టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ అరెస్ట్... ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు

- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. టీవీ9 సంస్థలో అధికారం లేకపోయినా, కోట్ల రూపాయలు విత్ డ్రా చేసుకున్నారనే ఫిర్యాదుపై పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. టీవీ9 కొత్త యాజమాన్యం ఈ ఫిర్యాదు చేసింది.
అక్టోబర్ 4వ తేదీన టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా తరపున సింగారావు ఈ ఫిర్యాదు చేశారు. రవి ప్రకాశ్ తో పాటూ మరో డైరెక్టర్ ఎంకెవిఎన్ మూర్తి, క్లిఫోర్డ్ పెరేరియాలపై ఫిర్యాదు చేశారు. టీవీ9 చానల్ విక్రయానికి ముందు వారిద్దరూ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) నుంచి బోర్డు అనుమతి లేకుండా, తమకు డబ్బు విత్ డ్రా చేసే అధికారం లేకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా సొంత ప్రయోజనాల కోసం సంస్థ ప్రయోజనాలను పట్టించుకోకుండా, సంస్థను మోసం చేసి డబ్బు తీసుకున్నారని కొత్త యాజమాన్యం తమ ఫిర్యాదులో పేర్కొంది.

మొత్తం విత్ డ్రా చేసిన సొమ్ము 18 కోట్ల 31 లక్షల 75 వేలు. కాగా, నెట్ టిడిఎస్ 11 కోట్ల 74 లక్షల 51 వేల 808 రూపాయలు ఉంది. అందులో రవి ప్రకాశ్ పేర 6 కోట్ల 36 లక్షల రూపాయలూ, నెట్ టిడిఎస్ 4 కోట్ల 7 లక్షల 80 వేల 320 రూపాయలూ ఉండగా మిగిలిన సొమ్ము ఎంకెవిఎన్ మూర్తి, క్లిఫర్డ్ పెరెయిరా పేర్లతో ఉంది. 2018 సెప్టెంబరు నుంచి 2019 మే మధ్యలో ఈ లావాదేవీలు జరిగాయి.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఏబీసీఎల్ నుంచి డబ్బు విత్ డ్రా చేసే చెక్ పవర్ రవిప్రకాశ్‌కు, ఎంకెవిఎన్ మూర్తికీ ఇద్దరికీ ఉంటుంది. కానీ, పెద్ద మొత్తాల్లో తీసుకునేప్పుడు బోర్డు అనుమతితో చేయాలి. కానీ బోర్డు అనుమతి లేకుండా వారిద్దరూ ఈ సొమ్ము విత్ డ్రా చేసినట్టు గుర్తించారు. పద్దుల్లో దాన్ని తమకు ఇచ్చే బోనస్, ఎక్స్ గ్రేషియాల కింద చూపించారు. అసలు వారిద్దరికీ అంత బోనస్ కానీ, ఎక్స్ గ్రేషియా కానీ రావనీ, ఉన్నా వారు అలా బోర్డు అనుమతి లేకుండా తీసుకోవడానికి లేదనీ ఫిర్యాదు చేసిన వారి ఆరోపణ. దీంతో సంస్థను మోసం చేసి డబ్బుతీసుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2019లో తాము టేకోవర్ చేసినప్పుడు పాత అకౌంట్లను పరిశీలిస్తున్నప్పుడు ఈ విషయం బయటపడిందనీ అలంద మీడియా తన ఫిర్యాదులో రాసింది. వాళ్లు తీసుకున్న ఈ సొమ్ము రెండు సంవత్సరాల సంస్థ లాభంతో సమానమని వారు ఆరోపించారు.
దీనిపై అదే రోజు కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు రవిప్రకాశ్ తో పాటూ ఇతరులపై ఐపిసి 409 (సంస్థను బాధ్యుడు మోసం చేయడం), 418 (తెలిసీ మోసం చేయడం), 420 (మోసం చేయడం) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈరోజు రవి ప్రకాశ్‌ను అరెస్టు చేశారు.

అయితే, పోలీసుల తీరును రవిప్రకాశ్ తరపు న్యాయవాది వీరబాబు తప్పు పట్టారు. ఇది సివిల్ తగాదా అనీ ఇప్పటికే ఎంసిఎ (కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) పరిధిలో కేసు ఉందనీ ఈ సమయంలో కేవలం రవిప్రకాశ్ ను అరెస్టు చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశారని ఆయన మీడియా ముందు ఆరోపించారు.
ఈ కేసు విషయంలో పోలీసులు నోటీసులు ఇచ్చామని చెబుతున్నప్పటికీ రవిప్రకాశ్ కు ఎటువంటి నోటీసులు కూడా రాలేదని చెప్పారు వీరబాబు. తాము నోటీసులకు రిప్లై ఇస్తామన్న పోలీసులు వినడం లేదనీ, అధికార దుర్వినియోగం చేసి కావాలనే రిమాండుకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- ‘80 రూపాయలకే ఇల్లు పథకం’
- తెలంగాణ ఆర్టీసీ: సమ్మెకు సై అంటున్న కార్మికులు... విధుల నుంచి తొలగిస్తామంటున్న యాజమాన్యం
- 'ఐఫోన్ నన్ను 'గే'గా మార్చింది' అంటూ యాపిల్ కంపెనీపై కేసు వేసిన రష్యన్
- ‘జీవితంలో మొదటిసారి నన్ను నేను ముస్లింగా భావించుకోవాల్సి వస్తోంది‘
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








