణ నిపుణులు రాహుల్ బేడీ మాత్రం ఆయనకు పూర్తి విరుద్ధంగా చెబుతున్నారు. బీబీసీతో మాట్లాడిన ఆయన భారత్‌కు ఈ విమానాలు సరిపోవని అన్నారు.

"రఫేల్ వల్ల భారత వైమానిక దళం బలం కచ్చితంగా పెరుగుతుంది. కానీ వాటి సంఖ్య చాలా తక్కువ. కొనుగోలు చేసే 36 రఫేల్ విమానాలు అంబాలా, పశ్చిమ బెంగాల్‌లోని హాసిమారా స్క్వాడ్రన్‌కే సరిపోతాయి" అన్నారు.

"రెండు స్క్వాడ్రన్‌లు సరిపోవు. భారత వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్లు కేటాయించారు. ఇవి 32 మాత్రమే. మనకు ఎన్ని స్క్వాడ్రన్లు ఉన్నాయో దానికి తగ్గట్లు యుద్ధ విమానాలు లేవు. మనకు నాణ్యత కావాలి, దానితోపాటు సంఖ్య కూడా పెరగాలి. మనం చైనా లేదా పాకిస్తాన్‌తో పోటీపడుతున్నప్పుడు మన యుద్ధ విమానాల సంఖ్య కూడా పెంచాలి" అని రాహుల్ బేడీ చెప్పారు.

రాఫేల్

ఫొటో సోర్స్, AFP

రఫేల్ సామర్థ్యంపై సందేహం లేదు

భారత వైమానిక దళం రఫేల్‌ను తిరుగులేని యుద్ధ విమానంగా వర్ణించింది. ఈ జెట్ ఫైటర్లకు అధ్భుత సామర్థ్యం ఉంటుందని చెప్పింది.

రఫేల్‌కు ఉన్న ప్రత్యేకతల వల్ల దాని ఫోర్స్ మల్టిప్లై అవుతుందని మరూఫ్ రజా చెప్పారు.

రఫేల్ ఫ్లయింగ్ రేంజ్, మామూలు యుద్ధ విమానాలు, ఆయుధాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

"దానిలోని క్షిపణిని 300 కిలోమీటర్ల దూరం నుంచే ఫైర్ చేయవచ్చు. అది టార్గెట్‌ను కచ్చితంగా హిట్ చేస్తుంది. రఫేల్ ఆపరేషనల్ అవైలబిలిటీ 65 నుంచి 70 శాతం. సుఖోయ్‌లో అది 50 శాతం మాత్రమే. అంటే సగం సుఖోయ్ విమానాలు ఎప్పుడూ మెయింటనన్స్‌లో ఉండవచ్చు" అన్నారు రజా.

ఇది మల్టీ రోల్ కాదు, ఓమనీ రోల్ అయ్యే విమానం. పర్వత ప్రాంతాలపై, చిన్న స్థలంలో కూడా ల్యాండ్ కాగలదు. సముద్రంలో వెళ్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌పై కూడా దిగగలదు.

రఫేల్

ఫొటో సోర్స్, Getty Images

రఫేల్ జెట్ ఫైటర్‌ ప్రత్యేకతలు

రఫేల్ యుద్ధ విమానానికి అణు క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఉంటుంది.

ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించగల సత్తా ఉంది.

రఫేల్‌లో రెండు రకాల క్షిపణులు ఉంటాయి. ఒకదాని రేంజ్ 150 కిలోమీటర్లు, రెండో దాని రేంజ్ సుమారు 300 కిలోమీటర్లు.

అణ్వాయుధాలు మెసుకెళ్లగలిగే రఫేల్ గాలిలో నుంచి గాలిలో 150 కిలోమీటర్ల దూరం వరకూ క్షిపణిని ప్రయోగించగలదు. గాలిలో నుంచి భూమిపైకి ఇది క్షిపణిని 300 కిలోమీటర్ల వరకూ ఫైర్ చేయగలదు.

రఫేల్ లాంటి యుద్ధ విమానం చైనా, పాకిస్తాన్‌ దగ్గర కూడా లేదు. ఇది భారత వైమానిక దళం ఉపయోగించే మిరాజ్ 2000 జెట్ ఫైటర్‌కు ఆధునిక రూపం. భారత వైమానిక దళం దగ్గర ప్రస్తుతం 51 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఉన్నాయి.

ఈ యుద్ధ విమానం సత్తా ఎంత

ఫొటో సోర్స్, DASSAULT

డసో ఏవియేషన్ వివరాల ప్రకారం రఫేల్ స్పీడ్ మ్యాక్ 1.8. అంటే ఇది సుమారు గంటకు 2020 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.

రఫేల్ యుద్ధ విమానం ఎత్తు 5.30 మీటర్లు, పొడవు 15.30 మీటర్లు. ఈ జెట్ ఫైటర్ గాలిలోనే ఇంధనం నింపుకోగలదు.

రఫేల్ యుద్ధ విమానాన్ని ఇప్పటివరకూ అఫ్గానిస్తాన్, లిబియా, మాలి, ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో జరిగిన యుద్ధాల్లో ఉపయోగించారు.

మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ "రఫేల్ యుద్ధ విమానం గురి తప్పకుండా టార్గెట్ హిట్ చేస్తుందని చెప్పారు.

రఫేల్ విమానానికి, పైనా కింద, అటూ- ఇటూ అంటే అన్ని వైపులా నిఘా పెట్టే సామర్థ్యం ఉంటుంది. అంటే దీనికి 360 డిగ్రీస్ విజిబిలిటీ ఉంటుంది. పైలెట్ శత్రువును గమనిస్తే చాలు, టార్గెట్ ఫిక్స్ చేసి బటన్ నొక్కగానే మిగతా పని ఆ యుద్ధ విమానంలోని కంప్యూటర్ చూసుకుంటుంది.

ఎన్నో ప్రత్యేకతలున్న రఫేల్ జెట్ ఫైటర్‌ను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ విమానంలో అధికారికంగా అణ్వాయుధాలు తీసుకెళ్లకూడదు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం దీనిని అలా నిర్మించారు.

అయితే, మిరాజ్ 2000 జెట్ ఫైటర్ లాగే రఫేల్ యుద్ధ విమానాన్ని కూడా భారత్ తన అవసరాలకు తగినట్లు మార్చుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)