తెలంగాణ ఆర్టీసీ: సమ్మె‌కు సై అంటున్న కార్మికులు... విధుల నుంచి తొలగిస్తామంటున్న యాజమాన్యం

బస్

ఫొటో సోర్స్, facebook/tsrtc

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెపై ఉత్కంఠ ఏర్పడింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారిపైనా తీవ్రంగా పడుతుంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండుకు తగిన స్పందన రాలేదని దాంతో సమ్మెకు సిద్ధమవుతున్నామని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది.

ముగ్గురు ఐఏఎస్‌లతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కార్మిక సంఘాల నేతల చర్చలు
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కార్మిక సంఘాల నేతల చర్చలు

అంతకుముందు కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన చర్చలూ నిష్ఫలమయ్యాయి. సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక దఫాలు చర్చలు జరిగాయి.

మరోవైపు ఆర్టీసీ యాజమాన్యమూ సమ్మె విషయంలో కఠినంగానే ఉంది. సమ్మె చట్ట వ్యతిరేకమని, సమ్మెలో పాల్గొనే సిబ్బందిని తొలగిస్తామని ఆదేశాలు జారీ చేసింది.

ఆర్టీసీ బస్సులు

ఫొటో సోర్స్, Getty Images

''అక్టోబరు 2న త్రిసభ్య కమిటీతో చర్చల్లో భాగంగా డిమాండ్ల పరిష్కారానికి సమయం పడుతుంది. దసరా సందర్భంగా సమ్మె ఆలోచన విరమించుకోవాలి. 4 నుంచి 6వ తేదీల మధ్య ప్రయాణాలకు 50 వేల మంది అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నారు. వారికి అసౌకర్యం, సంస్థకు నష్టం కలగకూడదు. ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు ఉన్నాయి. కార్మిక శాఖ కూడా చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంలో సమ్మెలోకి వెళితే డిస్మిస్ చేసే అవకాశం ఉంది'' అని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులిచ్చారు.

అంతేకాదు, ''తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆర్టీసీకి బడ్జెట్ కేటాయింపులకు మించి సాయమందింది. సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఇప్పటికీ సమ్మె విషయంలో వెనక్కు తగ్గకపోతే చర్యలు తప్పవు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. అవసరమైతే స్కూలు బస్సులు కూడా ప్రయాణికుల కోసం తిప్పుతాం'' అని మీడియా ముందు ప్రకటించింది ఐఏఎస్‌ల కమిటీ.

అయితే కార్మిక సంఘాలు మాత్రం తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ఎస్మా చట్టానికి తాము భయపడబోమని ప్రకటించారు. ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మెకు వెళ్తున్నామని, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటున్నారు తప్ప, సరైన హామీ ఇవ్వడం లేదన్నారు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు.

''ఆర్టీసీ సమ్మె ఖాయం. అన్ని సంఘాలు కలసిరావాలి. ఆర్టీసీని బతికించడానికే సమ్మె చేస్తున్నాం. మేం ఎవరి చేతుల్లో కీలు బొమ్మలం కాదు. ఇప్పుడు సకల జనుల సమ్మెను మించిన సమ్మె అవసరం. సమ్మె వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాం'' అని కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి చెప్పారు.

బస్

ఫొటో సోర్స్, Getty Images

కార్మికుల డిమాండ్లు ఇవీ..

  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. (ప్రస్తుతం ఆర్టీసీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ - కార్పొరేషన్‌గా ఉంది)
  • 2017 ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన వేతన సవరణ చేయాలి.
  • ఆర్టీసీలో ఖాళీలు భర్తీ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించేలా సర్క్యులర్ల గైడ్‌లైన్స్ మార్చాలి.
  • ఉద్యోగుల సహకార సంస్థల బకాయిలు వెంటనే చెల్లించాలి.
  • ప్రభుత్వ విధానాల వల్ల వచ్చే నష్టాలను ప్రభుత్వమే భరించాలి.

పట్టువదలని కార్మికులు

ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా ముందే ప్రభుత్వం చేత పనిచేయించుకోవాలని ఆర్టీసీ కార్మికులు అనుకుంటున్నారు. ఈ సమ్మెతో తెలంగాణలో దసరా పండుగ, ముందు వారాంతం రావడంతో సెలవులకు వెళ్లానుకునే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

ప్రధాన కార్మిక సంఘాలైన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) సహా పలు సంఘాలు ఈ సమ్మెకు మద్దతిచ్చాయి.

పాత చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్టీసీ సమ్మె.. ప్రతీకాత్మక చిత్రం

పండుగ సందర్భంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

మరోవైపు అధికారులు, సమ్మె సందర్భంగా బస్సులు నడిపేందుకు బయటి నుంచి డ్రైవర్లు, కండక్టర్లునూ తీసుకునే పని మొదలుపెట్టారు. 5వ తేదీ ఉదయం నుంచి ఎవరైనా డిపోలోని అధికారులను కలవచ్చని చెప్పారు. హైదరాబాద్ రూరల్ డివిజినల్ మేనేజర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు, 18 నెలల హెవీ డ్రైవింగు లెసెన్స్, బ్యాడ్జీ ఉన్న వారు డ్రైవరుగానూ, పదో తరగతి పాసయిన సర్టిఫికేట్ ఉన్న వారు కండెక్టరు గానూ రావచ్చు.

ఒకరోజుకు పల్లె వెలుగు బస్సుకు 4 వేల రూపాయలూ, ఎక్స్ ప్రెస్ బస్సుకు 5 వేల రూపాయలూ ఆర్టీసికి చెల్లించి అంతకంటే ఎక్కువ వచ్చిన ఆదాయాన్ని డ్రైవర్ - కండక్టర్లు రెమ్యూనరేషన్ గా తీసుకోవచ్చు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు, ఇప్పుడు సేవలు అందించిన వారికి భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగాల నియామకాల్లో ఈ సర్వీసును పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు.

దసర సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగ కుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

అటు హైదరాబాద్లో ఆర్టీసీ అధికారులకు అదనంగా, తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లకు కూడా డిపోల వారీ డ్యూటీలు వేసింది ప్రభుత్వం.

మరోవైపు సమ్మెపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)