మనసు కశ్మీర్‌లో.. మనుగడ లేహ్‌లో

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కుల్‌దీప్ మిశ్ర
- హోదా, బీబీసీ ప్రతినిధి, లేహ్ నుంచి
"ఇక్కడ వేడుక జరుగుతోంది. ప్రజలు ఆనందంగా నృత్యాలు చేస్తున్నారు. అక్కడేమో కశ్మీర్‌లో నా ఇల్లు దిగ్బంధంలో ఉంది. మా అమ్మ, నాన్న ఎలా ఉన్నారో కూడా తెలియదు. మీరే చెప్పండి, ఈ వేడుకలో నేనెలా పాలుపంచుకోవాలి?''
లద్దాఖ్‌లో లేహ్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తున్న కశ్మీరీ యువకుడి నుంచి ఎదురైన ప్రశ్న ఇది. చుట్టుపక్కలా చూసి, ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆయన ఈ మాటలు అంటున్నారు.
లేహ్‌లోని ముఖ్యమైన అంగళ్లలో రోడ్లకు ఇరువైపులా ఉండే దుకాణాల్లో కనీసం డెబ్బై శాతం కశ్మీరీలవే. వీటిలో కొన్ని వాళ్లు కొనుక్కున్నవి కాగా, మిగిలినవి బౌద్ధులైన యజమానుల నుంచి అద్దెకు తీసుకున్నవి.
ఇక్కడి బౌద్ధుల దుకాణాల్లోనూ చాలా మంది కశ్మీరీ యువకులు పనిచేస్తున్నారు.

లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా మారిన తర్వాత ఇక్కడుంటున్న కశ్మీరీ దుకాణాదారులకు, వారి వద్ద పనిచేస్తున్నవారిలో కొత్త సందిగ్ధత తలెత్తింది.
ధనవంతులైన కశ్మీరీలు లేహ్‌లో రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టారు. కొందరు హోటళ్లు పెట్టుకుని, తివాచీలు, శాలువాలు, దుపట్టాలు అమ్ముకునే దుకాణాలు పెట్టుకుని బతుకుతున్నారు.
ఇలా ఈ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షల్లో వారు కూడా భాగస్వాములయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని సవరించడం, రాష్ట్రాన్ని రెండు యూటీలుగా విభజించడం పట్ల వాళ్లు వ్యతిరేకతతో ఉన్నారు.
లేహ్‌లోని ప్రధాన అంగడిలో కొంత మంది కశ్మీరీ దుకాణదారులు, కార్మికులు తమ పేర్లు గోప్యంగా ఉంచాలని చెబుతూ బీబీసీతో మాట్లాడారు.

యూటీ చేయాలని డిమాండ్
లేహ్‌లోని ప్రజలు చాలా కాలంగా తమ ప్రాంతాన్ని యూటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమం వెనుక లద్దాఖ్ బౌద్ధ సంఘం (ఎల్‌బీఎ) అనే మత సంస్థది ప్రముఖ పాత్ర. అందుకే, ఇక్కడి బౌద్ధుల్లో చాలా మందికి యూటీ అనేది భావోద్వేగాలతో కూడుకున్న అంశం.
అయితే, లద్దాఖ్‌ను యూటీ చేయడం వల్ల లేహ్ ప్రజలకు ప్రయోజనమేమీ ఉండదని ఇక్కడుండే కశ్మీరీల్లో చాలా మంది అభిప్రాయం.
లేహ్ ప్రజలకు యూటీ అనేది సుదూర స్వప్నంలా ఉండేదని, ఇప్పుడది నెరవేరిందని ఓ కశ్మీరీ దుకాణదారుడు అన్నారు.
''వాళ్ల ఆకాంక్ష నెరవేరింది. కానీ, ఆర్టికల్ 370 సవరణ వల్ల ప్రత్యేక అధికారాలు పోయాయి. ఇక్కడి ప్రజల్లో అయోమయం ఉంది. దీని దుష్ప్రభావాల గురించి ఇంకా చాలా మందికి తెలియదు'' అని చెప్పారు.

''ప్రతి పనికీ కశ్మీర్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదని లద్దాఖ్ ప్రజలు యూటీని కోరుకున్నారు. కేంద్ర ప్రత్యక్ష పాలనలో వెళ్తే కశ్మీరీ నాయకులపై ఆధారపడే అవసరం ఉండదన్నది వారి ఉద్దేశం. కానీ, ఆర్టికల్ 370 ప్రయోజనాలను కోల్పోవడం వారికి ఇష్టం లేదు'' అని మరో కశ్మీరీ దుకాణదారుడు అన్నారు.
లేహ్‌లో టాక్సీ వ్యాపారం స్థానిక ప్రజల చేతుల్లోనే ఉంది. అది వారికి ప్రధాన ఆదాయ వనరు. ప్రత్యేక ప్రతిపత్తి దూరమవడం వల్ల ఉబర్, ఓలా లాంటి సంస్థలు వచ్చి, స్థానిక ట్యాక్సీ డ్రైవర్ల ఆదాయం దెబ్బతినొచ్చని మరో కశ్మీరీ దుకాణదారుడు అన్నారు. హోటళ్ల విషయంలోనూ ఇలాంటి పరిస్థితి రావొచ్చని ఇంకో కశ్మీరీ అన్నారు.
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నిధులు ఎక్కువగా వెచ్చించకపోవడంతోనే లద్దాఖ్ అభివృద్ధిలో వెనుకబడిందంటూ యూటీ డిమాండ్ వినిపించేవారు ప్రధానంగా చెప్పేవారు.
అయితే, 90వ దశకంలో లేహ్ హిల్ కౌన్సిల్ ఏర్పడ్డాక లేహ్-లద్దాఖ్ అభివృద్ధిలో వేగం పెరిగిందని స్థానిక విలేఖరి సేవాంగ్ రింగ్జిన్ చెప్పారు.

‘బయటివారితో ఎలా పోటీపడగలరు’
గత పదేళ్లలో లేహ్‌లో చాలా అభివృద్ధి జరిగిందని ఓ కశ్మీరీ దుకాణదారుడు కూడా అన్నారు.
"తమపై మరొకరు పెత్తనం చెలాయించడం ఇక్కడి ప్రజలకు ఇష్టం లేదు. జమ్మూకశ్మీర్ శాసనసభ నిధుల విషయంలో వివక్ష చూపి ఉండొచ్చు. అది రాజకీయ సమస్య. కానీ, ఇప్పుడు బయటివాళ్లు ఇక్కడికి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారితో స్థానికులు పోటీపడాల్సి ఉంటుంది. బయటివారి కన్నా విద్య, నైపుణ్య వసతుల్లో వెనుకబడి ఉన్న స్థానికులు వారితో ఎలా పోటీపడగలరు?'' అయన ప్రశ్నించారు.
ఆర్టికల్ 370 సవరణపై లేహ్ అంగళ్లలో రెండు రకాల భిన్నమైన అభిప్రాయాలున్నాయి.
దుకాణాల్లో వస్తువులను చూపించేవాళ్లు ఆగ్రహంగా కనిపిస్తుంటే, కౌంటర్‌లో కూర్చున్న యజమానులు ఆనందంగా కనిపిస్తున్నారు. అయితే, ఈ రెండు రకాల భిన్నాభిప్రాయాల వల్ల ఘర్షణ తలెత్తిన సందర్భాలున్నట్లు ఎవరూ చెప్పలేదు.

ఓ కశ్మీరీ యువకుడు ఈసారి ఈద్ జరుపుకునేందుకు తాను ఇంటికి వెళ్లలేకపోయానని చెప్పారు. అయితే, తాను పనిచేసే దుకాణ యజమాని (బౌద్ధుడు) తనతో కలిసి ఈద్ జరుపుకున్నారంటూ మొబైల్‌లో ఫొటోలు చూపించారు.
ఒకరితో మరొకరికి ఉన్న అవసరాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా? లేక, నిజంగానే ఇక్కడి సమాజంలో ఐకమత్యానికి ఈ ఘటన అద్దంపడుతోందా?
కొందరు ఈ ప్రశ్నలకు సమాధానంగా చిరునవ్వు చిందించారు. ఇంకొందరు అస్పష్టంగా సమాధానాలిచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల పట్ల కశ్మీరీలు అసంతృప్తితో ఉన్న విషయం వారి ముఖాల్లోనే కనిపిస్తోందని లేహ్‌లో ఓ దుకాణం ముందు కూర్చున్న అంగ్‌చుక్ అనే వ్యక్తి అన్నారు.
''ఏమైనా కానీ, డెబ్బై ఏళ్లుగా మేం కలిసి ఉన్నాం. ఈ అంగట్లో కశ్మీరీలు కూడా భాగం'' అని ఆయన చెప్పారు.

‘వెళ్లిపోవాలని కోరుకోను’
తన వద్ద పనిచేసే కశ్మీరీ కార్మికులతో తనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అయితే వారు వెళ్లిపోవాలని మాత్రం తాను కోరుకోనని ఓ బౌద్ధ వ్యాపారి అన్నారు.
ఒక దుకాణం వద్ద ఉన్న ఇద్దరు కశ్మీరీ కార్మికులను ప్రశ్నించినప్పుడు వారు కశ్మీర్‌లో భారత్ విధించిన ఆంక్షలపై, భారత మీడియా వార్తలు ప్రసారం చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కశ్మీర్‌లో వేర్పాటువాద ప్రయత్నాలను తాను సమర్థించనని తనను తాను భారతీయ దేశభక్తుడిగా వర్ణించుకున్న ఓ కశ్మీరీ దుకాణదారుడు అన్నారు. అయితే, కశ్మీరీల ప్రత్యేక అధికారాలను తొలగించడం మాత్రం తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు.
''మాది ఒక రాష్ట్రం. మీరు ఎన్నికల్లో గెలవలేరన్న ఒకే ఒక్క కారణంతో దాన్ని యూటీ చేసేశారు. ఇది కేవలం ఓ రాజకీయ నిర్ణయం'' అని ఆయన అన్నారు.

బౌద్ధ వ్యాపారులతో మంచి సంబంధాలున్నా, ఆర్టికల్ 370 విషయంలో తాము కశ్మీర్‌వాసులతోనే ఏకీభవిస్తామని లేహ్‌లోని కశ్మీరీ దుకాణదారులు చెబుతున్నారు.
''కశ్మీర్ మీ సొంతం కావాలంటే, భారతీయులు తమ సోదరులు అన్న భావన కశ్మీరీలకు కలిగించాలి. అంతే కానీ, వేధింపులకు గురిచేయొద్దు.
కశ్మీరీల ప్రత్యేక అధికారాలను మీరు లాక్కున్నారు. మీ ఇంటిని నేను లాక్కుంటే, మీరు నాతో గొడవకు దిగరా?'' అని ఓ దుకాణదారుడు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- ‘కశ్మీర్‌లో మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత భారత ప్రభుత్వానిదే’
- శాండ్విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు
- కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తానని మరోసారి ప్రతిపాదించిన డోనల్డ్ ట్రంప్
- ఉడుము దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధ జంట
- భారత్‌తో యుద్ధానికి సిద్ధం.. గుణపాఠం చెప్పే సమయం వచ్చింది : ఇమ్రాన్ ఖాన్
- ఆయన రోజూ 30 కిలోమీటర్లు గాల్లో తేలుతూ ఆఫీసుకు వెళతారు...
- కశ్మీరీ యువతి డైరీలో ఆ అయిదు రోజులు
- అమెరికా ఇతర దేశాల నుంచి ఎన్ని భూభాగాలను ఎంత ధరకు కొన్నదో తెలుసా...
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- డీప్ ఫేక్: నకిలీ వీడియోలను ఎలుకలు గుర్తిస్తాయా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









