టిక్‌టాక్‌లో ఫేమస్ అయితే డబ్బులు సంపాదించొచ్చా

ఫొటో సోర్స్, Tiktok/sasank
టిక్‌టాక్.. చైనాకు చెందిన ఈ సోషల్ మీడియా యాప్‌కు యువతలో ఇప్పుడు విపరీతైమన క్రేజ్.
ముఖ్యంగా టీనేజర్లు దీన్ని తెగ వాడేస్తున్నారు. చిట్టిపొట్టి వీడియోలను తీసి పోస్ట్ చేస్తూ వయసు ఇరవైలైనా దాటకముందే లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు.
'టిక్‌టాక్‌లో మేం ఫేమస్' అని చెప్పుకుంటున్నారు. అయితే, ఇదంతా కాలక్షేపానికేనా? లేక ఫాలోయింగ్ వల్ల డబ్బు వస్తుందా?
మరి, వాళ్ల ఆదాయ మార్గాలు ఎలా ఉన్నాయి?
యాప్ మానిటరింగ్ సంస్థ సెన్సర్ టవర్ వెల్లడించిన సమాచారం ప్రకారం గత ఫిబ్రవరి నాటికి టిక్‌టాక్ యాప్ వంద కోట్ల డౌన్‌లోడ్‌లను దాటింది.
ఒక్క 2018లోనే 66 కోట్ల సార్లు దీన్ని ప్రజలు ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ యాప్ కన్నా ఈ సంఖ్య 22 కోట్లు ఎక్కువంటే.. టిక్‌టాక్‌కు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వినోదంతో నిండిన అచ్చమైన క్రియేటివిటీ వైరల్ అయ్యే వేదిక టిక్‌టాక్ అని డిజిటాస్ యూకే అనే సంస్థ స్ట్రాటజీ పార్ట్‌నర్ జేమ్స్ వాట్లీ అభిప్రాయపడ్డారు.
కోట్ల మంది టీనేజర్లు, చిన్నారులు టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. ప్రకటనకర్తలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఆశించేది ఇలాంటి వేదికనే.

ఫొటో సోర్స్, Javi Luna
ఒక్కటే మార్గం
యూట్యూబ్‌లో వీడియోలు పెట్టేవారికి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత వాటాను ఆ సంస్థ పంచుతుంది. వీడియోలను ఎంత మంది వీక్షించారనే(వ్యూస్) ప్రాతిపదికన డబ్బు చెల్లిస్తుంది.
సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన ప్రముఖులు.. డబ్బులు తీసుకుని ఏదైనా ఉత్పత్తికో, సంస్థకో ప్రచారం చేస్తూ స్పాన్సర్డ్ పోస్ట్‌లు పెడుతుంటారు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్‌ల్లో ఇలా ఒక్కో స్పాన్సర్డ్ పోస్ట్‌తో రూ.కోట్లు సంపాదించే వారు ఉన్నారు. యూట్యూబర్లు కూడా స్పాన్సర్డ్ వీడియోలు చేస్తుంటారు.
ప్రస్తుతం టిక్‌టిక్‌లో డబ్బు సంపాదించాలంటే స్పాన్సర్డ్ వీడియోలు చేయడం ఒక్కటే మార్గం.

ఫొటో సోర్స్, Vicky Banham
ప్రకటనలను చూపించి, వ్యూస్‌ను బట్టి డబ్బులు చెల్లించే పద్ధతిని ఈ యాప్ అమలు చేయడం లేదని జేవీ లునా అనే స్పానిష్ నటుడు చెప్పారు.
లునాకు ఈ వేదికపై 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2018 నుంచి ఆయన టిక్‌టాక్‌లో హాస్య వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
''టిక్‌టాక్ కూడా ఇన్‌స్టాగ్రామ్ లాంటిదే. మీకు చాలా మంది ఫాలోవర్లు ఉండి, మీ వీడియోలకు వ్యూస్ ఎక్కువగా వస్తుంటే బ్రాండ్లు మిమ్మల్ని సంప్రదిస్తాయి'' అని లునా చెప్పారు.

ఫొటో సోర్స్, Vicky Banham
అసమానతలకు అదే కారణం
ఏడాది క్రితం జాష్ షెపర్డ్ అనే వ్యక్తి 'ఇన్ఫ్లూయెన్షల్లీ' అనే పేరుతో ఓ టిక్‌టాక్ టాలెంట్ ఏజెన్సీని ప్రారంభించారు.
ప్రస్తుతం ఆయన సంస్థ 15 మంది టిక్‌టాక్ స్టార్లతో పనిచేస్తోంది. మొత్తంగా ఆ 15 మందికి కలిపి 1.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
గత ఏడు నెలల్లో ఇన్ఫ్లూయెన్షల్లీ 35 ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఇందుకోసం ఒక్కో టిక్‌టాక్ స్టార్‌కు రూ.1.3 లక్షలకుపైగా చెల్లించింది.
ఇంతే మొత్తంలో ఫాలోవర్లు ఉన్న యూట్యూబర్‌తో ఇలాంటి ప్రచారం చేయించాలంటే రూ.44 లక్షల వరకూ చెల్లించాల్సి వస్తుందని షెపర్డ్ అన్నారు.
టిక్‌టాక్ ప్రత్యేకంగా యువతకు వేదిక కావడం, కొత్తగా వచ్చిన యాప్ కావడం ఈ ఆదాయ అసమానతలకు కారణం.
టిక్‌టాక్ స్టార్ల జాతకాలు మారిపోనున్నాయా
రాబోయే రోజుల్లో టిక్‌టాక్ స్టార్ల జాతకాలు మారొచ్చు.
అంతకుముందు తమ వీడియోలు ఎవరు చూస్తున్నారన్న కనీసం సమాచారం కూడా టిక్‌టాక్ స్టార్లకు అందుబాటులో ఉండేది కాదు.
ఇప్పుడు పరిస్థితి మారింది. వీక్షకుల ప్రాంతం, వయసు, వీడియోల వ్యాప్తి ఎలా ఉందన్న విషయాలు తెలుసుకునే అవకాశాన్ని టిక్‌టాక్ కల్పిస్తోంది.
వీడియోలు పెట్టేవారు తమకు ఉపయోగపడతారో, లేదో నిర్ణయించుకునేందుకు బ్రాండ్లు ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి.
''ఓ వ్యక్తికి టిక్‌టాక్‌లో పది లక్షల మంది ఫాలోవర్లు ఉండొచ్చు. వారి ఏ వయసు వారన్నది గతంలో ఎవరికీ తెలిసేది కాదు. ఇదే టిక్‌టాక్ వైపు రాకుండా బ్రాండ్లను ఆపింది. కానీ, ఇప్పుడు లండన్‌లోని 25 ఏళ్ల వయసు వారిని లక్ష్యంగా చేసుకోవాలన్నా, మనకు సమాచారం దొరుకుతుంది'' అని షెపర్డ్ వివరించారు.

ఫొటో సోర్స్, Tiktok
ఆచితూచి వ్యవహరిస్తున్న టిక్‌టాక్
మిగతా యాప్‌లు చేసిన పొరపాట్లను తాము చేయకూడదన్న ఉద్దేశంతోనే టిక్‌టాక్ నిదానంగా వ్యవహరిస్తోందని విక్కీ బన్హమ్ అనే టిక్‌టాక్ యూజర్ అన్నారు.
ప్రకటనదారులతో టిక్‌టాక్ యాప్ రూపకర్తలు కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నారని ఆమె చెప్పారు.
స్పాన్సర్డ్ హ్యాష్‌టాగ్‌ల ఛాలెంజ్‌లను, స్నాప్‌చాట్‌లో ఉండే బ్రాండెడ్ లెన్స్ వంటి వాటిని సంస్థ ప్రోత్సహిస్తోందని అన్నారు.
టిక్‌టాక్‌లో ఆదాయపరంగా పెద్దగా అవకాశాలు లేకపోవడం పట్ల తనకేమీ బాధ లేదని ఆమె అన్నారు.
బాడీ ఆర్ట్, మేకప్ టుటోరియల్ వీడియోలను విక్కీ టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఆమెకు 13 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఫొటో సోర్స్, Tiktok
ఛాలెంజ్‌లతో ప్రచారం
యాప్ రూపకర్తలు నిదానంగా ఉన్నా, ప్రకటనదారులు మాత్రం టిక్‌టాక్ స్టార్లకున్న ఆదరణను వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు.
టిక్‌టాక్‌లో ఛాలెంజ్‌లు బాగా ఫేమస్.
ఒకే లాంటి వీడియోలను పోస్ట్ చేస్తూ వీటిలో యూజర్లు పాల్గొంటుంటారు.
ఉదాహరణకు ఏదో ఒక డ్యాన్స్ స్టెప్ చేయడం ఛాలెంజ్‌గా మారితే, చాలా మంది యూజర్లు అదే స్టెప్‌ను ప్రయత్నిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.
మేకప్‌కు ముందు, మేకప్‌కు తర్వాత ఎలా ఉన్నారో చూపించడం కూడా ఒక ఛాలెంజ్.
ఇలాంటి ఛాలెంజ్‌లను బ్రాండ్లు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి.
'బ్రాండ్లు తమకు అనుగుణంగా 'ఛాలెంజ్‌లను మార్చుకుంటున్నాయి. బాగా ఫాలోవర్లు ఉన్నవారితో తమ ఉత్పత్తులను ప్రస్తావిస్తూ ఛాలెంజ్‌లు చేయిస్తున్నాయి'' అని విక్కీ వివరించారు.
అయితే ప్రకటనలను ప్రవేశపెట్టే విషయంలో టిక్‌టాక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో ఓ వెలుగు వెలిగి అంతరించిపోయిన యాప్‌ల నుంచి పాఠాలు నేర్చుకుంటోంది.
రాబోయే రోజుల్లో టిక్‌టాక్ మరింత శక్తిమంతమైన వేదికగా మారుతుందని విక్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- 99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు
- నమ్మకాలు-నిజాలు: పీరియడ్స్ ఆపే మాత్రలు వేసుకోవడం మంచిదా, కాదా
- కిమ్-పుతిన్: తొలిసారిగా భేటీ కానున్న ఉత్తర కొరియా, రష్యా నాయకులు
- శ్రీలంక పేలుళ్లు న్యూజిలాండ్ మసీదుల్లో దాడులకు ప్రతీకారంగా జరిగినవా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








