వాజ్‌పేయి 'హిందూ హృదయ సామ్రాట్' మోదీకి మార్గం ఎలా సుగమం చేశారు?

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP
- రచయిత, రాజేష్ ప్రియదర్శి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అటల్ బిహారీ వాజ్‌పేయిని ఆయన శత్రువులు కూడా విమర్శించరు. 'అజాత శత్రువు, సర్వప్రియుడు, సర్వమాన్య' లాంటి ఉపమానాలను ఆయన పేరుతో జోడిస్తారు.
వాజ్‌పేయిలో అన్నిటికంటే ప్రత్యేకం, ఆయన సహృదయత. ప్రత్యర్థులను కూడా మిత్రులుగా భావించడం, అద్భుతమైన వాక్చాతుర్యం. కానీ దానికి కారణం కేవలం ఆయన సున్నిత ప్రవర్తనే అనడం తెలీనితనమే అవుతుంది. తను ఒక రాజకీయ నేత అనే విషయం కూడా ప్రజలు మర్చిపోయేంత ఇమేజ్ వాజ్‌పేయిని ఒక స్థాయికి చేర్చింది.
రాజకీయాల్లో ఇమేజ్‌ను మించి ఏదీ ఉండదు. ఆ ఇమేజ్‌ను జనసత్తా మాజీ సంపాదకుడు, ప్రముఖ జర్నలిస్ట్ ప్రభాష్ జోషి "సంఘ్ ముసుగు"గా వర్ణించారు. వాజ్‌పేయి తన జీవితాంతం సంఘ్ ప్రచారక్‌గా ఉన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడూ సంఘ్ ప్రతినిధిగానే ఉన్నారు.
2001లో న్యూయార్క్ సభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన వాజ్‌పేయి "ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నా, రేపు లేకపోవచ్చు. కానీ నేను మొదటి నుంచీ సంఘ్ స్వయం సేవకుడిని, ఇక ముందు కూడా అలాగే ఉంటాను" అన్నారు.
ఆయన ఆరోజు అన్న ఆ మాటలు ముమ్మాటికీ నిజం. వాజ్‌పేయి సంఘ్‌కు అంకితమైన ప్రచారక్‌గా నిలిచారు. వాజ్‌పేయి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి అయ్యారు. అప్పుడు అడ్వాణీ సమాచార-ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. 1977లో జన్‌సంఘ్ జనతా పార్టీలో విలీనమైంది.
తర్వాత సోషలిస్టులు, ముఖ్యంగా జార్జ్ ఫెర్నాండెజ్ ఒక అంశాన్ని లేవనెత్తారు. ద్వంద్వ సభ్యత్వం ఉండకూడదని, జనతా పార్టీలో ఉన్న వారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. దాంతో సంఘ్‌కు దూరం కాలేమని చెప్పిన వాజ్‌పేయి-అడ్వాణీ, ఆ ప్రభుత్వం నుంచి బయటికొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం
ఆ తర్వాత 1980లో జన్‌సంఘ్ కొత్త పేరుతో ప్రజల ముందుకు వచ్చింది. దానికి భారతీయ జనతా పార్టీ అనే పేరు పెట్టారు. అంటే ఇక్కడ బీజేపీ ఆవిర్భావానికి ముందే వాజ్‌పేయి-అడ్వాణీ సంఘ్ సూచనలకు అనుగుణంగా రాజకీయాలు నడిపించారనేది స్పష్టం అవుతోంది. 2004 ఎన్నికల్లో పరాజయం పొందేవరకూ ఈ జంట హిందుత్వ వాదాన్ని బలోపేతం చేయడంలో నిమగ్నమైంది.
భారత్‌ను హిందూ దేశంగా మార్చడమే లక్ష్యం అని ప్రకటించిన సంఘ్, హిందూ ఆధిపత్య మోడల్‌ను విశ్వసించింది. ఆ సంస్థ ఎవరి గురించి ఎలాంటి బాధ్యతలూ తీసుకోలేదు, బదులుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బీజేపీ ప్రధానులు సర్‌సంఘ్‌చాలక్ ఆదేశాలను పాటిస్తున్నారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి సన్నిహిత మిత్రుల్లో జశ్వంత్ సింగ్ ఒకరు. 1996లో ప్రధానమంత్రి అయిన వాజ్‌పేయి జశ్వంత్ సింగ్‌ను ఆర్థికమంత్రిగా చేశారు. 1998లో వాజ్‌పేయి అప్పటికే తన మంత్రుల జాబితాను సిద్ధం చేసేశారు. ఇక దానిని రాష్ట్రపతి భవన్‌కు పంపించడమే మిగిలింది. ఆ సమయంలో హఠాత్తుగా అప్పటి సర్‌సంఘ్‌చాలక్ కేసీ సుదర్శన్ వాజ్‌పేయిని కలిశారు. ఆయన చెప్పడంతో జశ్వంత్ సింగ్ పేరును ఆ జాబితా నుంచి తొలగించారు.
తన మంత్రిమండలిని ఎంచుకోవడంలో ప్రధానమంత్రికి ప్రత్యేక హక్కులు ఉంటాయి. కానీ పీఎంకు సంఘ్‌తో సంబంధాలు ఉన్నప్పుడు, జీవితకాల పదవిలో ఉన్న సర్‌సంఘ్‌సంచాలక్ ముందు ఆ ప్రత్యేక హక్కులు వ్యర్థం అవుతాయి. తర్వాత జశ్వంత్ సింగ్ స్థానంలో యశ్వంత్ సిన్హాను ఆర్థిక మంత్రి చేశారు. ఎందుకంటే సింగ్‌ను ఆర్థిక మంత్రి చేయడానికి సంఘ్ ఒప్పుకోలేదు.
ప్రస్తుత మోదీ ప్రభుత్వం తమ పాలన ప్రోగ్రెస్ రిపోర్టును ఇప్పటికే సంఘ్ నేతలకు అప్పగించింది.

ఫొటో సోర్స్, T.C. MALHOTRA
అప్పట్లో రెండు ముఖాలు అవసరం
80వ దశకంలో అయోధ్య ఉద్యమం ప్రారంభం నుంచి 2004 వరకూ రామ మందిరం, హిందుత్వం, సంకీర్ణ ప్రభుత్వం అన్నిటినీ ఒక్కటిగా కలిపి నడిపేందుకు రెండు ముఖాలు అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావించింది. కఠోరమైన, మతపరమైన పనులను అడ్వాణీకి, ఎన్డీయేను కలిపి ఉంచి, ప్రభుత్వాన్ని ప్రశాంతంగా నడిపించే బాధ్యతను వాజ్‌పేయికి అప్పగించింది.
ఇద్దరి మధ్యా ఉన్న అభిప్రాయబేధాలను అప్పటి జర్నలిస్టులు చాలావరకూ సీరియస్‌గా తీసుకోలేదు. సంఘ్ పనితీరు కూడా అలాగే ఉండేది. ఇక్కడ కనిపించే నిజం ఒక్కటే. అడ్వాణీ, వాజ్‌పేయి కలిసి ఒకే దిశలో పనిచేసేవారు. దానినే సంఘ్ భాషలో 'అంతిమ లక్ష్యం' అనేవారు.
ఇది స్వచ్ఛమైన ఇమేజ్‌కు సంబంధించిన విషయం. అందుకే ఉద్దేశపూర్వకంగా వాజ్‌పేయిని మితవాదిగా, అడ్వాణీని మతవాదిగా చూపిస్తూ ప్రచారం చేశారు. సమయం-సందర్భానికి అనుణంగా వారిద్దరూ తమ తమ పాత్రలు పోషించేవారు. అయినా ఇద్దరి మధ్యా పెద్ద వ్యత్యాసం లేదు. ఎందుకంటే సంఘ్‌లో సైద్ధాంతిక విభేదాలకు అంత స్థానం లేదు. మార్క్సిజంపై నమ్మకం లేకుంటే, కమ్యూనిస్టు పార్టీలో ఎలా ఉండలేమో ఇది అలాగే ఉంటుంది. అయినా హిందుత్వవాది కాని వాళ్లు ఎవరైనా సంఘ్‌లో ఎలా ఉండగలరు?
అది నిరూపించే ఘటనలు చాలానే జరిగాయి. అవి వాజ్‌పేయి ఇమేజ్ ఎలా ఉన్నా ఆయన హిందుత్వ అంశంలో లోకపురుషుడు అనిపించుకున్న అడ్వాణీ కంటే తక్కువేమీ కాదని స్పష్టం చేశాయి. చాలామందికి గుర్తుండే ఉంటుంది. 2002లో గుజరాత్‌లో మతఘర్షణలు జరిగినపుడు వాజ్‌పేయి ప్రధానమంత్రిగా, మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మోదీకి "రాజధర్మం పాటించాలి, రాష్ట్ర ప్రజలపై మతం లేదా జాతి ఆధారంగా పక్షపాతం చూపద్దు" అన్న మాటలు చాలా ప్రసిద్ధి చెందాయి.

ఫొటో సోర్స్, PTI
ఎప్పుడూ నిజం మాట్లాడండి, మీ పనిని కష్టపడి చేయండి, ఎవరి మనసూ బాధపెట్టకండి. ఇలాంటి తీయటి మాటలు తప్ప వాజ్‌పేయి కఠినంగా ఎప్పుడూ మాట్లాడరు. అయితే గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాల్లో ఏప్రిల్ 12న ప్రసంగించిన వాజ్‌పేయి ముస్లింల పట్ల తన ఆలోచన ఏంటనేది స్పష్టం చేశారు. ఆయన అందులో "ముస్లింలు ఎక్కడున్నా ఇతరులతో సహజీవనానికి ఇష్టపడరు. వేరేవారితో కలిసిమెలిసి ఉండాలని కోరుకోరు. శాంతియుతంగా తమ మత ప్రచారం చేసుకోడానికి బదులు, తీవ్రవాదం, బెదిరింపుల ద్వారా ఆ పని చేస్తారు అన్నారు.
అడ్వాణీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి బాబ్రీ మసీదు విధ్వంసానికి నేతృత్వం వహిస్తే, వాజ్‌పేయిని దానికి దూరంగా ఉంచాలనేది కూడా ముందే నిర్ణయించిన వ్యూహంలో ఒక భాగం. అలా చేయడం వల్ల ఆయన ఉదారవాది అనే భ్రమలు అలాగే ఉంటాయి. విధ్వంసం రోజున ఆయన అక్కడ ఉండకూడదని కూడా నిర్ణయించారు. కానీ అంతకు ముందు డిసెంబర్ 5న ఆయన లక్నోలో ఇచ్చిన ప్రసంగం చూస్తే, వాజ్‌పేయి అతివాదో, కాదో స్పష్టం అవుతుంది. ఆయన ఆయోధ్యలో కరసేవ సమయంలో భూమిని చదును చేస్తామని అనడం మీరు ఇక్కడ వినవచ్చు.
ఇలాంటిదే మరో ఉదాహరణ అసోంలో నల్లీ మారణకాండ తర్వాత జరిగింది. ప్రస్తుతం ఎన్ఆర్సీ అంశం మొత్తం దేశాన్నే వేడెక్కిస్తున్నప్పుడు, 1983లో అటల్ బిహారీ వాజ్‌పేయి అసోంలో ఒక వివాదాస్పద ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం మీరిక్కడ చూడవచ్చు.
వాజ్‌పేయి ప్రసంగంపై బీజేపీ మాట మార్చింది. కానీ 1996 మార్చి 28న అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో అప్పటి హోంమంత్రి ఇంద్రజిత్ గుప్తా పార్లమెంటులో వాజ్‌పేయి ప్రసంగంలోని అంశాలను చదివి వినిపించారు. వీటిలో బంగ్లాదేశీయులుగా చెబుతున్నవారిని భరించవద్దని, వారితో కఠినంగా వ్యవహరించాలని అంటున్న మాటలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, FACEBOOK
'అంతిమ లక్ష్యం' వైపు
ఎన్నో దశాబ్దాల హిందుత్వ రాజకీయ యాత్రలో అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్ర చాలా ప్రధానమైనది. హిందుత్వ కోసం నిశ్శబ్దంగా మైదానం సిద్ధం చేయడం అనేది వాజ్‌పేయి లేకుంటే చాలా కష్టం అయ్యేది. ఆయన 1996 నుంచి 2004 వరకూ మూడు సార్లు దేశప్రధానిగా ఉన్నారు. వాజ్‌పేయి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేతర నేతగా నిలిచారు.
పార్టీ నమ్మకాన్ని మించి వాజ్‌పేయి దేశంలో కోట్లాది ప్రజల ప్రేమను సంపాదించిన నేతగా ఎదిగారు. ప్రజలు అంత ప్రేమను ఉదారంగా, సౌమ్యంగా ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోని ఆ నేతకు అందించారు. ఆ రాజకీయ కౌశలంతోనే వాజ్‌పేయి, అడ్వాణీతో కలిసి రెండు సీట్ల పార్టీని చివరికి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేవరకూ నడిపించారు.
ఆ సమయంలోనే సంఘ్ అధికారం అండతో తన మూలాలను బలోపేతం చేసుకుంది. ఆ సంస్థకు అతివాద అడ్వాణీ ఒక వైపు, స్థిరంగా, సమర్థంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన వాజ్‌పేయి మరోవైపు నిలిచారు.
ప్రస్తుతం నరేంద్ర మోదీ, సాక్షీ మహరాజ్, గిరిరాజ్ సింగ్ లాంటి వారు అడ్వాణీ అప్పుడు చేసిన పనిని స్వీకరించారు. ఇప్పుడు వారికి రెండో ముఖం అవసరమే లేకుండా పోయింది.
ఇప్పుడు వాజ్‌పేయి లాంటి ముసుగు తొడుక్కోవాల్సిన అవసరం సంఘ్‌కు లేదు. కానీ ఒకప్పుడు మాత్రం అది వారికి చాలా ఉపయోగపడింది.
ఇవికూడా చదవండి:
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- ప్రియాంక చోప్రా, నిక్ జోనస్: నిశ్చితార్థం అయ్యింది.. త్వరలో పెళ్లి
- ‘నా ఎముకలు విరిచేసి పోలీసులకు అప్పగించాలని ఆ విద్యార్థులు ప్లాన్ చేశారు’
- అమ్మ పాలు... బాటిల్ రూ.250
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- పాకిస్తాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











