మహిళా ముఖ్యమంత్రులు: ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్కరు

వసుంధరా రాజే
    • రచయిత, సింధువాసిని త్రిపాఠి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాల కారణంగా రాష్ట్రాల్లో ఎన్నో విషయాలు మారిపోయాయి. వాటితో పాటు దేశంలోని మహిళా ముఖ్యమంత్రుల సంఖ్య మారిపోయింది. ఇప్పుడు దేశంలోని 29 రాష్ట్రాలకు కలిపి ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు.

ఎన్నికల ముందు వరకు వసుంధరా రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. కానీ, ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటమితో ఆమె ముఖ్యమంత్రి పీఠం చేజారింది. దాంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే దేశంలోని ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా మిగిలారు.

2011లో, 2014లో నాలుగు రాష్ట్రాలకు మహిళలు ఏకకాలంలో ముఖ్యమంత్రులుగా ఉండేవారు.

రెండేళ్ల క్రితం వరకూ భారత్ నలుమూలల్లోని నాలుగు రాష్ట్రాలకు ఒక్కో మహిళా ముఖ్యమంత్రి ఉండేవారు. ఇప్పుడా సంఖ్య నాలుగు నుంచి ఒక్కటికి పడిపోయింది.

మమతా

జమ్మూ కశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ, గుజరాత్‌లో ఆనందీబెన్ పటేల్, రాజస్థాన్‌లో వసుంధరా రాజే, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రులుగా ఉండేవారు. అంతకుముందు తమిళనాడులో జయలలిత కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు.

వీళ్లలో జయలలిత తప్ప మిగతా అందరూ తమ రాష్ట్రాలకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రులే.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఉమా భారతీ, రబ్రీ దేవి, షీలా దీక్షిత్ లాంటి 15మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

ప్రస్తుతం దేశంలో ఉన్న పరిణామం భారతీయ మహిళలకు మంచిది కాదని సీనియర్ పాత్రికేయులు స్మితా సిన్హా అంటారు.

‘దేశంలో ఇప్పటిదాకా ఉన్న మహిళా ముఖ్యమంత్రుల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. జయలిలత, మాయావతి, మమతా బెనర్జీ లాంటి శక్తమంతమైన మహిళలు ఆ జాబితాలో ఉన్నారు. వీళ్లు ఒకటికంటే ఎక్కువ సార్లే ఆ పదవిలో ఉన్నారు.

మెహబూబా ముఫ్తీ

వివిధ రాష్ట్రాల్లో ఒకరి తరువాత ఒకరు మహిళలు ముఖ్యమంత్రులవ్వడం మంచిదే అయినా, ఆ సంఖ్య క్రమంగా తగ్గడం మాత్రం మంచిది కాదంటారు స్మిత.

2017లో లోక్ సభలో కేవలం 11.8 శాతం మంది, రాజ్యసభలో కేవలం 11 శాతం మాత్రమే మహిళల భాగస్వామ్యం ఉంది.

‘మహిళలు ఉన్నత స్థానాల్లో ఉంటే వారు మహిళలకు అనుకూలంగా ఎక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తారు. కానీ, అది పూర్తిగా నిజం కాదు. ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు మహిళల పరిస్థితి పూర్తిగా మెరుగైందని చెప్పలేం. అలాగే రాష్ట్రాలకు మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా పరిస్థితులు మారలేదు. మరోపక్క మగవాళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నంత మాత్రాన వాళ్లు మహిళల పక్షాన ఆలోచించరని కూడా కాదు’ అంటారు సీనియర్ రాజకీయ విశ్లేషకురాలు అదితి ఫడ్నిస్.

మరోపక్క, ఎంత ఎక్కువ మంది మహిళలు నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉంటే, సమానత్వం కూడా అంత ఎక్కువ పెరుగుతుందని ఆమె అంటారు.

మాయావతి

ఒక వేళ మహిళలు అన్ని అడ్డంకులు దాటి ఉన్నత స్థానానికి చేరుకున్నా, అక్కడికొచ్చాక కూడా అంతకుముందు ఆ పదవిలో ఉన్న మగవాళ్లతో పోటీ పడాలి. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అనేక ఇబ్బందుల్ని అధిగమించాలి. ఆ పోటీలో చాలాసార్లు వాళ్లు వెనకబడిపోతుంటారు అని స్మితా చెబుతారు.

రాజకీయాల్లో ఉండే మహిళల సంఖ్య పెరిగినప్పుడే వివక్ష తగ్గుతుంది. ప్రస్తుతం రాజకీయాల్లో మగవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. అందుకే వాళ్ల మాట నెగ్గించుకోవడంలో వాళ్లు విజయం సాధిస్తారని చెబుతారు స్మితా.

ఇప్పటిదాకా భారత రాజకీయాల్లో ఉన్నత స్థానాలను అధిగమించిన వాళ్లను గమనిస్తే వాళ్లలో ఇందిరా గాంధీ, వసుంధరా రాజేలాగ ఎక్కువమంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే.

అదే మాయవతి, జయలలిత లాంటి వాళ్లను గమనిస్తే వాళ్ల వెనక కాన్షీరామ్, ఎంజీఆర్ లాంటి రాజకీయ గురువుల అండ ఉంది.

జయలలిత

‘పురుషులతో సమానంగా మహిళలు నిలవాలంటే, వాళ్లు పురుషులకంటే ఎక్కువ కష్టపడాలి. పురుషులకంటే తాము ఎక్కువ సమర్థులమని నిరూపించుకోవాలి. రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది’ అంటారు అదితి.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి మమతానే. కాంగ్రెస్ నుంచి వేరుపడి తృణమూల్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసిన మమతా, అక్కడి రాజకీయాల్లో తనకంటూ ఓ సొంత ముద్రను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల జరిగిన రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రి ఎంపిక కాకపోతే, దేశంలో కొన్నాళ్ల పాటు ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా మమత కొనసాగే అవకాశముంది.

రాజస్థాన్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి వసుంధరా రాజే తన పదవిని కోల్పోయారు. రాజకీయ కుటుంబం, రాజ వంశానికి చెందిన వసుంధరా చాలా సార్లు తన దుందుడుకు స్వభావం వల్ల విమర్శలకు గురయ్యారు.

జమ్మూ కశ్మీర్‌లో తన తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ మరణం తరువాత మెహబూబా ముఫ్తీ ఆ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా మారారు.

తమిళనాడుకు 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత 2016లో మరణించారు. 2014లో మోదీ ప్రధాన మంత్రిగా మారాక, ఆనందీబెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. కానీ, రెండేళ్లకే ఆమె రాజీనామా చేశారు.

మాయావతి నాలుగు దఫాలు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఉత్తర్ ప్రదేశ్ న్యాయవ్యవస్థను గాడిలో పెట్టినట్లు మన్ననలు అందుకున్న మాయవతి, చివరికి అవినీతి ఆరోపణలను ఎదుర్కొని తన ప్రతిష్ఠను తగ్గించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)