మాంసం తింటే క్యాన్సర్ వస్తుందనే ప్రచారంలో నిజమెంత?

మాంసాహారం

ఫొటో సోర్స్, REDA&CO/gettyimages

    • రచయిత, విలియం పార్క్
    • హోదా, బీబీసీ కోసం

ఇటీవలి ఓ వార్తా కథనం ప్రపంచవ్యాప్తంగా మాంసాహారుల నోరు మరింత ఊరేలా చేసింది.

జంతు మాంసం ఇంతకాలం అందరూ అనుకున్నంత చెడ్డదేమీ కాదన్నది ఆ వార్త సారాంశం.

గత అధ్యయనాల్లోని వివరాలను మరోసారి విశ్లేషించడం ద్వారా వెలువరించిన నివేదిక ఆధారంగా ఆ కథనం రాశారు. జంతు మాంసం తినడం తగ్గించుకోవాలని చెప్పే అనేక అధ్యయనాలు, అంతర్జాతీయంగా ఆమోదం ఉన్న ఆరోగ్య మార్గదర్శకాలను అంత సీరియస్‌గా తీసుకోనవసరం లేదని తాజా నివేదిక సూచించింది.

జంతుమాంసం తినడం తగ్గించడమనేది జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలను ప్రభావితం చేస్తుందనడానికి అనిశ్చిత ఆధారాలున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.

అంతేకాదు, ఆరోగ్యానికి ముప్పు అనడానికీ సరైన ఆధారాలు లేవని చెప్పింది. 60 లక్షల మందిపై చేసిన 70 వేర్వేరు అధ్యయనాల ఫలితాలను విశ్లేషిస్తూ ఈ నివేదిక రూపొందించారు.

జంతు మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కలిగే ముప్పుపై ఇటీవల కాలంలో అనేక నివేదికలు సందేహాలు వ్యక్తంచేశాయి.

మాంసాహారం

ఫొటో సోర్స్, Getty Images

ప్రాసెస్డ్ మీట్ నిల్వ ఉండేందుకు వినియోగించే నైట్రేట్లు, నైట్రైట్ల వినియోగానికి వ్యతిరేకంగా 2018లో కొందరు శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

నైట్రేట్లు, నైట్రైట్ల కారణంగా క్యాన్సర్ వస్తుందని పలు అధ్యయనాలు చెప్పడంతో ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

బీబీసీ ఫ్యూచర్ కోసం ఏంజెలా డౌడెన్ పరిశోధన చేయగా ప్రాసెస్డ్ మీట్‌లోనే కాదు మనం తినేక అనేక ఆహార పదార్థాల్లో అంతకంటే ఎక్కువ మోతాదులో నైట్రేట్లు, నైట్రైట్లు ఉంటాయని తేలింది.

ఐరోపా ప్రజల ఆహారంలో కనిపించే 80 శాతం నైట్రేట్లు, నైట్రైట్లు కూరగాయల నుంచే వస్తున్నాయి. అంతేకాదు, ఒక్కోసారి నైట్రేట్లు ఆరోగ్యానికి మేలూ చేస్తున్నాయి. రక్తపోటును తగ్గించడంలో అవి తోడ్పడుతున్నాయి.

కానీ, అసలు విషయం వేరే ఉంది. నైట్రైట్స్ నైట్రోసమైన్లుగా మారే ఆస్కారముంది. ఈ నైట్రోసమైన్లు పేగు క్యాన్సర్‌కు కారణం కావొచ్చు. నైట్రైట్లు, అమైన్లతో కలిసేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పతుంది. మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారపదార్థాల్లో ఈ అమైన్లు ఉంటాయి. ఆ కారణం వల్లే కూరగాయల్లోని నైట్రైట్లు, నైట్రేట్ల కంటే జంతు మాంసంలోని నైట్రైట్లు, నైట్రేట్లతో ముప్పు ఎక్కువని చెబుతారు.

అయితే, శాకాహారాన్నైనా అధిక ఉష్ణోగ్రతల్లో వండినప్పుడు నైట్రోసమైన్లు ఏర్పడతాయి. అంటే ఆహారాన్ని ఎలా తయారుచేస్తున్నామన్న అంశంతోనూ నైట్రోసమైన్లు, దానివల్ల క్యాన్సర్ ముప్పు ముడిపడి ఉంటుంది. కాబట్టి ఏం వండుతున్నాం అనేదాని కంటే ఎలా వండుతున్నామన్నదీ ఈ ముప్పుల స్థాయిని నిర్దేశిస్తుంది. ఇక్కడే జంతుమాంసంతో ముప్పేమీ ఎక్కువ లేదని చెప్పడానికి అవకాశమేర్పడింది.

గ్రిల్ చేయడం, వేయించడం వంటి పద్ధతుల్లో వండడం కంటే ఉడకబెట్టి వండడం.. అందులోనూ, తక్కువ వేడిలో ఎక్కువ సమయం వండడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని సూచిస్తున్నారు.

గుండెపోటు

ఫొటో సోర్స్, Getty Images

అదేవిధంగా, మనం తీసుకునే ఆహారంలో హానికరమైనవాటికి ప్రత్యామ్నాయాలు ఏం తీసుకుంటామన్నదీ కీలకమే. మాంసాహారంలోని సంతృప్త కొవ్వులు గుండె జబ్బులతో సహా అనేక రోగాలకు కారణమవుతాయి. అలా అని సంతృప్త కొవ్వులకు బదులు చక్కెర, పిండిపదార్ధాలను ఎక్కువగా తీసుకున్నామనుకోండి, అది గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది.

సంతృప్త కొవ్వులున్న ఆహారానికి బదులు పాలీ సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యకరం. సంతృప్త కొవ్వులతో పోల్చినప్పుడు వీటి వాడకం వల్ల 19 శాతం మరణ ప్రమాదం తగ్గుతుంది. అంటే, జీవ నూనెలకు బదులు, కొవ్వులకు బదులు సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటివి వాడడం మంచిదని ఈ నివేదిక తేల్చింది.

బీబీసీ ఫ్యూచర్ కోసం డేవిడ్ రాబ్సన్ రాసిన ఓ వ్యాసంలో.. పందిమాంసానికి పేగు క్యాన్సర్‌కు సంబంధం ఉందని, అయితే, ఇలాంటివి చాలా అరుదని చెప్పారు. ప్రతి వెయ్యి మందిలో 56 మందికి మాత్రమే జీవితకాలంలో ఇలాంటి క్యాన్సర్ ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఆ వెయ్యి మంది ప్రతి రోజూ పంది మాంసం తింటే అప్పుడు వెయ్యి మందిలో 66 మందికి ఇలాంటి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. పందిమాంసం తినడం వల్ల క్యాన్సర్ ముప్పు స్వల్పంగా పెరుగుతుందన్నది ఆయన చెప్పేమాట.

మనం నిజంగా అవసరమైన కంటే ఎక్కువ ప్రోటీన్లను తీసుకుంటాం. శరీర దారుఢ్యంపై దృష్టిపెట్టేవారు కూడా ప్రోటీన్ సప్లిమెంట్ల కోసం డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. అవసరానికి మించి ప్రోటీన్లుంటే శరీరం దాన్ని బయటకు పంపించేస్తుంది కాబట్టి ప్రత్యేకించి సప్లిమెంట్ల అవసరమే లేదు.

(ఈ కథనంలోని వివరాలన్నీ వివిధ అధ్యయనాల ఆధారంగా తీసుకుని రాసినవి మాత్రమే. వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణుల సూచనలకు ఇది ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదు)

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)