టీవీ-9 సీఈవో రవి ప్రకాశ్, శివాజీలపై ఫోర్జరీ కేసు : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, youutube/Tv9
టీవీ-9 సీఈవో రవి ప్రకాశ్ మీద చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం, రవి ప్రకాశ్ మీద కంపెనీలోని మెజారిటీ వాటా భాగస్వాములు గతనెలలో కేసులు పెట్టారు. దర్యాప్తులో భాగంగా సైబరాబాద్ పోలీసులు గురువారం ఈ రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ, టీవీ-9 డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి నివాసాల్లో, టీవీ-9 ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
టీవీ-9ను స్థాపించినపుడు కంపెనీలో రవిప్రకాశ్‌కు ఎనిమిది శాతం వాటా, శ్రీనిరాజు కంపెనీలకు 90 శాతానికి పైగా వాటాలు ఉన్నాయి. దాదాపు ఏడు చానళ్లు ఉన్న కంపెనీలో తనకున్న 90 శాతం వాటాను శ్రీనిరాజు గత ఏడాది జూన్‌లో అలంద మీడియాకు అమ్మారు.
అయితే, 90 శాతం వాటాలు కొనుగోలు చేసినా తమకు కంపెనీ నడిపే అవకాశం ఇవ్వకుండా రవిప్రకాశ్ అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ అలంద మీడియా ఆరోపిస్తోంది.
తప్పుడు పత్రాలను సృష్టించి, కొత్త వ్యక్తులను వాటాదారులుగా చూపిస్తున్నారని, కంపెనీ సెక్రెటరీ రాజీనామా చేసినట్లు చూపించి, బోర్డులో తమ సభ్యులు చేరడాన్ని ఆలస్యం చేస్తున్నారని చెబుతోంది.
గురువారం సోదాలు జరుగుతుండగానే టీవీ-9ను స్వాధీనం చేసుకొనేందుకు అలంద మీడియా ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. అందులో భాగంగానే రవిప్రకాశ్‌కు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్ 24న పెట్టిన మొదటి కేసులో రవిప్రకాశ్ నటుడు శివాజీతో కలిసి ఆయనకే షేర్ల జారీకి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించారనే ఆరోపణను ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 30న పెట్టిన రెండో కేసులో కంపెనీ సెక్రెటరీ రాజీనామా చేసినట్లు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి, లేఖ సృష్టించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేశారని అలంద మీడియా ప్రతినిధులు ఆరోపించారు.
గురువారం జరిపిన సోదాల్లో కీలక పత్రాలతో పాటు 12 హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ ఆధారాలను ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. వాటిని విశ్లేషించిన తర్వాత కేసులో ముందుకు వెళ్తామని చెబుతున్నారు.
రవిప్రకాశ్, శివాజీ అందుబాటులో లేకపోవడంతో వారికి 160 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు.

సెల్ ఫోన్లపై హ్యాకర్ల దాడి... లక్షల రూపాయల డిమాండ్
ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల వెబ్‌సైట్లను రాన్సమ్‌వేర్ వైరస్‌తో హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు తాజాగా మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న వారిపై దృష్టి కేంద్రీకరించారంటూ ఈనాడు రాసింది. సెల్‌ఫోన్లను హ్యాక్ చేసి రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది.
ఇటీవల తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్‌సైట్‌ను ఎవరు హ్యాక్ చేశారన్న దానిపై పరిశోధిస్తున్న పోలీసు అధికారులు.. సైబర్ నేరస్థులు సెల్‌ఫోన్లపై మాల్‌వేర్, రాన్సమ్‌వేర్ దాడులు చేస్తుండటాన్ని గుర్తించారు.
సెల్‌ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లలో వినియోగిస్తున్న విండోస్ ఎక్స్‌పీ సాఫ్ట్‌వేర్ పైరేటెడ్ కావడంతో సైబర్‌నేరగాళ్లు సులువుగా దాడులకు పాల్పడుతున్నారని వివరించారు.
రాన్సమ్‌వేర్ ద్వారా దాడులు చేస్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినా వాటివల్ల ఉపయోగం ఉండదు.
హ్యాకర్లు ఎవరన్నది గుర్తించడం సాధ్యంకాదని, వీరికి మాదకద్రవ్యాలు, ఆయుధాలు రహస్యంగా రవాణాచేసే డార్క్‌నెట్ వెబ్‌సైట్ నిర్వాహకులతో సంబంధాలున్నాయని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
రాన్సమ్‌వేర్, మాల్‌వేర్ దాడులపై కంపెనీలు, సంస్థలు ఫిర్యాదులు చేసినా అవి కేసుల వరకే పరిమితమవుతున్నాయి. గత నెల 29న విద్యుత్ శాఖకు చెందిన నాలుగు డిస్కంల వెబ్‌సైట్లను సైబర్ నేరస్థులు హ్యాక్ చేశారు. పదిరోజులైనా రాన్సమ్‌వేర్ వైరస్‌ను కంప్యూటర్లలోకి ప్రవేశపెట్టిన నిందితులెవరన్నది గుర్తించలేకపోయారు.
హైదరాబాద్ కేంద్రంగా పాలు, పాల పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్న ఓ కార్పొరేట్ సంస్థ వెబ్‌సైట్‌ను సైబర్ నేరస్థులు హ్యాక్ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు నిందితులను గుర్తించలేదని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
వడదెబ్బతో పది మంది మృతి
తెలంగాణలో వడదెబ్బతో గురువారం పది మంది మృతిచెందారని నమస్తే తెలంగాణ రాసింది.
హైదరాబాద్‌లో ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ సీజన్‌లో అత్యధికంగా గురువారం 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల్లో అత్యధికంగా 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
పెద్దపల్లిలో 46.4 డిగ్రీలు, కరీంనగర్‌లో 46.3, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర ఇంటీరియర్ ఒడిశా నుంచి రాయలసీమ వరకు కోస్తా ఆంధ్రామీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, ఈ ప్రభావంతో తెలంగాణలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

కౌంటింగ్ సిబ్బంది ఫోన్లు వాడొద్దు
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు 3,05,040 మందికి, 25 పార్లమెంటు స్థానాలకు 3,01,003 మందికి పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారని సాక్షి కథనం పేర్కొంది.
అసెంబ్లీ స్థానాలకు 3,18,530 మంది, పార్లమెంటు స్థానాలకు 3,17,291 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సరైన పత్రాలు సమర్పించని వారికి పోస్టల్ బ్యాలెట్లు మంజూరు చేయలేదని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారిలో కొంతమంది అసలు దరఖాస్తే చేసుకోలేదని వివరించారు.
ఈవీఎంలు, వీవీప్యాట్‌ల కౌంటింగ్‌పై ఆర్వో, ఏఆర్వోలకు మే 17న విజయవాడలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
లెక్కింపులో పాల్గొనే ఉద్యోగులను జిల్లా యూనిట్‌గా మూడుసార్లు ర్యాండమైజేషన్ విధానంలో ఎంపిక చేస్తామన్నారు. లెక్కింపునకు వారం రోజుల ముందు మొదట విడత ర్యాండమైజేషన్, 24 గంటల ముందు నియోజకవర్గ పరిశీలకుల సమక్షంలో రెండో విడత పూర్తి చేస్తామని వివరించారు. కౌంటింగ్ రోజు ఒక గంట ముందు సిబ్బందికి ఏ టేబుల్ కేటాయించామన్నది తెలియజేస్తామన్నారు.
ఉదయం 8.30 తర్వాత కేవలం కేంద్ర ఎన్నికల పరిశీలకులు తప్ప ఆర్వోలతో సహా ఎవ్వరి సెల్‌ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
- లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్‌లోనూ జోరుగా సాగు
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- భయంకరమైన పీడకలలకు రూపం ఇస్తే..
- గయానా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం కానుందా....
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది?- బీబీసీ క్విజ్
- ‘ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీ కుటుంబం వ్యక్తిగత టాక్సీలా ఉపయోగించింది’: నరేంద్ర మోదీ
- మామిడి పళ్లు నోరూరిస్తున్నాయా.. కార్బైడ్‌తో జాగ్రత్త
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








