రఫేల్ డీల్: ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న ఈ ఒప్పందం ఏమిటి.. దీనిపై ఎందుకింత వివాదం?

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవలి కాలంలో దేశాన్ని తీవ్రంగా కుదిపేసిన వివాదం... రఫేల్ ఒప్పందం. ఇప్పటికే కొన్ని నెలలుగా దీనిపై పాలక, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతుండగా తాజాగా దీనికి సంబంధించి ఆడియో టేపులను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టడంతో మరోసారి ఇది చర్చనీయమైంది.
ఈ ఒప్పందంలో మోదీ ఓ భారతీయ కంపెనీ పట్ల ‘పక్షపాతంగా’ వ్యవహరించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కానీ, బీజేపీ ఆ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసింది. తాము నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్నామని చెబుతోంది. మొత్తంగా, దేశ రాజకీయాలను ఈ అంశం కుదిపేసింది. ఈ వివాదం ఫ్రాన్స్‌లో సైతం ప్రకంపనలు సృష్టించింది.
అసలు ఇంతకీ ఏంటీ రఫేల్ డీల్? ఈ వివాదానికి కారణాలేంటి?
1. ఒప్పందం ప్రారంభం
వాయుసేన వద్ద ఉన్న యుద్ధ విమానాలను ఆధునికీకరించాలని భారత ప్రభుత్వం భావించింది. 2012లో, అంటే యూపీఏ ప్రభుత్వం ఇందుకు సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. అమెరికా, యూరప్, రష్యా తదితర దేశాల నుంచి పలు బిడ్లు వచ్చాయి. వాటిలో ఫ్రాన్స్‌కి చెందిన ప్రైవేటు కంపెనీ డసో ఏవియేషన్ తక్కువ మొత్తం కోట్ చేయడంతో ఆ సంస్థను ఎంపిక చేశారు.
18 ఆఫ్ ద షెల్ఫ్ జెట్ విమానాలను డసో నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
డసో నుంచి టెక్నాలజీ, ఇతర విడి భాగాలను భారత్‌కు తీసుకొచ్చి బెంగళూరులో ఉన్న ప్రభుత్వ అధీనంలోని హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్‌లో (హల్) 108 యుద్ధ విమానాలను అసెంబుల్ చేయాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Getty Images
2.మోదీ ప్రధాని అయ్యాక
2014లో భారత్‌లో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యూపీఏ నిర్ణయానికి భిన్నంగా.. ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 రఫేల్ యుద్ధ విమానాలను నేరుగా డసో నుంచి కొనుగోలు చేయాలని 2015లో నిర్ణయించింది. అక్కడి టెక్నాలజీని కొని దేశీయంగా హల్‌లో యుద్ధ విమానాలను అసెంబుల్ చేయాలన్న ఆలోచనను విరమించుకుంది.
2015 ఏప్రిల్లో భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుందని మోదీ ప్రకటించారు.
ఈ ఒప్పందం కింద డసో, దాని ప్రధాన భాగస్వాములైన ఇంజిన్ మేకర్ సఫ్రాన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ తయారీదారు థాలెస్‌లు తమ టెక్నాలజీని డీఆర్డీవో, హెచ్ఎఎల్‌తో పంచుకుంటాయని అనుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3.ఒప్పందం కుదిరాక...
2016 సెప్టెంబరులో ఫ్రాన్స్‌తో ఒప్పందంపై మోదీ సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. డసోకి రూ.58వేల కోట్లు చెల్లించాలి. డసో 36 రఫేల్ యుద్ధ విమానాలను అందిస్తుంది. మొత్తం రూ.58వేల కోట్లలో 15 శాతం నిధులను భారత్ డసోకి ముందస్తుగా చెల్లించాలి. విమానాలతో పాటు మీటియర్ మిసైల్స్ సహా పలు అత్యాధునిక ఆయుధాలను భారత్‌కి డసో అందిస్తుంది.
భారత వాయుసేన పరిశోధన కార్యక్రమాల్లో డసో 30 శాతం పెట్టుబడులు పెడుతుంది. స్థానికంగా భారత్‌లో తయారు చేసే విమానాల కోసం 20 శాతం నిధులు వెచ్చిస్తుంది. ఈ నిధులు మొత్తం రూ.58వేల కోట్లలో భాగంగా ఉంటాయి.
2019 సెప్టెంబరులో రఫేల్ యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తాయి.
రఫేల్ యుద్ధవిమానాలు సుదూర లక్ష్యాలను కూడా చేరుకోగలవు. నేలతో పాటు నీటి మీద కూడా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలవు.

ఫొటో సోర్స్, Getty Images
4.మరి వివాదం ఎక్కడ?
మొదట డసోకి భారత భాగస్వామిగా ... అంటే ఇక్కడ ఆ సంస్థ పరిశోధనలు చేయడానికి, టెక్నాలజీ అందించడానికి హల్‌ను ఎంచుకుంటారని భావించారు. కానీ, అలా జరగలేదు. డసో తమ భారత భాగస్వామిగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఎంచుకుంది.
అలాగే వెంటనే 36 విమానాలను కొనుగోలు చేయాలని మోదీ నిర్ణయించడం కూడా ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు.
2012లో యూపీఏ జరిపిన బేరసారాలతో పోల్చితే ఇప్పుడు ఒక్కో విమాన ధరను మూడు రెట్లు పెంచేశారని కాంగ్రెస్ చెబుతోంది. తాజా ఒప్పందాన్ని అధిగమించలేని నష్టంగా పేర్కొంది.
‘ప్రధాని స్వయంగా రఫేల్ ఒప్పందాన్ని తెరచాటుగా మార్చేశారు. ఆయన దేశాన్ని మోసం చేశారు. మన సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు. దేశ భద్రత విషయంలో రాజీపడ్డారు’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
5. మోదీ ప్రభుత్వం ఏమంటోంది?
కాంగ్రెస్ విమర్శలను కేంద్రం తిప్పికొట్టింది. 2012 చర్చలతో పోలిస్తే తాజా ఒప్పందం చాలా పారదర్శకంగా ఉందని.. ఇందులో అత్యాధునిక ఆయుధాల ప్యాకేజీ, లాజిస్టిక్ సపోర్ట్ లు కూడా ఉన్నాయని తెలిపింది. యూపీఏ సంప్రదింపులు జరిపినపుడు వీటిని చేర్చలేదని పేర్కొంది.
పొరుగు దేశాలు సైనిక బలాన్ని పెంచుకున్నాయి కాబట్టి మనకు వెంటనే 36 అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలని మోదీ చెప్పారు.
రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను డసో తన భారత భాగస్వామిగా ఎంచుకోవడంలో ప్రభుత్వం పాత్ర లేదని అవి రెండూ ప్రైవేటు సంస్థలని కేంద్రం పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP
6. డసో ఏం చెప్పింది?
ఒప్పందంపై వచ్చిన విమర్శలపై డసో కూడా స్పందించింది. తమ భాగస్వామ్యంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని డసో, రిలయన్స్ ఎయిరో స్పేస్ పేర్కొంది. డసో.. రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌లు రెండూ ప్రైవేటు సంస్థలని, తమ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భారత ప్రభుత్వం పాత్ర లేదని తెలిపింది. తామే రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఎంచుకున్నామని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
7. ఇప్పుడేమైంది?
డసో తమ భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవాలని భారత ప్రభుత్వమే డసోకు సూచించినట్లు ఫ్రెంచి పత్రిక మీడియా పార్ట్.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ చెప్పింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం కావాలనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'హాల్'ను పక్కనపెట్టి, అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్‌కు కాంట్రాక్టును అప్పగించిందన్న విమర్శలకు బలం చేకూరినట్టయింది.
8. సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఈ నేపథ్యంలో కోర్టు పర్యవేక్షణలో రఫేల్ ఒప్పందంపై విచారణ జరగాలని మొదట న్యాయవాదులు మనోహర్ శర్మ, వినీత్ దందా పిటిషన్ వేశారు. ఆపైన ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే సంజయ్ సింగ్ మరో పిటిషన్ వేశారు. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలతో పాటు న్యాయవాది ప్రశాంత్ భూషన్ కూడా సుప్రీం కోర్టులో జాయింట్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్లను 2018 డిసెంబరులో విచారణ జరిపిన సుప్రీంకోర్టు అన్నిటినీ తోసిపుచ్చింది.
''36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేసేందుకు ఎలాంటి ఆస్కారం లేదు. ఒప్పందంలోని చిన్న చిన్న క్లాజుల మార్పుల వల్ల మొత్తంగా ఒప్పందాన్నే రద్దు చేయకూడదు.
గతంలో నిర్ణయించిన 126 యుద్ధ విమానాల కొనుగోళ్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవటం వల్లనే 36 రఫేల్ యుద్ధ విమానాల ఒప్పంద ప్రక్రియ మొదలయ్యింది. ఇదే అసలైన వాస్తవం (హార్డ్ ఫ్యాక్ట్).
తాజా ఒప్పందంపై 2016 సెప్టెంబర్‌లో సంతకాలు జరిగాయి. ఈ (ఒప్పందం రద్దు చేయాలన్న) పిటిషన్లను (ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు) హోలండ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, దానిపై మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతే వేశారు. వ్యక్తిగత దృక్కోణాలు న్యాయ పునః పరిశీలనకు ఆధారాలు కాదు.
ఈ ఒప్పందానికి సంబంధించి భారతీయ భాగస్వామితో (దసో కంపెనీ) ఒప్పందం చేసుకోవటంలో తమకు ఎలాంటి పాత్ర లేదని ప్రభుత్వం చెబుతోంది. భారతీయ భాగస్వామిని ఎంపిక చేసుకునేది ఈ విమానాలను విక్రయిస్తున్న దసో ఏవియేషన్. కాబట్టి న్యాయ పునఃపరిశీలన సాధ్యం కాదు.
తొలుత నిర్ణయించిన 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేయకుండా 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అనే విచక్షణలోకి మేం వెళ్లం. అలాగే, (తొలుత నిర్ణయించినట్లుగా) 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని మేం కోరం.
మన దేశం సన్నద్ధత లేకుండా ఉండకూడదు. 4వ తరం, 5వ తరం యుద్ధ విమానాల అవసరాన్ని నొక్కి చెప్పిన సీనియర్ ఐఏఎఫ్ (భారత వాయుసేన) అధికారులతో (ఈ కేసు విషయంలో)మాట్లాడాం.
ఈ ఒప్పందంలోని ప్రతి ఒక్క అంశంపైనా (విచారణ జరిపేందుకు) అప్పీలేట్ అథార్టీలాగా కోర్టు కూర్చోవటం సరికాదు.
మేం మా న్యాయ పునఃపరిశీలన అధికారంతో రఫేల్ పాత ఒప్పందం, కొత్త 36 యుద్ధ విమానాల ఒప్పందాల ధరలను సరిపోల్చేందుకు ఉపయోగించకూడదు.
పైగా, ఈ ఒప్పందం వాణిజ్యపరంగా మరింత ప్రయోజకరమని కేంద్ర ప్రభుత్వ వివరణ పత్రం చెబుతోంది.
జాతీయ భద్రత దృష్ట్యా మేం ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేం'' అని కోర్టు తీర్పు చెప్పింది.
ఇవి కూడా చదవండి
- 'అంబేడ్కర్'కు పంజరం నుంచి విముక్తి ఎప్పుడు?
- సబర్మతి ఆశ్రమం: గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం
- అప్రజాస్వామికంగా కనిపించినా కఠినంగానే ఉంటానని కేసీఆర్ అనడానికి కారణాలేంటి?
- మహిళా ముఖ్యమంత్రులు: ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్కరు
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








