ఒరాంగుటాన్ శాండ్రా: ఇది జంతువు కాదు, మానవ హక్కులున్న మనలాంటి మనిషే'

ఒరాంగుటాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఒరాంగుటాన్

మనిషికి ఉండే కొన్ని చట్టబద్ధ హక్కులను దక్కించుకొని ఐదేళ్ల క్రితం ప్రత్యేక గుర్తింపు పొందిన ఒరాంగుటాన్‌ 'శాండ్రా' అమెరికా చేరుకొంది.

దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనాలో జంతు ప్రదర్శనశాలలో 20 ఏళ్లుగా ఉంటున్న ఈ ఆడ ఒరాంగుటాన్‌ను ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒక జంతు సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నారు.

ఇది శుక్రవారం కాన్సస్ రాష్ట్రానికి చేరింది. ఆరోగ్య పరీక్షల తర్వాత ఫ్లోరిడాకు వెళ్తుంది.

శాండ్రా వయసు 33 ఏళ్లు.

రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో శాండ్రాను అక్రమంగా నిర్బంధిస్తున్నారంటూ లోగడ అర్జెంటీనా న్యాయస్థానంలో కేసు నడిచింది.

జీవశాస్త్ర కోణంలో కాకుండా తాత్విక కోణంలో చూస్తే శాండ్రా ఒక 'వ్యక్తి' అని దీని విడుదల కోసం 'అర్జెంటీనా అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ లాయర్స్ ఫర్ యానిమల్ రైట్స్ (అఫడా)' తరపు న్యాయవాదులు వాదించారు.

న్యాయస్థానం ఈ వాదనను పరిగణనలోకి తీసుకొంది. శాండ్రాను స్వేచ్ఛా హక్కున్న 'మానవేతర వ్యక్తి (నాన్-హ్యూమన్ పర్సన్)'గా ప్రకటిస్తూ రూలింగ్ ఇచ్చింది.

అర్జెంటీనాలో ఇలాంటి హక్కులు పొందిన తొలి జంతువు ఇదే.

ఒరాంగుటాన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒరాంగుటాన్లు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి

జంతువులు ఇంద్రియ జీవులని, మనిషి నుంచి గౌరవం పొందే హక్కు వాటికి ఉందని, వాటి మొదటి హక్కే అదని, వాటికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనిషిపై ఉందని నాడు రూలింగ్ ఇచ్చిన జడ్జి ఎలీనా లిబరటోరి వార్తాసంస్థ ఏపీతో చెప్పారు. తన రూలింగ్ ఈ సందేశాన్ని పంపాలని కోరుకొన్నానని ఆమె చెప్పారు.

1986లో జర్మనీలోని జంతుప్రదర్శనశాలలో శాండ్రా పుట్టింది. 1994 సెప్టెంబరులో బ్యూనస్ ఎయిర్స్‌కు చేరింది.

శాండ్రా చాలా కాలం ఎన్‌క్లోజర్లో ఒంటరిగా ఉండేది. మనుషులను దగ్గరకు రానిచ్చేది కాదు.

1999లో శాండ్రా ఒక ఆడ ఒరంగుటాన్‌కు జన్మనిచ్చింది. దానిని అక్కణ్నుంచి తీసుకెళ్లి, చైనాలో ఒక జంతువుల పార్కుకు అమ్మేశారు.

2014 డిసెంబరులో అర్జెంటీనా కోర్టు ఇచ్చిన రూలింగ్‌తో శాండ్రా గురించి ప్రపంచమంతా తెలిసింది. ఏప్‌లను ప్రాపర్టీగా కంటే చట్టప్రకారం 'డీమ్డ్ పీపుల్'గా పరిగణించాలనే సందేశాన్ని రూలింగ్ పంపింది.

కొన్ని రోజుల క్రితం వరకు శాండ్రా అర్జెంటీనాలో తాను నివసించిన జూ ప్రాంతంలోనే ఉండేది. జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శిస్తున్నందుకు జూను 2016లో మూసివేశారు. జంతువుల జీవనానికి అనువుగా ప్రమాణాలను మెరుగుపరచి ఈ జూను ఇప్పుడు ఎకో పార్కుగా పునర్నిర్మిస్తున్నారు.

శాండ్రాను ఫ్లోరిడాలోని 'సెంటర్ ఫర్ గ్రేట్ ఏప్స్‌'కు తరలించేందుకు అర్జెంటీనా న్యాయస్థానం 2017లో అనుమతి ఇచ్చింది. అమెరికా అనుమతుల కోసం దరఖాస్తుల విషయంలో జాప్యం వల్ల దీని తరలింపు ఆలస్యమైంది.

ఫ్లోరిడాలోని ఈ సంరక్షణ కేంద్రం వంద ఎకరాల్లో విస్తరించి ఉంది. సర్కస్‌లు, ప్రయోగశాలలు, జంతుప్రదర్శనశాలలు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకొచ్చిన ఒరాంగుటాన్లు, చింపాంజీలు ఇందులో ఉన్నాయి.

ప్రఖ్యాత పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ పెంపుడు చింపాంజీ 'బబుల్స్ ' కూడా ఇక్కడే ఉంది.

ఈ కేంద్రంలో ప్రస్తుతం 21 ఒరాంగుటాన్లు ఉన్నాయి. ఇక్కడి 11 ఔట్‌డోర్ ప్రాంతాల్లో శాండ్రా స్వేచ్ఛగా తిరగవచ్చు.

శాండ్రా కోసం తాము ఎదురుచూస్తున్నామని ఈ కేంద్రం వ్యవస్థాపకులు పాటీ రేగన్ బీబీసీతో చెప్పారు. అది ఇక్కడ ప్రశాంతంగా, హాయిగా బతకాలని తాము కోరుకొంటున్నామని తెలిపారు.

అంతరించిపోయే ముప్పును తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్న జంతువుల్లో ఒరాంగుటాన్ ఒకటి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)