హిందుత్వ అజెండా గురి తప్పిందా? అందుకే బీజేపీ ఓడిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ జనతాపార్టీకి గుండెలాంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓటమి, బీజేపీ హిందుత్వ అజెండా గురి తప్పిందా అన్న అనుమానాలను రేకిత్తిస్తోంది. తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించడంతో, రానున్న జనరల్ ఎలక్షన్లు బీజేపీకి సవాలుగా మారనున్నాయి.
హిందుత్వ అజెండా అన్నది గురి తప్పిందా? అభివృద్ధి అజెండా నుంచి మతపరమైన హిందుత్వ అజెండాకు మారిన బీజేపీ వైఖరితో రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ మూల్యం చెల్లించక తప్పదా? అని బీజేపీ ఇంటాబయటా ఆత్మశోధన మొదలైంది.
హిందుత్వ నినాదాన్ని ప్రతిబింబించే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. స్టార్ క్యాంపెయినర్‌గా తాజా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
యోగి ఆదిత్యనాథ్ మొత్తం 74 ర్యాలీల్లో పాల్గొన్నారు. తెలంగాణలో 8, మధ్యప్రదేశ్‌లో 17, రాజస్థాన్‌లో 26, ఛత్తీస్‌గఢ్‌లో 23 ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొనగా, ఈ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ 31, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 56 కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కేవలం 24 గంటల్లో రామమందిర వివాదాన్ని పరిష్కరిస్తానని, సరయు నది ఒడ్డున దీపావళినాడు 3లక్షల దీపాలను వెలిగించాలని, అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తానని, ఉత్తర్ ప్రదేశ్‌లో రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తానని ఆయన ఇప్పటికే ప్రతిజ్ఞలు చేశారు.
నరేంద్ర మోదీకి తాను మాత్రమే ఓ ప్రత్యామ్నాయం అని, హిందుత్వ అజెండాను కాంక్షిస్తున్న వ్యక్తిగా విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకత్వానికి సంకేతాలు పంపడమే ఈయన ప్రధాన లక్ష్యం. కానీ తాజా ఎన్నికల ఫలితాలు మాత్రం, ఆయనకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవు.

ఫొటో సోర్స్, Getty Images
అభివృద్ధి అజెండా నుంచి హిందుత్వ అజెండాకు మళ్లడమే తాజా ఎన్నికల్లో బీజేపీని ఓడించిందనేది పరిశీలకుల అభిప్రాయం. కానీ సంఘ్ పరివార్‌లోని కొందరు మాత్రం, ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.
బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, 'అయోధ్యలో రామమందిరాన్ని బీజేపీ నిర్మిస్తుందన్న విశ్వాసాన్ని ప్రజలు కోల్పోయారు' అని సంఘ్ పరివార్‌లోని కొందరి వ్యక్తిగత అభిప్రాయం.
‘ఈ విషయాల పట్ల ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ కలిసి ప్రయత్నిస్తే, ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళతాయి?' అని వారంటున్నారు.
రామమందిరం నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ, అలా చేయలేకపోతున్న బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈమధ్యనే ఓ ర్యాలీ జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ర్యాలీలో 'మొదట రాముడికి సింహాసనం ఇవ్వండి. ఆ తర్వాతే ప్రజలకు సుపరిపాలన అందించండి' అన్న నినాదం మారుమోగింది. ఈ నినాదం మోదీ 'అభివృద్ధి అజెండా'పై ప్రత్యక్ష దాడి.
వీహెచ్‌పీ-ఆర్ఎస్ఎస్ ఉమ్మడి వర్గానికి, బీజేపీకి మధ్య నెలకొన్న ఈ విభేదాలను కుటుంబ కలహంగా ఈ వర్గాల ఆంతరంగీకులు కొట్టిపారేస్తున్నారు.
2001లో రామమందిరం నిర్మించాలని వీహెచ్‌పీ-ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేశాయి. అప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఈ డిమాండ్ పట్ల వ్యవహరించిన తీరుకు ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతోంది.
2001లో వీహెచ్‌పీ-ఆర్ఎస్ఎస్ వర్గాలు అప్పటి బీజేపీ ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట గడువు విధించాయి. ఆ గడువులోగా రామమందిర నిర్మాణం జరకగకపోతే, ఈ రెండు సంస్థల కార్యకర్తలే 2002 మార్చిలో మందిరాన్ని నిర్మిస్తారని హెచ్చరించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల్లో బూత్ స్థాయిలో ఓట్లను సమీకరించడంలో ఆర్ఎస్ఎస్‌ది అందెవేసిన చేయి. బీజేపీ విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం వెనుక, హిందీ రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో బీజేపీ.. ఆర్ఎస్ఎస్‌ను విస్మరించలేదు.
బీజేపీ హిందుత్వ అజెండా గురి తప్పిందని, ప్రస్తుతం ఆ అజెండా వదిలి ఆర్థికరంగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉదారవాదులు సలహా ఇస్తున్నారు. మరోవైపు.. బీజేపీలోని కొందరు నేతలు మాత్రం, ఎట్టిపరిస్థితుల్లోనూ రామమందిరం నిర్మాణం, గోరక్షణ అంశాలకే కట్టుబడాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశ ఆర్థిక రంగంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న విషయాన్ని అంగీకరిస్తూనే, రానున్న ఎన్నికల్లో హిందూ అంశాలతో ముందడుగు వేస్తేనే, హిందుత్వ అజెండాకు న్యాయం చేసినట్లు అని బీజేపీ-ఆర్ఎస్ఎస్-వీహెచ్‌పీ వర్గాలు నొక్కిచెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- గౌతం గంభీర్: రాజకీయాల్లోకి రానేరాను.. వేరే వాళ్ల చేతిలో రబ్బర్ స్టాంపులా ఉండను
- తెలంగాణ రాష్ట్ర సమితి: విజయానికి 7 ప్రధాన కారణాలు
- మహాకూటమి చంద్రబాబు వల్ల నష్టపోయిందా?
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
- #BBCSpecial : ఊసరవెల్లి రంగులు ఎందుకు.. ఎలా మారుస్తుందంటే..
- హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
- వాజ్‌పేయి 'హిందూ హృదయ సామ్రాట్' మోదీకి మార్గం ఎలా సుగమం చేశారు?
- అయోధ్య: రామ మందిర వివాదంతో మోదీకి లాభమా? నష్టమా?
- అభిప్రాయం: మోహన్ భాగవత్ ఎదురుచూపులు ఏ యుద్ధం కోసం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








